• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి అధికారాలు - విధులు

రాష్ట్రపతి అధికారాలు - విధులు
       రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాలను ఎక్కడా వర్గీకరించలేదు. పరిపాలనాంశాల సౌలభ్యం కోసం రాష్ట్రపతి అధికారాలను కింది విధంగా విభజించవచ్చు.
1) సాధారణ అధికారాలు     2) అత్యవసర/ అసాధారణ అధికారాలు


1. సాధారణ అధికారాలు
కార్యనిర్వహణాధికారాలు (Executive Powers)
* ఆర్టికల్ 53 ప్రకారం భారతదేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి. దేశ పరిపాలన, కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి. రాష్ట్రపతి దేశ పాలనను స్వయంగా లేదా ఇతర అధికారుల సహాయంతో నిర్వహిస్తారు.
* ఆర్టికల్ 77 ప్రకారం భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదు గానే నిర్వహించాలి. ఆర్టికల్ 74(1) ప్రకారం రాష్ట్రపతికి పాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.
తన కార్యనిర్వహణాధికారాలను నిర్వహించడంలో భాగంగా రాష్ట్రపతి కింద పేర్కొన్న నియామకాలు జరుపుతారు. అవి:
ఆర్టికల్ 75(1) - లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలి సహచరులను నియమిస్తారు.
ఆర్టికల్ 76(1) - భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడైన అటార్నీ జనరల్‌ను నియమిస్తారు.
ఆర్టికల్ 124 - సుప్రీంకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను
ఆర్టికల్ 155 - రాష్ట్రాల్లో గవర్నర్లను
ఆర్టికల్ 148 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి, వాటి వివరాలను తెలియజేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జరనల్ (కాగ్)ను
ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను
ఆర్టికల్ 263 - కేంద్రం - రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి అంతర్ రాష్ట్ర మండలిని
ఆర్టికల్ 280 - కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని
ఆర్టికల్ 315 - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను
ఆర్టికల్ 316 - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 324 - కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర అధికారులను
ఆర్టికల్ 239 - కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను, పరిపాలకులను
ఆర్టికల్ 323 (A) - సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
¤ జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* జాతీయ సమాచార కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* జాతీయ మైనార్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* లోక్‌పాల్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.


శాసనాధికారాలు:
ఆర్టికల్ 79 - పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ. రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగంగా కొనసాగుతారు.
ఆర్టికల్ 80 - కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, క్రీడా రంగాల్లో విశిష్ట వ్యక్తులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
ఆర్టికల్ 331 - లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో  ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
ఆర్టికల్ 85 - పార్లమెంటు సమావేశాలను ప్రారంభిస్తారు. (Summons)
                  పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తారు.(Prorogue)
                  లోక్‌సభను రద్దు చేస్తారు. (Dissolve)
ఆర్టికల్ 86 - లోక్‌సభ, రాజ్యసభలకు సంయుక్తంగా లేదా విడివిడిగా సందేశాలను పంపుతారు.
ఆర్టికల్ 87 - పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ప్రత్యేక/ విశేష ప్రసంగాలను పంపగలరు.
ఆర్టికల్ 99 - పార్లమెంటు సభ్యులు 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి సమక్షంలో లేదా రాష్ట్రపతితో నియమితులైన అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆర్టికల్ 103 - పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించడం.
ఆర్టికల్ 108 - పార్లమెంటు ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన నిర్వహిస్తారు.
ఆర్టికల్ 111 - పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతో చట్టాలుగా మారుతాయి.
ఆర్టికల్ 123 - ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి 'ఆర్డినెన్స్‌'ను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్‌లకు సాధారణ చట్టాలకు ఉండే విలువ ఉంటుంది.
 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవిత కాలం
 పార్లమెంటు సమావేశమైన 6 వారాలు (లేదా)
 6 నెలలు + 6 వారాలు (లేదా)
 7  నెలలు (లేదా) 222 రోజులు.
* పైన పేర్కొన్న గడువులోగా రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ పార్లమెంటు ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. లేకపోతే ఆర్డినెన్స్ రద్దవుతుంది.


ఆర్డినెన్స్ - సుప్రీంకోర్టు తీర్పులు
* 1987లో కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ దురుద్దేశంతో జారీ చేసిన ఆర్డినెన్సును న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చని పేర్కొంది.
* 1987లో డి.సి.వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన తర్వాత అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యధాతథంగా దాన్ని కొనసాగిస్తూ మరో ఆర్డినెన్స్‌ను జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని, అది రాజ్యాంగంపై దాడి లాంటిదని పేర్కొంది.
ఆర్టికల్ 91(1) - రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను నియమిస్తారు.
ఆర్టికల్ 95(1) - లోక్‌సభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 201 - రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లుల్లో ఏదైనా రాజ్యాంగబద్ధ సందేహం ఉందని గవర్నర్ భావిస్తే సంబంధిత బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు.


రాష్ట్రపతి వీటో అధికారాలు
* వీటో (Veto) అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫర్బిడ్ (Forbid) అంటారు. వీటో అధికారం అంటే తిరస్కరించే అధికారం, నిరోధించే అధికారం, నిలుపుదల చేసే అధికారం.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి 3 రకాలైన వీటో అధికారాలకు గురిచేయవచ్చు. అవి:


1. అబ్సల్యూట్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా, కారణంతో లేదా కారణం లేకుండా తిరస్కరించడాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు.
ఉదా: 1954లో రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ PEPSU (Pantiala East Punjab States Union) బిల్లు విషయంలో; 1991లో రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల బిల్లుల విషయంలో అబ్సల్యూట్ వీటోను వినియోగించారు.
* రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను పార్లమెంట్ లేదా మంత్రిమండలి రద్దు చేయవచ్చు. అదే బిల్లును సవరణలతో లేదా సవరణలు లేకుండా రెండోసారి ఆమోందించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.
* రాష్ట్రాలు ఆమోదించి పంపిన బిల్లుల‌ను గ‌వ‌ర్నర్‌లు రాష్ట్రప‌తి ప‌రిశీల‌నకు రిజ‌ర్వు చేసిన‌ప్పుడు ఆర్టిక‌ల్ 201 ప్రకారం రాష్ట్రప‌తి వాటిని తిర‌స్కరించ‌వ‌చ్చు. ఈ బిల్లుల‌ను రాష్ట్రాలు రెండోసారి ఆమోదించి పంపిన‌ప్పుడు కూడా వారు దాన్ని త‌ప్పనిసరిగా ఆమోదించాల్సిన అవ‌స‌రం లేదు.


2. సస్పెన్సివ్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా సవరణలు, సూచనలు చేస్తూ, పునఃపరిశీలనకు తిరిగి వెనుకకు పంపడాన్నే సస్పెన్సివ్ వీటో అంటారు.
* ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2006లో జోడు పదవుల బిల్లుల విషయంలో తన సస్పెన్సివ్ వీటోను వినియోగించుకున్నారు.
* కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ రెండోసారి అవే బిల్లుల్ని రాష్ట్రపతికి పంపడం ద్వారా వాటికి సస్పెన్సివ్ వీటోను రద్దు చేయవచ్చు.


3. పాకెట్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినేట్ లేదా పార్లమెంట్ పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా, ఎలాంటి నిర్ణయం తెలపకుండా వాటిని తన దగ్గరే పెట్టుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు.
ఉదా: 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్‌ను అప్పటి రాష్ట్రపతి జ్ఞానీజైల్‌సింగ్ పాకెట్‌వీటోకు గురిచేశారు. సుమారు 18 నెలలపాటు బిల్లును తన వద్దే పెట్టుకున్నారు.


4. క్వాలిఫైడ్ వీటో
* ఈ వీటో అధికారం 'భారతరాష్ట్రపతి'కి లేదు.
* అమెరికా అధ్యక్షుడికి ఈ రకమైన అధికారం ఉంటుంది.
* అమెరికా అధ్యక్షుడు వీటో చేసిన అంశాన్ని అమెరికా శాసన వ్యవస్థ 10 రోజుల నిర్ణీత గడువులోగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో మాత్రమే రద్దు చేసే వీలుంటుంది.
రాష్ట్రపతి అనుమతితో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు
* ఆర్టికల్, 3 ప్రకారం - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులు.
* ఆర్టికల్, 109 ప్రకారం - ద్రవ్య బిల్లులు
* ఆర్టికల్, 112 ప్రకారం - బడ్జెట్
* ఆర్టికల్, 31(A) ప్రకారం - ఆస్తుల జాతీయీకరణ బిల్లులు
* ఆర్టికల్, 19(1)(G) ప్రకారం - వ్యాపార వాణిజ్య, స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు
* ఆర్టికల్, 117 ప్రకారం - మొదటి రకమైన ఆర్థిక బిల్లులు
* ఆర్టికల్, 349 ప్రకారం - జాతీయ అధికార భాషలో చేసే మార్పులు, చేర్పులకు సంబంధించిన బిల్లులు
* ఆర్టికల్, 368 ప్రకారం - రాజ్యాంగ సవరణ బిల్లులు


ఆర్థిక అధికారాలు:
* ఆర్టికల్, 117 - పార్లమెంటులో ఆర్థిక బిల్లులను ప్రవేశ పెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి
* ఆర్టికల్, 112 - ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌ను, సప్లిమెంటరీ బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 151 - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్రప్రభుత్వ ఖర్చులు, ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా, రాష్ట్రపతి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు.
* ఆర్టికల్, 292 - భారత ప్రభుత్వం విదేశీరుణాలు సేకరించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
* ఆర్టికల్, 265 - నూతన పన్నులు వసూలు చేసే బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 267 - భారత ప్రభుత్వం ఊహించని ఖర్చులను ఎదుర్కోవడానికి రాష్ట్రపతి నియంత్రణలో ఉండే భారత ఆగంతుక నిధి నుంచి ఆయన అనుమతితో నగదును తీసుకోవాలి.
* ఆర్టికల్, 280 - మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని సిఫారసు చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని  5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు.


దౌత్యాధికారాలు:
* భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచ దేశాల సహకారాన్ని పొందేందుకు కృషిచేయడం.
* అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహించడం.
* మిత్ర దేశాలకు భారతదేశం తరపున రాయబారులను నియమించడం, మిత్రదేశాల నుంచి వచ్చే విదేశీ రాయబారుల నియామక పత్రాలను స్వీకరించడం.
* మనదేశం తరపున ప్రతినిధులను ఐక్యరాజ్యసమితి (UNO) కి నియమించడం.
* మనదేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ రాయబారులను, దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిచడం.


సైనిక అధికారాలు
* ఆర్టికల్, 53(2) ప్రకారం రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వసైన్యాధిపతి, త్రివిధ దళాలకు అధిపతి.
* ఆర్మీ, నేవీ, ఎయిర్‌పోర్స్‌లకు అధిపతులను నియమిస్తారు.
* శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించేది, శత్రుదేశాలతో జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తూ ప్రకటన చేసేది రాష్ట్రపతి మాత్రమే.
* మనదేశం విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతుంది.
* రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రిస్తారు. ప్రధాని సలహా మేరకు రక్షణమంత్రిని నియమిస్తారు.


న్యాయాధికారాలు:
* ఆర్టికల్, 72 ప్రకారం రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానాలు, సైనిక కోర్టులు విధించిన శిక్షలను నిలిపివేయవచ్చు. న్యాయ విచారణ, న్యాయస్థానాల్లో జరిగే పొరపాట్లను నివారించడం దీని ముఖ్య ఉద్దేశం. పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. ముద్దాయిలు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి. రాష్ట్రపతి మొత్తం 5 రకాల క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటారు. అవి:
1. పార్డన్ (Absolving entire Punishment):
* న్యాయ స్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దు చేసి, క్షమాభిక్షను ప్రసాదించడం.
2. రెమిషన్ (Reduction of Sentence)
* శిక్షాస్వభావాన్ని మార్చకుండా శిక్షాకాలాన్ని తగ్గించడం.
3. కమ్యుటేషన్: (Changing Nature of Sentence)
* శిక్షాకాలాన్ని మార్చకుండా స్వభావాన్ని మార్చడం.
ఉదా: రాజీవ్ గాంధీ హత్యకేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగారశిక్షగా మార్చారు.
4. రిప్రైవ్: (Postponement of Sentence)
* శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా వాయిదా వేయడం. క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు ఈ వెసులుబాటు ఉంటుంది.
5. రెస్పైట్: (Providing Relief)
* ముద్దాయి ప్రత్యేక పరిస్థితులను పరిగిణనలోకి తీసుకుని దీన్ని ప్రసాదిస్తారు.
ఉదా: శిక్షకు గురైన వ్యక్తి మానసిక సమతౌల్యత కోల్పోయినప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, వయోభారం ఉన్నప్పుడు, గర్భిణి అయినప్పుడు ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది.
క్షమాభిక్ష అధికారాలు న్యాయ సమీక్షకు గురవుతాయా?
* రాష్ట్రపతి గవర్నర్ల క్షమాభిక్ష అధికారాలను న్యాయ సమీక్షకు గురిచేయవచ్చని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గౌరు వెంకట్ రెడ్డి కేసులో ఆర్జిత్ పసాయత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ 2006లో పేర్కొంది.
దేవేందర్‌పాల్ సింగ్ దిల్లార్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మరణశిక్ష విషయంలో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎవరైనా ధరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై భారత రాష్ట్రపతి నిర్ణీత కాలంలోగా నిర్ణయం తెలుపకపోతే మరణశిక్షను యావజ్జీవ కారగార శిక్షగానే పరిగణించాలని పేర్కొంది.
* ఉరిశిక్ష, సైనిక కోర్టులు విధించే శిక్షల విషయంలో క్షమాభిక్షను ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. గవర్నర్‌కు ఈ అధికారాలు వర్తించవు.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహామేరకు మాత్రమే రాష్ట్రపతి న్యాయాధికారాలను వినియోగించాలి.


రాష్ట్రపతి - ప్రత్యేక రక్షణలు
* ఆర్టికల్, 361 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక రక్షణలు, మినహాయింపులు ఇచ్చారు.
* రాష్ట్రపతి పదవిలో ఉండగా అతడిని అరెస్ట్ చేయకూడదు, ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు.
* రాష్ట్రపతిపై సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలలు ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
* రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై దేశంలో ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేయరాదు.
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు; రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు; రాష్ట్రాల లోకాయుక్తలను నియమించేది గవర్నర్లు అయినప్పటికీ వారిని తొలిగించేది మాత్రం రాష్ట్రపతి.
* ఆర్టికల్, 244 ప్రకారం మనదేశంలో ఆదివాసీ ప్రాంతాలు, షెడ్యూల్డు ప్రాంతాలను రాష్ట్రపతి ప్రకటిస్తారు.


రాష్ట్రపతి  అత్యవసర పరిస్థితి  అధికారాలు
* భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు అత్యవసర పరిస్థతి అధికారాలను వివరించారు.
* భారత రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభత్వ చట్టం నుంచి అత్యవసర పరిస్థితి అధికారాలను గ్రహించారు.
* అత్యవసర పరిస్థితిని విధించేటప్పుడు పాటించే పద్ధతులను జర్మనీ నుంచి గ్రహించారు.
* అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ జీవించే హక్కును రద్దుచేయకుండా ఉండే పద్ధతిని జపాన్ నుంచి గ్రహించారు.
* రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలను పొందుపరచాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి. కృష్ణమాచారి ప్రతిపాదించారు.
* అత్యవసర పరిస్థితి అధికారాలను పూర్తిగా వ్యతిరేకించిన వారిలో హెచ్.వి. కామత్, కె.టి. షా, సి.డి. దేశ్‌ముఖ్ కీలకమైనవారు.
* అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఐక్యత, రక్షణ..... లాంటివి పరిరక్షించడానికి అత్యవసర అధికారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవి వినియోగించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తాయి.
భారత రాజ్యాంగంలో 3 రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్నొన్నారు. అవి:
1. జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) ఆర్టికల్, 352
2. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (Constitutional Emergency) ఆర్టికల్, 356 (రాష్ట్రపతి పాలన)
3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (Financial Emergnecy) ఆర్టికల్, 360


జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 352
     జాతీయ అత్యవసర పరిస్థితిని రెండు కారణాల వల్ల విధించవచ్చు. అవి:
A. బాహ్య కారణాలు:
* మన దేశంపై విదేశీ దాడి లేదా మనదేశం శత్రుదేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
B. ఆంతరంగిక కారణాలు:
* దేశంలో ఆంతరంగిక అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు, దేశ సమగ్రతకు, ఐక్యతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
* 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆంతరంగిక అల్లకల్లోలం అనే పదాన్ని తొలగించి, సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చింది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేబినెట్ అనే పదాన్ని ఆర్టికల్ 352(7) లో చేర్చి, కేంద్ర కేబినెట్ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలని పేర్కొన్నారు.
* కేంద్ర కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు కానీ కేంద్ర కేబినెట్ రెండోసారి అమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు ఉభయసభలు నెలరోజుల్లోగా 2/3 వ వంతు  ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. (ఇంతకు ముందు పార్లమెంటు 2 నెలల్లోగా 2/3 వ వంతు  ప్రత్యేక మోజార్టీతో ఆమోదించాలని ఉండేది.)
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించే నాటికి ఒకవేళ లోక్‌సభ రద్దయితే, దాన్ని రాజ్యసభ ఆమోదంతో కొనసాగిస్తారు. కానీ నూతన లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశ తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
* జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలలకు ఒకసారి చొప్పున గరిష్ఠంగా ఎన్నిసార్లయినా, ఎంతకాలమైనా విధించవచ్చు, పొడిగించవచ్చు.


జాతీయ అత్యవసర పరిస్థితి - రద్దు
* రాష్ట్రపతి 6 నెలల కంటే ముందే దీన్ని రద్దు చేయవచ్చు.
* పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా దీన్ని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభలోని 1/10వ వంతు మంది సభ్యుల సంతకాలతో అత్యవసర పరిస్థితి రద్దును కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు/రాష్ట్రపతికి అందజేయాలి.
* 14 రోజుల ముందు ఇచ్చే ఈ నోటీసు ప్రకారం లోక్‌సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధారణ మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దుచేయవచ్చు.


జాతీయ అత్యవసర పరిస్థితి - పరిణామాలు
* రాష్ట్ర జాబితాతోసహా అన్ని జాబితాల్లోని అంశాలపై కేంద్రమే శాసనాలు రూపొందిస్తుంది.
* కేంద్ర కార్యనిర్వహక వర్గం అధికారాలు విస్తృతం అవుతాయి.
* ఆర్టికల్, 353 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసే పరిపాలనా పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* ఆర్టికల్, 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన చట్టాలు జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేసిన తర్వాత 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. 6 నెలల అనంతరం ఈ చట్టాలు వాటంతటవే రద్దు అవుతాయి.
* ఆర్టికల్, 354 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థిక పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* లోక్‌సభ, రాష్ట్రాల శాసనభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చు.
* 5వ లోక్‌సభ పదవీకాలం 1976, మార్చి 18తో ముగిసింది. అదే సమయంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుండటంతో 5వ లోక్‌సభ పదవీకాలాన్ని 1977, మార్చి 18 వరకు పొడిగించారు. కానీ మధ్యలోనే 1977, జనవరి 18న రద్దు చేశారు. 5వ లోక్‌సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది.
* రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని కూడా పార్లమెంటు ఒక ఏడాది పాటు పొడిగించవచ్చు.
* 1976లో ఒడిశా, కేరళ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో 5వ శాసన సభ పదవీ కాలాన్ని 1977 నుంచి 1978 వరకు ఒక సంవత్సరంపాటు పొడిగించారు.
* ఆర్టికల్, 358 ప్రకారం ఆర్టికల్, 19 సహజంగానే సస్పెండ్ అవుతుంది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విదేశీ కారణాలతో  జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రమే ఆర్టికల్, 19 సహజంగా రద్దు అవుతుంది. ఆంతరంగిక కారణాల ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆర్టికల్, 19 సహజంగా సస్పెండ్ కాదని, రాష్ట్రపతి జారీచేసే ప్రత్యేక ప్రకటన ద్వారా మాత్రమే సస్పెండ్ చేస్తారని దీన్ని పార్లమెంటు ఆమోదించాలని నిర్దేశించారు.
* ఆర్టికల్, 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన సమయంలో రాష్ట్రపతి ఆర్టికల్ 20, 21 లలో పేర్కొన్న హక్కులను మినహాయించి, మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు.
* ఉన్నత న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కుల అమలుకోసం ఆర్టికల్, 32 ప్రకారం సప్రీంకోర్టు; ఆర్టికల్, 226 ప్రకారం హైకోర్టులు రిట్స్ జారీచేసే అధికారాలపై పార్లమెంటు చట్టబద్ధ పరిమితులను విధించవచ్చు.


మనదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భాలు
1. 1962, అక్టోబరు 26 - 1968, జనవరి 10 మధ్య మనదేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. 1962లో చైనా భారతదేశంపై దురాక్రమణ చేయడంతో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
2. 1971, డిసెంబరు 3 - 1977, మార్చి 21 మధ్య రెండోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి, కొనసాగించారు.
* 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమవడంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
3. 1975, జూన్ 25 - 1977, మార్చి 21 మధ్య మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించి, కొనసాగించారు.
* 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో చెలరేగిన ఆంతరంగిక అల్లకల్లోలాలను నివారించేందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్ధీన్ అలీ అహ్మద్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
* 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం సంభవించినప్పటికీ ప్రత్యేకంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేదు. దీనికి కారణం 1962లో విధించిన అత్యవసర పరిస్థితి 1968 వరకు కొనసాగడమే.
* 1975 నుంచి 1977 మధ్య ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించారు.
* 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 352కు సవరణ చేసి, ఒకే సమయంలో రెండు రకాలైన అత్యవసర పరిస్థితులను ప్రకటించే వీలును కల్పించారు.

 

ఆర్టికల్ - 358, ఆర్టికల్ - 359 మధ్య వ్యత్యాసం

ఆర్టికల్, 358 ఆర్టికల్, 359
1. దీని ప్రభావం ఆర్టికల్, 19లో ప్రస్తావించిన
వ్యక్తిగత స్వేచ్ఛలకు మాత్రమే పరిమితం.
1. దీని ప్రభావం అన్ని ప్రాథమిక హక్కులకు వర్తిస్తుంది.
2. దీని ప్రభావం బాహ్య కారణాల వల్ల విధించిన అత్యవసర పరిస్థితికే పరిమితం. 2. ఇది ఆంతరంగిక, బాహ్య జాతీయ అత్యవసర పరిస్థితులకు కూడా వర్తిస్తుంది.
3. దీని ప్రభావం దేశం మొత్తానికి వర్తిస్తుంది. 3. దీని ప్రభావం దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.
4. అత్యవసర పరిస్థితి ఉన్నంతవరకు ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుంది. 4. రాష్ట్రపతి నిర్ణయించిన సమయం వరకు మాత్రమే
ఉంటుంది. అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ ప్రాథమిక హక్కుల అమలు రద్దు చేయకపోవచ్చు.

 

జ్యాంగ అత్యవసర పరిస్థితి - రాష్ట్రపతి పాలన (ఆర్టికల్, 356)
* ఆర్టికల్, 355 ప్రకారం ప్రతి రాష్ట్రం రాజ్యాంగపరంగా పరిపాలన కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
* ఆర్టికల్, 356(1) ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు, రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగలేదని రాష్ట్ర గవర్నర్ నివేదిక ఇచ్చినప్పుడు ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలనను ఆర్టికల్, 356 ద్వారా విధిస్తారు.
రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే?
  * ప్రభుత్వం పనిచేయకపోవడం.
  * శాంతిభద్రతలు క్షీణించడం.
  * ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం.
  * రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పడిపోవడం.
  * ప్రభుత్వమే ఏర్పడకపోవడం.
  * ఆర్టికల్, 365 ప్రకారం కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోవడం.
» రాష్ట్రపతి పాలనను పార్లమెంటు 2 నెలల్లోగా సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. లేకపోతే రద్దు అవుతుంది.
» ఆర్టికల్, 356(3) ప్రకారం ఒకవేళ రాష్ట్రపతిపాలన విధించే సమయానికి లోక్‌సభ రద్దు అయితే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పాటైన నెలరోజుల్లోగా తప్పనిసరిగా రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే రద్దు అవుతుంది.
* పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదం ద్వారా 6 నెలలకు ఒకసారి చొప్పున రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు విధించవచ్చు.
» 1997లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలనను విధించాలని, ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ పునఃపరిశీలనకు పంపారు.
* రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపినప్పుడు కేంద్ర కేబినెట్ అదే అంశాన్ని రెండోసారి ఆమోదించి పంపినట్లయితే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి.
ఉదా: అటల్‌బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ బిహార్‌లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించాలని చేసిన సిఫారసును రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ పునఃపరిశీలనకు పంపారు. అదే సిఫారసును కేంద్ర కేబినెట్ రెండోసారి పంపడంతో కె.ఆర్. నారాయణన్ తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చింది.
* రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. రాష్ట్రపతి పాలన రద్దు అవుతుంది.
ఉదా: బిహార్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించి, రాజ్యసభ తిరస్కరించడంతో రాష్ట్రపతి పాలన రద్దయి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
ఆర్టికల్, 356(5) ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగాలంటే..
     44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి:
* దేశంలో లేదా రాష్ట్రాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉండాలి.
* సంబంధిత రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడం సాధ్యంకాదని కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరించాలి.
* 3 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రపతి పాలనను పొడిగించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి.
ఉదా: పంజాబ్‌లోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 59, 64, 68 రాజ్యాంగ సవరణల ద్వారా అక్కడ రాష్ట్రపతి పాలనను 5 ఏళ్ల వరకు పొడిగించారు.
» రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన ద్వారా లేదా పార్లమెంటు సాధారణ తీర్మానం ద్వారా రాష్ట్రపతి పాలనను రద్దు చేయవచ్చు.

 


రాష్ట్రపతి పాలన - పర్యవసానాలు
* రాష్ట్రప్రభుత్వాన్ని (మంత్రి మండలి) రద్దు చేయవచ్చు.
* రాష్ట్ర విధానసభను రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు.
* రాష్ట్ర విధానసభను రద్దు చేసినట్లయితే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.
* రాష్ట్ర విధానసభను సుప్తచేతనావస్థలో ఉంచితే, దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఉంది.
ఉదా: జమ్మూకశ్మీర్ విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో ఆర్టికల్, 356 ప్రకారం అక్కడ రాష్ట్రపతి పరిపాలనను విధించి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారు. పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ), బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడంతో రాష్ట్ర శాసనసభను పునరుద్ధరించారు.
* రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయి.
* హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.
* రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.
* పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలను రాష్ట్రపతి ఆర్టికల్, 123 ప్రకారం ఆర్డినెన్స్ రూపంలో వెలువరిస్తారు.
* రాష్ట్రపతి పాలనను గవర్నర్ రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహిస్తారు. గవర్నర్‌కు రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణాధికారాలు ఉంటాయి.
* గవర్నర్‌కు తన విధి నిర్వహణలో సహాయాన్ని, సలహాలను అందించడానికి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు.
» ఆర్టికల్, 357(2) ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తే, అవి రాష్ట్రపతి పాలన రద్దు అయిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఈ చట్టాలను రాష్ట్ర శాసన సభ కొనసాగించవచ్చు లేదా రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలన - న్యాయ సమీక్ష
» 38వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ఆర్టికల్, 356ను ప్రయోగించవచ్చని, రాష్ట్రపతి నిర్ణయమే తుది నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరాదని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్దేశించింది.
» మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా రాష్ట్రపతి పాలనను న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చని, రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్షకు అతీతం కాదని నిర్దేశించారు.
ఎస్.ఆర్. బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1994)
» ఈ కేసులో సుప్రీం కోర్టు రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది. అవి
  * భారత సమాఖ్యకు భంగం కలిగించే విధంగా ఆర్టికల్, 356ను ప్రయోగించరాదు.
  * రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదించే వరకు రాష్ట్ర విధాన సభను రద్దు చేయరాదు.
  * రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని, విధాన సభను పునరుద్ధరించాలి.
  * రాష్ట్రపతి పాలన విధించడాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
  * రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.
  * రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా? లేదా? అనే అంశాన్ని శాసనసభ లోపల మాత్రమే పరీక్షించాలి.
  * లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం. లౌకిక తత్వానికి విఘాతం కలిగించే రాష్ట్ర  ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయవచ్చు.
  * రాష్ట్రపతి పాలనను దురుద్దేశంగా విధిస్తే, దానికి సమంజసమైన కారణాలు లేకపోతే న్యాయస్థానాలు వాటిని  రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలనా విశేషాలు
* 2015, ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 123 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు.
* 1951లో పంజాబ్‌లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను విధించారు.
* అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం పంజాబ్. 1987, మే 11 - 1992, ఏప్రిల్ 25 వరకు అంటే 4 సంవత్సరాల 9 నెలల 3 రోజులు పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను విధించారు.
* అతి తక్కువ కాలం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రం కర్ణాటక. 1990, అక్టోబరు 10 - 1990, అక్టోబరు 17 వరకు అంటే కేవలం 8 రోజులు మాత్రమే కర్ణాటకలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.
* మణిపూర్‌లో 12 , ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 , కేరళలో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
* ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు - ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ.
* 1975 - 77 మధ్య కాలంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 21 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు.
* 1977లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన బి.డి. జెట్టి 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
* 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయించారు.
* ఆర్టికల్, 356ను దుర్వినియోగం చేయకుండా 2000 లో వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో అంతర్‌రాష్ట్ర మండలి నుంచి జార్జి ఫెర్నాండెజ్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పడి పలు సూచనలు చేసింది.
* ఆర్టికల్, 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని 2002లో ఎం.ఎన్. వెంకటాచలయ్య నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ పేర్కొంది.

జాతీయ అత్యవసర పరిస్థితికి, రాష్ట్రపతి పాలనకు మధ్య వ్యత్యాసాలు

జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 352 రాష్ట్రపతి పాలన - ఆర్టికల్, 356
1. దీన్ని పార్లమెంటు నెలరోజుల్లోగా ఆమోదించాలి. 1. పార్లమెంటు రెండు నెలల్లోగా ఆమోదించాలి.
2. పార్లమెంటు  వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదించాలి. 2. పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా ఆమోదించాలి.
3. దేశం మొత్తం లేదా దేశంలోని ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో విధించవచ్చు. 3. రాష్ట్రం మొత్తం విధించాలి.
4. దీన్ని విధిస్తే లోక్‌సభను రద్దు చేయాల్సిన అవసరం లేదు. 4. దీన్ని విధిస్తే రాష్ట్ర శాసనసభను రద్దు చేయ వచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు.
5. దీన్ని విధిస్తే కేంద్ర మంత్రిమండలి రద్దు కాదు. 5. దీన్ని విధించిన వెంటనే రాష్ట్ర మంత్రిమండలి రద్దు అవుతుంది.
6. దీన్ని విధిస్తే ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు. 6. దీన్ని విధించినప్పటికీ ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయి.
7. గరిష్ఠంగా ఎంతకాలమైనా విధించవచ్చు. 7. గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు విధించవచ్చు.

 

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన
1. ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధ విషయంపై టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ సి.ఎం. త్రివేది సిఫారసుల మేరకు 1954, నవంబరు 15 నుంచి 1955, మార్చి 29 మధ్య 4 నెలల 11 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.
2. ఆంధ్రప్రదేశ్‌లోని జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో పి.వి. నరసింహా రావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ సిఫారసుల మేరకు 1973, జనవరి 11 నుంచి 1973, డిసెంబరు 10 మధ్య 335 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.
3. ఆంధ్రప్రదేశ్‌లో 'ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం' నేపథ్యంలో ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ సిఫారసుల మేరకు 2014, మార్చి 1 నుంచి 2014 జూన్ 8 మధ్య 3 నెలల 7 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.


ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 360
* దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం వాటిల్లినా, విదేశీమారక చెల్లింపుల సమస్య ఏర్పడినా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేకపోయినా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి ఆర్టికల్, 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను రెండు నెలల్లోగా పార్లమెంటు ఆమోదిస్తే ఆరు నెలల వరకు కొనసాగుతుంది. దీన్ని పార్లమెంటు ఆమోదంతో ఆరు నెలలకొకసారి చొప్పున గరిష్ఠంగా ఎంత కాలమైనా విధించవచ్చు.
* లోక్‌సభ, రాజ్యసభల మధ్య ఆర్థిక అత్యవసర బిల్లు ఆమోదం విషయంలో అభిప్రాయ భేదాలు వస్తే అది రద్దవుతుంది. ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన నాటికి లోక్‌సభ రద్దయితే రాజ్యసభ ఆమోదంతో అది కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
» రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన , పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను రద్దు చేయవచ్చు.


ఆర్థిక అత్యవసర పరిస్థితి - పర్యవసానాలు
* కేంద్రం జారీచేసే ఆర్థిక ఆంక్షలను, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి.
* కేంద్రం ఆదేశిస్తే రాష్ట్రాలు తమ బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపాల్సిందే.
* రాష్ట్రపతి మినహా దేశంలోని ఉన్నత ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు; సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలు తగ్గిస్తారు.
* ఆర్టికల్, 275 ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు అందించే సహాయక గ్రాంట్లను నిలిపివేస్తుంది.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో రూపొందించిన చట్టాలు అది రద్దయిన అనంతరం 6 నెలల వరకు అమల్లో ఉంటాయి.
» ఇప్పటి వరకు మనదేశంలో ఒకసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు.

 

జాతీయ అత్యవసర పరిస్థితి - షా కమిషన్ నివేదిక
* 1975, జూన్ 25 నుంచి 1977, మార్చి 21 వరకు సుమారు 21 నెలలపాటు ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ప్రతిపక్ష రాజకీయ పార్టీల పట్ల అణిచివేత చర్యలు లాంటివి జరిగాయి.
* వీటిని విచారించేందుకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1977లో జయంత్‌లాల్ ఛోటాలాల్ షా
(జె.సి. షా) నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికను 1978లో సమర్పించింది.
* ఈ కమిషన్ నివేదికలో తెలిపిన అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో జనతా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
* 1980లో 'ఇందిరాను పిలవండి - దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో ఇందిరా గాంధీ అధికారానికి వచ్చి, షా కమిషన్ నివేదికను రద్దు చేసింది.


అత్యవసర అధికారాలపై ప్రముఖుల వ్యాఖ్యలు
» 'అత్యవసర పరిస్థితులను ఉపయోగించి నెలకొల్పే శాంతి స్మశానపు ప్రశాంతిని తలపిస్తుంది' - హెచ్.వి. కామత్
» 'అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపైన జరిపే దోపిడీ లాంటివి' - కె.ఎం. నంబియార్
» 'అత్యవసర పరిస్థితి అధికారాలనేవి మన రాజ్యాంగంలోని అవశ్యక్లేశాలు అంటే అవసరమైన చెడు' -టి.టి. కృష్ణమాచారి
» 'అత్యవసర పరిస్థితులు అసాధారణ పరిస్థితుల్లో రాజ్యాంగానికి రక్షక కవచాల లాంటివి' - మహావీర్ త్యాగి
» 'అత్యవసర పరిస్థితులు భారత రాజ్యాంగానికి శ్వాసను అందించే మార్గాలు, మృత సంజీవని లాంటివి' - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
» 'భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవడానికి వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు' -డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'ఒకవేళ రాష్ట్రపతి అత్యవసర అధికారాలను నిజంగా వినియోగిస్తే, ఆ రోజు ఒక అవమానకర, బాధాకరమైన రోజు అవుతుంది' - హెచ్.వి. కామత్
» 'అత్యవసర పరిస్థితి అధికారాల వల్ల రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి నియంతగా మారిపోతారు' - అలెన్ గ్రేడ్‌హిల్
» 'డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మరణించారు, కానీ ఆర్టికల్, 356 సజీవంగానే ఉంది' -హెచ్.వి. కామత్
» 'వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కంటే దేశ సార్వభౌమత్వం గొప్పది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'ఆర్టికల్, 356 రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వులాంటిది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'అత్యవసర అధికారాలను రాజకీయ ఉద్దేశాల కోసం దుర్వినియోగం చేయరు అనే అభిప్రాయాలతో నేను అంగీకరించను. ఆర్టికల్, 356 అనేది మృతాక్షరం (Dead Article)' - డాక్టర్ బి.ఆర్. అంబ్కేడర్
» 'ఆర్టికల్, 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలన అనేది కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలా మారింది. గవర్నర్లు రాష్ట్రాల్లో కేంద్రం పావులుగా మారారు' - జస్టిస్ వి. కృష్ణయ్యర్
» 'ఆర్టికల్, 356 అనేది రాష్ట్రాల తలలపై వేలాడే కేంద్రం యొక్క కత్తి అంటే ఆ ప్రభుత్వాలను ఎప్పుడైనా వధించవచ్చు' - డి.కె. చటర్జీ

 

రాష్ట్రపతి - విచక్షణాధికారాలు
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో ప్రధానమంత్రిని నియమించే సమయంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తారు.
* 1989లో మనదేశంలో తొలిసారిగా 9వ లోక్‌సభ హంగ్ పార్లమెంట్‌గా అవతరించిన సమయంలో 191 స్థానాలతో కాంగ్రెస్ పెద్దపార్టీగా  ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఏర్పాటుకు  ముందుకు రాకపోవడంతో 141 స్థానాలతో రెండో పెద్ద పార్టీగా ఏర్పడిన జనతాదళ్‌కు చెందిన వి.పి. సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ఆహ్వానించారు.
* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఆహ్వానించారు. కానీ మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమైన వాజ్‌పేయీ 13 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు.
» కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి అవకాశాన్ని కల్పించడం లేదా లోక్‌సభను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునివ్వడం అనేది రాష్ట్రపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
ఉదా:1979లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేసినప్పుడు చరణ్‌ సింగ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చరణ్‌ సింగ్‌ను ప్రధానమంత్రిగా ప్రమాణం చేయించి నెలరోజుల్లోగా లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించారు. చరణ్‌సింగ్ పార్లమెంటుకు హాజరుకాకుండానే 23వ రోజున పదవికి రాజీనామా చేశారు.
» చరణ్‌ సింగ్ రాజీనామా అనంతరం బాబూ జగజ్జీవన్‌రామ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పటికీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించకుండా లోక్‌సభను రద్దు చేశారు.
» 1998లో 12వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం బీజేపీకి చెందిన అటల్‌బిహారి వాజ్‌పేయీని ప్రధానిగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ 12వ లోక్‌సభను రద్దు చేశారు.
» మన దేశంలో అతి తక్కువ కాలం అంటే 13 నెలలు మాత్రమే పనిచేసిన లోక్‌సభ 12వ లోక్‌సభ.
* 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కేబినెట్ ప్రసంగం బదులుగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఒక పాత్రికేయుడితో సంభాషణ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
* 1999లో అటల్‌బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలోని 'ఆపద్ధర్మ ప్రభుత్వం' నూతన టెలికాం విధానం, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను మెరుగుపరిచేందుకు రూ. 125 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విషయాలపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
* 2006లో లాభదాయక పదవుల బిల్లును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు పంపారు.


రాష్ట్రపతి పదవి - ప్రముఖుల వ్యాఖ్యానాలు
» 'మంత్రిమండలి సలహా లేకుండా రాష్ట్రపతి ఏమీ చేయలేరు. రాష్ట్రపతి పదవిని బ్రిటిష్ రాజమకుటంతో పోల్చవచ్చు. ఎందుకంటే వారు దేశానికి ఏలిక మాత్రమే, పాలకులు కాలేరు. రాష్ట్రపతి మంత్రిమండలికి మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగా వ్యవహరిస్తారు.' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'రాష్ట్రపతి పదవి జాతీయ సమైక్యతకు, సమగ్రతలకు ప్రతీక. మన దేశ ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్యమైన పాత్రను పోషిస్తారు' - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
» 'రాష్ట్రపతి పదవి భారత జాతి నిర్ణయాలను తెలియజేసే ఆమోదముద్ర లాంటిది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» '42వ, 44వ రాజ్యాంగ సవరణల అనంతరం రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలింది' - ఎమ్.పి జైన్
» 'భారత్‌లో పార్లమెంటరీ విధానం ఉండటం వల్ల ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలి' - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
» 'భారత రాష్ట్రపతులందర్నీ ప్రధానమంత్రి రాష్ట్రపతులుగానే పరిగణించాలి' - టి.ఎన్. శేషన్
» 'భారత రాజ్యాంగం కేంద్ర మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ, రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యాన్ని కూడా ఇచ్చింది' - జవహర్‌లాల్ నెహ్రూ
షంషేర్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: 1974
» ఈ కేసులో జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిస్తూ ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించాలని పేర్కొంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌