• facebook
  • whatsapp
  • telegram

జాతీయోద్యమ రెండో దశ (1905-1919)

స్వరాజ్యమే లక్ష్యం.. సమరమే మార్గం!    

  పాలనాపరమైన సంస్కరణలు చాలంటూ మితవాదులు నివేదన, ప్రార్థన, నిరసన పద్ధతుల్లో సాగితే: స్వరాజ్య సాధనే లక్ష్యంగా ఆంగ్లేయుల పాలనను అంతం చేయాలని అతివాదులు స‌మ‌ర‌శీల వాదాన్ని ఆశ్రయించారు. పాశ్చాత్య విద్యతో ప్రభావితులైన ఎందరో నాయకులు జాతీయోద్యమం రెండోదశలో దోపిడీ విధానాలను ప్రతిఘటించారు. బ్రిటిషర్లను తరిమికొడితేనే భారతీయులకు భవిష్యత్తు ఉంటుందని నినదించి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. కీలకమైన ఆ పరిణామాలను, నాటి ముఖ్య నాయకుల వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  

భారత జాతీయ కాంగ్రెస్‌ 1885లో స్థాపితమైనప్పటి నుంచి మొదటి రెండు దశాబ్దాలు మితవాద నాయకుల ప్రాబల్యంలో నడిచింది. డిమాండ్ల కోసం వారు చట్టబద్ధ విధానాలను అనుసరించడం వల్ల సాధించింది చాలా తక్కువ. ఈ దశలో లక్ష్యాలను చేరుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని అందులోని వారే విమర్శించడం మొదలుపెట్టారు. తర్వాత కాలంలో ఆ విధంగా నిరసించే వారి సంఖ్య ఎక్కువైంది. మితవాద నాయకుల సిద్ధాంతాలు, విధానాలతో విభేదించిన వారినే అతివాదులు లేదా సమరశీల జాతీయవాదులు అంటారు. వీరి లక్ష్యం ‘స్వరాజ్యం’ లేదా ‘స్వపరిపాలన’. ప్రత్యక్ష సామూహిక రాజకీయ ఉద్యమాల ద్వారా స్వరాజ్యం సాధించడానికి వారు ప్రయత్నించారు. కాంగ్రెస్‌లో ఈ అతివాద పక్షం ఆవిర్భవించడానికి అనేక కారణాలున్నాయి.

  ఉదారవాద సిద్ధాంతాలు/విధానాల వల్ల మితవాదులు వారి డిమాండ్ల సాధనలో విఫలమయ్యారు. దాంతో మితవాదుల కార్యాచరణ పట్ల కాంగ్రెస్‌లోని ఒక వర్గం, సామాన్య ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ప్రజలు మితవాద నాయకులపై పెంచుకున్న భ్రమలు తొలగిపోయాయి. డిమాండ్లు సాధించుకోవాలంటే కేవ‌లం వార్షిక సమావేశాలు చాలవని, నిరంతర రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాలని, అందుకు జన సామాన్యాన్ని సంసిద్ధం చేయాలని మితవాదులను వ్యతిరేకించేవారి ఆలోచన. 

  బ్రిటిషర్ల దుష్ట పాలన, దోపిడీ విధానాలే దేశ దారిద్య్రానికి కారణమని, రాజకీయంగా చైతన్యవంతమైన భారతీయులకు తెలిసివచ్చింది. 1896 నుంచి 1900 వరకు దేశంలో విలయతాండవం చేసిన భీకర కరవు లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. దాదాభాయ్‌ నౌరోజీ గ్రంథం ‘పావర్టీ అండ్‌ అన్‌-బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’, రమేష్‌చంద్ర దత్త గ్రంథం ‘ఎకనామిక్‌ హిస్టరీ అఫ్‌ ఇండియా’, రనడే వ్యాసాలు ఆంగ్లేయులు భారతదేశ సంపదను ఏ విధంగా ఇంగ్లండ్‌కు తరలిస్తున్నారో చక్కగా వివరించి ప్రజలను మేలుకొలిపాయి. తెల్లవారు భారతీయులను క్రూరంగా అణిచివేస్తున్న తీరును పత్రికలు ప్రచారం చేశాయి. ప్రజలు క్రమక్రమంగా బ్రిటిష్‌ పాలన నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు.

  19వ శతాబ్దం చివరి భాగానికి ఆంగ్ల విద్యను అభ్యసించినవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పాశ్చాత్య విద్య వల్ల పాశ్చాత్య ఆలోచనలు, ప్రజాస్వామం, వ్యక్తి స్వేచ్ఛ, జాతీయవాదం లాంటి భావాలు సమాజంలో వ్యాపించాయి. ఇంగ్లిష్‌ విద్యను నేర్చుకున్న భారతీయ విద్యావంతుల్లో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగి నిస్పృహ ఆవహించింది. అలాంటి వారే సమరశీల రాజకీయవాదాన్ని అనుసరించారు.

 

బ్రిటిష్‌ అణిచివేత పద్ధతులు

  బ్రిటిషర్లు తీసుకొచ్చిన అనేక చట్టాలను ప్రజలు వ్యతిరేకించారు. జాతీయవాదాన్ని ప్రోత్సహించిన తిలక్‌ లాంటి వారిని జైలుకు పంపడాన్ని నిరసించారు. .ఉదా: జాతీయవాదాన్ని ప్రోత్సహించడాన్ని నేరంగా పరిగణించే చట్టం (1898), పత్రికల స్వేచ్ఛను నిరోధించే భారత అధికార రహస్యాల చట్టం (1904).

  సాంఘిక సంస్కరణల ఉద్యమాల వల్ల భారతీయుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరిగాయి. తమ శక్తి సామర్థ్యాలపై నమ్మకం కుదిరింది. తమ దేశాన్ని తామే పాలించుకోగలమని గుర్తించారు. ఈ ప్రక్రియలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులను ఎదిరించగలమనే ధైర్యం వచ్చింది. భారతీయుల దురవస్థకు పరిష్కారం కూడా వారి చేతిలోనే ఉందనీ, ప్రజలు సంఘటితంగా, ధైర్యంగా ప్రతిఘటించాలని పలువురు బోధించారు. 1896లో ఇటలీ సైన్యాన్ని ఇథియోపియన్లు ఓడించడం, 1905లో ఆసియాలో చిన్న దేశమైన జపాన్‌ అతిపెద్దదైన రష్యాపై గెలుపు సాధించడం లాంటి అంతర్జాతీయ సంఘటనలు కూడా ధైర్యాన్ని పెంపొందించాయి. యూరోపియన్లను ఓడించలేమనే భయం, భ్రమలు భారతీయుల్లో తొలగిపోయాయి. ఐరోపావాసుల సైనికాధిపత్య సిద్ధాంతాన్ని ఎదిరించగలిగిన సత్తాను సమకూర్చాయి. ఐర్లాండ్, రష్యా, ఈజిప్టు, టర్కీ, చైనాలో తిరుగుబాట్లు కూడా బలాన్ని ఇచ్చాయి. 

  జాతీయోద్యమ ప్రారంభం నుంచి దేశంలో కొందరు అతివాద భావజాలం కలిగిన నాయకులుగా ఎదిగారు. మహారాష్ట్రలో విష్ణుశాస్త్రి చిప్లున్కర్, బాలగంగాధర్‌ తిలక్‌; బెంగాల్‌లో రాజనారాయణ్‌ బోస్, బిపిన్‌ చంద్రపాల్, అరబిందో ఘోష్‌; పంజాబ్‌లో లాలాలజపతి రాయ్, అజిత్‌సింగ్‌ తదితరులు వారిలో ఉన్నారు. తిలక్, లజపతి రాయ్, బిపిన్‌ చంద్ర పాల్‌లు ‘లాల్‌-బాల్‌-పాల్‌’ త్రయంగా ప్రసిద్ధికెక్కారు.

 

బాలగంగాధర్‌ తిలక్‌ (1856-1920): భారత రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలిగిన నాయకుడు తిలక్‌. ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులను చేసి వారిలో జాతీయ భావాన్ని రగిలించి, కార్యోన్ముఖులను చేస్తేనే భారతీయులకు భవిష్యత్తు ఉంటుందని ఆయన బలంగా నమ్మాడు. అందుకోసం కేసరి, మరాఠీ పత్రికలను స్థాపించి, వాటి ద్వారా బ్రిటిషర్ల దుష్పరిపాలనపై విమర్శనా వ్యాసాలు రాశాడు.. 1893లో గణపతి ఉత్సవాలను, 1895లో శివాజీ ఉత్సవాలను  నిర్వహించి మహారాష్ట్ర యువతలో జాతీయతను, దేశాభిమానాన్ని పెంపొందింపజేశాడు. వందేమాతరం, హోమ్‌రూల్‌ ఉద్యమాల్లో ముఖ్య భూమిక పోషించాడు. 1916లో తిల‌క్ మొదటిసారిగా హోంరూల్ ఉద్య‌మాన్ని ప్రారంభించ‌గా, ఆ త‌ర్వాత దాన్ని అనిబిసెంట్ దేశ‌వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువ‌చ్చారు.

‘స్వాతంత్య్రం నా జన్మ హక్కు’ అని నినదించాడు. ‘గీతా రహస్యం’, ‘ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ ఆర్యన్స్‌’ అనే గ్రంథాలు రాశాడు. జాతీయోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన ధీరోదాత్తుడు తిలక్‌.

 

లాలాలజపతి రాయ్‌ (1865-1928): ఈయన ‘పంజాబ్‌ కేసరి’గా ప్రసిద్ధి చెందాడు. విద్యావేత్త, ఆర్యసమాజ్‌ సభ్యుడు, గొప్ప వక్త, నిష్కళంక దేశభక్తుడు. ఇటాలియన్‌ విప్లవ వీరులు మాజిని, గారిబాల్డి, మరాఠా యోధుడు శివాజీల నుంచి ప్రేరణ పొందాడు. వారి జీవిత చరిత్రలు రాశాడు. కాంగ్రెస్‌ మితవాద సిద్ధాంతాలతో, స్వరాజ్యం సాధించలేమని, ఆంగ్లేయులను ఎదుర్కోడానికి సమరశీల రాజకీయాలు అవసరమని భావించాడు. ఈయన రాసిన ముఖ్య గ్రంథం ‘అన్‌ హ్యాపీ ఇండియా’. వందేమాతరం, సహాయనిరాకరణ, సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమాల్లో గణనీయ పాత్ర పోషించాడు. సైమన్‌ కమిషన్‌ లాహోర్‌ను సందర్శించినప్పుడు జరిపిన ఉద్యమంలో సాండర్స్‌ అనే పోలీస్‌ అధికారి లాఠీ దెబ్బల వల్ల రాయ్‌ మరణించాడు.

 

బిపిన్‌ చంద్రపాల్‌ (1858-1932): ఈయన ప్రముఖ జాతీయవాది. బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా దేశం నలుమూలలా పర్యటించి తన ఉత్తేజకరమైన ప్రసంగాలతో స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు. ‘వందేమాతరం’ పత్రికలో యువతలో జాతీయ భావాలను పెంపొందించే వ్యాసాలు రాశాడు. ‘ఇండిపెండెంట్‌’ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. మితవాదుల శాంతియుత విధానాలను దుయ్యబట్టి, భారతీయులు దేశ దాస్య విముక్తికి ఎంతటి త్యాగాలకైనా సంసిద్ధంగా ఉండాలని ప్రబోధించాడు.

 

అరబిందో ఘోష్‌ (1872-1950): ఈయన సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు. వందేమాతర ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించారు. ‘ది లైఫ్‌ డివైన్‌’, ‘ది సింథసిస్‌ ఆఫ్‌ యోగ’, ‘న్యూ ల్యాంప్స్‌ ఫర్‌ ది ఓల్డ్‌’ లాంటివి ఆయన  ముఖ్య గ్రంథాలు. ఈయనను బ్రిటిష్‌ ప్రభుత్వం ఆలీపుర్‌ బాంబు కేసులో ఇరికించి హింసించింది. ఆ కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత పాండిచ్చేరి చేరి ఆశ్రమం నిర్మించుకొని ఆధ్యాత్మిక జీవితం గడిపారు.

 

అతివాదుల సిద్ధాంతాలు

  అతివాదులు పరాయి పాలనను పూర్తిగా నిరసించారు. మితవాదుల ఉదారవాద సిద్ధాంతాలు, పద్ధతులను వ్యతిరేకించారు. ప్రజల శక్తి సామర్థ్యాలపై, త్యాగ గుణంపై అపార నమ్మకం ఉంచారు. భారతీయులు తమ రాజకీయ దాస్య విముక్తి కోసం తామే కార్యక్రమాలను రూపొందించుకోవాలని బోధించారు. దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వరాజ్య సాధనే జాతీయోద్యమ లక్ష్యమని విస్పష్టంగా ప్రకటించారు. వీరి పద్ధతి విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ, శాంతియుత ప్రతిఘటన. 

   ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా లార్డ్‌ కర్జన్‌ 1905లో బెంగాల్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతో దేశంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న సమరశీల రాజకీయ భావనలు ఒక్కసారిగా విస్ఫోటం  చెందాయి. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమమే  వందేమాతర ఉద్యమంగా గొప్ప ప్రజా విప్లవంగా మారి దేశమంతా వ్యాపించింది. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌