• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సాహిత్య చరిత్ర

తెలంగాణ గడ్డపై పుట్టిన ‘పరబ్రహ్మ.. పరమేశ్వర’!


భాష, సాహిత్యాల అభివృద్ధి, విస్తరణలో ప్రాచీన యుగం నుంచే తెలంగాణ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. మధ్య, ఆధునిక యుగాల్లోనూ అదే ఒరవడి కొనసాగింది. ఇక్కడి కవులు, సాహితీవేత్తలు తరతరాలు గుర్తుంచుకునే రచనలు చేశారు. శైలిలో కొత్త పద్ధతులు సృష్టించారు. తెలుగు భాష, సంస్కృతుల ఉన్నతికి ఎంతగానో దోహదపడ్డారు. కుతుబ్‌షాహీల హయాంలో తెలుగు కవులకు రాజాదరణ లభించడంతో గొప్ప గ్రంథాలెన్నో వెలువడ్డాయి. నాటి మేటి రచనలు, ప్రసిద్ధ కవులు, వారి సాహితీ సేవ గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆధునిక కాలంలో ప్రజల్లో చైతన్యం పెంచి, నిరంకుశత్వాన్ని నిలదీస్తూ తెలుగు సాహిత్యం పరిణామం చెందిన విధానాన్ని, అందులో భాగమైన కవులు, వారి విశేషాలు, గొప్పతనం గురించి అవగాహన పెంచుకోవాలి.


ఆధునిక యుగంలో తెలంగాణలో పలువురు కవులు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు. తమ సాహిత్యం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి పాటుపడ్డారు. జనంలోని మూఢ విశ్వాసాలను తొలిగించే ప్రయత్నం చేశారు. నిజాం నిరంకుశత్వంలో బానిసలుగా మగ్గుతున్న ప్రజల్లో చైతన్యం నింపి, వారిని స్వాతంత్య్ర పోరాటం వైపు మళ్లించారు.ముఖ్యంగా  కుతుబ్‌ షాహీలు బహుభాషా కవులను పోషించి తెలుగు సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. ఇబ్రహీం కుతుబ్‌ షా అనేక మంది తెలుగు కవులను పోషించాడు. వీరిలో కందుకూరి రుద్రకవి ‘సుగ్రీవ విజయం’ (తొలి యక్షగానం), నిరంకుశోపాఖ్యానం, గువ్వలచెన్న శతకం మొదలైన గ్రంథాలు రచించాడు. పొన్నెగంటి తెలగణార్యుడు అనే కవి ‘తపతీ సంవరణోపాఖ్యానం’ (1565) రచించి ఇబ్రహీం కుతుబ్‌ షాకు అంకితమిచ్చాడు. ఈ రాజును తెలుగు కవులు ‘మల్కిభ రాముడు’గా వ్యవహరించారు. మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా అనే మరో పాలకుడు తెలుగు, ఉర్దూ కవులను పోషించాడు. ఆయన స్వయంగా కవి. ‘మాలిని’ అనే కలం పేరుతో ‘కులియాత్‌ కులి’ అనే కవిత్వాన్ని రచించాడు. ఇతడి ఉర్దూ కవితల సంకలనాన్ని ‘దివాన్‌’ పేరుతో ఇతడి అల్లుడు సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌ షా వెలువరించాడు. ఈ పాలకుడు వజిహీ, గవాసీ, మీర్జా మహ్మద్‌ అమీన్‌ అనే ఉర్దూ కవులను పోషించాడు. మరో కవి సారంగ తమ్మయ్య ‘వైజయంతీ విలాసం’, ‘హరిభక్తి సుదోదయం’ తదితర గ్రంథాలు రచించాడు. ఈయన గోల్కొండ కరణం. ‘వైజయంతీ విలాసం’ తెలుగు శృంగార కావ్యాల్లో మేటిది. ఎల్లారెడ్డి ‘బాలభారతం’ (ఆగస్త్యుడి రచనకు అనువాదం), ‘కిరాతార్జునీయం’ (భారవి రచనకు అనువాదం), మల్లారెడ్డి అనే కవి ‘శివధర్మోత్తరం’, ‘షట్చక్రవర్తి’, ‘పద్మ పురాణం’ తదితర గ్రంథాలు రచించాడు. అబ్దుల్లా కుతుబ్‌ షా ఆస్థానంలో అనేక మంది కవులుండేవారు. వీరిలో అప్పకవి ‘అనంత వ్రతకల్ప కావ్యం’, ‘కవి కల్పకం’ (లక్షణ గ్రంథం), ‘సాధ్వీజన ధర్మం’ (ద్విపద కావ్యం), ‘అంబికా వాదం’ (యక్షగానం) తదితర గ్రంథాలు రచించాడు. కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ‘దాశరథి శతకం’, ‘రామదాసు కీర్తనలు’ రచించాడు. కోన నారాయణ ‘వజ్రాభ్యుదయం’, చరిగొండ నరసింహ కవి ‘శశిబిందు చరిత్ర’, గోపతి లింగ కవి ‘చెన్నబసవ పురాణం’, రాజలింగ కవి ‘కూర్మపురాణం’, మరిగంటి వెంకç నరసింహాచార్యులు ‘హరివాసర మహత్యం’, పిల్లలమర్రి వెంకటపతి ‘రాజేశ్వర విలాసం,’ పానుగంటి జగన్నాథాచార్యులు ‘కుమదవల్లి విలాసం’ (భక్త రామదాసు జీవితానికి దగ్గరగా ఉంటుంది), విశ్వనాదయ్య ‘సిద్ధేశ్వర పురాణం’ (ద్విపద), పెన్గటూరి వెంకటాద్రి ‘భువన మోహిని’ విలాసం, అన్నం భట్టు ‘తర్క సంగ్రహం’ గ్రంథం రచించాడు.


చందాల కేశవదాసు (1876): ఈయనది ఉమ్మడి ఖమ్మం జిల్లా. ‘సీతాకల్యాణం’, ‘జోల పాటలు’, ‘కేశవ శతకం’, ‘మేలుకొలుపు’, ‘బలిబంధనం’, రుక్మాంగద మొదలైన గ్రంథాలు రచించారు. తొలితరం తెలుగు సినీ గేయ రచయిత కూడా. తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదకు పాటలు రాశారు. ఆయన ఆధ్వర్యంలో భారత్‌ సమాజం వారు నాటకాలు ప్రదర్శించేవారు. నాటకాల్లో పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన ఈయనదే. అవధాన విద్యలో ఆరితేరిన వ్యక్తి కేశవ దాసు.


బోయ జంగయ్య: ఈయన 1942, అక్టోబరు 1న నల్గొండ జిల్లా, పంతంగి (రామన్నపేట)లో జన్మించారు. జాతర (ఉత్తమ నవల), పావురాలు (కవిత సంపుటి), ఎచ్చరిక (కథా సంపుటి), జగడం (దళిత నవల-2004) ఇతడి రచనలు.


పాకాల యశోదా రెడ్డి: ఈమె 1929, ఆగస్టు 8న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా, బిజినేపల్లిలో జన్మించారు. తెలంగాణ భాషా సంస్కృతులకు అద్దం పట్టే విదూషీమణిగా పేరుపొందారు. గొప్ప వక్త, కవి. యశోదమ్మను ఆమె గ్రామంలో ఎచ్చమ్మ అని పిలిచేవారు. తెలుగులో హరివంశములు (సిద్ధాంత వ్యాస గ్రంథం), మావూరి ముచ్చట్లు - 1973 (1950 నాటి తెలంగాణ గ్రామీణ సంస్కృతి), ఎదుర్కోలు (పెళ్లిలోని ఎదుర్కోలు సంప్రదాయం గురించి), ఎచ్చమ్మ కథలు - 2000 (1960-1970 నాటి భాష, గ్రామీణ సాంస్కృతిక జీవనం గురించి), గ్రామీణ ఆడపడుచుల ముచ్చట్లు, బతుకమ్మ, పీర్ల పండగ నిర్వహించుకునే సంప్రదాయాలను వర్ణించారు. ఈమెకు తెలంగాణ మాండలికంపై గొప్ప పట్టు ఉండేది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్య పీఠం అధిష్టించారు. తెలుగు అకాడమీ వారి మాండలిక పదకోశం, తెలుగు సామెతలు సంపాదక మండలి సభ్యులుగా పనిచేశారు. 1990-1993 మధ్య తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఎప్పుడూ తెలంగాణ యాసతోనే గ్రామీణ ప్రాంతం వారు మాట్లాడినట్లుగానే మాట్లాడేవారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి పురస్కారం, వాళం కృష్ణారావు పురస్కారం, సుశీల నారాయణరెడ్డి పురస్కారం, సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం అందుకున్నారు. 


దేవులపల్లి రామానుజరావు: ఉమ్మడి వరంగల్‌ జిల్లా, దేశాయిపేటలో 1917, ఆగస్టు 25న జన్మించారు. తెలంగాణ గ్రంథాలయోద్యమ ప్రగతికి తోడ్పడ్డారు. సాహితీవేత్త, పత్రికా సంపాదకులు. సారస్వత నవనీతం, తెలంగాణలో జాతీయోద్యమాలు, తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం, హైదరాబాదు స్వాతంత్య్రోద్యమం, జవహర్‌లాల్‌ నెహ్రూ, గౌతమ బుద్ధుడు, నా రేడియో ప్రసంగాలు, వేగుచుక్కలు, కావ్యమాల, 50 సంవత్సరాల జ్ఞాపకాలు (1929-1979) మొదలైన గ్రంథాలు రచించారు. 1966-1973 మధ్య హైదరాబాదు నగర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీకి 25 సంవత్సరాలకు పైగా కార్యదర్శిగా ఉన్నారు. హైదరాబాదు విమోచనోద్యమం, స్వాతంత్య్రోద్యమం, ఆంధ్రోద్యమాలతో దేవులపల్లికి సన్నిహిత సంబంధం ఉంది. 1960-1962 మధ్య రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 1972-1975 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయానికి యాక్టింగ్‌ వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేశారు. 1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు కోశాధికారిగా వ్యవహరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు.


గడియారం రామకృష్ణ శర్మ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా, అలంపుర్‌లో 1919, మార్చి 6న జన్మించారు. గొప్ప రచయిత. భారతదేశ చరిత్ర (క్షేత్ర చరిత్ర), ఉమామహేశ్వర చరిత్ర, కన్నడ సాహిత్య చరిత్ర (దక్షిణ భారత సాహిత్యాలు), శతపత్రము (ఆత్మ కథ), పాంచజన్యం (ఖండకావ్య సంపుటి), మాధవిద్యారణ్య, దశరూపకసారం (రూపలక్షణ గ్రంథం) లాంటి రచనలు చేశారు. ఇతడి సాహిత్య సేవలకు 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.


మాదిరెడ్డి సులోచన: హైదరాబాదులోని శంషాబాద్‌లో 1936లో జన్మించారు. గొప్ప రచయిత్రి. తెలంగాణ మాండలికంలో నవల రాసిన మొదటి రచయిత్రి. జీవనయాత్ర (ఈమె రచించిన మొదటి నవల), సంధ్యారాగం, పంతులమ్మ (ఈ నవల్లో తెలంగాణ భూస్వామ్య సంస్కృతిని చిత్రీకరించారు), తరం మారింది మొదలైన పుస్తకాలు రాశారు.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో ఏ గ్రంథం తొలి యక్షగానం?

ఎ) యయాతి చరిత్ర బి) వైజయంతి విలాసం సి) సుగ్రీవ విజయం డి) గువ్వలచెన్న శతకం


2. మల్కిభ రాముడిగా ప్రసిద్ధిగాంచినవారు?

ఎ) మీర్జా మహమ్మద్‌ బి) ఇబ్రహీం కుతుబ్‌ షా సి) తెలగనార్యుడు డి) మహ్మద్‌ కులీకుతుబ్‌ షా


3. ‘పరబ్రహ్మ - పరమేశ్వర’ కీర్తన రచయిత ఎవరు?

ఎ) బోయ జంగయ్య బి) కేశవదాసు సి) కోన నారాయణ డి) చరిగొండ నరసింహ


4. ఎచ్చమ్మగా పిలిచే కవయిత్రి ఎవరు?

ఎ) యశోదారెడ్డి బి) మాదిరెడ్డి సులోచన సి) సుజాత డి) సంధ్య


5. కింది ఏ నవల తెలంగాణ భూస్వామ్య సంస్కృతిని చిత్రీకరించింది?

ఎ) వేగుచుక్కలు బి) పంతులమ్మ సి) భూస్వామ్య చరిత్ర డి) సంధ్యారాగం


6. వైజయంతి విలాసం గ్రంథ రచయిత ఎవరు?

ఎ) తెలగణార్యుడు బి) రుద్రకవి సి) సారంగ తమ్మయ్య డి) గంగాధర కవి


7. ‘దివాన్‌’ పేరుతో వెలువడిన ఉర్దూ కవితల రచయిత ఎవరు?

ఎ) వజీ మహమ్మద్‌ బి) గులాం అలీ సి) అలీవుర్సీ డి) మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా


8. ‘పాంచజన్యము’ అనే ఖండ కావ్యాన్ని రచించిందెవరు?

ఎ) రామకృష్ణ శర్మ బి) సులోచన సి) తమ్మయ్య డి) సి.నారాయణరెడ్డి


9. కిందివాటిలో మాదిరెడ్డి సులోచన రచించని గ్రంథం ఏది?

ఎ) దశరూపకసారం  బి) జీవనయాత్ర సి) సంధ్యారాగం డి) పంతులమ్మ


10. కిందివారిలో ఎవరుర ఆంధ్ర సారస్వత పరిషత్తు అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు?

ఎ) శేషాద్రి బి) కేశవదాసు సి) రామానుజరావు డి) వెంకట రమణాచార్యులు


11. తెలంగాణ మాండలికంలో నవల రచించిన మొదటి కవయిత్రి?

ఎ) యశోదారెడ్డి బి) సులోచన సి) సుజాత డి) కుప్పాంబిక


12. కిందివారిలో ఎవరు తెలంగాణ యాసలోనే ఎక్కువగా మాట్లాడేవారు?

ఎ) రామకృష్ణ శర్మ బి) రామానుజరావు సి) మాదిరెడ్డి సులోచన డి) పాకాల యశోదారెడ్డి


జవాబులు: 1-సి, 2-బి, 3-బి, 4-ఎ, 5-బి, 6-సి, 7-డి, 8-ఎ, 9-ఎ, 10-సి, 11-బి, 12-డి.
 


డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి
 

Posted Date : 14-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు