• facebook
  • whatsapp
  • telegram

ఇతర వెనుకబడిన వర్గాలు

పురోగతి ఎరుగని సాంఘిక సమూహాలు!

 


  దేశంలో సగానికిపైగా జనాభా అన్ని రకాలుగా వెనుకబడి ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అవకాశాలను అందుకోలేకపోతోంది. అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. ఈ చారిత్రక ప్రతికూలతలను గుర్తించిన భారత ప్రభుత్వం  ఆ వర్గాల ఉన్నతికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. అంతరాలను తగ్గించి దేశ ప్రగతిలో చురుకైన భాగస్వాములను చేసేందుకు  కృషి చేసింది. ఆ మేరకు కమిటీలు వేసి, అందిన సిఫార్సులను అమలు చేసింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసింది. ఈ వివరాలను రాజ్యాంగ పరమైన అంశాలతో కలిపి అధ్యయనం చేసి, పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

 


  వెనుకబడిన వర్గాలు అనే పదానికి నిర్దిష్ట నిర్వచనం లేదు. రాజ్యాంగ నిర్మాతలు, సామాజికవేత్తలు ఎవరూ దాన్ని నిర్వచించలేదు. వెనుకబడిన వర్గాలు మూడు ప్రధాన వర్గాలకు చెందినవై ఉంటాయి. అవి షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీలు). 1956లో ప్రచురించిన వెనకబడిన వర్గాల నివేదిక కూడా ఈ విషయమే చెప్పింది. మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో ఓబీసీలు 52% ఉండవచ్చు. జాతీయ నమూనా సర్వే కార్యాలయం ్బవిళీళీవ్శీ ప్రకారం 41.7% ఉంటారని మరో అంచనా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కోకా సుబ్బారావు నిర్వచనం ప్రకారం కులం, మతం, జాతి, భాష, వృత్తి తదితర ప్రాతిపదికలపై నిర్ధారించదగిన, గుర్తించదగిన వ్యక్తుల సమూహమై; సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో వెనుకబాటు లక్షణాలతో ఉన్నదే వెనుకబడిన వర్గం. రి తక్కువ అక్షరాస్యత, విద్య లేమి, పేదరికం, శ్రామిక దోపిడీ, అంటరానితనం వంటి లక్షణాలతో కూడిన సాంఘిక సమూహాలు/వర్గాలు/కులాలే వెనుకబడిన వర్గాలు. 

 


* సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, వెనుకబడిన సమూహాలైన కూలీలు, తెగలు కలిసి ఏర్పడిన సామాజికవర్గమే వెనుకబడిన వర్గం.

 


రాజ్యాంగపరంగా వెనుకబడిన వర్గం: భారత రాజ్యాంగం వెనుకబడిన వర్గాన్ని నిర్వచించకపోయినా, వెనుకబాటుతనం లక్షణాలను పలు ఆర్టికల్స్‌లో తెలియజేసింది.

 


ఆర్టికల్‌ 15 (4): సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం గురించి ప్రస్తావించింది.

 


ఆర్టికల్‌ 16 (4): వెనుకబాటువర్గాన్ని గురించి ప్రస్తావించి, సేవా రంగంలో వారికి తగినంత ప్రాతినిధ్యం లేదని చెప్పింది.

 


ఆర్టికల్‌ 45: ఉచిత నిర్బంధ విద్య ప్రస్తావించింది.

 


ఆర్టికల్‌ 46: బలహీనవర్గాల ప్రజలంతా కలిసి వెనుకబడ్డ వర్గాలవారవుతారని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలు ఈ వర్గంలో అంతర్భాగం.

 


ఆర్టికల్‌ 340: ప్రతి రాష్ట్రం తన పరిధిలో నివసిస్తున్న వెనుకబడినవర్గాల స్థితిగతులను పరిశీలించి వారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తెలిపింది.

 


వివిధ కమిషన్లు, నివేదికలు

 


కాకా కాలేల్కర్‌ కమిషన్‌: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340ని అనుసరించి వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిశీలించేందుకు 1953, జనవరి 20న కాకా కాలేల్కర్‌ కమిషన్‌ను కేంద్రం నియమించింది. అది 1955, మార్చి 30న నివేదిక సమర్పించింది. వెనుకబాటుతనాన్ని నిర్ణయించేందుకు ప్రమాణాలను పేర్కొంది. 

 


* హిందూ సమాజంలోని సంప్రదాయక కులశ్రేణిలో సాంఘికంగా నిమ్న స్థానంలో ఉండటం. రి ఒక కులంలో లేదా సముదాయంలో అంతర్భాగంగా అభివృద్ధికి నోచుకోకపోవడం. రి ప్రభుత్వ సేవల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం. రి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో తగినంత ప్రాతినిధ్యం లభించకపోవడం.


పై అంశాలను అనుసరించి కాలేల్కర్‌ కమిషన్‌ 2,399 సముదాయాలను సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడినవిగా పరిగణించింది. వీరిలో 913 సముదాయాల జనాభా 11.5 కోట్లు. అధునాతన ఎస్సీ, ఎస్టీల జాబితాను తిరిగి ప్రకటించింది.

 


కాలేల్కర్‌ కమిషన్‌ సిఫార్సుల్లో ప్రధానమైనవి: 

 


* 1961 జనాభా లెక్కల ప్రకారం కులాల వారీగా జనాభా లెక్కలు తయారు చేయాలి. రి ముస్లిం, క్రిస్టియన్, సిక్కుల్లోని కొన్నివర్గాల వారిని ఇతర వెనుకబడిన వర్గాలుగా పరిగణించాలి. * రాజ్యాంగపరమైన రక్షణలను అమలుచేసే పరిపాలనా వ్యవస్థ కులతత్వంతో నిండిపోయింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే వర్గ ఘర్షణలు తలెత్తి జాతీయ సమైక్యత దెబ్బతింటుంది. * వెనుకబడినవర్గాల విద్యార్థులకు ఉదారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలి. వృత్తివిద్యా కళాశాలల్లో 70% సీట్లు కేటాయించాలి. * ప్రభుత్వ స్థానిక సర్వీసుల్లో క్లాస్‌-1 ఉద్యోగాల్లో 25%, రెండో తరగతి ఉద్యోగాల్లో 33.33%; 3, 4వ తరగతి ఉద్యోగాల్లో 40% వరకు రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు కల్పించాలి. వీటిని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో చేర్చకూడదు. * అన్ని రిజర్వేషన్లు కలిపి 49 శాతానికి మించకూడదు.

 


కేంద్ర ప్రభుత్వ విధానం: కాలేల్కర్‌ కమిషన్‌ నివేదికను కేంద్రం అంగీకరించలేదు. ఆ నివేదికపై చాలా విమర్శలు, అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఆచరణయోగ్యమైన ప్రమాణాల ద్వారానే వెనుకబడిన వర్గాలను శాస్త్రీయంగా గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పింది.

 


కేంద్ర ప్రభుత్వ నిర్ణయం: రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కేంద్రం జాగ్రత్తగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రమాణాలతో వెనుకబడిన వర్గాల జాబితా తయారు చేసుకోవచ్చని చెప్పింది. కులప్రాతిపదిక కంటే ఆర్థిక ప్రాతిపదికన వెనుకబడిన వర్గాలను గుర్తించడం సబబని సూచనలు చేసింది.


మండల్‌ కమిషన్‌: 1978, డిసెంబరు 20న బి.పి.మండల్‌ ఛైర్మన్‌గా రెండో వెనుకబడిన వర్గాల కమిషన్‌ను కేంద్రం నియమించింది. ఈ కమిషన్‌ 1980, డిసెంబర్‌ 31న నివేదిక సమర్పించింది. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని నిర్ణయించేందుకు 11 సూచికలు/ప్రమాణాలు రూపొందించారు. 11 పాయింట్లు వచ్చిన కులాలన్నింటినీ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా నిర్ణయించారు. ఆ విధంగా 3,743 కులాలను పరిగణించారు. దేశ జనాభాలో వీరి సంఖ్య 52% కంటే కొద్దిగా ఎక్కువేనని తేలింది.

 


మండల్‌ కమిషన్‌ సిఫార్సులు: 1) ఓబీసీలుగా 3,743 కులాలు, సముదాయాలను గుర్తించింది. వీరికి ఉద్యోగాలలో 27% కేటాయించాలి. రాజ్యాంగంలోని అధికరణ 15(4), 16(4) ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదు. అందువల్ల ఇతర వెనుకబడిన కులాల జనాభా 52% పైనే ఉన్నప్పటికీ కమిషన్‌ వారికి 27% రిజర్వేషన్లు ఇచ్చింది. 2) ఓబీసీలు పోటీ పరీక్షల్లో సాధారణ విభాగంలో ఎంపికైతే అలాంటి వారిని రిజర్వేషన్లలో చేర్చకూడదు. 3) పదోన్నతుల్లో రిజర్వేషన్లనేవి అన్ని స్థాయుల్లో వర్తింపజేయాలి. 4) రిజర్వేషన్‌ కోటా ప్రకారం భర్తీచేయని ఉద్యోగ ఖాళీలను మూడేళ్ల వరకు కొనసాగించి, ఆ తర్వాతే రిజర్వేషన్‌ పరిధి నుంచి తొలగించాలి. 5) ప్రత్యక్ష భర్తీ ప్రక్రియల్లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు వర్తింపజేసే వయసు పరిమితి సడలింపులను ఓబీసీలకూ వర్తింపజేయాలి. 6) షెడ్యూల్డ్‌ కులాలకు, తెగలకు రోస్టర్‌ పద్ధతిని అనుసరించినట్లే ఓబీసీలకూ పాటించాలి. 7) ఓబీసీల 27% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, బ్యాంకింగ్, జీవిత బీమా రంగాల్లోనూ వర్తింపజేయాలి. 8) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు పొందే ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలవ్వాలి. 9) ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందే విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కూడా ఈ రిజర్వేషన్లు పాటించాలి. ఇందుకోసం అవసరమైతే ఇప్పుడున్న చట్టాన్ని సవరించాలి. 10) ఓబీసీలు పెద్దసంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ప్రయత్నాల ద్వారా అదనపు శిక్షణ, వృత్తి, ఇతర విద్యాసౌకర్యాలు కల్పించాలి. 11) గ్రామీణ ప్రాంతాల్లోని ఓబీసీలు పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాల్లో ప్రగతి చూపితే వారికి తక్కువ వడ్డీకి రుణం లేదా రాయితీల రూపంలో ఆర్థిక సహాయం అందించాలి. 12) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భూసంస్కరణలను కచ్చితంగా అమలుచేయాలి. 13) వెనుకబడిన వర్గాలకు  ప్రయోజనాలు సమకూర్చేందుకు తగినంత ఆర్థిక సహాయం అందించాలి. రాష్ట్రం నిధులు కేటాయించలేకపోతే కేంద్రం ఇవ్వాలి.

 


  మండల్‌ కమిషన్‌ సిఫార్సులను భారత ప్రభుత్వం అంగీకరిస్తూ 1990, ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. దేశంలోని వివిధ వర్గాలు మండల్‌ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి. కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. 1991, సెప్టెంబరులో సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి వివిధ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అప్పటి పీవీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అదనంగా 10% రిజర్వేషన్లు ఇచ్చింది.

 


సుప్రీంకోర్టు సంచలన తీర్పు: మండల్‌ కమిషన్‌ సిఫార్సులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించి 1992, నవంబరు 15న చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. కమిషన్‌ సిఫార్సు చేసిన 27% రిజర్వేషన్లను సమర్థించింది. కానీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన 10% రిజర్వేషన్‌ను తోసిపుచ్చింది. * రిజర్వేషన్ల వల్ల లాభం పొందే వాళ్లను కులప్రాతిపదికన గుర్తించడానికి అంగీకరించింది. * రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని, గరిష్ఠ పరిమితిని నిర్ణయించింది. * సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల్లో అభివృద్ధి చెందినవారు, సంపన్న వర్గ శ్రేణిగా ఉన్నారని, అలాంటివారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలని చెప్పింది.* కొన్నిరకాల టెక్నికల్‌ పోస్టులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం సముచితం కాదు. * వెనుకబడిన వర్గాల నుంచి సాంఘికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులను ఏ సాంఘిక, ఆర్థిక ప్రమాణాలను అనుసరించి మినహాయించిందీ కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలి. * వెనుకబడిన వర్గాల పట్టికలో చేర్చేందుకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత కమిషన్లను నియమించాలి. 

Posted Date : 16-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌