• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాల సమ్మేళనం

సంక్లిష్ట దేశంలో సమర్థ పాలన! 


భిన్న జాతులు, విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న దేశంలో అందరినీ కలిపి ఉంచడం అంత తేలికైన విషయం కాదు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు, అభ్యంతరాలు లేకుండా ఉండాలంటే పాలన ఎక్కడిక్కడ స్వతంత్రంగా సాగాలి. అందుకే సమాఖ్య వ్యవస్థను ఎంచుకున్నారు. అదే సమయంలో బ్రిటిష్‌ పాలనలో విడివిడిగా రాజ్యాలు, సంస్థానాలుగా నిరంకుశంగా సాగిన వ్యవస్థలను ఏకం చేసి, ఐకమత్యంతో నడిపించడానికి, విదేశీ శక్తుల నుంచి దేశాన్ని కాపాడటానికి బలమైన కేంద్రీకృత యంత్రాంగం కావాలి. దాని కోసం ఏకకేంద్ర పద్ధతిని అనుసరించారు.  కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను, విధులను స్పష్టంగా విభజించారు. సంక్లిష్టమైన వైవిధ్యమైన దేశాన్ని పాలించడానికి, జాతి ఐక్యతను రక్షించడానికి ఆచరణాత్మక విధానాన్ని రూపొందించి, విజయవంతంగా అమలు చేస్తున్న తీరును పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ అంశంపై రాజ్యాంగ రూపకర్తల ఉద్దేశాలు, వ్యాఖ్యానాలతోపాటు ప్రపంచంలోని ఇతర ప్రధాన ప్రజాస్వామ్య దేశాలతో ఉన్న పోలికలు, సారూప్యతలను అర్థం చేసుకోవాలి.

 

భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాల సమ్మేళనంగా రూపొందించారు. దేశవిభజన కాలంనాటి పరిస్థితులు, స్వదేశీ సంస్థానాల విపరీత ధోరణులు, సువిశాల భూభాగ పరిధి, విభిన్న జాతులు, మతాలు, సంస్కృతుల కారణంగానే ఆ విధానాన్ని అనుసరించారు. 


ఏక కేంద్ర, సమాఖ్య - అర్థ వివరణ: 

 * దేశంలోని పరిపాలనా అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటే దాన్ని ‘ఏకకేంద్ర ప్రభుత్వం’గా పేర్కొంటారు. 

ఉదా: బ్రిటన్, చైనా, జపాన్, ఇటలీ. 


* దేశ పరిపాలనాధికారాలు రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ జరిగితే దాన్ని ‘సమాఖ్య ప్రభుత్వం’గా పేర్కొంటారు. 


ఉదా: అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా.


యూనియన్‌ పవర్స్‌ కమిటీ తీర్మానం: 1947, జూన్‌ 5న జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని ‘యూనియన్‌ పవర్స్‌ కమిటీ’ మన దేశ ప్రభుత్వ నిర్మాణంపై కీలకమైన తీర్మానం రూపొందించింది. అందులో కొన్ని అంశాలను వివరించారు. 


* శాసనాధికారాలను మూడు జాబితాలుగా వర్గీకరించాలి. 


* భారతదేశం బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థగా ఉండాలి. 


* కొన్ని ప్రత్యేక అంశాలను మినహాయించి సమాఖ్య జాబితా విషయంలో స్వదేశీ సంస్థానాలకు, ప్రావిన్సులకు సమాన అధికారాలు ఉండాలి. 


* మిగులు అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కేటాయించాలి.


భారత్‌లో సమాఖ్య లక్షణాలు:


లిఖిత రాజ్యాంగం: భారతదేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఉంది. దీనిప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన నిర్వహించాలి. ఈ రాజ్యాంగమే దేశానికి అత్యున్నత శాసనంగా కొనసాగుతుంది. దీనిలో ప్రజలు, పాలకులు అనుసరించాల్సిన నియమాలను పేర్కొన్నారు. ప్రభుత్వ స్వరూప స్వభావాలను వివరించారు. ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని వివరిస్తుంది.


అధికారాల విభజన: సమాఖ్య ప్రభుత్వంలో కీలక అంశమైన ‘అధికారాల విభజన’ను భారత రాజ్యాంగంలో వివరించారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పొందుపరిచారు. 


1) కేంద్ర జాబితా: ఈ జాబితాలో జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలు ఉన్నాయి. మొదట్లో 97 అంశాలు ఉంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 98. వీటిపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.


2) రాష్ట్ర జాబితా: ఈ జాబితాలో ప్రాంతీయ ప్రాధాన్య అంశాలను  చేర్చారు. ప్రారంభంలో 66 అంశాలు ఉంటే, ప్రస్తుతం 59 ఉన్నాయి. వీటిపై రాష్ట్రాల శాసనసభలు శాసనాలను రూపొందిస్తాయి.


3) ఉమ్మడి జాబితా: ఈ జాబితాలో ప్రాంతీయ ప్రాధాన్యం,  జాతీయ దృక్పథంతో కూడిన అంశాలను పేర్కొన్నారు. మొదట్లో 47 అంశాలు ఉంటే, ప్రస్తుతం  ఆ సంఖ్య 52 కి చేరింది. ఈ జాబితాలోని అంశాలపై పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు శాసనాలను రూపొందించవచ్చు.


* ఈ మూడు జాబితాల్లో లేని అంశాలను ‘అవశిష్ట అంశాలు’ (Residuary Powers) అంటారు. వాటిపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది. మన దేశంలో ఏదైనా ఒక అంశం అవశిష్ట అంశమా, కాదా అని ధ్రువీకరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. 


రెండు స్థాయుల్లో ప్రభుత్వాలు: మన దేశంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధికి లోబడి పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వ అధిపతిగా ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల అధిపతులుగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తారు.


స్వయంప్రతిపత్తి న్యాయవ్యవస్థ: మన దేశ న్యాయ వ్యవస్థకు పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి ఉంది. సుప్రీం, హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. అయినప్పటికీ వారిని తొలగించే అధికారం రాష్ట్రపతికి లేదు. న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులను అందరూ అనుసరించాల్సిందే. న్యాయవ్యవస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధితో సంబంధం లేకుండా స్వతంత్రంగా కొనసాగుతుంది.


రాజ్యాంగ ఆధిక్యత: మన దేశానికి రాజ్యాంగమే అత్యున్నత శాసనం. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలకు లోబడి వ్యవహరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ఆధారంగా ఏర్పడి, దాని ద్వారానే అధికారాలు పొంది, దాని పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది.


దృఢ రాజ్యాంగం: మన రాజ్యాంగాన్ని ఆర్టికల్‌ 368 ప్రకారం పార్లమెంటు సవరిస్తుంది. అయితే జాతీయ ప్రాధాన్యం ఉన్న సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదించాలి. మరికొన్ని అంశాలను సవరించాలంటే పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో పాటు, దేశంలోని సగం కంటే ఎక్కువ శాసన సభల ఆమోదం కూడా ఉండాలి. అందుకే రాజ్యాంగంలోని కీలకమైన అంశాలను సవరించడం కఠిన నియమాలతో కూడిన వ్యవహారం.


రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం: పార్లమెంటులో ఎగువసభ అయిన రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించారు. తద్వారా రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ సాధ్యమవుతుంది.


రాజ్యాంగ సవరణలో - రాష్ట్రాల పాత్ర: రాజ్యాంగంలోని కీలక, సమాఖ్య అంశాలను సవరించే క్రమంలో పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతోపాటు, దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్రాల శాసన సభల ఆమోదం కూడా ఉండాలి.


భారత సమాఖ్య, అమెరికా సమాఖ్యకు వ్యత్యాసాలు:


భారతదేశం: 

 

* ఏక పౌరసత్వాన్ని అనుసరిస్తుంది. 


* బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. 


* అవశిష్ట అంశాలపై సర్వాధికారం కేంద్రానిదే.


* రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం నియమిస్తుంది.


* ఏకీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. 


* దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉంటుంది. 


* ఎగువ సభ అయిన రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం జనాభాపై ఆధారపడి ఉంటుంది.


అమెరికా: 

 

* ద్వంద్వ పౌరసత్వాన్ని అనుసరిస్తుంది. 


* బలమైన రాష్ట్ర ప్రభుత్వాలను కలిగి ఉంటుంది. 


* అవశిష్ట అంశాలపై అధికారాలను రాష్ట్రాలకు అప్పగించారు. 


* రాష్ట్రాల గవర్నర్లను ఓటర్లు ఎన్నుకుంటారు.


* వికేంద్రీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. 


* కేంద్రం, రాష్ట్రాలకు వేర్వేరు రాజ్యాంగాలు ఉన్నాయి. 


* ఎగువ సభ అయిన సెనేట్‌లో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు: 1994లో ఎస్‌.ఆర్‌.బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ, ‘సమాఖ్య’ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది.


భారత్‌లో ఏక కేంద్ర లక్షణాలు: 


బలమైన కేంద్రం: న దేశంలో రాజ్యాంగ నిర్మాతలు బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర జాబితా, అవశిష్ట జాబితాల్లోని అంశాలపై శాసనాలను రూపొందించే సర్వాధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ శాసనం రూపొందిస్తే, సంబంధిత శాసనంపై వైరుధ్యం ఏర్పడితే పార్లమెంటు రూపొందించిన శాసనమే చెల్లుబాటు అవుతుంది. జాతీయ ప్రయోజనాల రీత్యా ఆర్టికల్‌ 249 ప్రకారం రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది. 


* ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. సాధారణ మెజార్టీ తీర్మానం ద్వారా రాజ్యాంగంలోని సుమారు 70% పైగా అంశాలను పార్లమెంటు సవరించగలుగుతుంది. మరికొన్ని అంశాలను 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో సవరిస్తుంది. సమాఖ్య లక్షణాలను సవరించే క్రమంలోనే రాజ్యాంగ సవరణలో రాష్ట్రాలకు కూడా అవకాశం లభిస్తుంది.


ఏక పౌరసత్వం: భారతీయులందరికీ ‘ఏక పౌరసత్వ విధానం’ అమలులో ఉంది. పౌరసత్వ అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.


ఏకీకృత న్యాయవ్యవస్థ: రాజ్యాంగ నిర్మాతలు మన దేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఇది వెలువరించే తీర్పులు, మార్గదర్శకాలు దేశంలోని హైకోర్టులు, దిగువ న్యాయస్థానాలకు దిక్సూచిగా పనిచేస్తాయి.


గవర్నర్‌ వ్యవస్థ: రాష్ట్రాధినేతలైన గవర్నర్ల నియామకం, బదిలీ, తొలగింపు తదితర విధులను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా అనుగుణంగా వ్యవహరిస్తారు.


అత్యవసర అధికారాలు: కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి (ఆర్టికల్‌ 352)ని, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన (ఆర్టికల్‌ 356)ను, ఆర్థిక అత్యవసర పరిస్థితి (ఆర్టికల్‌ 360)ని విధిస్తారు. అవి అమలులో ఉన్న సమయంలో భారతదేశం సమాఖ్య స్వరూపాన్ని కోల్పోయి, ఏకకేంద్ర రూపాన్ని సంతరించుకుంటుంది. ఆర్టికల్‌ 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే రాష్ట్రాలపై చర్యలు తీసుకునే అధికారం రాజ్యాంగం కేంద్రానికి ప్రసాదించింది. 


రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ: మన దేశంలో రాష్ట్రాలను పునర్‌ వ్యవస్థీకరించే సర్వాధికారం ఆర్టికల్‌ 3 ప్రకారం పార్లమెంటుకి ఉంది. ఈ సందర్భంలో సంబంధిత రాష్ట్రాల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. పార్లమెంటు సాధారణ మెజార్టీ తీర్మానంతో రాష్ట్రాలను పునర్‌ వ్యవస్థీకరించవచ్చు.


రాజ్యాంగబద్ధ సంస్థలు: 

* అఖిల భారతీయ సర్వీసు ఉద్యోగులను ఎంపికచేసే యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 


* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే, మార్గదర్శకాలను సిఫార్సు చేసే ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. 


* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను పర్యవేక్షించే కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ను కేంద్రమే నియమిస్తుంది.


ప్రముఖుల వ్యాఖ్యానాలు:


* భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది.

 


- డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


* భారతదేశం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌


* భారతదేశం బలమైన కేంద్రీకృత ధోరణి ఉన్న బలహీనమైన సమాఖ్య - సర్‌.ఐవర్‌ జెన్నింగ్స్‌


* భారతదేశం సిద్ధాంతపరంగా సమాఖ్య విధానాన్ని అనుసరించాలని కోరుకున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఏకకేంద్ర విధానాన్ని అనుసరిస్తుంది - కె.సంతానం

 

 


 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

 

Posted Date : 04-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌