• facebook
  • whatsapp
  • telegram

సుప్రీంకోర్టు

దేశానికి ధర్మపీఠం!

  దేశానికి అత్యున్నత న్యాయస్థానం. న్యాయం కోసం అందరూ ఆశ్రయించే ఆఖరి స్థానం. రాజ్యాంగం అమలులో వ్యక్తులు, వ్యవస్థలు అతిక్రమణలకు పాల్పడితే పర్యవేక్షించి పరిరక్షించే ప్రతిష్ఠాత్మక పీఠం. పౌరుల హక్కులకు సంపూర్ణ భద్రతనిచ్చే సమున్నత వేదిక. అక్కడ వచ్చే తీర్పు తిరుగులేనిది, విలువైనది, విశిష్టమైనది. ఆ ఉతృష్ట ధర్మక్షేత్రం రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. ప్రభుత్వాలు లెవనెత్తే విభేదాలను విచారిస్తుంది. రాష్ట్రపతికి న్యాయసలహాదారుగా వ్యవహరిస్తుంది. ఆ వివరాలన్నింటినీ ఆర్టికల్స్‌తో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. రాజ్యాంగం ప్రకారం పూర్తి స్వయంప్రతిపత్తితో ఏర్పాటైన ఉన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు దేశంలోని ప్రతి ఒక్కరికి శిరోధార్యం. పార్లమెంటు రూపొందించే శాసనాలు, కార్యనిర్వాహక వర్గం అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగం ప్రకారం కొనసాగే విధంఆ పర్యవేక్షించే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టుకు అప్పగించారు.

 

చారిత్రక నేపథ్యం

భారతదేశంలో న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టింది వారన్‌ హేస్టింగ్స్‌. దాన్ని అభివృద్ధిపరిచి న్యాయవ్యవస్థ పితామహుడిగా ప్రసిద్ధి చెందింది కారన్‌ వాలీస్‌. ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో 1773లో రూపొందించిన రెగ్యులేటింగ్‌ చట్టం ప్రకారం 1774, మార్చి 16న కలకత్తాలోని ఫోర్ట్‌ విలియంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. తొలి ప్రధాన న్యాయమూర్తిగా సర్‌ ఎలిజా ఇంఫే, ఇతర న్యాయమూర్తులుగా సీజర్‌ లైమెస్టర్, జాన్‌హైడ్, రాబర్ట్‌ ఛాంబర్స్‌ నియమితులయ్యారు. ఈ కోర్టును భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ఫెడరల్‌ కోర్టుగా మార్పు చేసి 1937లో దిల్లీలో ఏర్పాటు చేశారు. ఫెడరల్‌ కోర్టులో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సర్‌ మారిస్‌ గ్వేయర్‌ నియమితులయ్యారు. స్వాతంత్య్రానంతరం ఈ ఫెడరల్‌ కోర్టు 1950, జనవరి 28 నుంచి దిల్లీ కేంద్రంగా సుప్రీంకోర్టుగా మారింది. ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులతో అత్యున్నత న్యాయవ్యవస్థ ప్రస్థానం ప్రారంభమైంది. తొలి చీఫ్‌ జస్టిస్‌గా హరిలాల్‌ జె కానియా వ్యవహరించారు.

 

* మనదేశం ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. దాని ప్రకారం జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దానికి దిగువన రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, వాటికి దిగువన జిల్లా స్థాయిలో సబార్డినేట్‌ కోర్టులు కొనసాగుతున్నాయి. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి.

 

సుప్రీంకోర్టు ఏర్పాటుకు కారణాలు: * భారత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం.

* ప్రాథమిక హక్కులను సంరక్షించడం.

* భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడం.

* రాజ్యాంగానికి అర్థ వివరణ ఇవ్వడం, వ్యాఖ్యానించడం.

 

రాజ్యాంగ వివరణ: రాజ్యాంగం Vవ భాగంలోని 124 - 147 మధ్య ఆర్టికల్స్‌ సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, నియామకం, అధికారాలు, విధుల గురించి వివరిస్తున్నాయి.

 

ఆర్టికల్‌ 124: సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్మాణం గురించి తెలియజేస్తుంది.

 

ఆర్టికల్‌ 124(1): దీని ప్రకారం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి పార్లమెంటు కింది సంవత్సరాల్లో చట్టాలను రూపొందించింది.

 

సంవత్సరం    

న్యాయమూర్తుల సంఖ్య

(ప్రధాన, ఇతర న్యాయమూర్తులు)

1950 1 + 7
1956  1 + 10
1960 1 + 13
1978 1 + 17
1986  1 + 25
 2009   1 + 30
 2019   1 + 33

 

ఆర్టికల్‌ 124(3): న్యాయమూర్తుల నియామకానికి ఉండాల్సిన అర్హతలు:

* భారతీయ పౌరుడై ఉండాలి.

* రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి.

* హైకోర్టు న్యాయమూర్తిగా అయిదేళ్లు లేదా హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.


ఆర్టికల్‌ 124(2): న్యాయమూర్తుల నియామకం: సాధారణంగా ప్రధాని నేత్పత్వంలోని కేంద్ర మంత్రిమండలి సిఫార్సుల మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. రాష్ట్రపతి సంతకం, సీలు వేసిన వారెంటు ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి.

 

న్యాయమూర్తుల నియామక ప్రక్రియ - సుప్రీంకోర్టు విభిన్న తీర్పులు

 

ఎస్‌.పి.గుప్తా Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1982): న్యాయమూర్తుల నియామకం సమయంలో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను రాష్ట్రపతి సంప్రదించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని ‘ఫస్ట్‌ జడ్జస్‌ కేసు’గా పేర్కొంటారు.

 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1993): న్యాయమూర్తుల నియామకం సమయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా కొలిజీయంను సంప్రదించాలని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి మరో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులను సంప్రదించి తన అభిప్రాయాన్ని తెలియజేయాలని పేర్కొంది. దీన్ని ‘సెకండ్‌ జడ్జస్‌ కేసు’గా పేర్కొంటారు.

1998లో నాటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ కొలీజియం వ్యవస్థపై ఆర్టికల్‌ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహా కోరారు. 1999లో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొలీజియం వ్యవస్థకు సంబంధించి వివరణ ఇచ్చింది. దాని ప్రకారం..

* కొలీజియం అంటే ప్రధాన న్యాయమూర్తితో (సీజేఐ) పాటు మరో నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల సముదాయం. సాధారణంగా కొలీజియం ఏకాభిప్రాయం ఆధారంగా తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. 

* రాష్ట్రపతి కొలీజియం సలహాను తప్పనిసరిగా పాటించాలి. కొలీజియంను సంప్రదించిన తర్వాత న్యాయమూర్తులను నియమించాలి.

 

జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్‌ (NJAC) :  డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 120వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం జడ్జస్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ (JAC) ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది.

  నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 120వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించి, దాన్ని 121వ రాజ్యాంగ సవరణ బిల్లుగా రూపొందించింది. దీన్ని న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్‌ (ఎన్‌జేఏసీ) ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీన్ని పార్లమెంటు 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించింది. తర్వాత దేశంలోని 15 రాష్ట్రాలు కూడా అంగీకారాన్ని తెలిపాయి. తర్వాత అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అధికార ముద్ర వేయడంతో అది ‘99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014’గా మారింది. ఎన్‌జేఏసీ 2015, ఏప్రిల్‌ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం న్యాయమూర్తుల నియామకం సమయంలో రాష్ట్రపతి కొలీజియంకు బదులుగా ఎన్‌జేఏసీని సంప్రదించాల్సి ఉంటుంది.

 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 2015: ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లుబాటు కాదని, అది రాజ్యాంగ విరుద్ధమని 2015, అక్టోబరు 16న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీని ఫలితంగా న్యాయమూర్తుల నియామకం సమయంలో రాష్ట్రపతి ఎన్‌జేఏసీకు బదులుగా తిరిగి సీజేఐ నేతృత్వంలోని కొలీజియంనే సంప్రదించాలి.

 

ప్రధాన న్యాయమూర్తి నియామకం: * సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమిస్తారు. 1950 నుంచి 1973 వరకు సీనియర్‌ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించే విధానం కొనసాగింది. 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో సీనియర్‌ న్యాయమూర్తులైన జె.ఎం.షేలట్, ఎ.ఎన్‌.గ్రోవర్, కె.ఎస్‌.హెగ్డేలను విస్మరించి 4వ స్థానంలో ఉన్న ఎ.ఎన్‌.రే ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 

* 1977లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వ కాలంలో సీనియర్‌ న్యాయమూర్తి అయిన హెచ్‌.ఆర్‌.ఖన్నాను విస్మరించి ఎమ్‌.హెచ్‌.బేగ్‌ను సీజేఐగా నియమించారు.

* 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీనియర్‌ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి.

 

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి:  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 126 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అనుకోని పరిస్థితుల్లో ఖాళీ అయినా, ప్రధాన న్యాయమూర్తి ఏ కారణంతోనైనా తన విధులు నిర్వహించలేకపోయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిని రాష్ట్రపతి ‘తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి’గా నియమిస్తారు.

 

తాత్కాలిక న్యాయమూర్తులు (Adhoc Judges): ఆర్టికల్‌ 127 ప్రకారం సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులను రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. ఈ విధంగా నియమితులైనవారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పొందే అధికారాలు, వేతనాలు లభిస్తాయి. వీరి పదవీ కాలం 2 సంవత్సరాలు.

 

ప్రమాణ స్వీకారం

ఆర్టికల్‌ 124(6) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న పద్ధతిలో కింది విధంగా ప్రమాణస్వీకారం చేస్తారు.

‘రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటానని.. రాజ్యాంగాన్ని, శాసనాలను సంరక్షిస్తానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను పరిరక్షిస్తానని, సంపూర్ణ విశ్వాసంతో, పూర్తి సామర్థ్యంతో ఎలాంటి పక్షపాతం, భయం లేకుండా విధులు నిర్వహిస్తానని’ ప్రమాణం చేస్తారు.

 

రాజీనామా: ఆర్టికల్‌ 124(A) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

 

పదవీకాలం: సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులందరి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.

 

జీతభత్యాలు: ఆర్టికల్‌ 125 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల జీతభత్యాల గురించి వివరిస్తుంది. జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో తప్ప మిగిలిన సందర్భాల్లో వీరి జీతభత్యాలు తగ్గించకూడదు.

* 2018లో చేసిన చట్టం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి నెల వేతనం రూ.2.8 లక్షలు, ఇతర న్యాయమూర్తుల వేతనం రూ.2.5 లక్షలు. ఉచిత నివాసం, వైద్యం, రవాణా, టెలిఫోన్‌ సదుపాయం ఉంటుంది. పదవీ విరమణ అనంతరం వారు చివరిసారిగా పొందిన జీతభత్యంలో 50% నెలసరి పెన్షన్‌గా పొందుతారు.

 

తొలగింపు ప్రక్రియ

  అవినీతి, అసమర్థత, దుష్ప్రవర్తన వంటి కారణాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తొలగించవచ్చు. వీరిని తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ అభిశంసన తీర్మాన నోటీసును లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యుల సంతకాలు, రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు అవసరం. 14 రోజుల ముందస్తు నోటీసుతో తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభాధిపతి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ విచారణ అనంతరం ఇచ్చే నివేదికపై ఆ సభ చర్చించి 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, రెండో సభకు పంపుతారు. అక్కడా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే సదరు న్యాయమూర్తిని రాష్ట్రపతి తొలగిస్తారు. తొలగింపు తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభ తీర్మానాన్ని తిరస్కరిస్తే రెండో సభకు పంపాల్సిన అవసరం లేదు. ఒక సభ ఆమోదించిన తీర్మానాన్ని రెండో సభ తిరస్కరిస్తే తీర్మానం రద్దవుతుంది. మన దేశంలో ఇంతవరకు ఈ తీర్మానం ద్వారా ఎవరినీ తొలగించలేదు. 1991లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామస్వామిపై ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోయింది. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

 

* సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.జె.కానియా.

* సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.

* మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌.

* సీజేఐగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు.

* ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసినవారు జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ (7 సంవత్సరాల 14 రోజులు) 

* తక్కువ కాలం సీజేఐగా పనిచేసినవారు జస్టిస్‌ కె.ఎన్‌.సింగ్‌ (18 రోజులు)

* సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమాబీబీ

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌