• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో గ్రామీణ సమాజశాస్త్రం 

గ్రామీణ ప్రగతికి శాస్త్రీయ ఆసరా!

గ్రామీణ సమాజాన్ని శాస్త్రబద్ధంగా అధ్యయనం చేసేదే గ్రామీణ సమాజశాస్త్రం. సాధారణ సమాజశాస్త్రంలో ఇదొక ప్రధానమైన విభాగంగా అభివృద్ధి చెందింది. గ్రామీణ సమాజ నిర్మాణం, ప్రజల వ్యవహారాలు, గ్రామస్థాయి సంస్థల గురించి వివరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని సంబంధాలు, కాలాగుణంగా వస్తున్న పరిణామాలను విశ్లేషిస్తుంది. సమస్యలను గుర్తించి పరిష్కారాలను సూచిస్తుంది. గ్రామీణ జనాభా అధికంగా ఉన్న మన దేశంలో     ప్రభుత్వాలకు గ్రామీణాభివృద్ధి అత్యంత ప్రాధాన్య అంశం. పల్లెల పురోగతికి ప్రణాళికలు రూపొందించడంలో ఉపకరించే ఈ శాస్త్రం గురించి, ఇందులోని   అధ్యయన అంశాల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


మానవుడు ఆది యుగం నుంచి నేటి ఆధునిక యుగం వరకు తాను తెలుసుకున్న, పురోగతికి వినియోగించుకున్న విజ్ఞానాన్ని కొన్ని శాస్త్రాలుగా విభజించి తర్వాతి తరానికి అందిస్తూ వస్తున్నాడు. ఈ శాస్త్రాలను ప్రధానంగా భౌతిక, సాంఘిక శాస్త్రాలుగా విభజించవచ్చు. సాంఘిక శాస్త్రాల్లోని సరికొత్త విభాగమే సమాజ శాస్త్రం. మానవ, సామాజిక సంబంధాలను ఇది అధ్యయనం చేస్తుంది. దీనిని ఆంగ్లంలో ‘సోషియాలజీ’ అంటారు. లాటిన్‌లోని ‘సోసైటస్‌’, గ్రీకులోని ‘లోగాస్‌’ అనే పదాలను కలిపి సోషియాలజీగా 19వ శతాబ్దంలో ఫ్రెంచి తత్వవేత్త ఆగస్ట్‌ కోమ్టే రూపొందించాడు.


సమాజంలో మనుషుల మధ్య జరిగే పరస్పర చర్యలు, సంబంధాలను సమాజ శాస్త్రం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. దీనిలో సాధారణ, ప్రత్యేక అంశాలుంటాయి. సమాజంలో వ్యక్తుల మధ్య పరస్పర చర్యలు, సంబంధాల అధ్యయనం సాధారణ సమాజ శాస్త్రం అయితే, లోతైన అధ్యయనానికి ఎంచుకున్న విశిష్టాంశాలకు ప్రత్యేక సమాజ శాస్త్రం 

వర్తిస్తుంది. సమాజంలోని అనేక దృగ్విషయాలను సమగ్రంగా పరిశీలించి, విశ్లేషించేందుకు సమాజ శాస్త్రం నుంచి పలు ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి. వీటిలో గ్రామీణ సమాజ శాస్త్రం ఒకటి.


పుట్టుక, అభివృద్ధి:  గ్రామీణ సమాజ శాస్త్రం ఆవిర్భావానికి మూలకేంద్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. మహాత్కార్య కాలంలో (ఎక్స్‌ప్లాయిటర్‌ పీరియడ్‌-1889 - 1920) అమెరికాలోని గ్రామీణ సమాజం క్షీణ దశలో ఉన్నప్పుడు నాటి గ్రామీణ సమాజ సమస్యలను సమాజ శాస్త్రవేత్తలు గుర్తించి స్పందించారు. 1890లో అమెరికా అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ గ్రామీణ జీవిత విశేషాల అధ్యయనానికి ఒక కమిషన్‌ను నియమించారు. ‘కంట్రీలైఫ్‌ కమిషన్‌’గా పిలిచే దీనికి ‘డీన్‌ బేలీ’ అధ్యక్షుడు. ఈ కమిషన్‌ గ్రామీణ సమస్యలపై సమగ్ర నివేదిక అందించింది. దీనినే గ్రామీణ సమాజ శాస్త్రంలో మొదటి విలువైన గ్రంథంగా పేర్కొంటారు. 1912 తర్వాత అమెరికన్‌ సోషియోలాజికల్‌ సొసైటీ వార్షిక సమావేశాల్లో ఈ అంశమే ప్రధాన చర్చనీయమైంది. 1937లో గ్రామీణ సమాజాల అధ్యయనంపై శ్రద్ధాశక్తులున్న వారు ‘రూరల్‌ సోషియాలాజికల్‌ సొసైటీ’ని స్థాపించారు. ఈ సంస్థ ‘రూరల్‌ సోషియాలజీ’ అనే పత్రికను ప్రచురించేది.


గ్రామీణ సమాజ విషయాలను సుదీర్ఘంగా, నిశితంగా పరిశీలించిన మేధావుల్లో సోరోకిన్, జిమ్మర్మన్, గాల్ఫిన్, టేలర్, కోల్బ్, బ్రన్నర్, సిమ్స్, డైవాట్‌ సాండర్సన్, లాండిస్, రెడ్‌ పీల్ట్, స్మిత్‌ సుప్రసిద్ధులు. కాలక్రమేణా గ్రామీణ సమాజ శాస్త్రంలో పరిశోధనలు గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా పరిపుష్ఠమవుతున్నాయి. 1956 నాటి అంచనాల ప్రకారం గ్రామీణ సమాజ శాస్త్రంలో పరిశోధనలు వెయ్యి దాటాయి. ఐక్యరాజ్యసమితి, యునెస్కో, ఎఫ్‌ఏఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా గ్రామీణ సమాజ శాస్త్రాభివృద్ధికి దోహదపడ్డాయి.


భారత దేశంలో గ్రామీణ సమాజ శాస్త్రం - అభివృద్ధి: భారత దేశంలో ఈ శాస్త్రం ఎప్పుడు ప్రారంభమైందీ చారిత్రకంగా నిర్ధారించి చెప్పడం కష్టం. గ్రామాలకు సంబంధించిన వివిధ విషయాలు బ్రిటిష్‌ అధికారుల నివేదికల్లో, ఐరోపా మత ప్రచారకుల గ్రంథాల్లో లభ్యమవుతాయి. బ్రిటిష్‌ అధికారులు భూమిని సర్వే చేస్తూ రూపొందించిన నివేదికల్లో నాటి గ్రామీణ సామాజిక సంబంధాలు, ప్రజల స్థితిగతులను కూడా పొందుపరిచారు.


భారతీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థలో పూర్వ చారిత్రక కాలం నుంచి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన సాహిత్యంలో గ్రామం అనే పదాన్ని ఒక స్థలంలో నివసించే కొన్ని కుటుంబాల సమూహానికి ఉపయోగించేవారు. రుగ్వేదంలోనూ గ్రామం ప్రస్తావన ఉంది. గ్రామం, పట్టణం, నగరం మధ్య తేడాలను మనుస్మృతి వివరించింది. దీని ప్రకారం గ్రామం ఒక చిన్న పరిపాలన యూనిట్‌. గ్రామానికి సొంత అధికారులు, స్వయం వ్యవస్థలు ఉంటాయి. మనుస్మృతి, మహాభారతాల్లో గ్రామ నాయకుడిని ‘గ్రామణి’ అని పేర్కొన్నారు. బాడెన్‌ పావెల్‌ 1896లో ‘భారతీయ గ్రామీణ సముదాయము’ అనే గ్రంథంలో ఆనాటి గ్రామీణ  వ్యవస్థను పరిశీలించాడు. వాల్టర్‌ నీల్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లా నివేదిక ఆధారంగా ‘రెసిప్రాసిటీ అండ్‌ రీడిస్ట్రిబ్యూషన్‌ ఇన్‌ ద ఇండియన్‌ విలేజ్‌’ అనే శీర్షికతో వ్యాసాలు రాశాడు. 1936లో వైజర్‌ రాసిన ‘ద హిందూ జాజ్మాని సిస్టమ్‌’ గ్రంథం గ్రామీణ సామాజిక అధ్యయనంలో కొత్త ఒరవడిని సృష్టించింది. 1949లో ఎన్‌.కె.బోస్‌ బెంగాలీలో రాసిన ‘హిందూ సమాజ నిర్మితి’ గ్రామీణ సమాజ అధ్యయనాల్లో నూతన మార్గానికి నాంది పలికింది. కులవ్యవస్థ కొనసాగడానికి కారణాలను బోస్‌ ఇందులో తెలియజేశాడు.


స్వభావం: గ్రామీణ సమాజ శాస్త్రం గ్రామీణ సమాజాన్ని సమగ్రంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. ఇతర సాంఘిక శాస్త్రాల్లో ఉపయోగించే శాస్త్రీయ పద్ధతులను గ్రామీణ సమాజ శాస్త్రం కూడా అనుసరిస్తుంది. శాస్త్రం అనేది ఒక సమస్యను సిద్ధాంతపరంగా అధ్యయనం చేసేదైతే దాని అమలు ఒక కళ లేదా సాంకేతిక విజ్ఞానం. గ్రామాల్లోని ప్రతి సమస్యను పరిశీలించడానికి ఒకటి కంటే ఎక్కువ శాస్త్రాల సాంగత్యం అవసరమవుతుంది. దీని ద్వారా వెల్లడైన వాస్తవాలను, సూత్రాలను గ్రామీణాభివృద్ధిలో ఉపయోగించాలి. అప్పుడే గ్రామీణ సమాజ శాస్త్రం కేవలం ఒక శాస్త్రమే కాకుండా కళ కూడా అవుతుంది.


పరిధి:  ప్రతి శాస్త్రానికి ఒక పరిధి ఉంటుంది. ఏ అంశాలను ఎంతవరకు అధ్యయనం చేయాలి, ఏ దృక్కోణంలో ఆయా అంశాలను, దృగ్విషయాలను పరిశీలించాలి? అనే విషయాలు ఆ శాస్త్ర పరిధిని తెలియజేస్తాయి. ఎ.డబ్ల్యూ.హైస్‌ తన గ్రంథం ‘రూరల్‌ సోషియాలజీ’లో గ్రామీణ సమాజ శాస్త్ర పరిధిని ‘‘సమూహ జీవితానికి సంబంధించిన సామాజిక దృగ్విషయాలను అధ్యయనం చేసే శాస్త్రం’’గా పేర్కొన్నాడు. గ్రామీణ సంస్థలు, విద్యావసరాలు, విలువలు గ్రామ ప్రజల గతిశీలతల అభివృద్ధి, క్షీణత, పట్టణ - గ్రామ సంబంధాలు ఇందులో కనిపిస్తాయని వివరించాడు. సారాకిన్‌ అభిప్రాయంలో గ్రామీణ సమాజ శాస్త్రానికి రెండు ప్రధాన లక్ష్యాలున్నాయి. అవి 

1) గ్రామీణ, నగర దృగ్విషయాల్లో ఉండే స్థిరమైన వ్యత్యాసాలను అధ్యయనం చేయడం. 

2) గ్రామీణ దృగ్విషయాల్లో ఉన్న ప్రత్యేకాంశాలను విశదీకరించడం.


అధ్యయనాంశాలు: గ్రామీణ సమాజ శాస్త్ర పరిధిని విశ్లేషించేప్పుడు కింది అంశాలను అధ్యయనం చేయాలి.

1) గ్రామీణ సముదాయం: గ్రామీణ సముదాయ లక్షణాలు, ప్రత్యేక అంశాలు, గ్రామీణ పరిసరాలు, సముదాయ రూపాలు, 

2) గ్రామీణ సామాజిక నిర్మితి, 

3) గ్రామీణ సంస్థలు: సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మతపరమైన సంస్థలు. ఈ సంస్థల నిర్మాణం, తీరుతెన్నులు, విధులు, గ్రామీణ సమాజంలో వాటి పాత్ర, ప్రభావం, 

4) గ్రామీణ సంస్కృతి, 

5) గ్రామీణ సామాజిక జీవనం: గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు, ఆర్థిక సామాజిక పరిస్థితులు, జీవన విధానం, 

6) గ్రామీణ సామాజిక వ్యవస్థాపన: గ్రామీణ సమాజ శాస్త్రం గ్రామీణ సామాజిక వ్యవస్థాపననే కాకుండా గ్రామీణ సమాజ అవ్యవస్థని కూడా అధ్యయనం చేస్తుంది. గ్రామీణ సామాజిక వ్యవస్థాపనలో వివాహం, కుటుంబం, సామాజిక స్థిరీకరణం, మత సాంస్కృతిక సంస్థలు లాంటి అంశాలుంటాయి.

 7) గ్రామీణ సామాజిక పరివర్తన: నగరీకరణ, పారిశ్రామికీకరణ, ఆధునీకరణలు గ్రామీణ జీవితంపై చూపే ప్రభావాలు, వాటివల్ల గ్రామాల్లో వచ్చే మార్పులు. 

8) గ్రామీణ జనాభా: జనాభావృద్ధి, జనన - మరణాల రేటు, శిశు మరణాల తీరుతెన్నులు, గ్రామాల నుంచి నగరాలకు  వలసలు, గ్రామాల నుంచి గ్రామాలకు తరలివెళ్లడం.


భారతదేశంలో గ్రామీణ సమాజశాస్త్రం అధ్యయన ప్రాముఖ్యత: ‘‘భారతదేశం గ్రామాల్లో ఉంది’’ అన్న గాంధీజీ మాటలు అక్షర సత్యాలు. గ్రామాలు భారతీయ సంస్కృతికి దర్పణాలు. భారతీయ సమాజానికి మూలస్తంభాలు. గ్రామీణ జనాభాకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక భూమిక పోషిస్తోంది. వ్యవసాయ ఆధార ఆర్థిక వ్యవస్థ సామాజిక, రాజకీయ, మత సంస్థలను కూడా ప్రభావితం చేస్తుంది. గ్రామీణ సమాజ ప్రగతి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దీనిపై అవగాహన ఏర్పడాలంటే భారతదేశంలో గ్రామీణ సమాజశాస్త్ర అధ్యయనం అవసరం.


 గ్రామాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుంది. దీన్ని సాధించడానికి గ్రామాలను అభివృద్ధి చేసే పథకాలు, ప్రణాళికలు కావాలి. వీటిని రూపొందించడానికే గ్రామీణ సమాజశాస్త్రం ఆవిర్భవించింది. వివిధ జాతులు, విభిన్న మతాలు, భాషలు, ఆచారాలు ఉన్న భారతీయ గ్రామీణ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, వాటి ప్రగతికి, గ్రామీణ సమాజ సమగ్ర పరిశీలనకు గ్రామీణ సమాజశాస్త్రం ఉపకరిస్తుంది.


భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేకస్థానం, ఉమ్మడి కుటుంబానికి ప్రాముఖ్యత ఉన్నాయి. అయితే ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ, పారిశ్రామికీకరణ, నగరీకరణ ప్రభావాలతో గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. దీనికి కారణాలు, పర్యవసానాలను తెలుసుకోవడానికి గ్రామీణ సమాజశాస్త్రం తోడ్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కులపరమైన కట్టుబాట్లు, ఆంక్షలు, నిషేధాలు, వివిధ కులాల మధ్య సంబంధాలు, అంటరానితనం వంటి దురాచారాలు, వీటికి కారణాలు, ఫలితాలు, పరిష్కార మార్గాల అన్వేషణకు గ్రామీణ సమాజశాస్త్రం సహకరిస్తుంది.


ప్రపంచంలో ఎక్కడా లేని, కనిపించని కులవ్యవస్థ వల్ల కలిగే అనర్థాలను వెలికితీయటానికి, వెలుగులోకి తీసుకురావడానికి, అవగాహనకు గ్రామీణ సమాజశాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామాల్లోని భూస్వాములు, కౌలుదార్లు, ఉపకౌలుదార్లు వీరందరి మధ్య నెలకొన్న సామాజిక సంబంధాన్ని అధ్యయనం చేయడం ద్వారా పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చు. ఇలాంటి అంశాల గురించి గ్రామీణ సమాజశాస్త్రం అవగాహన కల్పిస్తుంది. గ్రామీణ సమస్యలైన పేదరికం, నిరుద్యోగిత, నిరక్షరాస్యత, అనారోగ్యం మొదలైన వాటికి కారణాలను తెలుసుకోవడానికి గ్రామీణ సమాజశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆంగ్లేయుల పాలనలో గ్రామాల పరిస్థితి దుర్భరంగా ఉండేది. అంతకుపూర్వం గ్రామాలు స్వయంప్రతిపత్తితో, స్వతంత్రంగా ఉండేవి. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితిలో ఉండేవి. స్వతంత్ర భారతదేశంలో గ్రామాల పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. గ్రామీణ సమాజం పునర్వ్యవస్థీకరణకు, పునర్నిర్మాణానికి, ప్రగతికి గ్రామీణ సమాజశాస్త్ర అధ్యయనం కీలకం. వ్యవసాయ ఆధారిత అభివృద్ధి అవసరమైన భారతదేశంలో గ్రామీణ సమాజశాస్త్రానికి ప్రాధాన్యం ఉంది. విభిన్న మతాలు, కులాలు, ఆచారాలు, సంస్కృతులున్న గ్రామాలను అవగాహన చేసుకోవడానికి, గ్రామాల ప్రగతికి, పునర్నిర్మాణానికి ప్రణాళికల రూపకల్పనకి గ్రామీణ సమాజశాస్త్రం ఉపకరిస్తుంది. గ్రామీణ సమాజ సమస్యల పరిష్కారానికి సహకరిస్తుంది.

 

నిర్వచనాలు


భారతదేశంలో 65 శాతం జనాభా గ్రామాల్లో నివసిస్తూ పలు రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే మన దేశంలో గ్రామీణ సమాజ శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దీనిని సమాజ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు.


* భూమి మీద ఆధారపడి జీవించే ప్రజల సామాజిక స్థితిగతులను మెరుగుపరచడమే గ్రామీణ సమాజ శాస్త్ర ప్రధాన ఉద్దేశం.  - శాండర్‌ సన్‌


గ్రామీణ సామాజిక సంబంధాల క్రమబద్ధ విజ్ఞానమే గ్రామీణ సమాజ శాస్త్రం   - లిన్‌ స్మిత్‌


గ్రామీణ ప్రజల సంబంధం, గ్రామీణ వాతావరణం గురించి అధ్యయనం చేసేదే గ్రామీణ సమాజ శాస్త్రం.   - బెర్ట్రాండ్‌ 


సామూహిక సంబంధాల భావనకు ప్రాముఖ్యతనిస్తూ గ్రామవాసుల సామూహిక సంబంధాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే గ్రామీణ సమాజ శాస్త్ర ముఖ్య ఉద్దేశం.  - ఎవరెట్‌ రోజర్స్‌


గ్రామీణ సమాజం గురించి అధ్యయనం చేసేదే గ్రామీణ సమాజ శాస్త్రం.  - ఎ.ఆర్‌. దేశాయ్‌


గ్రామీణ సంస్థల సమూహాల వర్ణన, పరిశీలన. - వెల్సన్‌


గ్రామీణ జనాభా, సామాజిక వ్యవస్థ, సామాజిక ప్రక్రియలు లాంటి గ్రామీణ జీవితానికి సంబంధించి అధ్యయన శాస్త్రమే గ్రామీణ సమాజ శాస్త్రం. - ఎఫ్‌.ఎన్‌. చాప్లిన్‌


ఈ నిర్వచనాల ఆధారంగా గ్రామీణ సమాజశాస్త్రం అంటే గ్రామీణ సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. గ్రామీణ జీవితానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలు, సంస్కృతి, సంస్థల సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. గ్రామీణ ప్రగతికి సూచనలిస్తుంది. సమస్యలకు పరిష్కార మార్గాన్ని వివరిస్తుంది.

 


 

రచయిత: శంకర్‌రెడ్డి 

Posted Date : 21-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌