• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - సమాఖ్య, ఏకకేంద్ర వ్యవస్థల సమ్మేళనం

విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో విస్తరించిన భారతదేశం ఏకీకృతంగా ఎలా ఉంది? కేంద్రం, రాష్ట్రాలకు అధికారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిని కలిపి ఉంచే శక్తి ఏమిటి? అధికారాల విభజనకు ప్రాతిపదిక ఏది? పాలిటీ అధ్యయనంలో భాగంగా వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహనను పెంచుకోవాలి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధాలను ఆధారం చేసుకొని రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణాన్ని సమాఖ్య, ఏకకేంద్రాలుగా పేర్కొంటారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఏకకేంద్రంలో పరిపాలన అధికారాలు మొత్తం కేంద్రం వద్ద ఉంటాయి.

సమాఖ్య లక్షణాలు
ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ: మన రాజ్యాంగం ప్రకారం జాతీయస్థాయిలో కేంద్ర, ప్రాంతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్‌, రైల్వేలు, తంతి తపాలా మొదలైన అంశాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ప్రజారోగ్యం, శాంతిభద్రతలు తదితరాలను పర్యవేక్షిస్తాయి.

రాజ్యాంగ ఆధిక్యత: భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలను పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తాయి. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరించాలి.

లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రారంభ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్‌, 8 షెడ్యూల్స్‌, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు, విధులు వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్రప్రభుత్వాల అధికార పరిధిని వివరిస్తాయి.

భారత రాజ్య వ్యవస్థ సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగానూ, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగానూ వ్యవహరిస్తుంది. - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్


అధికారాల విభజన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను మూడు రకాలుగా చేసి ఏడో షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఇది సమాఖ్య వ్యవస్థ లక్షణం.
కేంద్ర జాబితా: దీనిలో జాతీయ ప్రాధాన్యం ఉన్న 97 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 100.


రాష్ట్ర జాబితా: దీనిలో ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు 61.

ఉమ్మడి జాబితా: దీనిలో జాతీయ, ప్రాంతీయాలకు సంబంధించిన 47 అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 52. ఈ జాబితాల్లో లేని అంశాలను ‘అవశిష్టాధికారాలు’ అంటారు. అవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి.

సమాఖ్య వ్యవస్థ దేశాలు: అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, మెక్సికో.

ఏకకేంద్ర వ్యవస్థ దేశాలు: శ్రీలంక, బ్రిటన్‌, చైనా, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌.
 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌