• facebook
  • whatsapp
  • telegram

భారత రాష్ట్రపతి - అధికారాలు  

అధినేత ఆజ్ఞలతోనే యుద్ధం.. శాంతి!

దేశ ప్రధానిని నియమిస్తారు.  లోక్‌సభ రద్దును ప్రకటిస్తారు. ప్రతి చట్టంపై సంతకం చేస్తారు. సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. యుద్ధాన్ని, శాంతిని నిర్ణయిస్తారు. అత్యవసర అధికారాలను చెలాయిస్తారు.  ఈ విస్తృత అధికారాలను భారత రాజ్యాంగం రాష్ట్రపతికి అందిస్తోంది. పార్లమెంటులో అంతర్భాగంగా ఉంటూ విశేషమైన శాసన, ఆర్థిక, సైనిక, దౌత్య, న్యాయపరమైన అధికారాలతో దేశ గమనానికి దిక్సూచిగా రాష్ట్రపతి  నిలుస్తారు. ఇలాంటి సాధారణ, అసాధారణ అధికారాలు; వాటి పరిధి, సంబంధిత మౌలికాంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.  రాష్ట్రపతి చేసే నియామకాలు, పార్లమెంటు నిర్ణయాలను నిరోధించగలిగిన వీటో అధికారాల గురించి తెలుసుకోవాలి.

రాష్ట్రపతి అధికారాలను రాజ్యాంగంలో ఎక్కడా వర్గీకరించలేదు. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం

1) సాధారణ అధికారాలు

2) అత్యవసర/ అసాధారణ అధికారాలుగా పేర్కొన్నారు.

సాధారణ అధికారాలు:

కార్యనిర్వాహక అధికారాలు: రాజ్యాంగం ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది. రాష్ట్రపతి దేశ పరిపాలనను స్వయంగా లేదా ఇతర ప్రతినిధులు, అధికారుల సహాయంతో నిర్వహిస్తారు.

* ఆర్టికల్‌ 53: భారతదేశ సర్వోన్నత కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు.

* ఆర్టికల్‌ 74(1): రాష్ట్రపతికి పరిపాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి ఉంటుంది.

రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారం పలు   నియామకాలు నిర్వహిస్తారు.అవి-

* ఆర్టికల్‌ 75(1): లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రిని, ప్రధానమంత్రి సలహా మేరకు కేంద్రమంత్రిమండలి సభ్యులను నియమిస్తారు.

* ఆర్టికల్‌ 76(1): భారత

ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుడైన ‘అటార్నీ జనరల్‌’. 

*  ఆర్టికల్‌ 124: సుప్రీంకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు.

*  ఆర్టికల్‌ 148: భారత ప్రజల ప్రజాధనానికి కాపలాదారుగా పరిగణించే ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’

*  ఆర్టికల్‌ 155: రాష్ట్రాధినేతలైన గవర్నర్లు.

*  ఆర్టికల్‌ 217: హైకోర్టులకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు.

* ఆర్టికల్‌ 263:అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు.

*  ఆర్టికల్‌ 280: కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు.

*  ఆర్టికల్‌ 239: కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పరిపాలకులు.

*  ఆర్టికల్‌ 315: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

* ఆర్టికల్‌ 316: జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

* ఆర్టికల్‌ 323(ఎ): సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఛైర్మన్, సభ్యులు.

* ఆర్టికల్‌ 324: కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లు.

* ఆర్టికల్‌ 338: జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

* ఆర్టికల్‌ 338(ఎ): జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

*  ఆర్టికల్‌ 340: జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు

* ఆర్టికల్‌ 262: జాతీయ జలవనరుల సంఘం ఏర్పాటు.

* జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

* జాతీయ మానవ హక్కుల కమిషన్‌; జాతీయ బాలల కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

* జాతీయ సమాచార కమిషన్‌ ప్రధాన, ఇతర కమిషనర్లు.  

* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యులు.

శాసనాధికారాలు: పార్లమెంటులో రాష్ట్రపతి అంతర్భాగం. రాష్ట్రపతికి విశేషమైన శాసనాధికారాలున్నాయి.

* ఆర్టికల్‌ 79: పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ.            

* ఆర్టికల్‌ 83(3): కళలు, సాహిత్యం,  సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేస్తారు.

* ఆర్టికల్‌ 85: రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని ‘సమన్స్‌’ అని, పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలంపాటు వాయిదా వేయడాన్ని ‘ప్రోరోగ్‌’ అని, లోక్‌సభను రద్దు చేయడాన్ని ‘డిసాల్వ్‌’ అని అంటారు.

* ఆర్టికల్‌ 86: లోక్‌సభ, రాజ్యసభలకు రాష్ట్రపతి తన సందేశాలను విడివిడిగా లేదా సంయుక్తంగా పంపొచ్చు.

* ఆర్టికల్‌ 99: పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు రాజ్యాంగంలో మూడో షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి సమక్షంలో లేదా రాష్ట్రపతి నియమించిన ప్రతినిధి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

*  ఆర్టికల్‌ 95(1): లోక్‌సభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తారు. 

*  ఆర్టికల్‌ 91(1): రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తారు.

* ఆర్టికల్‌ 201: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్‌ ఆమోదం కోసం వెళ్లినప్పుడు వాటిలో రాజ్యాంగపరమైన అంశాలున్నాయని గవర్నర్‌ భావిస్తే, ఆ బిల్లులను గవర్నర్‌ ఆమోదించకుండా రాష్ట్రపతికి రిజర్వ్‌ చేస్తారు. ఇలాంటి బిల్లులను రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపొచ్చు లేదా తిరస్కరించవచ్చు.

* ఆర్టికల్‌ 103: పార్లమెంటు సభ్యులను అనర్హులుగా రాష్ట్రపతి ప్రకటిస్తారు.

*  ఆర్టికల్‌ 108: సాధారణ బిల్లుల ఆమోదం విషయమై లోక్‌సభ, రాజ్యసభ మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. దీనికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు.

* ఆర్టికల్‌ 111: పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకంతో చట్టాలుగా మారతాయి.                  

* ఆర్టికల్‌ 123: పార్లమెంటు సమావేశాలు అందుబాటులో లేనప్పుడు దేశ శ్రేయస్సు కోసం కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ‘ఆర్డినెన్స్‌’ జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్‌కు సాధారణ చట్టాలకు ఉన్నంత విలువ ఉంటుంది.

రాష్ట్రపతి - వీటో అధికారాలు 

వీటో (veto) అనే పదాన్ని లాటిన్‌ భాష నుంచి గ్రహించారు. ఆంగ్లంలో దీన్ని Forbid అంటారు. అంటే నిరోధించడం/తిరస్కరించడం/ నిలుపుదల చేయడం. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి/పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం తెలియజేయకుండా మూడు రకాల వీటో అధికారాలు ఉపయోగించవచ్చు.

1) అబ్సల్యూట్‌ వీటో: ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం తెలియ జేయకుండా కారణం చూపించి లేదా  చూపకుండా తిరస్కరించడాన్ని అబ్సల్యూట్‌ వీటో అంటారు.

ఉదా: 1954లో రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ PEPSU (Patiala East Punjab States Union) బిల్లు విషయంలో, 1991లో అప్పటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ ‘పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల బిల్లు’ విషయంలో అబ్సల్యూట్‌ వీటోను వినియోగించారు.

* రాష్ట్రపతి వినియోగించిన "Absolute Veto" ను కేంద్రమంత్రి మండలి /పార్లమెంటు రద్దు చేయొచ్చు. అదే బిల్లును సవరణలతో లేదా సవరణలు లేకుండా రెండోసారి రాష్ట్రపతి వద్దకు పంపితే తప్పనిసరిగా ఆమోదించాలి.

2) సస్పెన్సివ్‌ వీటో: ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి/ పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించకుండా సవరణలు చేయాలని పునఃపరిశీలనకు పంపడాన్ని"Suspensive Veto"అంటారు.

ఉదా: 2006లో రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ‘జోడు పదవుల బిల్లు’ విషయంలో సస్పెన్సివ్‌ వీటో వినియోగించారు.

* రాష్ట్రపతి వినియోగించిన సస్పెన్సివ్‌ వీటోను కేంద్ర మంత్రిమండలి/పార్లమెంటు రద్దు చేయొచ్చు. పునఃపరిశీలనకు వచ్చిన బిల్లులను సవరణ జరిపి లేదా జరపకుండా అవే బిల్లులను రెండోసారి రాష్ట్రపతికి పంపితే తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాలి.

3) పాకెట్‌ వీటో: కేంద్ర కేబినెట్‌/పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోదం తెలియజేయకుండా, పునఃపరిశీలనకు పంపకుండా, తిరస్కరించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన దగ్గరే ఉంచుకోవడాన్ని పాకెట్‌ వీటో అంటారు.

ఉదా: 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్‌ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ పాకెట్‌ వీటో ప్రయోగించి, సుమారు 18 నెలలపాటు తనవద్దే ఉంచుకున్నారు.

ఆర్థిక అధికారాలు: 

* ఆర్టికల్‌ 112: కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

* ఆర్టికల్‌ 117: ఆర్థిక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి.

* ఆర్టికల్‌ 151: కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి అందజేస్తుంది. దాన్ని రాష్ట్రపతి పార్లమెంటుకి సమర్పిస్తారు.

* ఆర్టికల్‌ 292: భారత ప్రభుత్వం విదేశాల నుంచి రుణాలు సేకరించాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

* ఆర్టికల్‌ 265: ప్రజల నుంచి నూతన పన్నులు వసూలు చేసే బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

* ఆర్టికల్‌ 267: ‘భారత అసంఘటిత నిధి’ రాష్ట్రపతి నియంత్రణలో ఉంటుంది.

* ఆర్టికల్‌ 280: ప్రతి అయిదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.

సైనిక అధికారాలు: భారత రాష్ట్రపతి సర్వసైన్యాధిపతిగా, త్రివిధదళాలకు సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు అధిపతులను నియమిస్తారు. అవసరమైన సందర్భాల్లో శత్రుదేశాలపై యుద్ధం ప్రకటిస్తారు. శత్రుదేశాలతో జరుగుతున్న యుద్ధాన్ని విరమించే ప్రకటన కూడా చేస్తారు.

* విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది.

* రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రిస్తారు. ప్రధాని సలహా మేరకు రక్షణ మంత్రిని నియమిస్తారు.

దౌత్యాధికారాలు:  దేశం తరఫున మిత్ర దేశాలకు రాయబారులను నియమించడం, విదేశాంగ సర్వీసులను నియంత్రించడంతో పాటు అంతర్జాతీయంగా జరిగే వ్యవహారాల్లో భారతదేశానికి రాష్ట్రపతి ప్రాతినిథ్యం వహిస్తారు. దేశం తరఫున ఐక్యరాజ్యసమితికి ప్రతినిధులను నియమిస్తారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తారు.

న్యాయాధికారాలు:

సుప్రీంకోర్టు, హైకోర్టులకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143 ప్రకారం పరిపాలనా వ్యవహారాల్లో రాజ్యాంగపరమైన సందేహాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయసలహా స్వీకరిస్తారు.

*  ఆర్టికల్‌ 72 ప్రకారం రాష్ట్రపతికి 5 రకాల క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి.

 

రచయిత: బంగారు సత్యనారాయణ 
 

Posted Date : 18-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌