• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌సీఆర్‌బీ వార్షిక నివేదిక - 2022

వ్యవస్థీకృత నేరాలతో పెరుగుతున్న సవాళ్లు!

(తెలుగు రాష్ట్రాలు)


దేశంలో ప్రతి గంటకు మూడు హత్యలు జరుగుతున్నాయి. మానవ అక్రమ రవాణా నిరోధానికి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణ కష్టంగానే ఉంది. సైబర్‌ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. తెలంగాణలో మహిళలపై నేరాలు పెరిగాయి. వ్యవస్థీకృత నేర కార్యకలాపాలు జాతీయ, అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకోవడం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అధికమవుతున్న నేరాల తీవ్రత పోలీసు విభాగాల వైఫల్యాలను  ప్రతిబింబిస్తున్న తీరును అర్థం  చేసుకోవాలి. 


నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2022 నివేదికను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిశీలిస్తే ఏపీ, తెలంగాణల్లో మొత్తం మీద కేసుల సంఖ్య తగ్గింది. కానీ తెలంగాణలో మహిళలపై నేరాలు పెరిగాయి. మానవ అక్రమ రవాణాలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యలు రెండు రాష్ట్రాల్లోనూ తగ్గాయి. 


1) కేసుల వివరాలు: ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో ఐపీసీ, స్పెషల్‌ లోకల్‌ లా (ఎస్‌ఎల్‌ఎల్‌) సెక్షన్ల కింద కలిపి 2021లో మొత్తం 60,96,310 కేసులు నమోదైతే, 2022లో అన్ని రకాల నేరాలు కలిపి 4.5 శాతం తగ్గుదలతో 58,24,946 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మందికి నేరాల నమోదు పరిశీలిస్తే 2021లో 445.9 నేరాలు నమోదు కాగా 2022లో ఆ సంఖ్య 422.2కు తగ్గింది. 

* రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య   పెరిగింది. 2021లో 20,865 కేసులు నమోదైతే 2022లో అవి 22,066కు పెరిగాయి.


2) మానవ అక్రమ రవాణా:

* 2022లో దేశవ్యాప్తంగా 2,250 మానవ అక్రమ రవాణా కేసులు నమోదవగా, 391 కేసులతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

* హత్య కేసుల సంఖ్య 2022లో తెలంగాణలో తగ్గింది. 2021లో 1,026 హత్య కేసులు నమోదవగా 2022లో ఆ సంఖ్య 337కు తగ్గింది.

* మానవ అక్రమ రవాణా అనుమానంతో భారతీయ ప్రయాణికులతో నికరాగ్వాకు వెళ్లే విమానాన్ని ఫ్రాన్స్‌లో నిలిపివేశారు. అనంతరం విమానం భారత్‌కు తిరిగి వచ్చింది.

మానవ అక్రమ రవాణా కుంభ కోణంతో సంబంధం ఉన్న వ్యవస్థీకృత నేర కార్యకలాపాల అవకాశంపై ఈ సంఘటనే దర్యాప్తును ప్రేరేపిస్తోంది. * మానవ అక్రమ రవాణాలో వ్యవస్థీకృత నేర సమూహాల ప్రమేయం, వారి జాతీయ స్వభావం కారణంగా సవాళ్లను సృష్టిస్తోంది. 


మానవ అక్రమ రవాణా గురించి:

* బలవంతంగా అపహరణ లేదా మోసం ద్వారా ఒక వ్యక్తిని నియమించడం, రవాణా చేయడం. ఆశ్రయం కల్పించడం లేదా స్వీకరించడాన్ని మానవ అక్రమ రవాణాగా పేర్కొంటున్నారు. ఇది సెక్స్, వినోదం, ఆతిథ్యం, ఇంటిపని, బలవంతపు వివాహాలు తదితర

* రూపాల్లో ఉంటుంది. 2022 ప్రపంచ నివేదిక 141 దేశాల్లో 50,000 మంది మానవ అక్రమ రవాణా బాధితులను గుర్తించి, నివేదించింది.


మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు:
 

* ప్రపంచ స్థాయిలో భూమి, జల, వాయు మార్గాల ద్వారా వలసదారుల అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రోటోకాల్‌ ద్వారా అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల వ్యతిరేక ఒప్పందం. ఈ ఐరాస ఒప్పందాన్ని భారతదేశం ఆమోదించింది.

* మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినాన్ని ఏటా జులై 30న నిర్వహిస్తున్నారు.

* భారతదేశం కూడా అనేక చర్యలు చేపడుతోంది.. మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడం, ఎదుర్కోవడంపై సార్క్‌ సమావేశంలో ప్రస్తావించింది.

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 23 మనుషుల అక్రమ రవాణాను నిషేధించింది. అనైతిక వ్యాపార నిరోధక చట్టం-1956, భారతదేశంలో అక్రమ రవాణాను నిరోధిస్తోంది.


3) సైబర్‌ నేరాలు:

* ఎన్‌సీఆర్‌బీ వార్షిక నేర నివేదిక - 2022 ప్రకారం సైబర్‌ నేరాల నమోదులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 2022లో మొత్తం 15,272 సైబర్‌ నేరాలు నమోదైతే, 2021లో మొత్తం 10,303 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2021 తో పోలిస్తే తెలంగాణలో 2022లో 40 శాతం మేర సైబర్‌ కేసులు పెరిగినట్లు వ్యక్తమైంది. 


4) సాధారణ ఆత్మహత్యలు, ప్రమాదాలు:

* తెలంగాణలో మొత్తం 9,980 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో అత్యధికంగా 5,390 మంది కుటుంబ కలహాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో వివాహితులు 7,436 మంది ఉన్నారు.

* వాహనాల ప్రమాదాల్లో ఏపీలో 815 మంది, తెలంగాణలో 625 మంది చనిపోయారు. బలవన్మరణాలకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది ఆదాయం రూ.1 - 5 లక్షల్లోపే ఉంది.


5) రైతుల ఆత్మహత్యలు:

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2021లో రైతులు 303 మంది, కౌలుదారులు 49 మంది, వ్యవసాయ కూలీలు ఏడుగురు కలిపిమొత్తం 359 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2022లో 178 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఒక్కటీ నమోదు కాలేదు. ఈ లెక్క ప్రకారం 2022లో రైతుల బలవన్మరణాలు 41% మేర తగ్గాయి.


ఆంధ్రప్రదేశ్‌:


* 2022లో రాష్ట్రంలో మొత్తం 1,95,284 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కేసులు 1,56,503, ఎస్‌ఎల్‌ఎల్‌ కేసులు 36,737 ఉన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గింది. గతేడాది (2022)తో పోలిస్తే రాష్ట్రంలో ఐపీసీ నేరాలు 11.72 శాతం, ఎస్‌ఎల్‌ఎల్‌ నేరాలు 13.73 శాతం తగ్గాయి. రాష్ట్రం మొత్తం మీద 12.11 శాతం కేసులు తగ్గాయని ఎన్‌సీఆర్‌బీ  నివేదిక స్పష్టం చేసింది.

2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా..ఆ సంఖ్య 2022లో 925కి తగ్గింది. హత్యల రేటు ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.7 శాతంగా ఉంది. 


2021లో రాష్ట్రంలో 1,188 అత్యాచారాల కేసులు నమోదు కాగా 2022లో 621 నమోదయ్యాయి. 2021లో రాష్ట్రంలో 111 వరకట్న కేసులు నమోదు కాగా 2022లో వందకు తగ్గాయి.

* వరకట్న కేసుల రేటు కేవలం 0.4 శాతానికే పరిమితమైంది. ఇక యాసిడ్‌ దాడుల కేసులు 2021లో 7 నమోదుకాగా 2022కు అవి 4 కు తగ్గాయి.

2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది, కౌలు రైతులు 122 మంది ఉన్నారు. 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369కి తగ్గాయి. వారిలో భూయజమానులైన రైతులు 309 మంది, కౌలురైతులు 60 మంది ఉన్నారు.


2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వారి ఆత్మహత్యలు 548కి తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా, 2022లో ఆ సంఖ్య 917కు తగ్గింది.

దేశవ్యాప్తంగా:

* 2022లో దేశంలో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. 2022లో దేశవ్యాప్తంగా రోజూ సగటున 78 లేదా ప్రతి గంటకు మూడుకు పైగా హత్యలు జరిగాయి. అయితే 2020లో నమోదైన 29,193 హత్య కేసులు, 2021లో నమోదైన 29,272 హత్య కేసుల కంటే 2022లో నమోదైనవి తక్కువేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎన్‌సీఆర్‌బీ 2023, డిసెంబరు 4న తన నివేదికలో తెలిపింది.


దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు హత్యల రేటు 2.1గా ఉన్నట్లు పేర్కొంది. ఆయా కేసుల్లో ఛార్జ్‌ షీట్‌ రేటు 81.5 గా ఉందని వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బీ వార్షిక నేర నివేదిక ప్రకారం 2022లో వివాదాల కారణాల వల్ల అత్యధికంగా 9,962 హత్య కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత లేదా శత్రుత్వం వల్ల 3,761 హత్య కేసులు, సొంత లాభం కోసం 1,884 హత్యలు జరిగినట్లు గణాంకాలు పేర్కొన్నాయి.

రాష్ట్రాల వారీగా హత్య కేసుల నమోదులో ఉత్తర్‌ప్రదేశ్‌ ముందుంది. 2022లో ఆ రాష్ట్రంలో అత్యధికంగా 3,491 హత్యలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆ తర్వాత బిహార్‌ (2,930), మహారాష్ట్ర (2,295), మధ్యప్రదేశ్‌ (1,978), రాజస్థాన్‌ (1,834) ఉన్నాయి. మొత్తం హత్య కేసులతో పోలిస్తే ఈ ఐదు రాష్ట్రాల్లో నమోదైన హత్య కేసుల శాతం  43.92గా ఉంది.

* 2022లో దేశంలో అత్యంత తక్కువ హత్య కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా సిక్కిం (9) నిలిచింది. నాగాలాండ్‌ (21), మిజోరం (31), గోవా (44), మణిపుర్‌ (47) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

* కేంద్రపాలిత ప్రాంతాల పరంగా పరిశీలిస్తే 2022లో దేశ రాజధాని దిల్లీలో 509 హత్య కేసులు నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్‌ (99), పుదుచ్చేరి(30), చండీగఢ్‌ (18), దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయ్యూ (16), అండమాన్, నికోబార్‌ దీవులు (7),   లద్దాఖ్‌లో 5 హత్య కేసులు నమోదు కాగా, లక్షద్వీప్‌లో ఎలాంటి హత్య కేసులు నమోదు కాలేదు.

మరోవైపు దేశవ్యాప్తంగా హత్యల రేటు అత్యధికంగా ఝార్ఖండ్‌ (4 శాతం)లో నమోదైంది. అరుణాచల్‌ప్రదేశ్‌ (3.6 శాతం), ఛత్తీస్‌గఢ్‌, హరియాణా (3.4 శాతం), అసోం, ఒడిశా (3 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

* మొత్తం హత్యల్లో 95.4 శాతం మంది పెద్ద వయసువారు. హత్య బాధితుల్లో మహిళలు 8,125 మంది, థర్డ్‌ జెండర్‌ వ్యక్తులు 9 మంది కాగా, పురుషులు 70 శాతం మంది ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ఈ డేటా నేరాల పెరుగుదలను సూచించడంతోపాటు పోలీసుల అసమర్థతను ప్రతిబింబిస్తోందని వెల్లడించింది.


రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి 

Posted Date : 13-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌