• facebook
  • whatsapp
  • telegram

జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు

జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్, 338 ప్రకారం ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను కాపాడటానికి 1978లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీని మొదటి ఛైర్మన్ బోళ పాశ్వాన్ శాస్త్రి.
* ఈ కమిషన్‌ను 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 'నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌'గా మార్చింది.
* దీనికి వి.పి. సింగ్ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ చట్టం (1990) ద్వారా రాజ్యాంగ భద్రతను కల్పించడంతో 1992, మార్చి 12 నుంచి నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అమల్లోకి వచ్చింది.

నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు
* రామ్‌ధన్                  -     1992 - 1995
* ఎం. హనుమంతప్ప     -    1995 - 1998
* దిలీప్‌సింగ్ భూరియా      -    1998 - 2002
* విజయ్ శంకర్ శాస్త్రి         -    2002 - 2004
* అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 89వ రాజ్యాంగ సవరణ చట్టం, 2004 ప్రకారం నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రెండుగా విభజించి, ఆర్టికల్, 338 ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్‌ను; ఆర్టికల్, 338(A) ప్రకారం నేషనల్ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

నేషనల్ ఎస్సీ కమిషన్ (ఆర్టికల్ 338)
* ఆర్టికల్, 338(1) - షెడ్యూల్డు కులాల వారికి జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
* ఆర్టికల్, 338(2) - పార్లమెంటు రూపొందించిన చట్టంలోని నిబంధనలను అనుసరించి ఎస్సీ కమిషన్‌కు ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు.
* వీరి సర్వీసు నిబంధనలు, పదవీ కాలపరిమితి రాష్ట్రపతి నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఉంటాయి. పదవీ కాలం 3 సంవత్సరాలు.
* ఆర్టికల్, 338(3) - ఎస్సీ కమిషన్‌కు అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఇతర సభ్యులను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార పత్రం ద్వారా నియమిస్తారు. సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా మహిళై ఉండాలి.
* ఆర్టికల్, 338(4) - ఎస్సీ కమిషన్ స్వతంత్ర సంస్థ. అంటే తన పని విధానాన్ని తానే నియంత్రించుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది.

అధికారాలు - విధులు
      ఆర్టికల్, 338(5) ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్ కింది విధులను నిర్వహిస్తుంది
* షెడ్యూల్డు కులాల రక్షణ, హక్కులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, విచారించడం.
* షెడ్యూల్డు కులాల ఆర్థిక, సామాజిక, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే ప్రణాళికల రూపకల్పనలో తగిన సలహాలు ఇవ్వడం, వారి అభివృద్ధి పురోగతిని మూల్యాంకనం చేయడం.
* షెడ్యూల్డు కులాల వారికి రాజ్యాంగపరంగా, చట్టపరంగా కల్పించిన ప్రత్యేక హక్కులకు సంబంధించిన అన్ని అంశాలను విచారించడం, పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం.
* షెడ్యూల్డు కులాల వారికి కల్పించిన పరిరక్షణల అమలుతీరు గురించి రాష్ట్రపతికి వార్షిక నివేదికలను సమర్పించడం లేదా అవసరాన్ని బట్టి ఇతర సమయాల్లో కూడా నివేదికలను పంపడం.
* రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు షెడ్యూల్డు కులాల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి, పురోగతి కోసం ఇతర విధులను నిర్వహించడం.
* అధికారాల నిర్వహణలో 'సివిల్ కోర్టు' అధికారాలను కలిగి ఉండటం.
* ఏ అధికారినైనా తన ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరవచ్చు లేదా అఫిడవిట్‌ను సమర్పించాలని కోరవచ్చు. ఎలాంటి రికార్డులనైనా పరిశీలించవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గాల సంక్షేమాన్ని ఉద్దేశించి తీసుకునే చర్యల అమలు తీరును మాత్రమే కాకుండా నూతనంగా వీరికోసం అమలుచేసే పథకాల గురించి ఎస్సీ కమిషన్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.
* 1976 నాటి పౌరహక్కుల పరిరక్షణ చట్టం, 1989 నాటి ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం అమలు తీరును ఈ కమిషన్ సమీక్షిస్తుంది.
* కోర్టులు, కార్యాలయాల నుంచి అవసరమైన పబ్లిక్ రికార్డులు, ఇతర నకళ్లను పొందడం.
* ఎస్సీ కమిషన్ అందించే నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటుకు సమర్పిస్తారు.
* ఎస్సీ కమిషన్ సమర్పించిన నివేదికలోని అంశాలు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే దాని ప్రతిని రాష్ట్రపతి గవర్నర్‌కు పంపగా, గవర్నర్ దాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.

ఛైర్మన్ సభ్యుల జీతభత్యాలు
* ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేంద్ర కేబినెట్ మంత్రి హోదా, డిప్యూటీ ఛైర్మన్ కేంద్ర సహాయమంత్రి హోదా, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాతో సమానమైన సౌకర్యాలను కలిగి ఉంటారు.
* ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి జీతంతో సమానమైన వేతనాలు పొందుతారు.
* పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులను ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులుగా నియమిస్తే వారికి ఎలాంటి జీతభత్యాలు ఉండవు.
* జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ కమిషన్ అధీన కార్యాలయాలను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ప్రధాన కార్యాలయంలో 4 విభాగాలు ఉన్నాయి. అవి:
1. పాలనా సమన్వయ విభాగం: ఇది కమిషన్ చేపట్టే వివిధ కార్యక్రమాలను సమన్వయ పరుస్తుంది.
2. సేవా పరిరక్షణ విభాగం: ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ వర్గాలకు సమకూర్చిన సౌకర్యాల అమలును పర్యవేక్షిస్తుంది.
3. పౌరహక్కుల పరిరక్షణ విభాగం: ఇది వివిధ చట్టాల అమలు తీరును పర్యవేక్షిస్తుంది.
4. సామాజిక, ఆర్థిక అభివృద్ధి విభాగం: షెడ్యూల్డు కులాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది.

నేషనల్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌లు
1. సూరజ్‌భాన్          -      2004 - 2007
2. భూటాసింగ్           -     2007 - 2010
3. పి.ఎల్. పునియా   -    2010 - 2013
4. పి.ఎల్. పునియా   -      2013, అక్టోబరు 22 నుంచి పునర్ నియామకం
* షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ 'అనుశుచిత్ జాతివాణి' పేరుతో ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక 'ఈ-మాగజైన్‌'ను విడుదల చేస్తుంది.
* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేములను దళితుడిగా పి.ఎల్. పునియా నేతృత్వంలోని నేషనల్ ఎస్సీ కమిషన్ ధ్రువీకరించింది.
* రోహిత్ దళితుడు కాదని అతడి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని ఏర్పాటు చేసిన 'రూపన్‌వాల్ కమిషన్‌'ను ఎస్సీ కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కులంపై తుది నిర్ధారణ అధికారి జిల్లా కలెక్టర్ అని పేర్కొంది.
* ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం 1968లో ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. దీన్ని 1978లో స్థాయీ సంఘంగా మార్పు చేశారు. దీనిలో 20 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్
* ఆంధ్రప్రదేశ్‌లో 2003లో చేసిన చట్టం ప్రకారం షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఒక ఛైర్మన్, 5 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సభ్యులందరూ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కృషి చేసేవారై ఉండాలి.
* సభ్యులు, ఛైర్మన్ పదవీకాలం 3 సంవత్సరాలు.

అధికారాలు - విధులు
* రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కల్పించిన సదుపాయాలు, అమలు జరుగుతున్న తీరును విచారించి, నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది. ఈ నివేదికను గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.
* ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
* కమిషన్ సమక్షంలో ఉండే ఏదైనా ప్రొసీడింగ్‌ను ఐపీసీ ప్రకారం జ్యుడీషియల్ ప్రొసీడింగ్‌గా భావించాలి.
* వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు
* కె. పున్నయ్య - 2003 - 2006
* ఎమ్. నాగార్జున - 2007 - 2009
* 2010 నుంచి కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించలేదు.
* 2013లో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి, వేర్వేరు కమిషన్‌లుగా ఏర్పాటు చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా 2016లో కారెం శివాజీ నియమితులయ్యారు.

జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్
* ఆర్టికల్, 338(A) ప్రకారం 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ను 2004, ఫిబ్రవరి 19న ఏర్పాటు చేశారు.
* నేషనల్ ఎస్టీ కమిషన్ ప్రధాన కార్యాలయం 'న్యూదిల్లీ'లో ఉంది. దీనికి భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, జయపుర, రాయ్‌పూర్, రాంచీలలో ఆరు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

ఆర్టికల్, 338(A)(1): షెడ్యూల్డు తెగల కోసం ఒక షెడ్యూల్డు తెగల జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.

ఆర్టికల్, 338(A)(2): నేషనల్ ఎస్టీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.
* అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు షెడ్యూల్డు తెగలకు చెందినవారై ఉండాలి. మిగిలిన ఒకరు కచ్చితంగా షెడ్యూల్డు తెగలకు చెందిన మహిళై ఉండాలి. వీరందరి పదవీకాలం 3 సంవత్సరాలు.
* అధ్యక్షుడు - కేంద్ర కేబినెట్ మంత్రితో సమానమైన హోదాను, జీతభత్యాలను పొందుతారు.
* ఉపాధ్యక్షుడు - కేంద్ర సహాయ మంత్రితో సమానమైన హోదాను, జీతభత్యాలను పొందుతారు.
* సభ్యులు - భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాను, జీతభత్యాలను పొందుతారు.

ఆర్టికల్, 338(A)(3): అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

ఆర్టికల్, 338(A)(4): ఎస్టీ కమిషన్ తన పని విధానాన్ని తానే నియంత్రించుకుంటుంది.

నేషనల్ ఎస్టీ కమిషన్ అధికారాలు - విధులు
* షెడ్యూల్డు తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికా ప్రక్రియలో పాల్గొనడం. ఈ తెగలకు సంబంధించిన విధాన ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
* ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న రక్షణ, ప్రత్యేక హక్కులను పరిరక్షించడం.
* ఎస్టీల సంక్షేమం, సామాజిక, ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, వాటిని సమర్థంగా అమలు చేయడం గురించి తగిన సలహాలు ఇవ్వడం.
* ఎస్టీల రాజ్యాంగ పరిరక్షణ పనితీరుపై రాష్ట్రపతికి వార్షిక నివేదికలను సమర్పించడం. ఈ నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటులో ప్రవేశపెడతారు.
* ఎస్టీ కమిషన్ పంపిన నివేదికలో కొంత భాగం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందైతే, ఆ నివేదిక ప్రతిని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించాలి. దాన్ని గవర్నర్ శాసనసభలో ప్రవేశపెడతారు.
* ఎస్టీ వర్గాల హక్కులు, రక్షణలకు భంగం వాటిల్లితే వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం.
* ఎస్టీ కమిషన్ కేసుల విచారణ ప్రక్రియలో భాగంగా సివిల్‌కోర్టులా వ్యవహరిస్తుంది.
* గిరిజనులు అనాదిగా అనుసరిస్తున్న 'పోడు వ్యవసాయ పద్ధతిని' నివారించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేయడం.
* PESA Act (Panchayat Raj Extension to the Scheduled Areas)ను షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తింపచేయడానికి కృషి చేయడం.
* అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించడం.
* గిరిజనులకు చెందిన భూమిని అన్యాక్రాంతం కాకుండా నివారించడం.
* చట్టరీత్యా ఆదివాసీలకు ఖనిజ, జల వనరులపై తగిన హక్కులను కల్పించడం.
* ఎస్టీ వర్గాల హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల ఆధారంగా లేదా సుమోటోగా విచారణ జరపడం.
* గిరిజనులకు జీవనోపాధి సంబంధిత అవకాశాలను పెంపొందించడం.
* ఏదైనా న్యాయస్థానం నుంచి లేదా ప్రభుత్వ కార్యాలయం నుంచి పబ్లిక్ రికార్డును లేదా దాని కాపీని పొందవచ్చు.
* అఫిడవిట్లపై సాక్ష్యాలను సేకరించడం. సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించమని ఉత్తర్వులను జారీచేయడం.
* వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు కమిషన్ ముందు హాజరవ్వాలని సమన్లు జారీ చేసి, అవి అమలయ్యేలా చూడటం.
* ఎస్టీ వర్గాలపై ప్రభావం చూపే అన్ని ముఖ్యమైన, విధానపరమైన అంశాలకు సంబంధించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కమిషన్‌ను సంప్రదించాలి.

నేషనల్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు
* కున్వర్ సింగ్ - 2004 - 2007
* ఊర్మిళా సింగ్ - 2007 - 2010
* రామేశ్వర్ ఓరాన్ - 2010 - 2013
* రామేశ్వర్ ఓరాన్ - 2013, నవంబర్ 1 నుంచి పునర్ నియామకం.
* భారత ప్రభుత్వం నేషనల్ ట్రైబల్ పాలసీని 2010లో రూపొందించింది.

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల కమిషన్
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి, ఎస్టీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్ర షెడ్యూల్డు తెగల కమిషన్‌కు సంబంధించిన బిల్లును 2013, జూన్ 19న శాసనసభలో ప్రవేశపెట్టారు.
* రాష్ట్ర ఎస్టీ కమిషన్‌లో ఛైర్మన్‌తోపాటు అయిదుగురు సభ్యులు ఉంటారు.
* గిరిజన వర్గాలకు చెందిన ప్రముఖ వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించాలి.
* సభ్యుల్లో తప్పనిసరిగా ఇద్దరు మహిళలు ఉండాలి.
* మైదాన ప్రాంతం నుంచి ఒక సభ్యుడిని, ఏజెన్సీ ప్రాంతం నుంచి మిగిలిన వారిని నియమిస్తారు.
* ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరందరినీ గవర్నర్ నియమిస్తారు. వీరు తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పిస్తారు.అధికారాలు - విధులు
* రాష్ట్ర ఎస్టీ కమిషన్ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు, విధులను చెలాయిస్తుంది.
* ఎవరైనా వ్యక్తికి సమన్లు జారీచేసి తన ముందు హాజరు కావాలని ఆదేశిస్తుంది.
* గిరిజనుల హక్కులపై ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు, గిరిజనుల సంక్షేమానికి నూతన సిఫారసులను చేయడం.
* గిరిజనుల ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన విధానాల అమలుతీరును పర్యవేక్షించడం.
* తన నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించడం. గవర్నర్ ఈ నివేదికను రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తారు.
* గిరిజనుల సామాజిక, ఆర్థిక రాజకీయ ప్రగతి కోసం కృషి చేయడం.

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
* బి.పి. మండల్ కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్లు కల్పించడాన్ని ఇందిరాసహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన విషయాలను పరిశీలించడానికి శాశ్వత సంఘాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
* ఈ తీర్పు ఆధారంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్, 340 ప్రకారం భారత ప్రభుత్వం 1993లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టాన్ని రూపొందించింది.
* ఈ చట్టం 1993, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* బీసీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. పదవీ కాలం 3 సంవత్సరాలు.
* ఛైర్మన్, సభ్యులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యులు పొందే హోదాను, జీతభత్యాలను పొందుతారు.

బీసీ కమిషన్ అధికారాలు - విధులు
* సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించే రక్షణలు, ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేసేందుకు కృషి చేయడం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయడం.
* వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి, వాటిని మెరుగుపరిచేందుకు సూచనలు చేయడం.
* బీసీ వర్గాల ప్రగతికోసం రూపొందించిన సిఫారసులను ఒక నివేదిక రూపంలో రాష్ట్రపతికి అందజేయడం, రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు.
* కమిషన్ తన విధులను నిర్వహించే విషయంలో సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది.
* వెనుకబడిన కులాల కేంద్ర జాబితాలో మార్పులు, చేర్పులను సిఫారసు చేస్తుంది.
* 1953లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన మొదటి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 1931 జనాభా లెక్కల ఆధారంగా బీసీ వర్గాల జనాభా 31 నుంచి 69 శాతం ఉన్నట్లు పేర్కొంది.
* బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం బిహార్.
* 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సిఫారసులు చేసేందుకు బి.పి. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.
* 1979లో జనతాప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో మండల్ కమిషన్ సిఫారసులు అమలుకాలేదు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలుచేసింది.
* 1963లో ఎం.ఆర్. బాలాజీ కేసులో, 1964లో దేవదాసన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించరాదు. కాబట్టి, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ సిఫారసు చేసింది.
* మండల్ కమిషన్ సిఫారసులను ఇందిరాసహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. అవి:
* ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు సమర్థనీయమే.
* ఓబీసీల్లోని సంపన్న శ్రేణి (క్రిమీలేయర్)ని రిజర్వేషన్‌ల నుంచి మినహాయించాలి.
* జాతీయ స్థాయిలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
* రిజర్వేషన్లు 50% మించకూడదు.
* 93వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని 2008లో సుప్రీంకోర్టు సమర్థించింది.
* 2007లో నేషనల్ శాంపిల్ సర్వే సేకరించిన వివరాల ప్రకారం మన దేశంలో 41.36% ఓబీసీలు ఉన్నారు.
* జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.

నేషనల్ బీసీ కమిషన్ ఛైర్మన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1993లో వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టాన్ని రూపొందించి, దీని ద్వారా వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 1994, మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చింది.
* రాష్ట్ర బీసీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని గవర్నర్ నియమిస్తారు. పదవీ కాలం 3 సంవత్సరాలు.

అధికారాలు - విధులు
* ఏదైనా వెనుకబడిన తరగతిని వెనుకబడిన తరగతి జాబితాలో ఎక్కువ హోదాలో చేర్చడానికి సంబంధించి లేదా తక్కువ హోదాలో చేర్చడానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, తగిన సలహాలను ప్రభుత్వానికి ఇవ్వడం.
* బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి.
* ఏదైనా వర్గానికి చెందిన పౌరులు తమను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చమని కోరినప్పుడు దాన్ని పరిశీలించి తగిన సలహాను ప్రభుత్వానికి ఇవ్వడం.
* మనోహర్ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 1968లో బీసీ వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.
* మురళీధర రావు కమిషన్ సిఫారసుల మేరకు 1985లో ఎన్‌టీఆర్ ప్రభుత్వం బీసీ వర్గాలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు పరిచింది.

ఏపీలో బీసీ కమిషన్ ఛైర్మన్లు
* జస్టిస్ కె. పుట్టుస్వామి      -    1994 - 1997, 1997 - 2000
* దాల్వ సుబ్రహ్మణ్యం          -    2004 - 2007, 2008 - 2011
* కె.ఎల్. మంజునాథ            -    2016, జనవరి 18 నుంచి - ప్రస్తుతం

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌