• facebook
  • whatsapp
  • telegram

జాతీయ స్థాయి సంక్షేమ పథకాలు

సామాజిక అసమానతలపై సంక్షేమ అస్త్రాలు!

(ఎస్సీ ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు)




 

 

అనాదిగా చాతుర్వర్ణ వ్యవస్థ అమలైన భారతదేశంలో కొన్ని సమూహాలు పీడిత వర్గాలుగా మిగిలిపోయాయి. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిపోయాయి. మన సమాజ నిర్మాణంలోని ఈ అసమానతలను తగ్గించేందుకు స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ నిర్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. సామాజికంగా కిందిస్థాయిలో ఉన్న కులాలు, సమూహాల అభివృద్ధికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని నమ్మి అన్నివిధాలుగా చేయూతనిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో అమలవుతున్న అలాంటి పథకాలు, వాటికి ఉన్న పరిమితులు, లక్ష్యాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

రాజ్యం/ప్రభుత్వం ప్రజల సంక్షేమం, బాగోగుల కోసమే పాటుపడితే దాన్ని ‘సంక్షేమ రాజ్యం’ అంటారు. ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం లేదా వివిధ రకాలుగా సాయం అందించడాన్ని సంక్షేమంగా చెప్పవచ్చు. అవి ధన సేవలు, నగదు చెల్లింపులు, మినహాయింపులు, రాయితీలు, దానాలు, ప్రభుత్వ పంపిణీ రూపంలో ఉంటాయి.


కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులను సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల వారీగా వర్గీకరించింది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ ప్రచురించే ఇతర వెనుకబడిన తరగతుల జాబితా క్రియాశీలకమైంది. ఇది సమయానుసారం సామాజిక, విద్య, ఆర్థిక అంశాల ఆధారంగా మార్పులకు గురవుతుంది. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యారంగంలో ఓబీసీలు 27 శాతం రిజర్వేషన్లకు అర్హులు. రాజ్యాంగం ఓబీసీలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారీగా అభివర్ణిస్తుంది. వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది.


షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ పథకాలు:


విద్యా సాధికారత: షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల చదువులకు వారి ఆర్థిక పరిస్థితులు అవరోధం కాకుండా ప్రభుత్వం ఉపకారవేతనాలు అందిస్తుంది. ఇవి ప్రధానంగా మూడు రకాలు.


* ప్రి-మెట్రిక్‌ ఉపకారవేతనాలు: ఈ పథకం ప్రధాన లక్ష్యం షెడ్యూల్డ్‌ కులాల పిల్లల చదువులకు చేయూత అందించడం. వారు బడి మానకుండా చూడటం.


* పోస్ట్‌-మెట్రిక్‌ ఉపకారవేతనాలు: ఇది కేంద్ర పథకం. రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం కింద షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల కోసం నిర్దేశించిన వ్యయం కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ 100 శాతం నిధుల్ని కేంద్రం విడుదల చేస్తుంది.


* ఉన్నత విద్య, శిక్షణకు ఉపకారవేతనాల పథకం


i) షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు నైపుణ్య విద్య అందించడం: 12వ తరగతి తర్వాత పేరున్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, వైద్య/న్యాయ, ఇతర సంస్థల్లో చదివేందుకు పూర్తి ఆర్థిక సాయం అందించడం ఈ పథకం లక్ష్యం.


ii) జాతీయ ఫెలోషిప్‌: ఎం.ఫిల్, పీహెచ్‌డీ వీటికి సమానమైన పరిశోధన, అధ్యయనాలు చేసే ఎస్సీ విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారు.


iii) జాతీయ విదేశీ ఉపకారవేతనాలు: మాస్టర్‌ లెవల్‌ పీహెచ్‌డీ లాంటి ఉన్నత చదువులను విదేశాల్లో అభ్యసించడానికి షెడ్యూల్డ్‌ కులాలు, అనుచిత సంచార, పాక్షిక సంచార తెగల విద్యార్థులకు ఈ పథకం సాయం అందిస్తుంది.


iv) షెడ్యూల్డ్‌ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉచిత శిక్షణ: ప్రభుత్వ/ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం పొందడానికి ఆర్థికంగా బలంగా లేని షెడ్యూల్డ్‌ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలున్న శిక్షణ అందించడం ఈ పథకం లక్ష్యం. కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-ఎ, బి పరీక్షలతో పాటు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే రిక్రూమెంట్‌ బోర్డ్డు, రాష్ట్ర పీఎస్‌సీఎస్, ఆఫీసర్స్‌ గ్రేడ్‌ పరీక్షలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు శిక్షణ ఇస్తారు. అలాగే ఇంజినీరింగ్, విద్య, వైద్య, వృత్తి విద్య కోర్సులు, మేనేజ్‌మెంట్, న్యాయశాస్త్రం కోర్సుల్లో ప్రవేశానికి శిక్షణ అందిస్తారు.


ఆర్థిక సాధికారతా పథకాలు:


జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ): దారిద్య్రరేఖకు దిగువన ఉండే షెడ్యూల్డ్‌ కులాల లబ్ధిదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, వారికి ఆదాయాన్ని కల్పించే కార్యక్రమాలు రూపొందించడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. రుణ రీఫైనాన్స్, నైపుణ్య శిక్షణ, ఔత్సాహిక పారిశ్రామికుల అభివృద్ధి కోసం కార్యక్రమాలు, రాష్ట్రస్థాయి సంస్థల సహకారంతో మార్కెటింగ్‌ సహాయం, ఆర్‌ఆర్‌బీలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా లబ్ధి పొందడానికి ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ సాయం అందిస్తోంది.


షెడ్యూల్డ్‌ కులాల ఉపప్రణాళిక (ఎస్సీఎస్పీ) కోసం కేంద్రం ప్రత్యేక సహాయం: రాష్ట్రాల్లో/కేంద్రపాలిత ప్రాంతాల్లోని షెడ్యూల్డ్‌ కులాల జనాభా, వెనుకబాటుతనం, వారు దారిద్య్రరేఖను దాటడానికి ఎస్సీఎస్పీకి అదనంగా కేంద్రం వంద శాతం సాయం అందిస్తుంది.


షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంస్థలకు సాయమందించే పథకం (ఎస్‌సీడీసీఎస్‌): కేంద్ర ప్రాయోజిత పథకం కింద షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంస్థలకు 49 : 51 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటా విడుదల చేస్తాయి. రుణాలు, పెట్టుబడులు అందుకొనేలా లబ్ధిదారులకు మార్జిన్‌ మనీ, రాయితీలిచ్చి సహకరించడంలో ఎస్‌సీడీసీఎస్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉద్యోగాల కల్పనకు దోహదపడే పనులకు ఈ పథకం సాయమందిస్తుంది. అవి  1) వ్యవసాయం, వ్యవసాయాధారిత కార్యక్రమాలు, చిన్ననీటి పారుదల 2) చిన్నతరహా పరిశ్రమలు 3) రవాణా 4) వాణిజ్య, సేవల రంగం


వెంచర్‌ క్యాపిటల్‌ నిధి: ఈ నిధి ప్రధానోద్దేశం షెడ్యూల్డ్‌ కులాల వారిలో పారిశ్రామిక ఔత్సాహికతను పెంపొందించడం, కొత్త ఆవిష్కరణలకు సాంకేతిక, అభివృద్ధుల్లో వారికి మినహాయింపుతో కూడిన ఆర్థిక సహాయం అందించడం.


క్రెడిట్‌ పెంపుదల గ్యారంటీ పథకం: షెడ్యూల్డ్‌ కులాల్లోని యువ పారిశ్రామికవేత్తలకు రుణ గ్యారెంటీని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఎస్సీల్లో దిగువ స్థాయుల్లో ఉన్నవారిలో ఉద్యోగ కల్పనలోనే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఈ పథకం తోడ్పడుతుంది.


ఇతర పథకాలు:


ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ యోజన: షెడ్యూల్డ్‌ కులాల వారు 50 శాతానికి పైగా ఉన్న గ్రామాల్లో వారి సమగ్ర అభివృద్ధికి అమలుపరిచే కేంద్ర ప్రాయోజిత ప్రయోగాత్మక పథకమే PMAGY.


బాబూ జగ్జీవన్‌ రామ్‌ చాత్రా ఆవాస్‌ యోజన: మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదివే ఎస్సీ బాల బాలికలకు హాస్టల్‌ వసతి కల్పించడానికి; హాస్టల్‌ నిర్మాణ ఏజెన్సీలను ఆకర్షించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.


షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడం: ఎస్సీ కులానికి చెందిన 9, 10 తరగతుల విద్యార్థులు రెసిడెన్షియల్‌/నాన్‌రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుకోవడానికి, వారి ప్రతిభని మెరుగుపరచడానికి సదుపాయాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం.


షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమ పథకాలు: 


పోస్ట్‌మెట్రిక్‌ ఉపకారవేతనాలు: ఎస్టీ విద్యార్థులు వృత్తి విద్య, సాంకేతిక, వృత్తి విద్యేతర, సాంకేతికేతర కోర్సులు వివిధ స్థాయుల్లో దూర, నిరంతర విద్య ద్వారా చదవడానికి ఈ పథకం వర్తిస్తుంది.


షెడ్యూల్డ్‌ తెగల బాల/బాలికల వసతిగృహ కేంద్ర ప్రాయోజిత పథకం వర్తింపు, లక్ష్యాల మార్పులు: ఈ పథకాన్ని ఆదిమతెగలు, షెడ్యూల్డ్ తెగల బాల/బాలికల కోసం ఏర్పాటు చేశారు. మాధ్యమిక, ఉన్నత సెకండరీ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో షెడ్యూల్ట్ తెగల బాలికలు/యువతులు చదువు మానేయకుండా వారికి వసతి ఏర్పాటుచేసే సంస్థలను ఆకర్షించడం ఈ పథకం ఉద్దేశం.


ఎస్టీ బాలికల వసతిగృహాలు: రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎస్టీ బాలికల కోసం వసతిగృహాల నిర్మాణం/విస్తరణ నిమిత్తం ఈ పథకం కింద 100 శాతం కేంద్రం సహాయం అందిస్తుంది.


ఎస్టీ బాలల వసతిగృహాలు: ఎస్టీ బాలల వసతిగృహాల నిర్మాణం/విస్తరణ కోసం 50 : 50 నిష్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి సాయం పొందుతాయి. నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం 100 శాతం సాయం అందిస్తుంది.


విద్యార్థులకు శ్రేష్ఠమైన విద్య: 2007-08 నుంచి కేంద్రం దీన్ని అందిస్తోంది. ఎస్టీ మంత్రిత్వ శాఖ గుర్తింపుపొందిన సంస్థల్లో డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో విద్య అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ప్రారంభించారు.


విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడం: 9- 12వ తరగతుల షెడ్యూల్డ్‌ తెగల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడం కోసం శిక్షణ, ప్రత్యేక తర్ఫీదు అందించడం ఈ పథకం లక్ష్యం.


గిరిజన ప్రాంతాల వృత్తి విద్యకు శిక్షణ కేంద్రాలు: గిరిజన యువతకు సంప్రదాయ లేదా ఆధునిక వృత్తుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.


జాతీయ విదేశీ ఉపకార వేతనాలు: ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మాస్టర్‌ స్థాయి పీహెచ్‌డీ, పోస్ట్‌డాక్టరేట్‌ పరిశోధన కార్యక్రమాల్లో ఇంజినీరింగ్, సాంకేతిక విజ్ఞానశాస్త్రంలో ఉన్నత విద్యాభ్యాసానికి ఈ కేంద్ర పథకం ఆర్థిక సహాయం చేస్తుంది.


రాజీవ్‌గాంధీ జాతీయ ఫెలోషిప్‌: ఎస్టీ విద్యార్థులు ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించేలా 2005-06లో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.


గిరిజన ఉపప్రణాళిక ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలల స్థాపన: షెడ్యూల్డ్‌ తెగలు, ఆదిమ గిరిజన సమూహాలకు గురుకుల పాఠశాలల ద్వారా విద్య అందించేందుకు ఉద్దేశించిందే ఈ పథకం.


ఏకలవ్య నమూనా రెసిడెన్షియల్‌ పాఠశాలలు: నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఎస్టీ విద్యార్థులకు అందించేందుకు ఏకలవ్య నమూనా రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఇవి జవహర్‌ నవోదయ, కస్తూర్బా గాంధీ, కేంద్రీయ విద్యాలయాల సరసన చేరాయి.


షెడ్యూల్డ్‌ తెగలకు శిక్షణ పథకం: ఈ పథకాన్ని నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. చివరిసారిగా 1998-99లో సవరించారు. దీనిద్వారా కింది కోర్సులకు శిక్షణను అందిస్తారు.* కేంద్ర, రాష్ట్ర సివిల్‌ సర్వీసుల పరీక్షలు. * వైద్యం, ఇంజినీరింగ్, ఎంబీఏ ఇతర వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు. * యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్, ఎన్డీఏ. ఉదాహరణకు స్టాఫ్‌ సెలక్షన్‌ లాంటి ఇతర పరీక్షలు. * కమిషన్‌ పరీక్షలు/సబార్డినేటెడ్‌/ దిగువ సబార్డినేటెడ్‌ సేవల పరీక్షలు, కేంద్ర ఎక్సైజ్‌ మొదలైనవి. * బీఎస్‌ఆర్‌/ఆర్‌ఆర్‌బీ, జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మొదలైనవి.

 

 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

 

Posted Date : 18-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌