• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి - అధికారాలు - తొలగింపు

(కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ) 

దేశాధినేతకు మహాభియోగంతో ఉద్వాసన!

 

భారతదేశంలో అత్యున్నత కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి. కేంద్ర కార్యనిర్వాహకవర్గానికి అధిపతి. పరిపాలన అంతా రాష్ట్రపతి పేరుమీదే జరుగుతుంది. వాస్తవానికి అధికారాలు అలంకారప్రాయమే అయినప్పటికీ దేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిలబడే ఆ పదవికి పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలు, షరతులు, దేశాధినేతకు లభించే వసతి, జీతభత్యాలు, పదవి నుంచి ఉద్వాసన పలికేందుకు అనుసరించే సంక్లిష్టమైన మహాభియోగ తీర్మానం లాంటి కీలకాంశాలను పోటీ పరీక్షార్థులు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ సహా తెలుసుకోవాలి. రాజీనామా చేయాల్సిన విధానం, రాష్ట్రపతికి మాత్రమే ఉన్న విశేషమైన క్షమాభిక్ష అధికారాలు, వాటిపై కోర్టు తీర్పుల గురించి అవగాహన పెంచుకోవాలి. 

ఆర్టికల్‌ 57: రాష్ట్రపతి పదవి చేపట్టడం గురించి వివరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా నిర్వహించవచ్చు. అయితే ఆ అత్యున్నత పదవిలో ఎవరైనా రెండుసార్లు మాత్రమే ఉంటే బాగుంటుందనే సంప్రదాయాన్ని దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సూచించి, అమలు చేశారు. దాంతో అప్పటి నుంచి ఆ పద్ధతే కొనసాగుతోంది.

ఆర్టికల్‌ 58: రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హతలు, షరతులు ఇందులో ఉన్నాయి. 

అర్హతలు: భారతీయ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. లోక్‌సభకు ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలన్నీ కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయం పొందే ఉద్యోగంలో ఉండకూడదు. దివాళా తీసినవారు ఈ పదవికి అనర్హులు. 1952 నాటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం ఇతర అర్హతలను   నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

షరతులు: రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని ‘ఎలక్టోరల్‌ కాలేజీ’ లోని 50 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది సభ్యులు బలపరచాలి.

* నామినేషన్‌ పత్రంతోపాటు రూ.15,000 సెక్యూరిటీ డిపాజిట్‌గా రిజర్వ్‌ బ్యాంకులో చెల్లించాలి. పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు పొందిన అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్లను తిరిగి పొందుతారు. చట్టసభ సభ్యుడై (పార్లమెంటు/రాష్ట్ర శాసనసభ) ఉండకూడదు. ఒకవేళ చట్టసభలో సభ్యుడై ఉంటే చట్టసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి.

ఆర్టికల్‌ 59: రాష్ట్రపతి వసతి, జీతభత్యాల గురించి వివరిస్తుంది. వాటిని పార్లమెంటు నిర్ణయిస్తుంది. రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో జీతభత్యాల వివరణ ఉంది. రాష్ట్రపతి వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. అది ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు. 2018లో రాష్ట్రపతి జీతభత్యాలను పెంచుతూ పార్లమెంటు చట్టం చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ.5 లక్షలు వేతనం లభిస్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో కూడా రాష్ట్రపతి వేతనంలో కోత విధించకూడదు. కనీసం 3 సంవత్సరాలు రాష్ట్రపతిగా పనిచేసిన వారికి వార్షిక వేతనంలో, సగం వార్షిక పెన్షన్‌గా లభిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం రాష్ట్రపతి పదవీకాలంలో నిర్వర్తించిన విధులకు సంబంధించి ఏ న్యాయస్థానానికి బాధ్యులు కారు. పదవిలో ఉన్న రాష్ట్రపతిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయకూడదు. సివిల్‌ కేసు వేయాలన్నా, 2 నెలలు ముందుగా నోటీసు ఇవ్వాలి.

ఆర్టికల్‌ 60: రాష్ట్రపతి ప్రమాణస్వీకారం గురించి వివరిస్తుంది.

* ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయన/ఆమె అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

ఆర్టికల్‌ 61: రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించే  ప్రక్రియను వివరిస్తుంది.

* రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే పార్లమెంటు మహాభియోగ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు. ఈ విధానాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యులు సంతకాలు చేసి, 14 రోజుల ముందస్తు నోటీసును సంబంధిత సభాధ్యక్షులకు, రాష్ట్రపతికి అందించాలి.

* తీర్మానం ప్రవేశపెట్టిన సభలో రాష్ట్రపతిని తొలగించే అంశంపై చర్చ జరిపిన తర్వాత ఓటింగ్‌ నిర్వహిస్తారు. సభలోని మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు మహాభియోగ తీర్మానాన్ని ఆమోదిస్తే, దాన్ని రెండో సభకు పంపుతారు. రెండో సభలో కూడా మహాభియోగ తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుపుతారు. సభలోని మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతారు. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో పార్లమెంటుకు నామినేట్‌ అయిన సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. మహాభియోగ తీర్మానాన్ని తొలుత ప్రవేశపెట్టిన సభలోనే తిరస్కరిస్తే, రెండో సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు. ఒక సభ ఆమోదించి, మరొక సభ తిరస్కరిస్తే తీర్మానం వీగిపోయినట్లు ప్రకటిస్తారు. ఇంతవరకు ఈ తీర్మానం ద్వారా ఏ ఒక్క రాష్ట్రపతిని తొలగించలేదు. 1971లో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నారు.

ఆర్టికల్‌ 62: రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా ఎన్నిక   జరపాలి. పదవీకాలం ముగిసేందుకు 15 రోజుల ముందు నుంచి కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి.

ఆర్టికల్‌ 72: రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 72 ప్రకారం రాష్ట్రపతికి 5 రకాల క్షమాభిక్ష   అధికారాలున్నాయి. న్యాయస్థానాల న్యాయ విచారణలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, విచారణ సందర్భంగా ఏవైనా అంశాలను న్యాయస్థానాలు విస్మరించిన సందర్భంలో రాష్ట్రపతి కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు క్షమాభిక్ష అధికారాలను వినియోగిస్తారు. అవి-

1) పార్డన్‌: దీని ప్రకారం రాష్ట్రపతి ఒక వ్యక్తికి పడిన శిక్షకు పూర్తిగా క్షమాభిక్ష ప్రసాదించి, శిక్షను రద్దు చేయవచ్చు.

ఉదా: మరణశిక్ష రద్దు చేసి సంబంధిత దోషికి ప్రాణభిక్షను ప్రసాదించడం.

2) కమ్యుటేషన్‌: రాష్ట్రపతి ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్పు చేయవచ్చు. 

ఉదా: మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేయడం.

3) రెమిషన్‌:  ఒక నేరస్థుడికి విధించిన శిక్ష రకంలో మార్పు చేయకుండా శిక్ష  పరిమాణాన్ని రాష్ట్రపతి తగ్గించవచ్చు. 

ఉదా: కఠిన కారాగార శిక్ష పడిన వ్యక్తికి శిక్షా కాలాన్ని తగ్గించడం.

4) రిస్పైట్‌: ప్రత్యేక కారణాల రీత్యా ఒక రకమైన శిక్షను మరోశిక్షగా మార్పు   చేయవచ్చు. 

ఉదా: శిక్షకు గురైన వ్యక్తులు మానసిక సమతౌల్యం కోల్పోయినప్పుడు, గర్భిణిగా ధ్రువీకరణ జరిగినప్పుడు. (రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితురాలైన ‘నళిని’ గర్భవతిగా ధ్రువీకరణ కావడంతో ఆమెకు న్యాయస్థానం విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేశారు.)

4) రిప్రైవ్‌: నేరస్థులకు విధించిన శిక్ష అమలు తాత్కాలికంగా వాయిదా

ఉదా: మరణశిక్ష పడిన నేరస్థుడు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతికి దరఖాస్తు చేసినప్పుడు, ఆ నిర్ణయం వెలువడే వరకు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేస్తారు.

* రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాలు న్యాయశాఖతో సంబంధం లేకుండా స్వతంత్రమైనవి. ఇవి కార్యనిర్వాహకవర్గ పరిధిలోకి వస్తాయి.

సుప్రీంకోర్టు తీర్పులు

షంషేర్‌సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1974):  జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో తీర్పునిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సలహాల మేరకే రాష్ట్రపతి పరిపాలనా వ్యవహారాలు నిర్వహించాలని పేర్కొంది.

సుధాకర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు (2006): రాష్ట్రపతి,  గవర్నర్‌ (అంటే కార్యనిర్వాహక శాఖ) ప్రసాదించిన క్షమాభిక్ష అధికారాలను న్యాయవ్యస్థ న్యాయసమీక్షకు గురిచేయవచ్చునని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. గౌరు వెంకటరెడ్డికి అప్పటి ఆంధ్రప్రదేశ్‌  గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ షిండే క్షమాభిక్ష ప్రసాదించడాన్ని జస్టిస్‌   అరిజిత్‌ పసాయత్, ఎస్‌.హెచ్‌.కపాడియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.


♦ ‘‘రాష్ట్రపతి పదవిని బ్రిటిష్‌ రాజమకుటంతో పోల్చవచ్చు. ఎందుకంటే వారు దేశానికి ఏలికలు మాత్రమే కానీ పాలకులు కాలేరు.  మంత్రి మండలికి మిత్రుడిగాను, మార్గదర్శిగాను, తాత్వికుడిగాను రాష్ట్రపతి వ్యవహరిస్తారు.’’     

 - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 


♦ ‘‘భారత రాజ్యాంగం కేంద్ర మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ, రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం,  ప్రాముఖ్యతను కూడా ఇచ్చింది.’’

 -  జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ


♦  ‘‘రాష్ట్రపతి పదవి జాతీయ సమైక్యతకు, సమగ్రతకు ప్రతీక. మన దేశ ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.’’                   

- డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌
 

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ
 
 

Posted Date : 06-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌