• facebook
  • whatsapp
  • telegram

జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్‌

1950, నవంబరు 18న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌ను నియమించారు. 
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338 ప్రకారం షెడ్యూల్డు కులాలు, తెగలకు కల్పించిన రక్షణలు, ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా 1978లో ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌ స్థానంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటుచేసింది. దీని మొదటి ఛైర్మన్‌ బోళ పాశ్వాన్‌ శాస్త్రి.
1987లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డు క్యాస్ట్స్‌ అండ్‌ షెడ్యూల్డు ట్రైబ్స్‌’గా రూపొందించింది. 

రాజ్యాంగ భద్రత
విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ చట్టం - 1990 ద్వారా ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డు క్యాస్ట్స్‌ అండ్‌ షెడ్యూల్డు ట్రైబ్స్‌’కు రాజ్యాంగ భద్రత కల్పించింది. ఇది 1992, మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. 

జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన
అటల్‌బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 89వ రాజ్యాంగ సవరణ చట్టం, 2004 ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రెండుగా విభజించింది. 
1) ఆర్టికల్‌ 338 ప్రకారం - నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డు క్యాస్ట్స్‌  
2) ఆర్టికల్‌ 338్బత్శి ప్రకారం - నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డు ట్రైబ్స్‌  

జాతీయ ఎస్సీ కమిషన్‌ - రాజ్యాంగ వివరణ
ఆర్టికల్‌ 338(1): షెడ్యూల్డు కులాల ప్రయోజనాల సంరక్షణకు జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ ఏర్పాటు.

ఆర్టికల్‌ 338(2): పార్లమెంటు రూపొందించిన చట్టంలోని నియమ నిబంధనలను అనుసరించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరి సర్వీసు నిబంధనలు, పదవీకాలం రాష్ట్రపతి నిర్ణయించిన నియమాల ప్రకారం ఉంటాయి. వీరి పదవీకాలం 3 సంవత్సరాలు.

ఆర్టికల్‌ 338(3): జాతీయ ఎస్సీ కమిషన్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార పత్రం ద్వారా నియమిస్తారు. మొత్తం సభ్యుల్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలి.


ఆర్టికల్‌ 338(4): జాతీయ ఎస్సీ కమిషన్‌ స్వతంత్ర సంస్థగా పనిచేస్తూ తన పని విధానాన్ని తానే నియంత్రించుకుంటుంది. 

ఆర్టికల్‌ 338(5): జాతీయ ఎస్సీ కమిషన్‌ అధికార, విధులను తెలియజేస్తుంది.

ఛైర్మన్, సభ్యుల సౌకర్యాలు, జీతభత్యాలు
జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదాతో సమానమైన హోదాను కలిగి ఉంటారు. డిప్యూటీ ఛైర్మన్‌ కేంద్ర సహాయమంత్రితో సమానమైన, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాతో సమానమైన సౌకర్యాలు, జీతభత్యాలను పొందుతారు. పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులుగా నియమితులైతే వారికి ఎలాంటి జీతభత్యాలు ఉండవు.

పని విధానం
జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ కమిషన్‌ అధీన కార్యాలయాలను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. ప్రధాన కార్యాలయంలో 4 విభాగాలున్నాయి. 
1) పాలనా సమన్వయ విభాగం: ఇది జాతీయ ఎస్సీ కమిషన్‌ చేపట్టే వివిధ కార్యక్రమాలను సమన్వయపరుస్తుంది.

2) సేవా పరిరక్షణ విభాగం:  ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ వర్గాలకు సమకూర్చిన సౌకర్యాల అమలును పర్యవేక్షిస్తుంది.
3) పౌరహక్కుల పరిరక్షణ విభాగం: ఇది పౌరహక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, వెట్టిచాకిరీ నిషేధం లాంటి చట్టాల అమలుతీరును పర్యవేక్షిస్తుంది.
4) సామాజిక, ఆర్థిక అభివృద్ధి విభాగం: ఇది షెడ్యూల్డు కులాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది.

* షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌ ‘అనుసూచిత్‌ జాతివాణి’ పేరుతో ప్రతి మూడు నెలలకోసారి 
‘ఈ - మ్యాగజీన్‌’ను విడుదల చేస్తుంది.

అధికారాలు - విధులు
* షెడ్యూల్డు కులాల రక్షణ, హక్కులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి విచారించడం. 
* షెడ్యూల్డు కులాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే ప్రణాళికల రూపకల్పనలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం; వారి అభివృద్ధి పురోగతిని సమీక్షించడం.
* ఎస్సీలకు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా కల్పించిన ప్రత్యేక హక్కులకు సంబంధించిన అంశాలన్నింటినీ విచారించడం, పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం.
షెడ్యూల్డు కులాలకు కల్పించే పరిరక్షణల అమలు గురించి రాష్ట్రపతికి వార్షిక నివేదికను సమర్పించడం. 
* ఏ ప్రభుత్వ అధికారినైనా కమిషన్‌ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని, అఫిడవిట్‌ను సమర్పించాలని కోరడం. 
* వివిధ న్యాయస్థానాలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన పబ్లిక్‌ రికార్డులు, ఇతర నకళ్లను పొందడం.
* పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1976; షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టం - 1989 అమలుకు కృషి చేయడం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం తీసుకునే చర్యల అమలుకు కృషి.
* రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు షెడ్యూల్డు కులాల రక్షణ, సంక్షేమం, ప్రగతి కోసం ఇతర విధులను నిర్వహించడం.
* సివిల్‌కోర్టుకు సమానమైన అధికారాలను కలిగి ఉంటుంది.
* జాతీయ ఎస్సీ కమిషన్‌ తన నివేదికలను రాష్ట్రపతికి సమర్పించగా, రాష్ట్రపతి వాటిని పార్లమెంటుకు అందజేస్తారు. 
* జాతీయ ఎస్సీ కమిషన్‌ సమర్పించిన నివేదికలోని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే ఆ ప్రతిని రాష్ట్రపతి గవర్నర్‌కు పంపిస్తారు. గవర్నర్‌ వాటిని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌