• facebook
  • whatsapp
  • telegram

లోక్‌సభ - ప్రత్యేక అధికారాలు

ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం! 

ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత ప్రాథమిక శాసనసభ లోక్‌సభ. చట్టాలను చేయడంలో, బడ్జెట్లను ఆమోదించడంలో, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. జాతీయ విధానాలను రూపొందిస్తుంది. ప్రజల అభీష్టాలను ప్రతిబింబిస్తుంది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తుంది.  కేంద్ర కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఇందుకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ ఆధికరణలు, సంబంధిత తీర్మానాల ఉద్దేశాలను ఉదాహరణలతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన దిగువ సభ కూర్పు, సభ్యుల సంఖ్యలో మార్పుచేర్పులు, రిజర్వేషన్లు, సభ కాలపరిమితి తదితర అంశాలతో పాటు శాసన, ఆర్థిక సంబంధ విషయాల్లో రాజ్యసభపై ఆధిక్యాన్ని ప్రదర్శించే సందర్భాలనూ అర్థం చేసుకోవాలి.

భారతదేశ ప్రజలకు లోక్‌సభ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సభలోని సభ్యులను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అందుకే ఈ సభ కేంద్ర శాసన నిర్మాణ శాఖలో శక్తిమంతమైనదిగా, ప్రజాస్వామ్యయుతమైనదిగా, సంపూర్ణ ప్రాతినిధ్యానికి వేదికగా నిలుస్తోంది. దేశాభివృద్ధికి, దేశ ప్రజల శ్రేయస్సుకు అవసరమైన చట్టాలు, విధానాలు రూపొందించడంలో కీలక భూమిక పోషిస్తోంది.


ప్రభుత్వ ఏర్పాటు: లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం సగానికన్నా ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీకి చెందిన లేదా మద్దతు పొందిన నేత లోక్‌సభకు నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.


ఉదా: 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 489 స్థానాలకుగాను 364 స్థానాలను భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) గెలుపొందింది. ఈ పార్టీ నాయకుడైన జవహర్‌లాల్‌ నెహ్రూ లోక్‌సభకు నాయకుడిగా ఎన్నికై కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోతే కొన్ని రాజకీయ పక్షాలు ఒక కూటమిగా ఏర్పాటై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.


ఉదా: 1989లో 9వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో జనతాదళ్‌ పార్టీకి చెందిన వి.పి.సింగ్, మిగిలిన రాజకీయ పార్టీలతో కలిసి ‘నేషనల్‌ ఫ్రంట్‌’ పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసి, లోక్‌సభ నాయకుడిగా ఎన్నికై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

 

ప్రభుత్వాన్ని నియంత్రించడం: కేంద్ర ప్రభుత్వ మితిమీరిన పోకడలను లోక్‌సభ వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించి, పరిపాలనను రాజ్యాంగబద్ధంగా కొనసాగే విధంగా చూస్తుంది. 


అవిశ్వాస తీర్మానం: ప్రభుత్వ పనితీరు పట్ల ప్రతిపక్ష పార్టీలు అసంతృప్తి చెందితే లోక్‌సభలో ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెడతాయి. అది నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది.


ఉదా: 1999లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మంత్రివర్గం అధికారాన్ని కోల్పోయింది.


* అవిశ్వాస తీర్మాన నోటీసుపై 50 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేసిన అనంతరం స్పీకర్‌కు అందజేయాలి. దానిపై సభలో చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో సాధారణ మెజార్టీతో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య కనీసం 6 నెలల విరామం ఉండాలి. ‘రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ పార్లమెంటు-1950’’ చట్టాన్ని అనుసరించి అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టాలి.


విశ్వాస తీర్మానం: ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగుతుంది.అవసరమైనప్పుడు లోక్‌సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు. ఆ సందర్భంలో లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో  సాధారణ మెజార్టీతో తీర్మానం ఓడిపోతే ప్రభుత్వం అధికారం కోల్పోతుంది.


ఉదా: 1990లో 9వ లోక్‌సభలో అప్పటి ప్రధాని వి.పి.సింగ్‌ లోక్‌సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం వీగిపోవడంతో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.


కోత తీర్మానాలు: సాధారణంగా లోక్‌సభలో కోత తీర్మానాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. వాటిపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో ఆ తీర్మానాలు నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. ఈ తీర్మానాలు 3 రకాలుగా ఉన్నాయి. 


1) విధానకోత తీర్మానం(Policy cut motion): వివిధ పద్దుల నుంచి కోరిన మొత్తాన్ని ఒక రూపాయికి తగ్గించాల్సిందిగా చేసే తీర్మానాన్ని ‘విధాన కోత తీర్మానం’ అంటారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో ప్రభుత్వం ఎంచుకున్న విధానానికి ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా సూచించవచ్చు.


2) ఆర్థిక కోత తీర్మానం(Economy cut motion):  ప్రభుత్వ దుబారాను నియంత్రించే ఉద్దేశంతో వివిధ పద్దుల నుంచి నిర్ణీత మొత్తాన్ని తగ్గించాలని ప్రవేశపెట్టే తీర్మానమే ఆర్థిక కోత తీర్మానం.


3) నామమాత్రపు కోత తీర్మానం (Token cut motion):  పద్దుల నుంచి రూ.100 తగ్గించాలని ప్రవేశపెట్టే తీర్మానమే ‘నామమాత్రపు కోత తీర్మానం’. బడ్జెట్‌లో ప్రభుత్వం విస్మరించిన ప్రత్యేక అంశాన్ని ఎత్తిచూపడం దీని ఉద్దేశం.

 

సమష్టి బాధ్యత: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75(3) ప్రకారం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహించాలి. ఈ సూత్రాన్ని ఉల్లంఘిస్తే మంత్రులు పదవులను కోల్పోతారు.


* ఉదా: హిందూ కోడ్‌ బిల్లు విషయమై జవహర్‌లాల్‌ నెహ్రూతో విభేదించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


* చైనాతో యుద్ధం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వి.కె.కృష్ణమీనన్‌


* పాకిస్థాన్‌తో 1966లో లాల్‌బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వం కుదుర్చుకున్న తాష్కెంట్‌ ఒప్పందాన్ని వ్యతిరేకించడం వల్ల మహావీర్‌ త్యాగి.


* 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం రూపొందించిన ‘ముస్లిం మహిళల వివాహం, విడాకుల హక్కుల చట్టం’ను వ్యతిరేకించడం వల్ల అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌.


* జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ప్రణాళిక సంఘానికి విశేష ప్రాధాన్యం కల్పించడాన్ని వ్యతిరేకించడం వల్ల వి.వి.గిరి. పదవులు కోల్పోయారు

ఆర్థిక బిల్లులపై - విశేష ఆధిపత్యం: ఒక బిల్లు ఆర్థిక బిల్లా? కాదా అని ధ్రువీకరించే విశేష అధికారం లోక్‌సభకు ఉంది. దీనిని స్పీకర్‌ నిర్ణయిస్తారు. ఆర్థిక బిల్లులను ముందుగా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. ఆ సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయం తెలియజేయాలి. లేకపోతే సంబంధిత బిల్లులను ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. ఆర్థిక బిల్లుల విషయమై లోక్‌సభ, రాజ్యసభల మధ్య విభేదాలు వస్తే ‘పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం’ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. 

అంచనాల సంఘం: ఇది పార్లమెంటు నుంచి ఏర్పడే కీలకమైన ఆర్థిక కమిటీ. జాన్‌ మత్తాయ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1950లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని 30 మంది సభ్యులు లోక్‌సభకు చెందినవారే. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు లేదా మితవ్యయం పాటించే పద్ధతులను ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. సభ్యులు లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నికవుతారు.

పార్లమెంటరీ కమిటీలు: పార్లమెంటు నుంచి ఏర్పడిన మొత్తం 24 శాఖాపరమైన పార్లమెంటరీ కమిటీల్లో 16 కమిటీలకు ఛైర్మన్లను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు. ప్రభుత్వ ఖాతాల సంఘంలోని 22 మంది సభ్యుల్లో 15 మంది లోక్‌సభ సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులను నియమించడం ఒక సంప్రదాయంగా 1967 నుంచి కొనసాగుతోంది. ఇది అతిపురాతనమైన పార్లమెంటరీ కమిటీ.

పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం: సాధారణ బిల్లులను లోక్‌సభ, రాజ్యసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఈ బిల్లులను ఆమోదించే క్రమంలో ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్‌ 108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. లోక్‌సభ ఆమోదించి పంపిన బిల్లులను రాజ్యసభ తిరస్కరించినా, సవరణలు సూచించినా, 6 నెలల్లోగా ఎలాంటి నిర్ణయం తెలియజేయకపోయినా ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లుగా భావిస్తారు. సంయుక్త సమావేశంలో జరిగే ఓటింగ్‌ను అనుసరించి బిల్లు భవిష్యత్తును నిర్ణయిస్తారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లోక్‌సభ అభిప్రాయమే నెగ్గుతుంది. అలాంటి ఉభయసభల సంయుక్త సమావేశాలు ఇప్పటివరకు మూడు సార్లు నిర్వహించారు.


1) 1961, మే 6న ‘వరకట్న నిషేధ బిల్లు’ను ఆమోదించే విషయంలో ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాటి లోక్‌సభ స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌ అధ్యక్షత వహించారు.


2) 1978, మే 26న బ్యాంకింగ్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు/రద్దుకు సంబంధించిన సర్వీసు నిబంధనలను ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. స్పీకర్‌ కె.ఎస్‌.హెగ్డే అధ్యక్షత వహించారు.


3) 2002, మార్చి 26న పోటా (POTA) బిల్లును ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ప్రధాని వాజ్‌పేయీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ సంయుక్త సమావేశం ఏర్పాటుచేశారు. డిప్యూటీ స్పీకర్‌ పి.ఎం.సయీద్‌ అధ్యక్షత వహించారు. (స్పీకర్‌ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహించారు).

జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 352 ప్రకారం రాష్ట్రపతి ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ ప్రకటిస్తారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్‌సభకు ప్రత్యేక అధికారాన్ని కల్పించారు. దీని ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే లోక్‌సభ ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలి. జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలని కోరుతూ లోక్‌సభలోని 1/10 వంతు సభ్యులు ఒక తీర్మాన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు లేదా రాష్ట్రపతికి సమర్పించవచ్చు. 14 రోజుల్లోగా లోక్‌సభ ఈ అంశాన్ని చర్చించి సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తే అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తారు.

ప్రభుత్వం - అధికారాన్ని కోల్పోయే సందర్భాలు: లోక్‌సభలో కొన్ని బిల్లుల విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది.


- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లోక్‌సభలో వీగిపోయినప్పుడు.


- ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరించినప్పుడు.


- ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా, ప్రైవేటు సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గినప్పుడు.


- ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పబ్లిక్‌ బిల్లు’ తిరస్కరణకు గురైనప్పుడు.

లోక్‌సభ సభ్యుల సంఖ్యలో మార్పులు, చేర్పులు: రాజ్యాంగం లోక్‌సభ సభ్యుల సంఖ్యను నిర్ధారించలేదు. కానీ ఆ సంఖ్యను నిర్ధారించే పద్ధతిని మాత్రం పేర్కొంది. ఆర్టికల్‌ 82 ప్రకారం దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత ప్రభుత్వం ‘నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌’(Delimitation Commission) ను ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్‌ సూచనల మేరకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను నిర్దేశిస్తుంది. 1950లో ఒకటో ‘డీలిమిటేషన్‌ కమిషన్‌’ సిఫార్సుల మేరకు 489 స్థానాలు నిర్దేశించారు. 1962లో రెండో డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు 525 స్థానాలు నిర్దేశించారు. 1972లో మూడో డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు, 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 550గా పేర్కొన్నారు. వీటిలో 530 మంది రాష్ట్రాలకు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాలని పేర్కొన్నారు.


* ఆర్టికల్‌ 331 ప్రకారం లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2020 ప్రకారం ఈ నామినేషన్‌ విధానాన్ని రద్దు చేశారు.

రిజర్వేషన్లు: లోక్‌సభలో అన్నివర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ వర్గాల వారికి 84 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 47 స్థానాలు కేటాయించారు. ప్రస్తుతం ఇవే స్థానాలు కొనసాగుతున్నాయి.

లోక్‌సభ కాలం: ఆర్టికల్‌ 83 ప్రకారం సాధారణంగా లోక్‌సభ కాలం 5 సంవత్సరాలు. అయితే కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు లోక్‌సభను ఆ కాలం కంటే ముందే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు.ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ అమలులో ఉన్న సందర్భంలో లోక్‌సభ కాలాన్ని ఒక సంవత్సరం వరకు అదనంగా పొడిగించవచ్చు (5 నుంచి 6 సంవత్సరాల వరకు).

 

 

బంగారు సత్యనారాయణ


 

 

Posted Date : 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌