• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో సామాజిక విధానం - అభివృద్ధి

సంక్షేమ సమానత్వాలే లక్ష్యాలు!

సమాజంలో క్రమానుగతంగా వస్తున్న మార్పులు, పరిణామాలను సామాజిక విధానం ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వాలు రూపొందించే పాలసీలు, అమలుచేసే సంక్షేమ పథకాల్లో అది కనిపిస్తుంది. బ్రిటిష్‌ పాలనకు ముందు మన దేశం స్వయంసమృద్ధ ఆర్థిక వ్యవస్థగా వర్ధిల్లింది. ఆంగ్లేయుల  వలస రాజ్యంగా మారిన తర్వాత పెను మార్పులకు గురైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమై, కులవృత్తుల వారు పట్టణాలకు వలస వెళ్లి పరిశ్రమల్లో కార్మికులుగా మారిపోయారు. పట్టణీకరణకు ప్రాధాన్యం పెరిగింది. ఇందుకనుగుణంగా బ్రిటిష్‌ కాలంలో, స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాల సామాజిక విధానాలు మారుతూ వచ్చాయి. క్రమంగా హక్కులకు ప్రాధాన్యం పెరిగింది. ఈ సంఘటనల క్రమాన్ని, వాటి ప్రభావాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. ప్రపంచ మార్పులకు అనుగుణంగా భారత్‌లోని ప్రధాన రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను అర్థం చేసుకోవాలి.


  చారిత్రక అభివృద్ధి అధ్యయనానికి, గత, ప్రస్తుత కాలాల్లో మార్పులను, పురోగతిని అర్థం చేసుకోవడానికి సామాజిక విధానం ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. సామాజిక విధాన చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు పారిశ్రామిక విప్లవం గురించి తప్పకుండా చర్చించాలి. 18వ శతాబ్దం చివర్లో, 19వ శతాబ్దం మొదట్లో పట్టణ ప్రాంత పరిశ్రమల్లో కార్మికుల అవసరం పెరగడంతో ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. పారిశ్రామికీకరణ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలు, వారి సమస్యలపై ఈ వలసలు ప్రభావం చూపాయి. తద్వారా కొత్త డిమాండ్లు, సవాళ్లు మొదలయ్యాయి. భూస్వామ్యవాదం నుంచి పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందినప్పుడు సామాజిక విధానం మార్పులకు గురైంది. సామాజిక శాస్త్రవేత్త ‘డీన్‌’ ప్రకారం భూస్వామ్యవాదం నుంచి పెట్టుబడిదారీ విధానానికి మార్పు విభిన్న ప్రక్రియల్లో జరిగింది. ఇటీవలి కాలంలో మధ్యతరగతి సమాజం పుట్టుకొచ్చింది.

 


భారతీయ సామాజిక విధానాల ఆవిర్భావం: పరాంజిపే (1990) ప్రకారం భారతదేశంలో సామాజిక సంక్షేమ అభివృద్ధికి దోహదపడే సామాజిక సేవలను ప్రభుత్వం పరిమితంగానే అందించగలుగుతోంది. బ్రిటిషర్లకు వలస రాజ్యంగా భారత్‌ మారక పూర్వం ఇక్కడి సంక్షేమం మూడు విధాలుగా ఉండేదని మజుందార్‌ పేర్కొన్నారు. అవి: 1) విస్తృత కుటుంబాలు 2) గ్రామాలు 3) కులవర్గాలు

 


బ్రిటిష్‌ కాలంలో మన దేశంలో పట్టణీకరణ, పారిశ్రామికీకరణ లాంటి మార్పులు వచ్చాయి. అయితే ఇవి కొన్ని సమూహాలకే పరిమితమయ్యాయి. వలసవాదులు నెలకొల్పిన పరిశ్రమలు, సైన్యం, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వడంతో అత్యంత బలహీనవర్గాల సామాజిక పురోగమనానికి దారితీసింది. ఈ పరిణామంతో కులవృత్తులపై ఆంక్షల కాఠిన్యం సడలింది. మరోవైపు జజ్‌మానీ వ్యవస్థ పారిశ్రామిక వస్తువులను పంపిణీ చేసింది. దీంతో స్థానిక కళాకారులు ఉపాధి కోల్పోయి కార్మిక వర్గంలో చేరారు. భారతదేశ వారసత్వ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చే విధంగా 1793లో వలస ప్రభుత్వం చట్టాలు చేసి అమలు చేసినప్పటికీ ఆచరణలో విఫలమయ్యాయి. 1923లో కార్మికుల నష్టపరిహార చట్టం ద్వారా పారిశ్రామిక, పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల సామాజిక భద్రతను ప్రవేశపెట్టారు. ఆ విధంగా భారతదేశంలో ప్రభుత్వ సంక్షేమ యంత్రాంగం ద్వారా పారిశ్రామికీకరణ ప్రారంభమైంది.


స్వాతంత్య్రానంతరం సామాజిక సంక్షేమ విధానం అనేది ప్రభుత్వ క్రియాశీల ప్రమేయంతో మొదలైంది. 1950,  జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చాక భారతదేశ సంక్షేమ వ్యవస్థ, సంస్థాగత నిర్మాణాలు ప్రజాస్వామ్య ఉద్యమంగా మార్పు చెందాయి. ఉదారవాద ప్రజాస్వామ్యంలో భూ సంస్కరణలు, విద్య, ఆరోగ్యం, గ్రామీణ మౌలిక అంశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిచ్చాయి. భారతీయ సమాజ సంక్షేమ క్రమాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు రక్షణ కల్పించాలని రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లోని 58వ నిబంధన ద్వారా ప్రభుత్వాన్ని నిర్దేశించింది. జీవించే హక్కు, బాలల హక్కులు దుర్వినియోగం కాకుండా సంరక్షించే హక్కు, దోపిడీని నిరోధించే హక్కు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా విద్య, పని హక్కు, పని ప్రాంతంలో ప్రసూతి ఉపశమనం పొందే హక్కు, 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ విద్య, బలహీనవర్గాలకు విద్య, ఆర్థిక ప్రయోజనాలు పొందే హక్కు లాంటివన్నీ ఇందులో భాగమే.

 


దేశ ప్రజల సంక్షేమ సాధనకు సరైన ప్రణాళిక అవసరమని భావించిన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1950, మార్చి 15న జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. సోవియట్‌ యూనియన్‌ ఆర్థికాభివృద్ధి నమూనాలో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించారు. ప్రణాళికా సంఘం సామ్యవాద విధానంలో జాతీయాభివృద్ధి జరిగే విధంగా నాలుగు దీర్ఘకాలిక లక్ష్యాలను ఎంచుకుంది. అవి-


1) ఉత్పత్తిని గరిష్ఠ స్థాయిలో పెంచి, అత్యధిక స్థాయిలో జాతీయ మూలధన ఆదాయాన్ని సాధించడం.


2) పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించడం.


3) ఆదాయ అసమానతలను తగ్గించడం/ నిర్మూలించడం.


4) సమసమాజ స్థాపన, సమన్యాయం కల్పించి దోపిడీని నిరోధించడం.


ఈ లక్ష్యాలను ప్రతి పంచవర్ష ప్రణాళికలోనూ పేర్కొన్నారు. దేశ ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ ప్రైవేటు సంస్థల అధికారాన్ని, పరిశ్రమల అనుమతులు, దిగుమతులను ప్రభుత్వం నియంత్రిస్తూ వచ్చింది.


ప్రణాళికా సంఘం సిఫార్సు మేరకు 1953, ఆగస్టులో ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలో భాగంగా సెంట్రల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు (సీఎస్‌డబ్ల్యూబీ)ను ప్రారంభించింది. ఈ బోర్డు ఏర్పాటు సామాజిక సంక్షేమ రంగంలో ఒక మైలురాయి. ఇది సంక్షేమ సేవల అభివృద్ధిలో స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించింది. అణగారిన పేదల సంక్షేమం, విదేశీ పెట్టుబడులను నియంత్రించడం ద్వారా ఆర్థిక వ్యవస్థపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటంతో పాటు పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం స్థిరమైన ధరల నియంత్రణను పాటించింది. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ఆవకశ్యకతల ప్రభావంతో 1991లో నూతన ఆర్థిక విధానం అమల్లోకి వచ్చింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు తలుపులు తెరచుకున్నాయి. ఈ కొత్త ఆర్థిక విధానాలు 8వ ప్రణాళిక (1992-97), 9వ పంచవర్ష ప్రణాళికల్లో (1997-2002) ప్రతిఫలించాయి. ఫలితంగా దేశ ఆర్థిక ప్రణాళిక దిశ మారింది. మార్కెట్‌పై ప్రభుత్వ రంగం గుత్తాధిపత్యం చెరిగిపోయింది. 2004 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హక్కుల ఆధారిత విధానం వచ్చింది. 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం-2009లో విద్యా హక్కు చట్టం, ఆహారపు హక్కు హామీ చట్టాలే ఇందుకు ఉదాహరణలు.  

 

రచయిత: వట్టిపల్లి శంకర్ రెడ్డి

Posted Date : 19-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌