• facebook
  • whatsapp
  • telegram

బంధుత్వం - అనుబంధం

సమాజ నిర్మితిలోని ప్రధానాంశాల్లో బంధుత్వాలు ఒకటి. ఇవి మనుషుల మధ్య సంబంధాలను ఏర్పరుస్తాయి. బంధాలను పెంచుతాయి, పటిష్టం చేస్తాయి. ఇలాంటి బంధుత్వాలు అనేక విధాలుగా ఏర్పడతాయి. బంధుత్వాలంటే ఏమిటి? ఎన్ని రకాలుగా ఏర్పడతాయి? వీటి ప్రాధాన్యం ఏమిటి? తదితర అంశాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
         ప్రపంచంలోని అన్ని సమాజాల్లో బంధుత్వం ఉంది. బంధుత్వం ఒక సామాజిక సంస్థ (Social Institution). కుటుంబం, కులం, గోత్రం, వివాహం, జాతి, మతం లాంటి వ్యవస్థలున్న ప్రతి సమాజంలోనూ సమాజ నిర్మాణానికి (నిర్మిత), సామాజిక సంబంధాలకు బంధుత్వమే ప్రధాన భూమిక.

బంధుత్వం అంటే..!
వివాహం ద్వారా లేదా ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధమే బంధుత్వం. దత్తత ద్వారా ఏర్పడే బంధుత్వం వివాహ బంధుత్వమో, రక్త సంబంధ బంధుత్వమో కానప్పటికీ అది చట్టం దృష్టిలో బంధుత్వమే. ఒకే పూర్వికుడి వంశంలో పుట్టిన వారంతా బంధువులు అవుతారు. సమాజంలో వివిధ రూపాల్లో బంధుత్వ విధానాలు కనిపిస్తాయి. అవి..
1. వైవాహిక బంధుత్వం (Affinal Kinship)
2. ఏకరక్త బంధుత్వం (Consanguineal Kinship)
3. దత్త బంధుత్వం (Adopt Kinship)


వైవాహిక బంధుత్వం

    వివాహం ద్వారా ఏర్పడిన బంధువులు వైవాహిక బంధువులు. దీని ద్వారా పరిచిత లేదా అపరిచిత కుటుంబాల మధ్య వైవాహిక బంధుత్వం ఏర్పడుతుంది.
ఉదా: భార్య-భర్త, అత్త-మామలు, బావా-మరుదులు, వదిన-మరదళ్లు లాంటి బంధుత్వాలు వైహిక బంధం ద్వారా ఏర్పడినవే.


ఏక రక్త బంధుత్వం
    ఈ బంధుత్వం రక్తసంబంధం ద్వారా ఏర్పడుతుంది. అంటే ఒకే తల్లి / తండ్రి ద్వారా ఏర్పడిన సంబంధాలను ఏకరక్త బంధువులంటారు.
ఉదా: తల్లి-కొడుకు, తండ్రి-కూతురు, సోదరుడు, సోదరి.


దత్త బంధుత్వం
    దత్తత తీసుకోవడం ద్వారా ఒకటయ్యే బంధువుల మధ్య ఉండే సంబంధాన్ని దత్త బంధుత్వం అంటారు.
    నీలగిరిలో నివసించే తోడాలు బహుభర్తృత్వం (Polyandry)ను పాటిస్తారు. వీరిలో బహుభర్తృత్వ బంధుత్వం కనిపిస్తుంది. వీరికి జైవిక తండ్రి ఎవరో తెలియదు. సామాజికంగా గుర్తించిన తండ్రి మాత్రమే ఉంటారు. తోడాలు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో నిర్ధారించడానికి ధనుర్బాణోత్సవం నిర్వహిస్తారు.

బంధుత్వ సంబంధాల చిత్రం

* పై చిత్రంలో X1, X2 లు భార్యాభర్తలు. వీరిది వైవాహిక బంధుత్వం. వీరికి X అనే కుమారుడున్నాడు. X అనే వ్యక్తి X1, X2 లకు ఏకరక్త బంధువు అవుతాడు.
* అదేవిధంగా Y1, Y2లు భార్యాభర్తలు. వీరిది వైవాహిక బంధుత్వం. వీరికి Y అనే కుమార్తె ఉంది. Y అనే ఆమె Y1, Y2లకు ఏకరక్త బంధువు అవుతుంది.
* X, Yలు వివాహం చేసుకోవడం ద్వారా X, Yల మధ్య వైవాహిక బంధుత్వం ఏర్పడింది.
(X1, X2); (Y1, Y2)లు X, Yలకు అత్తమామలు అవుతారు. అంటే వీరిమధ్య వైవాహిక బంధుత్వం ద్వారా రెండు కుటుంబాల మధ్య బంధుత్వ సంబంధాలు ఏర్పడ్డాయి.


బంధుత్వ స్థాయులు
(బంధుత్వ స్థానం - డిగ్రీస్ ఆఫ్ కిన్‌షిప్)
భారతీయ సమాజంలో మనకు కింది 3 స్థాయుల్లో బంధుత్వ సమూహాలు కనిపిస్తాయి..
1. ప్రాథమిక బంధువులు (Primary Kins)
2. ద్వితీయ బంధువులు (Secondary Kins)
3. తృతీయ బంధువులు (Tertiary Kins)

ప్రాథమిక బంధువులు: ఒక వైయుక్తిక కుటుంబంలో సభ్యులను ప్రాథమిక బంధువులుగా పిలుస్తారు. వీరిమధ్య ఉండే బంధుత్వమే ప్రాథమిక బంధుత్వం. ఇది రెండు రకాలు.


1. ప్రాథమిక ఏకరక్త బంధువులు
ఉదా: తల్లిదండ్రులకు పిల్లలకు; పిల్లలకు పిల్లలకు మధ్య ఉండే బంధుత్వం.

2. ప్రాథమిక వైవాహిక బంధువులు
ఉదా: భార్యాభర్తలు.
* ప్రాథమిక బంధుత్వంలో ముఖాముఖి సంబంధాలు నిరంతరంగా ఉంటాయి.
* ప్రాథమిక బంధుత్వ సమూహాల్లో ఏడు రకాల బంధుత్వాలు కనిపిస్తాయి.
* ప్రాథమిక బంధుత్వాన్ని పక్క చిత్రంలో చూపించవచ్చు.
A, Bలు = వైవాహిక బంధువులు (భార్యాభర్తలు)
C, Dలు = A, Bలకు ఏకరక్త బంధువులు (పిల్లలు)
X1, X2లు = A యొక్క తల్లిదండ్రులు (రక్త బంధువులు)

ద్వితీయ బంధువులు: దీన్ని లెక్కించేటప్పుడు 'నేను (ఈగో/సెల్ఫ్)' నుంచి లెక్కించాలి. 'అహం' నుంచి లెక్కించినప్పుడు అహంకు చెందిన కుటుంబ సభ్యులంతా ప్రాథమిక బంధువులవుతారు. ఉదా: A, B, Cలు ప్రాథమిక బంధువులు. ఇక్కడ C ని అహం అనుకుంటే, ABలు C కి తల్లిదండ్రులు అవుతారు.C కు D అనే భార్య E అనే కుమారుడు ఉన్నారు. అంటే ప్రాథమిక బంధువు C ప్రాథమిక బంధువులు ABలకు ద్వితీయ బంధువులవుతారు. దీన్ని పక్క చిత్రంలో చూడొచ్చు.
C = అహం
ABC = ప్రాథమిక బంధువులు
CDE = ప్రాథమిక బంధువులు
ABలకు E = ద్వితీయ బంధువు
ABలకు D = ద్వితీయ బంధువు

* ఈ విధంగా ద్వితీయ బంధుత్వంలో 33 రకాల బంధుత్వాలు కనిపిస్తాయి.
* ఉదాహరణ అమ్మమ్మ, తాతయ్య, మనవడు, మనవరాళ్లు, కోడళ్లు, అల్లుళ్లు.

తృతీయ బంధువులు: అహం ద్వితీయ బంధువుల ప్రాథమిక బంధువులు తృతీయ బంధువులవుతారు. లేదా అహం ప్రాథమిక బంధువుల గౌణ బంధువును తృతీయ బంధువు అంటారు.
పక్క చిత్రంలో C, Dల ప్రాథమిక బంధువు E, ద్వితీయ బంధువు G. G ప్రాథమిక బంధువు I
C, Dలకు I తృతీయ బంధువు అవుతాడు.
* సుమారు 151 తృతీయ బంధుత్వాలు మనకు కనిపిస్తాయి.


బంధుత్వం ఆచరణలు (Kinship Usages)
ప్రాథమిక, ద్వితీయ, తృతీయ బంధువుల మధ్య వివిధ ప్రవర్తనలు కనిపిస్తాయి. వాటినే బంధుత్వ ఆచరణలు అంటారు. అవి
1. పరిహాస సంబంధాలు (Joking Relations)
2. వైదొలగు నడవడి
3. మాతులాధికారం
4. పితృష్యాధికారం
5. కుహనా ప్రసూతి
6. సాంకేతిక సంబోధన


పరిహాస సంబంధాలు
ఇందులో ఒకరినొకరు పరిహసించుకుంటారు. ఇవి రెండు రకాలుగా జరుగుతాయి. అవి..

1. సౌష్ఠవ పరిహాసం: ఇద్దరు బంధువులు సమానంగా పరిహాసం చేసుకుంటారు.
ఉదా: బావామరదళ్లు, బావామరుదులు

2. అసౌష్ఠవ పరిహాసం: ఒక బంధువుకు మరో బంధువును పరిహసించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ బంధువుకు తిరిగి పరిహసించే స్వేచ్ఛ ఉండదు.
ఉదా: తాత-మనవరాలు


వైదొలగు నడవడి
బంధుత్వ సమూహాల్లో కొంతమంది ఎదురుపడినప్పుడు వారిని తప్పుకుని నడవడం, ప్రవర్తించడం జరుగుతుంది. వీరు ముఖాముఖిగా కూడా మాట్లాడరు.
ఉదా: మామ-కోడలు, అత్తా-అల్లుడు.


మాతులాధికారం
ఒక వ్యక్తికి తండ్రి కంటే అన్ని విషయాల్లో మేనమామ ప్రముఖపాత్ర వహిస్తే దాన్ని మాతులాధికారం అంటారు. మాతుల స్థానీయ నివాసం, మేనమామ నుంచి ఆస్తిని పొందడం లాంటివి.

పితృష్యాధికారం
ఒకరి జీవితంలో అతడి తండ్రి సోదరి (మేనత్త) ప్రముఖపాత్ర పోషించడాన్ని పితృష్యాధికారం అంటారు. పితృ స్థానీయ నివాసం, మేనత్త నుంచి ఆస్తి పొందడం లాంటివి.

కుహనా ప్రసూతి
భార్య ప్రసవించేటప్పుడు ఆమె భర్త రోగిలా నటించాలి. ఆమెలా ఆహార నియమాలు, పథ్యం పాటించాలి. ఇది తోడా, ఖాసీ తెగల్లో కనిపిస్తుంది.

సాంకేతిక సంబోధన
బంధువుని పేరుపెట్టి లేదా బంధుత్వంతో పిలుస్తారు. వారికి సంబంధించిన వ్యక్తులను వీరికి బంధుత్వ అనుసంధానం చేసి పిలుస్తారు. ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌