• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు

* భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. కానీ సిద్ధాంత పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతను రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
* మన దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు 3 విధాలుగా ఉన్నాయి. అవి:
1) శాసన సంబంధాలు - 11వ భాగంలోని 245 - 255 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
2) పరిపాలన సంబంధాలు - 11వ భాగంలోని 256 - 263 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
3) ఆర్థిక సంబంధాలు - 12వ భాగంలోని 264 - 300 (A) వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.

శాసన సంబంధాలు
రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న 11 ప్రకరణల్లో కేంద్ర, రాష్ట్రాల శాసన సంబంధాలను వివరించారు.

ఆర్టికల్ 245
* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధిని వివరిస్తుంది.

ఆర్టికల్ 245 (1)
* దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక రాష్ట్రం మొత్తానికి లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.

ఆర్టికల్ 245 (2)
* పార్లమెంటు చేసిన శాననాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తాయి. (Extra Territorial Operations)

ఆర్టికల్ 246
* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల మధ్య అధికారాల విభజన, చట్టాలకు సంబంధించిన విషయాలు.

ఆర్టికల్ 246 (1)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది.

ఆర్టికల్ 246 (2)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉంది.
* ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య విభేదాలు వస్తే కేంద్ర శాసనమే చెల్లుతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్స్ అంటారు.

ఆర్టికల్ 246 (3)
* 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.

ఆర్టికల్ 246 (4)
* రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపల ఉన్న భారత్‌లోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎలాంటి శాసనాలనైనా రూపొందించవచ్చు.

ఆర్టికల్ 247
* కేంద్ర జాబితాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి పార్లమెంటు చేసిన చట్టాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు.
 

ఆర్టికల్ 248
* అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‌కు అప్పగించారు. ఒక అంశం అవశిష్ట అధికారమా? కాదా? అనేది సుప్రీంకోర్టు ధ్రువీకరిస్తుంది.

ఆర్టికల్ 249
* జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందించగలదు.

ఆర్టికల్ 249 (1)
* జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ ద్వారా ఒక తీర్మానం చేస్తే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన శాసనం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది.

ఆర్టికల్ 250
భారత రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.
ఈ విధంగా రూపొందిన శాసనం అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.

ఆర్టికల్ 251
* ఆర్టికల్ 249, 250 లను అనుసరించి పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రూపొందించిన శాసనాలు రాష్ట్ర శాసనాలతో వైరుధ్యం కలిగి ఉంటే పార్లమెంటు రూపొందించిన శాసనాలే చెల్లుతాయి. పార్లమెంటు చేసే చట్టాలకు కాల పరిమితి ముగిసిన తర్వాత రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు తిరిగి అమల్లోకి వస్తాయి.

ఆర్టికల్ 252
* రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ప్రయోజనార్థం శాసనాలను రూపొందించాలని కోరితే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.
ఉదా: ఎస్టేట్ సుంకం చట్టం, 1955
          ప్రైజ్ కాంపిటీషన్ చట్టం, 1955
          వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972
          జల కాలుష్య నివారణ చట్టం, 1974
          పట్టణ ఆస్తుల పరిమితి చట్టం, 1976

ఆర్టికల్ 253
* భారత ప్రభుత్వం విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు, సంధులను అమలు చేయడానికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.
ఉదా: ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సౌకర్యాలు, రక్షణల చట్టం - 1947
         జెనీవా ఒప్పంద చట్టం - 1960
         హైజాకింగ్ వ్యతిరేక చట్టం - 1982

ఆర్టికల్ 254
పార్లమెంటు చేసిన చట్టానికి, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి వైరుధ్యం ఏర్పడినప్పుడు పార్లమెంటు చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది.
* రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తే ఆ అంశంపై రాష్ట్రానికి ఎలాంటి అధికారం ఉండదని 1990లో బిహార్ రాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆర్టికల్ 255
* ఏదైనా అంశానికి సంబంధించి శాసనం చేయాలంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే వారి నుంచి ముందుగా అనుమతి పొందకుండానే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ శాసనాన్ని రూపొందించి ఉండవచ్చు.
ఈ విధంగా రూపొందించిన శాసనానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే 'ముందస్తు అనుమతి లేకుండా శాసనం చేశారనే' కారణంపై చెల్లకుండా పోదు.

ఆర్టికల్ 201
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను సంబంధిత రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు. రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు శాసనంగా మారుతుంది.

ఆర్టికల్ 352
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు రాష్ట్ర జాబితాలోని పాలనాంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.

ఆర్టికల్ 356
* ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ తరఫున పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది.

ఆర్టికల్ 31 (ఎ)
రాష్ట్రాల్లో ఆస్తులను జాతీయం చేసే బిల్లులను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి.

Doctrine of Pith and Substance:
      కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగిన సందర్భంలో ఒక నిర్ణీత అంశం లేదా చట్టాన్ని ఒక జాబితాలో పొందుపరుస్తారు. ఆ జాబితాలో పొందుపరచిన అంశం మరో జాబితాలో పొందుపరచిన అంశంతో సందర్భానుసారం కొంతవరకు అతిక్రమించినా ఆ చట్టాలు చెల్లుతాయి. దీన్నే Pith and Substance అంటారు.

బెంగాల్ vs బెనర్జీ కేసు:
      ఈ కేసులో మనీ లెండింగ్ (అప్పులు) అనే అంశంపై శాసనం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని ప్రామిసరీ నోట్లు అనే అంశం కూడా ఇమిడి ఉండటం వల్ల అది రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని సార్లు అనుకోకుండా ఒక జాబితాలోని అంశంపై శాసనం చేసే సందర్భంలో మరో జాబితాలోకి చొచ్చుకుని రావడమే Pith and Substance అంటారు.

బల్లార్‌షా vs స్టేట్ ఆఫ్ ముంబయి కేసు:
      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ముంబయి రాష్ట్రం మద్యపానాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఈ సందర్భంలో కేంద్ర జాబితాలో పేర్కొన్న విదేశీ మద్యం అనే అంశాన్ని అనుకోకుండా చేర్చడం వల్ల ఆ చట్టం చెల్లుతుందని, అది రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

కేతన్ ఈశ్వర్ షుగర్ మిల్స్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసు: 
*  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములను జాతీయం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని 'షుగర్ ఫ్యాక్టరీ'ని కూడా జాతీయం చేస్తూ చట్టం చేయడమనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ఈ చట్టం చెల్లుతుందని పేర్కొంది.
*  సదరన్ ఫార్మాస్యూటికల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు, చావ్లా vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్, సింథటిక్ కెమికల్స్ లిమిటెడ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసుల్లో Pith and Substance గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.Colourable Legislation:
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాలు ఏవైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలు తీర్పునిచ్చిన తర్వాత, అవే శాసనాలను మరో రూపంలో తీసుకొచ్చినప్పుడు అవి కూడా చెల్లవని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడాన్నే Colourable Legislation గా పేర్కొంటారు.
ప్రత్యక్షంగా ఒప్పు కానిది ఏదీ పరోక్షంగా కూడా ఒప్పు కాదని, ఒక రూపంలో తప్పుగా భావించిన దాన్ని మరో రూపంలో కూడా ఒప్పు కాదని పేర్కొనడాన్నే Colourable Legislation అంటారు.
* కె.సి.జి. నారాయణ్‌దేవ్ vs స్టేట్ ఆఫ్ ఒడిశా కేసులో తొలిసారిగా సుప్రీంకోర్టు Colourable Legislation సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది.
* కామేశ్వరీ సింగ్ vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో Colourable Legislation సిద్ధాంతాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తొలిసారిగా తీర్పు ఇచ్చింది.
ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్రం, రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన శాసనాలు రూపొందిస్తే, కేంద్ర శాసనమే చెల్లుతుందని చెప్పడాన్ని Doctrine of Repugnancy అంటారు.
కానీ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రాష్ట్రాలు ముందుగా శాసనం రూపొందిస్తే రాష్ట్ర శాసనమే అమల్లో ఉంటుంది.

కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు
* భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో 256 నుంచి 263 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే పరిపాలనా సంబంధాలను వివరిస్తున్నాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధికి కట్టుబడి తమ కార్యనిర్వహణాధికారాలను నిర్వహించినప్పటికీ కొన్ని సందర్భాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సంబంధాలు కూడా ఉంటాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేయగా, ఆర్టికల్ 162 రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేస్తుంది.

ఆర్టికల్ 256
రాష్ట్రాలు తమ పరిపాలనను పార్లమెంటు చేసిన చట్టాలకు, కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు విరుద్ధంగా నిర్వహించరాదు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేసినప్పుడు వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం కేంద్రానికి ఆర్టికల్ 256 ప్రకారం ఉన్న అధికారం లేకపోయినట్లయితే పార్లమెంటు చేసే చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌