• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ

పరిపాలనా సౌలభ్యమే పరమలక్ష్యం!

విభిన్న జాతులు, భాషలు, ప్రాంతాల మధ్య సమతౌల్యతను సాధించి సమర్థ పాలనను అందించడమే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పరమోద్దేశం. భాష, సంస్కృతుల ఆధారంగా విభజన జరిపి, పరిపాలనను సులభతరం చేయడమే లక్ష్యం. తద్వారా అసమానతలను తొలగించడం, ఆర్థికాభివృద్ధితోపాటు, భాషాపరమైన గుర్తింపును పెంపొందించడం  సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాల పునర్నిర్మాణ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.  సంబంధిత రాజ్యాంగ విధానాలను ఆర్టికల్స్‌తో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. వివిధ వేర్పాటువాద ఉద్యమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ వరకు సంభవించిన పరిణామాలు, సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీలు, అవి చేసిన సిఫార్సులు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 


రాష్ట్రాల విస్తీర్ణాల్లో మార్పులు, చేర్పులు చేయడం; కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల పేర్లు, సరిహద్దులను మార్చడం మొదలైన అంశాలన్నింటినీ ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ’గా పేర్కొంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు. పునర్వ్యవస్థీకరణకు గురయ్యే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తెలియజేయాలని రాష్ట్రపతి గడువు విధిస్తారు. అయితే ఆ అభిప్రాయం ఏదైనప్పటికీ దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకోవచ్చు. పునర్వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారి కొత్త రాష్ట్రం ఏర్పడటం తదితర నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. 


* 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో ‘ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు’ను కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. 1927లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూ కాంగ్రెస్‌  సమావేశం తీర్మానించింది. 1928 నాటి ‘నెహ్రూ రిపోర్ట్‌’ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. భాష ప్రాతిపదికన ఒరిస్సా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సైమన్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. 

 1945లో కేంద్ర లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో, 1946లో రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల సందర్భంలో ‘భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు’ అంశాన్ని తన ఎన్నికల ప్రణాళిక పత్రంలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. భారతదేశంలో ‘భాష’ ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అనే అంశం అధ్యయనానికి వివిధ కమిటీలను నెలకొల్పారు.. 


ఎస్‌.కె.థార్‌ కమిషన్‌: 1948, జూన్‌లో రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకు అలహాబాద్‌ హైకోర్ట్‌ న్యాయమూర్తి సరోజ్‌ కుమార్‌ థార్‌ అధ్యక్షతన నియమించిన కమిటీ 1948, డిసెంబరులో నివేదిక సమర్పించింది. అందులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ‘భౌగోళిక అవిచ్ఛిన్నత, ఆర్థిక స్వయంసమృద్ధి, అత్యధిక ప్రజల ఆమోదం’ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.


సిఫార్సులు: 

 భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమంజసం కాదు. 

 పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలి.


జె.వి.పి. కమిటీ: ఎస్‌.కె.థార్‌ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీంతో 1948, డిసెంబరులో జైపుర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేసేందుకు  జె.వి.పి. కమిటీని ఏర్పాటు చేశారు.అందులో జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు. అది 1949, ఏప్రిల్‌లో తన నివేదికను సమర్పించింది. 


సిఫార్సులు:  

 భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేయాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సానుభూతితో పరిశీలించాలి. 

 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పరిపాలన, అభివృద్ధి, జాతీయ సమైక్యత లాంటి అంశాలు ప్రాతిపదిక కావాలి. 

 మద్రాసును వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు.


నిరశన దీక్షలు: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 1951, ఆగస్టు 15న గొల్లపూడి సీతారామశాస్త్రి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 35వ రోజుకు చేరుకున్న తర్వాత ఆచార్య వినోబా భావే సూచనలతో ఆయన దీక్ష విరమించారు. మళ్లీ 1952, అక్టోబరు 19న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజుల దీక్ష అనంతరం డిసెంబరు 15న మరణించారు. దీంతో అల్లర్లు, హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీనికి స్పందించిన జవహర్‌లాల్‌ నెహ్రూ 1952, డిసెంబరు 19న పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


కైలాష్‌నాథ్‌ వాంఛూ కమిటీ (1953):  ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధ్యయనం చేసేందుకు 1953, జనవరి 6న కైలాష్‌నాథ్‌ వాంఛూ (రాజస్థాన్‌ హైకోర్టు అప్పటి న్యాయమూర్తి) కమిటీని ఏర్పాటు చేశారు. అది తన నివేదికను 1953, మార్చి 23న సమర్పించింది. దాని ఆధారంగా 1953, మార్చి 25న జవహర్‌లాల్‌ నెహ్రూ 11 జిల్లాలతో ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. దీంతో 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.


ఫజుల్‌ అలీ కమిషన్‌:  ఆంధ్ర రాష్ట్రం ఏర్పా టుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాలను కోరుతూ ప్రజలు ఉద్యమించారు. నెహ్రూ కర్ణాటకలోని ‘బెల్గాం’ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ప్రజలు తీవ్ర ఆందోళనలు చేశారు. దీంతో నెహ్రూ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో తగిన సిఫార్సులు చేసేందుకు 1953, డిసెంబరులో ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌’ ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా ఫజుల్‌ అలీ, సభ్యులుగా కె.ఎం.ఫణిక్కర్, హెచ్‌.ఎన్‌.కుంజ్రు వ్యవహరించారు. ఈ కమిషన్‌ 1955, సెప్టెంబరులో కేంద్రానికి నివేదిక సమర్పించింది. 


సిఫార్సులు: 

 ‘ఒకే భాష - ఒకే రాష్ట్రం’ అనే వాదనను తిరస్కరించాలి. 

 పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని ప్రాంతీయ మండళ్లు గా ఏర్పాటు చేయాలి.

 దేశాన్ని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించాలి. 

 పార్ట్‌- ఎ, బి, సి, డి లుగా ఉన్న రాష్ట్రాల వర్గీకరణను రద్దు చేసి వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించాలి.

 జాతీయ మైనార్టీ భాషల కార్యాలయాన్ని దిల్లీలో ఏర్పాటు చేయాలి.


రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం: ఫజుల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ కాలంలో భారత పార్లమెంటు 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ’ను  చేపట్టింది. ఈ చట్టం ద్వారా దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.


శ్రీకృష్ణ కమిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చడంతో, సమస్య శాశ్వత పరిష్కారానికి నాటి కేంద్ర ప్రభుత్వం 2010, ఫిబ్రవరి 9న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.అది 2010, డిసెంబరు 30న నివేదిక సమర్పించింది. 461 పేజీల నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొంది.


ప్రధాన సిఫార్సులు:  

1) ఆంధ్రప్రదేశ్‌లో ‘యథాతథ స్థితి’ని కొనసాగించడం.

2) రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, రెండు రాష్ట్రాలు కొత్త రాజధానులను అభివృద్ధి పరచుకోడానికి అవకాశం కల్పించడం. 

3) రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించి, హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో అంతర్భాగం చేయడం. 4) ఆంధ్రప్రదేశ్‌ను సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్‌ మహానగరాన్ని విస్తృతపరచి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా, ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయడం. 

5) రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల్లోనే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలుగా విభజించి, హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా కొనసాగించడం, సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం. 

6) రాష్ట్రాన్ని యథావిధిగానే ఉంచి, తెలంగాణ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ సాధికారతకు నిర్దిష్టమైన రాజ్యాంగబద్ధ చర్యలు తీసుకోవడం, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం. శ్రీకృష్ణ కమిటీ ఆరో సూత్రానికి తమ ప్రథమ ప్రాధాన్యం అని, అది సాధ్యం కాకపోతే అయిదో సూత్రానికి రెండో ప్రాధాన్యం అని పేర్కొంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయ, భౌగోళిక, ఆర్థికాలతోపాటు చారిత్రక, సాంస్కృతిక అంశాలూ కీలకమైనవని వివరించింది.


 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 26-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌