• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానుల పాలన

ఢిల్లీ సుల్తానులు దాదాపు 320 ఏళ్లు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని భారతదేశాన్ని పాలించారు. వీరి పాలనా విధానం మొత్తం ఇస్లాం మతపరమైన చట్టాలపై ఆధారపడి ఉండేది. సుల్తాన్‌ను భగవంతుడి ప్రతినిధిగా భావించేవారు. వారికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఇస్లాం చట్టంలో నిర్దేశించిన సూచనల మేరకు వారు రాజ్యాన్ని పరిపాలించారు.


* ఢిల్లీ సుల్తానులు తురుష్క, పారశీక పరిపాలనా విధానాన్ని భారతీయ పరిపాలనలతో జోడించారు. వీరి పరిపాలనంతా చాలావరకు ఏకరూపకతను కలిగి ఉంది. అయితే పాలనా సంస్కరణల్లో మాత్రం అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. బాల్బన్, అల్లాఉద్దీన్‌ ఖిల్జీ, ఫిరోజ్‌షా తుగ్లక్‌ మొదలైనవారు పాలనలో తమదైన ముద్ర వేశారు. 


*  ఢిల్లీని పాలించిన సుల్తానులంతా మతాధికారస్వామ్యంగా లేదా కేంద్రీకృత, నిరంకుశంగా పాలించారు. వీరి కాలంలో నిర్మించిన కట్టడాలు, నిర్మాణాలు నాటి వాస్తు-శిల్పకళాభివృద్ధిని తెలుపుతున్నాయి.  


పాలనలోని భాగాలు


సుల్తాన్‌ 


ఇతడు ఢిల్లీ సామ్రాజ్యానికి అధినేత. సిద్ధాంతపరంగా సుల్తాన్‌ ఖురాన్‌ను అనుసరించి పరిపాలించాడు. నిరంకుశుడిగా వ్యవహరించేవాడు. అన్ని అధికారాలు అతడి వద్దే ఉండేవి. రాజ్యాధినేత, సర్వసైన్యాధ్యక్షుడు కూడా సుల్తానే. 


* సుల్తాన్‌ ఇష్టమే చట్టం. అతడి ఆజ్ఞలను అనుసరించడం అందరి కర్తవ్యం. 


* దార్‌-ఉల్‌-హర్బను (ఇస్లామేతర ప్రాంతం) దార్‌-ఉల్‌-ఇస్లాం (ఇస్లాం ప్రాంతం)గా మార్చడం సుల్తాన్‌ లక్ష్యం.


* సుల్తాన్‌ అధికారాలపై ఉలేమాలు, ప్రభువర్గం, సిద్ధసైన్యం ప్రభావం ఉండేది. ఉలేమాలు అప్పటి పాలనలో ముఖ్య పాత్ర పోషించారు. 


* సింహాసనం వారసత్వంగా దక్కేది కాదు. బలవంతుడిదే రాజ్యం అనే సూత్రంపై రాజ్యాధికారం ఆధారపడింది. ప్రభువర్గం వారు సుల్తాన్‌ నియామకంలో కీలక పాత్ర పోషించేవారు. 


రాష్ట్రపాలన


రాష్ట్ర పాలకుడిని ‘వలి’ లేదా ‘ముక్తి’ అంటారు. ఇతడు రాష్ట్రానికి సైన్యాధిపతి. 


* ఢిల్లీ సుల్తాన్‌లు ప్రారంభంలో ‘రాజ్యాన్ని’ సైనిక విభాగాలుగా విభజించారు. అల్లాఉద్దీన్‌ కాలంలో పదకొండు రాష్ట్రాలుగా, మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ సమయంలో ఇరవైమూడు రాష్ట్రాలుగా విభజించారు. 


* రాష్ట్ర పాలకుడు ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడి, రాచరిక ఆజ్ఞలను అమలు చేసేవాడు. ఇతడు సుల్తాన్‌కు మాత్రమే జవాబుదారీగా ఉండేవాడు.


* సుల్తాన్‌కు సైనికంగా సహాయం చేసేవాడు. సుల్తాన్‌ గూఢచారుల ద్వారా రాష్ట్రపాలకుల గురించి తెలుసుకునేవాడు. 


స్థానిక ప్రభుత్వం 


ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో స్థానిక ప్రభుత్వ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. వీరు ప్రతి రాష్ట్రాన్ని ‘షిక్‌’ అనే విభాగాలుగా విభజించారు. ‘షిక్‌’కు అధిపతి ‘షిక్‌దార్‌’. తన విభాగంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ఇతడి ముఖ్య బాధ్యత.


* వంద గ్రామాలను ఒక ‘పరగణా’గా ఏర్పాటు చేసి, దానికి ‘కస్బా’ అనే పేరు పెట్టినట్లు ఇబన్‌ బటూటా తన గ్రంథాల్లో రాశారు. అమీల్‌ (రెవెన్యూ అధికారి), ముస్రిఫ్‌ (ప్రభుత్వ జమాఖర్చు లెక్కలు రాసే గణాంక అధికారి), ఖజాన్‌దార్‌ (ప్రభుత్వ ఖజానా అధికారి), ఖాజీ (న్యాయాధిపతి), కొత్వాల్‌ (పోలీస్‌ అధికారి) మొదలైనవారు కస్బాలో ముఖ్య అధికారులు. పరిపాలనా క్రమంలో చివరిది గ్రామం. 


* గ్రామ వ్యవహారాలను చౌదరీ, పట్వారీలు నిర్వహించేవారు. గ్రామ పంచాయతీలు పరిపాలన, న్యాయసంబంధ విషయాలను చూసేవి. నాటి ప్రభుత్వ ఆదాయానికి గ్రామాలు మూలంగా ఉండేవి. అయితే వీటి అభివృద్ధిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి.


ఇక్తా వ్యవస్థ 


ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇక్తా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. యుద్ధంలో తనకు సహాయం చేసిన సామంతులకు సుల్తాన్‌ విశాల ప్రాంతాన్ని దానం చేసేవాడు. దీన్నే ఇక్తా అని, ఇక్తాలను పొందినవారిని ఇక్తాదార్లు అని పిలిచేవారు. ఈ ప్రాంతం తర్వాతి తరాలకు వారసత్వంగా లభించేది.


న్యాయపాలన 


న్యాయవ్యవస్థలో అత్యున్నత అధికారి సుల్తాన్‌. న్యాయాధికారాలన్నీ ఇతర అధికారులకు సుల్తాన్‌ నుంచే సంక్రమించేవి. రాజ్యంలోని అత్యున్నత న్యాయస్థానం సుల్తాన్‌ దర్బార్‌. అన్ని రకాల కేసులను ఇక్కడ విచారించేవారు.


* సుల్తాన్‌ తర్వాత రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి ఖాజీ. ప్రతి పట్టణంలో ఒక ఖాజీ ఉండేవాడు. న్యాయస్థానాల్లో మహమ్మదీయుల చట్టమైన ‘షరియత్‌’ను పాటించేవారు. శిక్షాస్మృతి చాలా కఠినంగా ఉండేది.


సైనిక పాలన 


తమ అధికార పరిరక్షణకు, రాజ్యాన్ని రక్షించడానికి ఢిల్లీ సుల్తాన్‌లకు శక్తిమంతమైన సైన్యం అవసరమైంది. అందుకే వీరు సైనిక వ్యవస్థపట్ల చాలా శ్రద్ధ వహించారు. వీరి సైనిక వ్యవస్థ చాలా వరకు టర్కీ సైనిక వ్యవస్థను పోలి ఉంది. వీరి సైన్యంలో ముఖ్య భాగం అశ్వికదళం, తర్వాత కాల్బలం ఉండేవి.


మంత్రులు - అధికారాలు


మంత్రులు సుల్తాన్‌కు సలహాలిచ్చి, పరిపాలనలో తోడ్పడేవారు. వారి సలహాలను సుల్తాన్‌ తప్పనిసరిగా పాటించాలనే నిబంధన లేదు. నాటి పాలనలో కింది వ్యక్తులు ముఖ్య పాత్ర పోషించారు.


వజీర్‌: ఇతడు ప్రధానమంత్రి. ప్రజలకు, సుల్తాన్‌కి మధ్య వారధి లాంటివాడు.


దివాన్‌-ఇ-రిసాలత్‌: విదేశాంగ మంత్రి.


సదర్‌-ఉస్‌-సదర్‌: ఇస్లాం నీతి, నియమాలను అమలు చేసే వ్యక్తి.


దివాన్‌-ఇ-ఇన్‌షా: రాచరిక ఉత్తరప్రత్యుత్తరాల మంత్రి. సుల్తాన్‌ ఉత్తర్వులను ఈయన తయారు చేసేవారు.


ఆరిజ్‌-ఇ-మమాలిక్‌: యుద్ధ మంత్రిత్వ శాఖ (దివాన్‌-ఇ-ఆరిజ్‌) అధిపతి. యుద్ధ నిర్వహణ, సైన్యసమీకరణ ఇతడి విధులు.


నాయిబ్‌-ఉల్‌-మమాలిక్‌: ప్రభువర్గంలోని వారిని ఈ ఉద్యోగంలో నియమించేవారు. ఇతడి అధికారాలను సుల్తాన్‌ నిర్ణయించేవాడు. సుల్తాన్‌ రాజధానిలో లేనప్పుడు ఇతడు ప్రతినిధిగా ఉండేవాడు.


బరీద్‌-ఇ-మమాలిక్‌: వార్తా విభాగానికి అధిపతి. సామ్రాజ్యంలో జరిగే అన్ని విషయాలను సుల్తాన్‌కు తెలపడం ఇతడి విధి. ఇతడికి సహాయంగా స్థానిక ‘బరీదులు’ ఆయా ప్రాంతాల్లో ఉండేవారు.


వకీల్‌-ఇ-దర్‌: అంతఃపుర వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి.


సర్‌-ఇ-జందర్‌: ఇతడు న్యాయస్థానానికి అనుబంధంగా ఉండేవాడు. సుల్తాన్‌ రక్షకభటులైన జందరులు ఇతడి  అధీనంలో ఉండేవారు. సుల్తాన్‌ను కాపాడటం ఇతడి విధి.


* వీరు కాకుండా అమీర్‌-ఇ-అఖురా (అశ్వశాఖాధిపతి), శహన్‌-హ-ఇపిలాన్‌ (గజాధ్యక్షుడు), అమీర్‌-ఇ-షికార్‌ (సుల్తాన్‌ వేటకు వెళ్లేటప్పడు సహాయంగా ఉండే వ్యక్తి) అనే ఉద్యోగులు ఉండేవారు.


శిస్తు విధానం 


ఇస్లాం మత గ్రంథం ప్రకారం ఢిల్లీ సుల్తాన్‌లు 4 రకాల పన్నులు వసూలు చేశారు. అవి: జకాత్, ఖరజ్, ఖామ్స్, జిజియా. మహమ్మదీయులు తమ తోటి ముస్లింల సంక్షేమం కోసం చెల్లించే పన్ను ‘జకాత్‌’. ప్రతి ముస్లిం తన ఆస్తి లేదా ఆదాయంలో రెండున్నర శాతాన్ని ‘జకాత్‌’గా చెల్లించేవారు.


భూమిశిస్తును ‘ఖరజ్‌’ అంటారు. ఉత్పత్తిలో 10 - 50 శాతం వరకు భూమి శిస్తును వసూలు చేసేవారు. ఇది ధన లేదా ధాన్యరూపంలో ఉండేది. 


* యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సంపదలో అయిదో వంతు ప్రభుత్వవాటాగా ఉండేది. దీన్ని ‘ఖామ్స్‌’ అంటారు.


ముస్లింలు కానివారిపై విధించే పన్ను జిజియా.


మాదిరి ప్రశ్నలు


1. కింది అంశాలను జతపరచండి.

వంశం              స్థాపకులు

a) బానిస వంశం     i) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌

b) ఖిల్జీ వంశం        ii) ఖిజిర్‌ఖాన్‌

c) తుగ్లక్‌ వంశం      iii) బహాల్‌ లోడీ 

d) సయ్యద్‌ వంశం  iv) కుతుబుద్దీన్‌ ఐబక్‌

e) లోడీ వంశం       v) జలాలుద్దీన్‌ ఖిల్జీ

1) a-iii, b-i, c-v, d-iii, e-iv

2) a-i, b-iv, c-v, d-iii, e-ii

3) a-iv, b-v, c-i, d-ii, e-iii

4) a-i, b-ii, c-iv, d-v, e-iii

 


2. కిందివాటిలో సరైంది ఏది?

ఎ) బానిస వంశంలో చివరివాడు కైకుబాద్‌ 

బి) ఖిల్జీ వంశంలో చివరివాడు ఖుస్రూ ఖాన్‌ 

సి) సయ్యద్‌ వంశంలో చివరివాడు అల్లాఉద్దీన్‌ అలమ్‌షా 

డి) లోడీ వంశంలో చివరివాడు ఇబ్రహీం లోడీ

1) ఎ, బి, సి    2) బి, డి    3) డి మాత్రమే    4) పైవన్నీ3. ఢిల్లీలో ‘కువ్వల్‌-ఉల్‌-ఇస్లాం’ మసీదు, ఆజ్మీర్‌లో ‘అర్హయిల్‌-దిన్‌కా-జోంప్డా’ మసీదును నిర్మించింది ఎవరు?

1) రజియా సుల్తానా      2) ఇల్‌టుట్‌మిష్‌

3) కుతుబుద్దీన్‌ ఐబక్‌     4) బాల్బన్‌ 

 


4. కుతుబుద్దీన్‌ ఐబక్‌ ‘కుతుబ్‌మినార్‌’ నిర్మాణాన్ని ప్రారంభించగా, దాన్ని పూర్తిచేసిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) ఇల్‌టుట్‌మిష్‌        2) బాల్బన్‌ 

3) రజియా సుల్తానా      4) ఆరామ్‌షా 

 


5. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) ఇల్‌టుట్‌మిష్‌ తన రాజ్యాన్ని ‘ఇక్తాలు’గా విభజించాడు.

బి) ఇక్తాలు అంటే సైనిక రాష్ట్రాలు.

సి) ఇల్‌టుట్‌మిష్‌ లాహోర్‌ నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చాడు.

డి) ఇల్‌టుట్‌మిష్‌ టంకా అనే వెండి నాణేలను, జిటాల్‌ అనే రాగి నాణేలను జారీచేశాడు.

1) ఎ, బి, సి    2) బి, సి    3) ఏదీకాదు    4) పైవన్నీ

 


6. ‘బరీద్‌’లనే గూఢచారి వ్యవస్థను స్థాపించింది ఎవరు?

1) బాల్బన్‌            2) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ

3) ఇల్‌టుట్‌మిష్‌    4) ఆరామ్‌షా

 


7. కింది ఏ కవి ‘భారతదేశ రామచిలుక’ (Parrot of India) గా పేరొందారు?

1) మిన్హాస్‌-ఉస్‌-సిరాజ్‌    2) ఫిరదౌసి

3) అమీర్‌ఖుస్రూ      4) ఫకృద్దీన్‌

 


8. ‘సితార్‌’ అనే వాయిద్య పరికరాన్ని కనుక్కున్న కవి?

1) మిన్హాస్‌-ఉస్‌-సిరాజ్‌   2) అమీర్‌ఖుస్రూ

3) అల్‌బెరూని    4) సిరాజ్‌-ఆసిఫ్‌9. ‘సిజ్దా’ (సాష్టాంగ నమస్కారం), పైబోస్‌ (సుల్తాన్‌ పాదాలను ముద్దు పెట్టుకోవడం) లాంటి వాటిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌     2) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ 

3) ఆరామ్‌షా   4) కైకుబాద్‌10. జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) ఇల్‌టుట్‌మిష్‌    2) మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌

3) బాల్బన్‌      4) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ


సమాధానాలు

1-3   2-4   3-3   4-1   5-4   6-1   7-3   8-2   9-1   10-4


 

Posted Date : 06-02-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు