• facebook
  • whatsapp
  • telegram

పార్లమెంటరీ పదజాలం

ఆదేశిస్తే విప్‌.. తీర్పు ఇస్తే రూలింగ్‌!

  పార్లమెంటు గురించి చదివేట‌ప్పుడు ఎజెండా, సమన్స్, ప్రోరోగ్, జీరో అవర్‌ అంటూ రకరకాల సాంకేతిక పదాలు ఎదురవుతుంటాయి. వాటి అర్థాలను అభ్యర్థులు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్పుడే పార్లమెంటరీ వ్యవహారాలపై సరైన అవగాహన ఏర్పడుతుంది. వీటిపై పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. 

 

పార్లమెంటు నిర్వహణలో అనేక రకాల ప్రత్యేక పదాలను ఉపయోగిస్తుంటారు. ఆ పదజాలం అత్యున్నత శాసనవ్యవస్థ కార్యకలాపాలను, విధి విధానాలను తెలియజేస్తుంది.

 

ఎజెండా: సభలో చర్చించాల్సిన కార్యక్రమాల పట్టికను ఎజెండా అంటారు. సభా వ్యవహారాల సలహా కమిటీ ఎజెండాను రూపొందిస్తుంది. సభా కార్యక్రమాలను ఎజెండా ప్రకారమే నిర్వహిస్తారు.

 

విప్‌: విప్‌ అంటే ఆదేశం అని అర్థం. ఒక రాజకీయ పార్టీ పార్లమెంటు లేదా శాసనసభలో తమ సభ్యులు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ జారీ చేసే ఆదేశాన్ని విప్‌ అంటారు.

 

హంగ్‌ పార్లమెంటు: లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీ ఏ రాజకీయ పార్టీకీ లభించకపోతే ఏర్పడే పరిస్థితిని హంగ్‌ పార్లమెంట్‌ లేదా త్రిశంకు సభ అంటారు. ఇప్పటివరకు మన దేశంలో 7 సార్లు హంగ్‌ పార్లమెంట్లు ఏర్పడ్డాయి. అవి..

* 9వ లోక్‌సభ - 1989

* 10వ లోక్‌సభ - 1991

* 11వ లోక్‌సభ - 1996

* 12వ లోక్‌సభ - 1998

* 13వ లోక్‌సభ - 1999

* 14వ లోక్‌సభ - 2004

* 15వ లోక్‌సభ - 2009

 

సమన్స్‌: రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని సమన్స్‌ అంటారు.

 

ప్రోరోగ్‌: రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని ప్రోరోగ్‌ అంటారు.

 

డిసాల్వ్‌: రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయడాన్ని డిసాల్వ్‌ అంటారు.

 

మెయిడెన్‌ స్పీచ్‌: పార్లమెంటుకు మొదటిసారి ఎన్నికైన సభ్యుడు సభలో చేసిన తొలి ప్రసంగాన్ని మెయిడెన్‌ స్పీచ్‌ అంటారు.

 

కార్పెట్‌ క్రాసింగ్‌: అధికార పార్టీకి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని కార్పెట్‌ క్రాసింగ్‌ అంటారు.

 

ఫ్లోర్‌ క్రాసింగ్‌: ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికార పక్ష పార్టీలోకి మారడాన్ని ఫ్లోర్‌ క్రాసింగ్‌ అంటారు.

 

కార్పెట్‌ బెగ్గర్‌: ఒక స్థానికేతర అభ్యర్థి స్థానిక అభ్యర్థిపై ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నిక కావాలని కోరుకోవడాన్ని కార్పెట్‌ బెగ్గర్‌ అంటారు.

 

ప్రశ్నోత్తరాల సమయం: పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిరోజు మొదటి గంట సమయాన్ని (11 నుంచి 12 గంటలు) ప్రశ్నోత్తరాల సమయం అంటారు. ప్రభుత్వ విధానాలు, పాలనకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

 

ప్రశ్నలు 4 రకాలు

1) నక్షత్రపు గుర్తున్న ప్రశ్నలు: నక్షత్రపు గుర్తు ఉన్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు మౌఖికంగా సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రశ్నల సమయంలో సభ్యులు అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఒక రోజులో గరిష్ఠంగా ఇలాంటి ప్రశ్నలను 20 వరకు అనుమతిస్తారు. ఈ ప్రశ్నలను ఆకుపచ్చ రంగులో ముద్రిస్తారు.

2) నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు: నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలకు సంబంధిత మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రశ్నల సమయంలో అనుబంధపు ప్రశ్నలు అడిగే వీలులేదు. ఒక రోజులో గరిష్ఠంగా ఇలాంటి ప్రశ్నలు 230 వరకు అనుమతిస్తారు. ఈ ప్రశ్నలను తెలుపు రంగులో ముద్రిస్తారు.

3) స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు: ఏదైనా అత్యవసర అంశంపై 10 రోజుల కంటే తక్కువ నోటీసుతో అడిగే ప్రశ్నలను స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు అంటారు. వీటికి మౌఖిక సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రశ్నలను లేత గులాబీ రంగులో ముద్రిస్తారు.

4) ప్రైవేట్‌ వ్యక్తులను అడిగే ప్రశ్నలు: ఏదైనా బిల్లుకు సంబంధించిన లేదా సభావ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సభలో ఎవరు బాధ్యత వహిస్తారో ఆ వ్యక్తిని అడిగే ప్రశ్నలు. ఈ ప్రశ్నలను పసుపు రంగులో ముద్రిస్తారు. వీటికి మౌఖిక సమాధానాలు ఇవ్వాలి.

 

జీరో అవర్‌

ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, సభా కార్యకలాపాలు ప్రారంభమవడానికి ముందున్న సమయాన్ని జీరో అవర్‌ (శూన్య కాలం) అంటారు. ఇది మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. 1962లో జీరోఅవర్‌ను సృష్టించారు. ఇది భారత పార్లమెంటరీ సంప్రదాయంలో అప్పట్లో కొత్తగా అవతరించిన ఒరవడి. దీనికి నిర్దిష్ట సమయం ఉండదు. 1964 నుంచి శూన్యకాలాన్ని క్రియాశీలకంగా వినియోగిస్తున్నారు. ఏ విధమైన ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు.

 

సమావేశ కాలం: పార్లమెంటు కార్యక్రమాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరిరోజు వరకు ఉన్న మధ్య కాలాన్ని 'సమావేశ కాలం' అంటారు. ఈ మధ్య కాలంలో సభ ప్రతిరోజు సమావేశమవుతుంది. సభా వ్యవహారాలు కొనసాగుతూ, నిర్ణీత గడువు ప్రకారం వాయిదా పడుతూ, మళ్లీ కొనసాగుతూ ఉంటాయి.

 

కోరం: సభా సమావేశాలు జరగడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. సభాధ్యక్షుడితో కలిపి సభలోని మొత్తం సభ్యుల్లో 1/10వ వంతును కోరంగా పరిగణిస్తారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన కోరం ఉందా? లేదా? అనేది సభాధ్యక్షులు నిర్ణయిస్తారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన కోరం లేకపోతే సభా సమావేశాలను వాయిదా వేస్తారు.

 

వాయిదా: సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు, భోజన విరామం లాంటి కారణాలతో సభాధ్యక్షులు సభా కార్యక్రమాలను తాత్కాలికంగా నిర్ణీత వ్యవధి వరకు నిలిపివేసి ఆ తర్వాత కొనసాగించడాన్ని 'వాయిదా' అంటారు.

 

నిరవధిక వాయిదా: సభాధ్యక్షులు సభా కార్యక్రమాలను కాలపరిమితి తెలియజేయకుండా వాయిదా వేయడాన్ని 'నిరవధిక వాయిదా' అంటారు.

 

లేమ్‌డక్‌ సెషన్‌: లేమ్‌డక్‌ అంటే ఓడిపోయిన వారు అని అర్థం. లోక్‌సభకు ఎన్నికలు జరిగిన తర్వాత రద్దయిన లోక్‌సభకు సభ్యులుగా ఉండి ప్రస్తుత లోక్‌సభకు ఎన్నిక కాని సభ్యులు, కొత్తగా ఎన్నికైన సభ్యులు కలిసి చివరిసారిగా ఏర్పాటు చేసుకునే సమావేశాన్ని 'లేమ్‌డక్‌ సెషన్‌' అంటారు. ఈ విధానం అమెరికాలో ప్రాచుర్యంలో ఉంది.

 

ఈల్డింగ్‌ ది ఫ్లోర్‌: చట్టసభలో ఒక సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ సభ్యుడిని నిరోధించి, మరొక సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించడాన్ని 'ఈల్డింగ్‌ ది ఫ్లోర్‌' అంటారు.

 

ఫిలిబస్టరింగ్‌: సభలో బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు సభ్యులు ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఉపన్యాసం చేస్తూ నిర్ణీత గడువు ముగిసేలా చేసే ప్రక్రియను 'ఫిలిబస్టరింగ్‌' అంటారు.

 

కాంపోజిట్‌ ఫ్లోర్‌ టెస్టింగ్‌: సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ లభించనప్పుడు, అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ కోల్పోయినప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయి. అలాంటి సమయంలో రాష్ట్రపతి సంబంధిత పార్టీల బలాబలాలను నిరూపించుకునేందుకు సభలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

 

రూలింగ్‌: సభలో తలెత్తే వివాదాలు, నిబంధనల అన్వయంపై సభాధ్యక్షులు ఇచ్చే తీర్పును రూలింగ్‌ అంటారు. ఈ రూలింగ్‌ను సభ్యులు ప్రశ్నించకూడదు. ఇది సభ్యులందరికీ శిరోధార్యం.

 

ఆపద్ధ‌ర్మ ప్రభుత్వం: అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు పరిపాలన బాధ్యతలను కొనసాగించడానికి అదే ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకు అధికారంలో కొనసాగిస్తే దాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. ఈ ప్రభుత్వం విధానపరమైన కీలక నిర్ణయాలను తీసుకోకూడదు.

 

అర్ధగంట చర్చ: పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ రోజు సమావేశాన్ని ముగించేందుకు చివరి అరగంటను 'అర్ధగంట చర్చ'కు కేటాయిస్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో తగిన ప్రాధాన్యం లభించని అంశాలపై చర్చించేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

* లోక్‌సభలో సోమ, బుధ, శుక్రవారాల్లో; రాజ్యసభలో ప్రతిరోజూ అర్ధగంట చర్చ ఉంటుంది.

 

ఆర్డినెన్స్‌: పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు దేశ శ్రేయస్సురీత్యా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 123 ప్రకారం ఆర్డినెన్స్‌ జారీచేస్తారు. ఈ ఆర్డినెన్స్‌కు సాధారణ శాసనాలకు ఉన్నంత విలువ ఉంటుంది. ఆర్డినెన్స్‌ను నిర్ణీత గడువులోగా పార్లమెంటు ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. ఆర్డినెన్స్‌ గరిష్ఠ జీవిత కాలం ఏడున్నర నెలలు.

 

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌: ఎన్నికల సమయంలో లేదా దేశం అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వీలులేనప్పుడు రెండు నెలల కాలపరిమితితో ప్రభుత్వం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌ను ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 116 ప్రకారం దీన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. సాధారణ బడ్జెట్‌ మొత్తం అంచనా వ్యయంలో 1/6వ వంతుకు సమానంగా, అంటే రెండు నెలలకు సరిపడే గ్రాంటుగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఇస్తారు. తర్వాత దీన్ని పూర్తిస్థాయి బడ్జెట్‌లో విలీనం చేస్తారు.

 

పునరాయనం (రీకాల్‌): అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులను అసమర్థులుగా ఉన్నప్పుడు లేదా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా వారి పదవీకాలం ముగియకుండానే పదవి నుంచి తొలగించడానికి వెనక్కి పిలవడాన్ని పునరాయనం (రీకాల్‌) అంటారు. ఈ విధంగా తొలగించిన వారి స్థానంలో కొత్త ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న స్విట్జర్లాండ్‌లో రీకాల్‌ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తారు.

 

రెఫరెండం: ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోడానికి ఉపయోగించే ప్రక్రియను రెఫరెండం అంటారు. ఈ విధానాన్ని తొలిసారిగా ఫ్రాన్స్‌లో నెపోలియన్‌ నిర్వహించారు.

 

ఎగ్జిట్‌ పోల్‌: సాధారణ ఎన్నికల సమయంలో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకొని ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడాన్ని ఎగ్జిట్‌పోల్‌గా పేర్కొంటారు.

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌