• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ

     మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? ఇంతకు ముందు ఈ నిర్మాణం ఏవిధంగా ఉండేది? వివిధ సంస్కృతులతో విస్తరించి, భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ భూభాగంలో ఏకత్వాన్ని సాధించడంలో ఎలాంటి కృషి జరిగింది..? ఈ అంశాలను పాలిటీ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


    స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో రెండు రాజకీయ విభాగాలు ఉండేవి. మొదటిది బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలోని ప్రావిన్సులు. రెండోది బ్రిటిష్‌ సర్వసమున్నతాధికారం కింద స్వదేశీ రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు. స్వాతంత్య్రానంతరం పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు.
     భారత యూనియన్‌ కంటే భారత భూభాగం అనే భావన చాలా విస్తృతమైంది. యూనియన్‌లో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. కానీ భారత భూభాగంలో రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వం ఆర్జించిన ఇతర ప్రాంతాలూ ఉంటాయి. కేంద్రంతో రాష్ట్రాలు అధికారాలను పంచుకుంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి.

రాజ్యాంగం ప్రారంభంలో..
    1950 జనవరి, 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి మన దేశంలోని భూభాగాలను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేశారు.
1) పార్ట్‌ - A రాష్ట్రాలు: గతంలో బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలుగా ఉన్నవాటిని ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి అసోం, బిహార్‌, బాంబే, మధ్యప్రదేశ్‌, మద్రాస్‌, ఒడిశా, పంజాబ్‌, యునైటెడ్‌ ప్రావిన్స్‌, పశ్చిమ్‌బంగ.
2) పార్ట్‌ - B రాష్ట్రాలు: శాసనసభలు లేని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి జమ్మూ-కశ్మీర్‌, మధ్యభారత్‌, హైదరాబాద్‌, మైసూర్‌, పాటియాలా అండ్‌ తూర్పు పంజాబ్‌, రాజస్థాన్‌, సౌరాష్ట్ర, ట్రావెన్‌కోర్‌ కొచ్చిన్‌, వింధ్యప్రదేశ్‌.
3) పార్ట్‌ - C రాష్ట్రాలు: గతంలో చీఫ్‌ కమిషనరేట్‌ ప్రాంతాలుగా ఉన్నవాటిని, కొన్ని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 10. అవి అజ్మీర్‌, భోపాల్‌, బిలాస్‌పూర్‌ కూంచ్‌, కూచ్‌-బిహార్‌, కూర్గ్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కచ్‌, త్రిపుర, మణిపూర్‌.
4) పార్ట్‌ - D రాష్ట్రాలు: ఈ విభాగంలో అండమాన్‌ నికోబార్‌ దీవులను చేర్చారు.


రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌
1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని ఉద్యమించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కర్ణాటకలోని బెల్గాంను సందర్శించినప్పుడు ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో తగిన సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం 1953 డిసెంబరులో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. దీనికి ఫజల్‌ అలీ ఛైర్మన్‌గా, కె.ఎం.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా వ్యవహరించారు. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.


సిఫారసులు:
* పార్ట్‌ - A, B, C, D లుగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ రద్దుచేసి వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్‌ వ్యవస్థీకరించాలి.
* ఒకే భాష - ఒకే రాష్ట్రం అనే వాదన సమంజసం కాదు.
* దేశాన్ని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలి.
* పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయ మండళ్లు (Zonal Councils) గా ఏర్పాటుచేయాలి.
* దిల్లీలో జాతీయ మైనార్టీ భాషల కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలి.


పార్లమెంటు - రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం
ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫారసుల్లో కీలకమైన వాటిని 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత పార్లమెంటు ఆమోదించింది. దీంతో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఏర్పడి, మన దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి.
1956లో ఏర్పాటైన రాష్ట్రాలు: అసోం, బెంగాల్‌, బిహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌, కేరళ, మైసూర్‌, ముంబయి, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌.
1956లో ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, అమోని, మినికాయ్‌, లాక్‌దీవులు, అండమాన్‌, నికోబార్‌ దీవులు, త్రిపుర, మణిపూర్‌.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌