• facebook
  • whatsapp
  • telegram

వివిధ సామాజిక ఉద్యమాలు

హ‌క్కుల పోరాటాల్లో కర్షకులు.. కార్మికులు!

  అరవయ్యో దశకంలో భూస్వాముల దోపిడీలు, అణచివేతలపై అన్నదాతలు, శ్రామికులు కదం తొక్కారు. తేయాకు తోటల్లో ఆయుధాలతో తిరగబడ్డారు. ఉద్యమాలు హింసాత్మకమయ్యాయి. ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినా పోరాటాలు ఆగలేదు. ఆఖరికి పాలకులు ప్రగతిశీల శాసనాలు చేయాల్సి వచ్చింది. ఆ మేరకు రైతులకు, గిరిజనులకు కొన్ని ప్రయోజనాలు చేకూరాయి. అదే తరహాలో దేశ వ్యాప్తంగా పలు లక్ష్యాల కోసం సామాజిక ఉద్యమాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన పోరాటాల వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  

సాంఘిక లక్ష్యాలను సాధించేందుకు భారతదేశంలో రకరకాల సామాజిక ఉద్యమాలు జరిగాయి. సాధారణంగా ఇవి రాజకీయ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ రాజకీయేతరంగా ఏకమైన రైతులు కూడా అనేక పోరాటాలు సాగించారు. తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ,హరియాణా, పంజాబ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగిన కొన్ని ఉద్యమాలను ప్రధానంగా పేర్కొనవచ్చు.

 

నక్సల్‌బరీ ఉద్యమం

నక్సల్‌బరీ ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమై దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది. భూస్వాముల దోపిడీ, రాజ్యం అణచివేత ధోరణులపై రైతులు, భూమి లేని శ్రామికులు, నిమ్నకులాల వారు పోరాడే విధంగా వ్యవస్థీకృతం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లా ఉపవిభాగంలో ఒక గ్రామం పేరు నక్సల్‌బరీ. ఇక్కడ చారు మజుందార్, కానుసన్యాల్‌ల నాయకత్వంలో తేయాకు తోటల్లో సాయుధ తిరుగుబాటు మొదలైంది. బినామీ భూములను ఆక్రమించుకోమని అప్పట్లో పశ్చిమ బెంగాల్‌ కిసాన్‌ సభ  పిలుపునిచ్చింది. 1967 ఏప్రిల్‌- మేల్లో రైతుల సమావేశం ఏర్పాటు చేస్తే దాదాపు 5,000 మంది హాజరయ్యారు. భూమికి సంబంధించిన కొన్ని తీర్మానాలను ఈ సమావేశంలో ప్రతిపాదించారు. 

* జోతెదార్ల (అత్యంత ధనిక రైతులు) భూములను స్వాధీనం చేసుకోవడం. 

* పేద రైతుల నుంచి తేయాకు తోటల యజమానుల తీసుకున్న పొలాలను వెనక్కు తీసుకోవడం.

* జోతెదార్ల పొలాలను సాగు చేయడం. 

* సొంతంగా సాగు చేసుకుంటున్న జోతెదార్ల పొలాలను వదిలివేయడం.

ఉద్యమం మలి దశలో పెద్దఎత్తున హింస, ప్రతిహింస చోటు చేసుకున్నాయి. యువత, విద్యావంతులు ఈ ఉద్యమంలో పాలుపంచుకోవడం దీని ప్రధాన లక్షణం.

  నక్సల్‌బరీ ఉద్యమం దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో ఆ ఉద్యమం జరిగింది. గిరిజన యువత, స్త్రీలు అందులో పాల్గొన్నారు. అటవీ భూములను ఉపయోగించుకునే హక్కు, బాండెడ్‌ లేబర్‌ను నిర్మూలించడం, వేతనాల్లో పెంపు వంటివి ప్రధాన డిమాండ్లు అయ్యాయి. దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, నాగభూషణం పట్నాయక్, ఆదిభట్ల కైలాసం, పంచాద్రి కృష్ణమూర్తి, తరిమెల నాగిరెడ్డి లాంటి నాయకులు ఈ ఉద్యమానికి సారథ్యం వహించారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలోని యువత ఉద్యమానికి ఆకర్షితులై చేరారు. మరో వైపు రాష్ట్రస్థాయిలోని ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఎన్నో చర్యలు తీసుకున్నాయి. అదే మావోయిస్టు ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. వర్గ శత్రువులు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి గెరిల్లా యుద్ధ ఎత్తుగడలు అవలంబించడం, అవి హానికరంగా మారడంతో రైతులు, ఉపాంత రైతులు ఉద్యమం నుంచి వైదొలిగారు. నక్సల్‌బరీ ఉద్యమం, దాని తర్వాత విస్తరించిన నక్సలైట్‌ ఉద్యమాల ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూమి హక్కులను, చిన్న ఉపాంత రైతుల అవసరాలను పరిరక్షించేందుకు ప్రగతిశీల శాసనాలను చేశాయి. గిరిజనులు ఎదుర్కొంటున్న భూమి అన్యాక్రాంతమయ్యే సమస్యలను తీవ్రంగా చర్చించి, పాక్షికంగా నిర్మూలించారు. పోడు వ్యవసాయం చేసే గిరిజనుల హక్కులను ప్రభుత్వాలు గుర్తించాయి.

 

సమకాలీన రైతు ఉద్యమాలు - డిమాండ్లు

సమకాలీన రైతు ఉద్యమాల పుట్టుకను 1970 నుంచి గమనించవచ్చు. భూసంస్కరణల అమలు, హరిత విప్లవం ద్వారా వ్యవసాయ విధానాలను మెరుగుపరచడం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సబ్సిడీలు క్రమంగా పెరగడం ఈ విషయాన్ని తెలియజేస్తాయి. సమకాలీన ఉద్యమాలకు వనరులున్న ధనిక రైతులు సారథ్యం వహించారు. వీరిని లాయిడ్, సుసాన్‌ రుడాల్ఫ్‌లు ‘బుల్లక్‌ కాపిటలిస్టులు’ అని పేర్కొన్నారు. ఈ కొత్త రైతు వర్గం పంజాబ్‌ - హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ప్రభావవంతంగా ఉద్యమాల్లో పాల్గొంది. వాటిలో పేర్కొనదగినవి-

* భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) 

* షేత్కారీ సంఘటన (ఎస్‌ఎస్‌) 

* కర్ణాటక రాజ్య రైతు సంఘం (కేఆర్‌ఆర్‌ఎస్‌) 

* తమిళనాడు వివాశవిగళ్‌ సంఘం (టీఎన్‌వీఎస్‌)

ఈ రైతు ఉద్యమాలు రాజకీయేతర స్వభావం కలిగినవి. ఏ పార్టీతో పొత్తు లేనివి. అన్ని రకాల రైతులు, కౌలుదార్లు, షేర్‌క్రాపర్‌ల అభిరుచులను ప్రోత్సహించాయి.

 

తమిళనాడు వివాశవిగళ్‌ సంఘం (టీఎన్‌వీఎస్‌)

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో 1966లో ప్రారంభమైంది. 1973లో నారాయణస్వామి నాయుడు నాయకత్వంలో విస్తరించి చురుకుగా మారింది. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, విద్యుత్తు ఛార్జీల తగ్గింపు, వ్యవసాయ సంక్షోభ సమయంలో పంట రుణాల మాఫీ, పరపతి సౌకర్యాలు విస్తరించడం వంటివి ఈ సంఘం డిమాండ్లలో కొన్ని. ఈ ఉద్యమం దక్షిణ భారతదేశంలోని ఎందరో రైతులను ప్రభావితం చేసింది.

 

కర్ణాటక రాజ్య రైతు సంఘం (కేఆర్‌ఆర్‌ఎస్‌)

1970 దశకం మలిదశలో కర్ణాటకలో ఆవిర్భవించిన రాజకీయేతర ఉద్యమ సంస్థ. ఇందులో డాక్టర్‌ నంజుండ స్వామి చురుకైన పాత్ర పోషించారు. విత్తనాలు తయారుచేసే మాన్‌సాంటో అనే బహుళజాతి కంపెనీ (ఎంఎన్‌సీ) రైతులకు వ్యతిరేకంగా అమలుచేస్తున్న వివిధ ఎత్తుగడలను ఈ ఉద్యమం వ్యతిరేకించింది.  సబ్సిడీలిచ్చిన ఇన్‌పుట్లు, సరైన ధర, భూమి రెవెన్యూను మినహాయించడం ఉద్యమం డిమాండ్లు

 

షేత్కారీ సంఘటన (ఎస్‌ఎస్‌)

1970-80 దశకంలో శరద్‌ ఆనంద్‌రావ్‌ జోషి నాయకత్వంలో మహారాష్ట్రలో ఉల్లిపాయలు, చెరకు రైతుల సమస్యలపై షేత్కారీ సంఘటన ఆందోళనలు నిర్వహించింది. 1982లో ప్రభుత్వ పాలధరల పథకానికి వ్యతిరేకంగా, 1985-86లో పత్తికి గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేసింది. 

 

భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ)

విద్యుత్తు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా 1980లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఉద్భవించింది. నాటి నుంచి హరియాణా, పంజాబ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో చురుగ్గా పని చేస్తోంది. 1986లో మహేందర్‌ సింగ్‌ టికాయిత్‌ దీని నాయకత్వం చేపట్టారు.

* హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఎన్నో రైతుల ఉద్యమాలు జరిగాయి. చరణ్‌ సింగ్, దేవీలాల్‌ వంటి గొప్ప నాయకులు వీటి నుంచే వెలుగులోకి వచ్చారు. చరణ్‌ సింగ్‌ను కేంద్ర కేబినెట్‌ నుంచి తొలగించినప్పుడు భారీ కిసాన్‌ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, సీపీఎం లాంటి వామపక్ష పార్టీలు కూడా పలు రైతు ఉద్యమాలను నిర్వహించాయి. 1950, 1960ల్లో ఉద్యమాలు జమీందారీ వ్యవస్థ నిర్మూలన, భూసంస్కరణల కోసం జరిగాయి. సమకాలీన ఉద్యమాలు మాత్రం వివిధ లక్ష్యాల కోసం పోరాటాలు చేస్తున్నాయి.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

 

Posted Date : 24-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌