• facebook
  • whatsapp
  • telegram

గిరిజన ఉద్యమాలు

తిరగబడిన గిరిజనం!

 

ఆధునిక సమాజానికి దూరంగా, ప్రకృతితో మమేకమై, ఆదిమ సంస్కృతిని ఆచరిస్తూ అడవుల్లో జీవిస్తున్నారు గిరిజనులు. కాల క్రమంలో పరాయి ప్రాంతాల వారి పెత్తనాలు పెరగడంతో అనేక రకాల దోపిడీలకు గురయ్యారు.  ఆ అమాయకుల భూములను ఆక్రమణల పాలయ్యాయి. వారి సంస్కృతి, జీవన విధానాలపై దాడులు జరిగాయి. దాంతో గిరిజనం తిరగబడ్డారు. వెట్టి చాకిరిని వ్యతిరేకించారు. భూస్వాములు, వడ్డీ వ్యాపారులపై పోరాడారు. ఈ దశలో కొందరు గొప్ప నాయకులు వీరిని నడిపించారు. ఆఖరికి నిజాం, స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు దిగి వచ్చాయి. వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాయి. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. 

 

దేశంలోని గిరిజన సమూహాలు ఎక్కువగా అటవీ, పర్వత ప్రాంతాల్లో జీవిస్తున్నాయి. మొత్తం జనాభాలో దాదాపు 7% గిరిజనులు ఉన్నారు. వీరు ఈశాన్య ప్రాంతం, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నివసిస్తున్నారు.  భౌగోళికంగా ఇతరులతో వీరికి సంబంధాలు తక్కువ. వారి ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, జీవన విధానం, ఆచార సంప్రదాయాలన్నీ అటవీ ప్రాంతంలోని అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వాటితో ముడిపడిన వివిధ సమస్యలపై స్వాతంత్య్రానికి ముందూ, తర్వాత గిరిజనులు ఉద్యమాలు చేపట్టారు.

 

అర్థం: గిరిజనులంటే నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను పాటించేవారు. Tribe అనే పదం TRIBUS అనే రోమన్‌ భాషా పదం నుంచి వచ్చింది. రోమన్‌ భాషలో Tribus అంటే అటవీ/కొండ ప్రాంతాల్లో నివసించేవారని అర్థం.

 

గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు: ప్రపంచంలో మొదటిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు జరిపిన సామాజికవేత్త లూయిస్‌ హెన్రీ మోర్గాన్‌. ఆ వివరాలను 1877లో ప్రచురించిన ‘ది ఏన్షియంట్‌ సొసైటీ’ అనే గ్రంథంలో అందించారు. 

 

* భారతదేశంలో గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసిన సామాజికవేత్త వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన గ్రంథం ‘ట్రైబ్స్‌ ఇన్‌ ఇండియా’. 1778 - 1971 మధ్యకాలంలో 70 వరకు గిరిజన ఉద్యమాలు జరిగాయని ఆయన తన పరిశోధనలో వెల్లడించారు.

 

* మనదేశంలో అధిక గిరిజన ఉద్యమాలు ఉత్తర, ఈశాన్య భారత్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవి ప్రధానంగా రెండు రకాలు. 1) స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతుగా 2) వెట్టిచాకిరీ వ్యవస్థ, భూస్వాములు, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా జరిగాయి.

 

* స్వాతంత్య్రం తర్వాత భారత్‌లో గిరిజన ఉద్యమం గురించి గ్రంథస్థం చేసినవారు సంజీవ్‌ బారువా. ఈయన 1) ఇండియా అగైనెస్ట్‌ ఇట్‌సెల్ఫ్‌ - అస్సాం అండ్‌ ద పాలిటిక్స్‌ ఆఫ్‌ నేషనాలిటీ 2) డ్యూరబుల్‌ డిజార్డర్‌ - అండర్‌స్టాండింగ్‌ ద పాలిటిక్స్‌ ఆఫ్‌ నార్త్‌ - ఈస్ట్‌ ఇండియా అనే గ్రంథాలు రచించారు. 

 

గిరిజన ఉద్యమాల వర్గీకరణ: సుర్జీత్‌ సిన్హా అనే సామాజికవేత్త ప్రకారం గిరిజన ఉద్యమాలు 5 రకాలు. 1) జాతిపరమైన తిరుగుబాటు  2) సంస్కరణోద్యమాలు 3) వేర్పాటు ఉద్యమాలు 4) వ్యతిరేక ఉద్యమాలు 5) సంస్కృతి, సంప్రదాయ ఉద్యమాలు.

 

కారణాలు: రామ్‌బర్మన్‌ కమిషన్‌ ప్రకారం ఈ ఉద్యమాలకు 3 ప్రధాన కారణాలున్నాయి. 1) సహజ వనరుల రక్షణ 2) సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టుకోవడం 3) ఉనికిని కాపాడుకోవడం, గుర్తింపు, అభివృద్ధి.

 

మహాపాత్ర అనే సామాజికవేత్త ప్రకారం ఉద్యమాలు 3 రకాలు: 1) ప్రగతి నిరోధక ఉద్యమాలు 2) సంప్రదాయ ఉద్యమాలు 3) ధార్శనిక, కాల్పనిక ఉద్యమాలు ఎస్‌.ఎం. దుబె ప్రకారం: 1) మత, సాంస్కృతిక   ఉద్యమాలు 2) ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు 3) విప్లవాత్మక, విద్రోహకార ఉద్యమాలు.

 

కె.ఎస్‌.సింగ్‌ ప్రకారం 3 దశలు: గిరిజన ఉద్యమాలను ఈయన 3 దశలుగా పేర్కొన్నారు. 1) మొదటి దశ: 1795 - 1860 వరకు 2) రెండో దశ: 1860 - 1920 వరకు 3) మూడో దశ: 1920 - 1947 వరకు.

 

వలస పాలనలో గిరిజన ఉద్యమాలు: 1) చుదార్‌ గిరిజన తిరుగుబాటు (1795-1800), 2) కోల్, భంజీ తిరుగుబాటు (1820), 3) చోటానాగ్‌పుర్‌ తిరుగుబాటు (1920), 4) సంతాల్‌ గిరిజనతిరుగు బాటు (1871-1880), 5) బిర్సాముండా (ముండా -ఓరాన్‌ ఉద్యమం) 1869-1895, 6) అల్లూరి సీతారామరాజు (కోయలు, జాతపుల ఉద్యమం) (1922-1924) 7) కొమురం భీం (గోండ్వానా ఉద్యమం) (1938 - 1944).      

 

స్వాతంత్య్రం తర్వాత..

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాంతీయ ఉద్యమాలు: ఉదా: 1) బిహార్‌లోని ఆదివాసీలు - ఝార్ఖండ్‌ రాష్ట్రం కోసం. 2) బోడో ఉద్యమం - బోడోలాండ్‌ రాష్ట్రం కోసం, 3) గూర్ఖా - గూర్ఖాలాండ్‌ రాష్ట్రం కోసం.

 

గిరిజన వేర్పాటు ఉద్యమం: మిజోరం, నాగాలాండ్, మణిపుర్, త్రిపుర, మేఘాలయలోని ఉద్యమాలు   ఉదా: నాగాలాండ్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం.

 

ఆదీవాసీల భూ సేకరణ చట్టం-1894: ఈ చట్టం ప్రకారం పునరావాసానికి కావాల్సిన చర్యలు చేట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

* గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తి కల్పించిన నాయకులు  బి.ఎస్‌.శర్మ, మేధా పాట్కర్‌

 

తెలంగాణలో గిరిజన తిరుగుబాట్లు: 1) గోండుల తిరుగుబాట్లు, 2) ధర్మారం లంబాడీల తిరుగుబాట్లు, 3) మెండ్రాయి లంబాడీల తిరుగుబాట్లు.

 

1) గోండుల తిరుగుబాట్లు: తాము ఘటోత్కచుడి సంతానం అని గోండుల నమ్మకం. వీరి నివాస స్థలం సంకెనపల్లి (ఆదిలాబాద్‌). వీరి జీవనాధారం పోడు వ్యవసాయం, అటవీ ఫలాల సేకరణ. * 1917లో నిజాం ప్రభుత్వం రిజర్వ్‌ అడవుల చట్టం చేసింది. దీని ప్రకారం గోండుల అధీనంలో ఉన్న భూమిపై ప్రభుత్వానికి హక్కు ఏర్పడి వారు నిర్వాసితులయ్యారు. దీంతో గోండులు సంకెనపల్లి ప్రాంతాన్ని వదిలి సుర్ధాపుర్‌ అనే గూడెంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అడవులను నరికి పొలాలుగా మార్చుకున్నారు. పంట చేతికి వచ్చేసరికి గోండులను అక్కడి నుంచి తరిమివేయడానికి సిద్ధిఖీ, పట్వారి లక్ష్మణ్‌రావు అనే భూస్వాములు వచ్చారు. * కొమురం భీం నేతృత్వంలో ప్రజలు తిరగబడి సిద్ధిఖీపై దాడి చేశారు. దీంతో కొమురం భీంపై హత్యానేరం మోపారు. భీంకు బ్రిటిష్‌ ఇండియాలో సహాయపడిన రహస్య ఉద్యమకారుడు విటోభా. * కొమురం భీం అస్సాం తేయాకు కూలీల తిరుగుబాటులో కూడా పాల్గొని జైలుకు వెళ్లాడు.

 

2) ధర్మారం లంబాడీల తిరుగుబాట్లు: దొడ్డి కొమురయ్య మరణంతో ధర్మారం లంబాడీలు ప్రభావితమయ్యారు. ఈ తండా గిరిజనులు ముఖ్తేదారు విసునూరు రాఘవరావుపై తిరుగుబాటు చేశారు. ముఖ్తేదారు అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి పొందారు. దీంతో ముఖ్తేదారు రాఘవరావు, బాబు దొర (విసునూరు రాంచంద్రారెడ్డి కుమారుడు) సహాయంతో లంబాడీల తిరుగుబాటును అణచివేశారు. తిరుగుబాటు నాయకుల్లో ఒకరైన జాటోతు హమును, అతడి కుమారులను సజీవదహనం చేశారు. మోహనరెడ్డి, నల్ల నరసింహులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

 

3) మొండ్రాయి లంబాడీల తిరుగుబాట్లు: మొండ్రాయి భూస్వామి కడారి నరసింహారావు లంబాడీల భూమిని అక్రమంగా తన పేరు మీద పట్టా చేయించుకున్నాడు. దాంతో స్థానిక లంబాడీలు, పక్క గ్రామ ప్రజలు ఏకమై భూస్వామిపై తిరుగుబాటు చేశారు. గురు దయాళ్‌సింగ్‌ నాయకత్వాన మిలిటరీ సైన్యాలు సాయం రావడంతో ఉద్యమం ఆగిపోయింది.

 

ప్రత్యేక అధ్యయనం

గిరిజన సమస్యలపై అధ్యయనం చేసినవారు హైమన్‌ డార్ఫ్‌. * ఆస్ట్రియాలోని వియన్నాకు చెందిన హైమన్‌ డార్ఫ్‌ పూర్తి పేరు క్రిస్టఫర్‌ వాన్‌ పురర్‌ హైమన్‌ డార్ఫ్‌. ఇతడు మానవ శాస్త్రవేత్త. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌లో ప్రొఫెసర్‌. ఏడో నిజాం కోరికపై ఇతడు గిరిజనుల సమస్యలు, జీవనోపాధులపై అధ్యయనాలు జరిపి, నివేదిక సమర్పించాడు. ఆయన అధ్యయనం ఫలితంగానే గోండులు, కోలామ్‌లు, పర్ధాన్, ఇతర ఆదివాసీ సముదాయాలు తమ భూములపై చట్టబద్ధమైన భూమి హక్కులు పొందారు. * హైమన్‌ డార్ఫ్‌ భారత్‌లో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని గిరిజనులపైన అధ్యయనం చేశాడు. 1939-1995 మధ్య అనేక మానవజాతి సంస్కృతులను అధ్యయనం చేసి అనేక పుస్తకాలు రాశాడు. ఉదా: 1) ద చెంచూస్‌ జంగిల్‌ ఫోక్‌ ఆఫ్‌ డెక్కన్‌ 2) రెడ్డీస్‌ బయోసన్‌ మిల్స్‌ 3) ది రాజ్‌ గోండ్స్‌ ఆఫ్‌ ఆదిలాబాద్, గిరిజన వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలపై నిజాం ప్రభుత్వ సలహాదారుగా హైమన్‌ డార్ఫ్‌ నియమితులయ్యారు. * 1945లో సమగ్ర గిరిజన అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్‌ సిద్ధం చేశాడు. దోపిడీలకు గురవుతున్న గిరిజనులను రక్షించే ‘దస్‌తర్‌ఉల్‌ - అమల్‌’ చట్టాన్ని  హైమన్‌ డార్ఫ్‌ సిఫార్సుల మేరకు నిజాం ప్రభుత్వం రూపొందించింది.

 

సిఫార్సులు: 1) విద్యను అందించాలి. 2) భూములు  గిరిజనులకు అప్పగించాలి. 3) చెంచులు, భిల్లులు, ఆంథ్, గోండు, కొండరెడ్డి, నాయక్‌పోడ్, కోలామ్, ప్రధాన్, తోటి వంటి మొత్తం 9 గిరిజన తెగలను ఎస్టీలుగా గుర్తించారు.

 

గోండులకు సహాయపడిన కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి. గోండులకు సహాయం చేసినందుకుగాను మున్సిఫ్‌ కోర్టు ఎల్లారెడ్డికి ఏడాది జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించింది. * గోండులకు సహాయపడిన పత్రిక గోల్కొండ. కొమురం భీం పోరాటానికి మద్దతు ఇచ్చిన పత్రిక సంపాదకుడు సిరాజుల్‌ హసన్‌ తీర్మాయిజీ.

 

ప్రభుత్వం చేపట్టిన చర్యలు: 1952లో సాముదాయిక గిరిజనుల అభివృద్ధి పథకాలు రూపొందించారు. * 1956లో గిరిజనుల అభివృద్ధి కోసం బ్లాక్‌లు ఏర్పాటయ్యాయి. * 1959లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రారంభించింది.

 

ప్రముఖ ఉద్యమకారులు

రాంజీగోండు: గోండుల ఆత్మాభిమానం కాపాడటం కోసం 1857లో నిర్మల్‌ కేంద్రంగా నిజాం, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇతడి రహస్య స్థావరాన్ని నిజాం తెలుసుకున్నాడు. నిర్మల్‌ దగ్గరున్న మర్రి చెట్టుకి వెయ్యి మందిని ఉరి తీశాడు. ఈ మర్రికే ‘వేయి ఊడలమర్రి’ అని పేరు.

 

నోట్‌: నిర్మల్‌ కోటలో రాంజీగోండు స్మృతి చిహ్నం కనిపిస్తుంది.

 

కొమురం భీం: గోండులకు ప్రత్యేక రాజ్యం కావాలని కొమురం భీం నాయకత్వంతో 1928 నుంచి 1940 వరకు గోండులు ఉద్యమించారు.

 

నినాదం: జల్, జంగల్, జమీన్‌

 

గోండులు నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌ నుంచి రేవా నది, విదర్భ (మహారాష్ట్ర), ఆదిలాబాద్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని ‘గోండ్వానా’ రాజ్యంగా ప్రకటించాలని కొమురం భీం నాయకత్వంలో పోరాటం జరిగింది. * గోండులు, కోలామ్‌లు కొమురం భీం నాయకత్వంలో నిజాం ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటు చేశారు.

 

నిజాం సైనికులకు కొమురం భీం ఆచూకీని కోవర్టు కుర్ధుపటేల్‌ తెలియజేయడంతో ఆయనను కాల్చి చంపారు. ఆ తర్వాత గోండులు సమావేశమై ‘గోండు పరిరక్షణ’ ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో సమావేశమైన గోండులపై పోలీసులు కాల్పులు జరపగా 113 మంది మృతి చెందారు.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి
 

Posted Date : 09-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌