• facebook
  • whatsapp
  • telegram

పెళ్లి.. నాటి ప్రమాణాలు

    సమాజాల్లో కుటుంబ వ్యవస్థతో పాటు అత్యంత కీలకమైంది వివాహం. సమాజాభివృద్ధికి మూలం వివాహ వ్యవస్థలో ఉంది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ పరిణామ క్రమం ఏమిటి? అందుకు కారణాలేమిటి? బంధుత్వం ఎలా ఏర్పడుతుంది? బంధుత్వ ప్రాధాన్యమేంటి? బంధుత్వ విధినిషేధాలేమిటి? - ఉస్మానియా విశ్వవిద్యాలయం సమాజశాస్త్రశాఖ అధిపతి, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ఆచార్యగణేశ్ అందిస్తున్న విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం.

    సామాజిక ఆమోదంతో లేదా చట్టపరమైన అంగీకారంతో స్త్రీ, పురుషులిద్దరూ కలసి జీవించడం.. వారిమధ్య సామాజిక బంధాన్ని ఏర్పరచుకునే పద్ధతిని వివాహం అంటారు. భార్యాభర్తల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను.. ముఖ్యంగా శారీరక సంబంధాలను, తద్వారా సంతానాన్ని పొందడాన్ని, వారిద్దరి ఉమ్మడి నివాసాన్ని వివాహం ద్వారా సమాజం ఆమోదిస్తుంది. భారతీయ సమాజంలో స్త్రీ, పురుషులిద్దరూ వివాహం ద్వారానే సంతానాన్ని పొందాలి. కుటుంబ వ్యవస్థను కొనసాగించాలి

వివాహ రకాలు
1. ఏకవివాహం: ఒక పురుషుడు ఒక స్త్రీని లేదా ఒక స్త్రీ ఒక పురుషుడిని వివాహమాడటం.
2. బహువివాహం: హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం బహుభార్యత్వం, బహుభర్తృత్వం నిషిద్ధం. బహు వివాహంలో రెండు పద్ధతులు. ఒకటి.. బహుభార్యత్వం - ఒక పురుషుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం. ఇది కొన్ని గిరిజన తెగల్లో (నాగాలు, గోండులు, బైగాల్లో) కనిపిస్తుంది.

    రెండోది.. బహుభర్తృత్వం - ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువమందిని భర్తలుగా కలిగి ఉండటం. ఇందులో మళ్లీ రెండు రకాలు. 1 - సోదర బహుభర్తృత్వం. 2 - సోదరేతర బహుభర్తృత్వం. ఒక స్త్రీ భర్తలంతా ఒకే కుటుంబానికి చెంది, సోదరులైతే దాన్ని సోదర బహుభర్తృత్వం అంటారు. అలాకాకుండా స్త్రీ భర్తలంతా వివిధ కుటుంబాల వారైతే దాన్ని సోదరేతర బహుభర్తృత్వం అంటారు. నీలగిరి కొండల్లో నివసించే తోడా తెగల్లో ఈ బహుభర్తృత్వ పద్ధతి ఉంది.
స్త్రీ, పురుషుల జనాభాలో అసమతౌల్యం.. స్త్రీల జనాభా తక్కువగా ఉండటం.. బాలికాశిశుమరణాల రేటు ఎక్కువగా ఉండటం.. లాంటివాటి వల్ల బహుభర్తృత్వం అనేది వచ్చింది. అలా, ఓలీ అనే సంప్రదాయాలు కూడా ఇందుకు కారణం. ఓలీ అనేది గిరిజన సంప్రదాయం. పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలంటే వధువు తల్లిదండ్రులకు ధనం చెల్లించాలి. ఒకరు చెల్లించడం కష్టం. అంత స్తోమత ఉండదు. కాబట్టి ఇద్దరు ముగ్గురు కలసి చెల్లించి వివాహం చేసుకుంటారు. ఇలాంటి సామాజిక, ఆర్థిక, మతపరమైన కారణాల వల్ల ఈ వ్యవస్థలు ఏర్పడతాయి.

 

    ఈ రెండింటితోపాటు కొన్ని గిరిజన సమాజాల్లో మరో రెండు వివాహ పద్ధతులు కనిపిస్తుంటాయి.
1. దేవర న్యాయం: స్త్రీ భర్త చనిపోతే, మరిది(చనిపోయిన భర్త సోదరుడి)ని వివాహం చేసుకునే పద్ధతి. గిరిజన సమాజాల్లో స్త్రీకి సామాజిక, ఆర్థిక సంరక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ సమాజంపై ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబ పురుషులు రక్షణ కల్పించాలనేది ఉద్దేశం.
2. భార్యాభగినీ న్యాయం: ఒక వ్యక్తి భార్య చనిపోతే, ఆమె అవివాహిత సోదరిని పెళ్లి చేసుకోవడం. కుటుంబంలో ఆర్థిక, సామాజిక రక్షణ కల్పించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.

 

వివాహ సంప్రదాయాలు
హిందూ సమాజంలో 8 రకాలైన సంప్రదాయ వివాహ పద్ధతులున్నాయి. అవి..
1. బ్రాహ్మం 2. దైవం 3. ఆర్షం 4. ప్రజాపత్యం 5. అసురం 6. గాంధర్వం 7. రాక్షసం 8. పైశాచికం
వీటిలో మొదటి నాలుగింటిని ప్రశస్త వివాహాలంటారు. హిందూ ధర్మశాస్త్రాలు ఆమోదించినవి. మిగిలిన నాలుగింటిని అప్రశస్తమైనవిగా భావిస్తారు.
బ్రాహ్మం - విద్య, సదాచారాలున్న యువకుడికి కన్యాదాత స్వయంగా పిలిచి, వస్త్రాలంకారాలతో కన్యనిచ్చి చేసే వివాహం. కన్య తండ్రి తన ఇష్టప్రకారం అల్లుడిని ఎంచుకునే పద్ధతి.
దైవం - యజ్ఞయాగాదులు నిర్వహించగలిగే తెలివితేటలు, జ్ఞానం కలిగిన వ్యక్తికి కూతురునిచ్చి చేసే వివాహం.
ఆర్షం - కన్య తండ్రి వరుడి నుంచి రెండు గోవులను బహుమానంగా తీసుకొని, దానికి ప్రతిఫలంగా కూతురినిచ్చి చేసే వివాహం. కన్యాదాత వరుడి నుంచి గోవులను తీసుకోవడాన్ని ధర్మార్థంగా భావిస్తారు.
ప్రజాపత్యం - కన్యాదాత వధూవరులిద్దరూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపండని ఆశీర్వదిస్తూ కన్యాదానం చేస్తూ చేసే వివాహం.
ఈ నాలుగింటిలోనూ సూక్ష్మమైన తేడాలున్నా వధువు తండ్రి తన ఇష్టప్రకారం, అన్ని సలక్షణాలున్న వరుడికి కుమార్తెనిచ్చి వివాహం చేసే పద్ధతి వీటిలో కనిపిస్తుంది. అందుకే వీటిని ప్రశస్తమైనవిగా పేర్కొన్నారు.
హిందూ సమాజంలో మిగిలిన నాలుగు పద్ధతులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తాయి. అవి..
అసుర వివాహం - వరుడు కన్యాదాత(మామ)కు కొంత డబ్బిచ్చి వధువును తీసుకొని వెళ్లి వివాహం చేసుకోవడం.
గాంధర్వం - వధూవరులిద్దరూ ఇష్టపడి, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా చేసుకునే వివాహం.
రాక్షసం - స్త్రీ అంగీకారం లేకుండా, అవసరమైతే ఆమె బంధువులను పక్కకు తప్పించి, బలవంతంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవడం.
పైశాచికం - స్త్రీ నిద్రాణస్థితిలో లేదా అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం.
ఈ నాలుగు వివాహాలు కూడా హిందూ సమాజంలో జరిగినట్లు ఆధారాలున్నాయి.


పవిత్ర కార్యం
హిందూ వ్యవస్థలో వివాహాన్ని పవిత్ర కార్యంగా భావిస్తారు. హిందూ వివాహం ప్రధాన ఉద్దేశాలు మూడు. 1. ధర్మం 2. ప్రజ 3. రతి. హిందూ శాస్త్రం ప్రకారం వివాహం చేసుకున్న స్త్రీ పురుషులిద్దరూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి. వివాహ బంధం ద్వారా సంతానాన్ని పొందాలి. ఆ విధంగా సంతానాన్ని పొందడం ద్వారా సమాజం నిరంతరం కొనసాగేలా చూడాలి. ధర్మబద్ధంగా శారీరక సంబంధాన్ని పాటించాలనేది వీటి అర్థం.

వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చిన చట్టాలు
హిందూ వివాహ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. సమాజ ఆమోదం లేని కొన్ని సంప్రదాయాలు వివాహ వ్యవస్థలో ఏర్పడ్డాయి. అవి.. సతీ సహగమనం, బాల్య వివాహాలు; వితంతు పునర్‌వివాహాలను ఆమోదించకపోవడం. ఇలాంటి పద్ధతుల్లో మార్పులు తేవడానికి బ్రిటిష్ హయాంలో, తర్వాత కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. హిందూ వివాహ వ్యవస్థలో మార్పులకు ఈ చట్టాలు దోహదపడ్డాయి.
1. సతీ సహగమన నిషేధ చట్టం (1829)
2. హిందూ విధవ పునర్‌వివాహ చట్టం (1856).. దీని ప్రకారం వైధవ్యం పొందిన స్త్రీ మళ్లీ వివాహం చేసుకునే హక్కు పొందింది.
3. ప్రత్యేక వివాహ చట్టం (స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ - 1872).. దీని ప్రకారం హిందూ వివాహం మతపరమైన సంస్కారమైనా, ఇది పౌర సంబంధమైన వివాహం కూడా. స్త్రీ పురుషుల మధ్య సామాజిక బంధాన్ని ఏర్పరిచే పద్ధతి. కాబట్టి కులాంతర, మతాంతర వివాహాలు ఆమోదయోగ్యమని చెబుతోందీ చట్టం.
4. బాల్య వివాహ నిషేధం చట్టం (1929).. ఈ చట్టం ప్రకారం బాలబాలికల వివాహాలు నిషిద్ధం. హిందూ వివాహ చట్టం (1955)లో కూడా వీటిని చేర్చారు.
5. హిందూ వివాహ చట్టం (1955).. దీని ప్రకారం వివాహం చేసుకోవాలంటే పురుషుడికి 21 సంవత్సరాలు, మహిళకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
6. వరకట్న నిషేధ చట్టం (1961).. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ చట్టపరంగా నిషేధాలే.


ముస్లిం వివాహ వ్యవస్థ
భారతీయ సమాజంలో హిందువుల తర్వాత అధిక సంఖ్యలో ఉన్నది ముస్లింలు, క్రైస్తవులు. ముస్లింలలో వివాహాన్ని సామాజిక ఒప్పందంగా భావిస్తారు. ఈ వివాహంలో ప్రధానంగా నాలుగు అంశాలుంటాయి.
1. స్త్రీ పురుషుల మధ్య వివాహమంటే ప్రతిపాదన, ఆమోదం ఉండాలి. కాబట్టి వివాహం చేసుకోవాలనుకునే పురుషుడు ప్రతిపాదించడం, దానికి వధువు అంగీకరించడం అవసరం. ఇవి రెండూ ఉన్నప్పుడే వివాహం.
2. వివాహం చేసుకోవాలనుకున్న వ్యక్తి వయోజనుడై ఉండాలి (అంటే బాల్య వివాహాలుండవు) పటిష్ఠమైన మానసిక స్థితిలో ఉండటం తప్పనిసరి.
3. సమానమైన సామాజిక అంతస్తుల మధ్య వివాహం జరిగితే బాగుంటుంది.
4. ఏ రకమైన చట్టపరమైన సమస్యలు లేకుండా, ముస్లిం చట్ట పరిధిలోనే వివాహం జరగాలి.
ముస్లిం వివాహ వ్యవస్థలో కనిపించే ఓ పద్ధతి మెహర్. వివాహం చేసుకునే వ్యక్తి స్త్రీపై గౌరవభావంగా ఆమెకు కొంత ధనాన్ని లేదా ఆస్తిని చెల్లిస్తారు. దీన్ని వివాహ నిశ్చయం సందర్భంలో పెద్దల సమక్షంలో నిర్ణయిస్తారు. దీన్ని వధువుకే చెల్లిస్తారు. వివాహ సమయంలో లేదా వివాహానంతరం చెల్లిస్తారు. దీనిపై వధువుకే సర్వహక్కులుంటాయి.
ఇస్లాం ప్రకారం విడాకులకు అవకాశముంది. మూడు రకాలుగా విడాకులు తీసుకోవచ్చు.
1. ముస్లిం మత చట్టం ప్రకారం (కోర్టు ప్రమేయం లేకుండా)..
2. షరియాత్ చట్టం 1937 ప్రకారం (దీని ప్రకారం పురుషుడు విడాకులు తీసుకోవచ్చు)..
3) ది డిసలూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 (దీని ప్రకారం మహిళలు విడాకులు కోరవచ్చు).


క్రైస్తవ వివాహాలు
ఈ సమాజంలో కూడా వివాహాన్ని పౌర ఒప్పందంగా భావిస్తారు. మత ఆచారాల ప్రకారం ఫాదర్ (మతగురువు), సాక్షుల సమక్షంలో వివాహం నిర్వర్తిస్తారు. వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ, పురుషులిద్దరూ ఏ చర్చిలో సభ్యులో, ఆ చర్చి మతగురువుకు తమ వివాహానికి సంబంధించిన వివరాలను ముందే అందజేయాలి. ఆ వివరాలను చర్చిలో మూడు వారాల ముందు ప్రకటిస్తారు. సమాజంలో ఎవరికైనా ఈ వివాహంపై ఆక్షేపణ ఉంటే తెలియజేసే అవకాశం ఇస్తారు. ఎలాంటి ఆక్షేపణ లేకుంటే వారు నిర్ణయించుకున్న తేదీ నాడు వివాహం జరిపిస్తారు. క్రైస్తవంలో ఏక వివాహ నియమం ఉంది. ఏకకాలంలో బహు వివాహం నిషిద్ధం. క్రైస్తవ పెళ్లిళ్లను క్రమబద్ధీకరించడానికి రెండు చట్టాలున్నాయి.
1. ది ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 (భారత్‌లో క్రైస్తవుల వివాహ విషయాల్ని నియంత్రించడానికి ఈ చట్టం).
2. ఇండియన్ డైవోర్స్ యాక్ట్ 1869 (క్రైస్తవులు కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలనుకుంటే ఈ చట్టం ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చు).


బంధుత్వం
భారతీయ సమాజంలో వివాహం, కుటుంబంతోపాటు ప్రధానమైంది బంధుత్వ వ్యవస్థ. కుటుంబ సభ్యుల మధ్య లేదా కుటుంబాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను క్రమబద్ధీకరించే, ఏకీకృతం చేసేది బంధుత్వ వ్యవస్థ. సమాజశాస్త్ర పరంగా చూస్తే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సమూహాల మధ్యగల సామాజిక సంబంధాలను సూచించేదే బంధుత్వం. బంధుత్వం వివాహం ద్వారా లేదా రక్తసంబంధం ద్వారా ఏర్పడుతుంది. వైవాహిక బంధువులు, రక్తబంధువులు ఉంటారు. ఉదాహరణకు భార్యాభర్తలది వైవాహిక బంధుత్వం. కోడలు, మామ, అత్తల మధ్య బంధుత్వం వైవాహిక బంధుత్వం. కుటుంబంలో తల్లిదండ్రులకు, పిల్లలకు, పిల్లల మధ్య ఉండే సంబంధం రక్తసంబంధం.
వీటి ప్రాతిపదికన భారతీయ సమాజంలో 4 రకాలైన బంధు సమూహాలు కనిపిస్తాయి. 1. వంశం 2. గోత్రం 3. గోత్రకూటమి 4. ద్విశాఖి
    వంశం, గోత్రం హిందూ సమాజంలో కనిపిస్తే.. గోత్రకూటమి, ద్విశాఖిలు భారతీయ సమాజంలోని గిరిజన సమూహాల్లో ఉన్నాయి. ఒకే పూర్వీకుల నుంచి ఉద్భవించిన సమూహాన్ని వంశం అంటారు. ఏకరక్త బంధుత్వం కలిగిన కుటుంబాల కలయిక వల్ల ఏర్పడిందీ వంశం. ఒక వంశంలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వ్యక్తులుంటారు. వీరందరికీ సమష్టి ఆచారాలు, సంప్రదాయాలుంటాయి. వారందరినీ రక్తబంధువులుగా భావిస్తారు. అందువల్లే ఒకే వంశానికి చెందిన వ్యక్తుల మధ్య వివాహాలు నిషిద్ధం. తమ పూర్వీకులెవరో కచ్చితంగా నిర్దారించే అవకాశం వంశంలో ఉంటుంది. ఈ వంశం అనేది చాలా విస్తృతమైనప్పుడు ఏర్పడేదే గోత్రం. గోత్రంలోని సభ్యులు కూడా తామంతా ఒకే మూలపురుషుడి నుంచి ఉద్భవించామనే భావన కలిగి ఉంటారు. కానీ గోత్రానికి సంబంధించిన మూలపురుషుడి స్పష్టమైన వివరాలు గోత్ర సభ్యులకు తెలియకపోవచ్చు. ఒక కల్పితమైన పూర్వీకుడి నుంచి ఉద్భవించిన రక్తబంధువులందరినీ స్వగోత్రీకులంటారు. అందుకే స్వగోత్ర వివాహం నిషిద్ధమని నియమం పెట్టుకున్నారు. ఈ గోత్రాలు హిందూసమాజంలో, గిరిజన సమూహాల్లో ఉంటాయి. ఇందులోనూ పితృ వంశీయ, మాతృ వంశీయ గోత్రాలుంటాయి. ఇవి కాకుండా కొన్ని గిరిజన సమూహాల్లో గోత్ర కూటములు కనిపిస్తాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ గోత్రాలున్న ఏక వంశానుక్రమ సమూహాలను గోత్రకూటములంటారు. ఒకే రకమైన సంప్రదాయాలు, ఆచారాలు, మూలపురుషుడు కలిగిన గోత్రాలు కలిసినప్పుడు ఈ గోత్రకూటములు ఆవిర్భవిస్తాయి. నాగాలాండ్‌లోని ఆవోనాగా తెగలో, తెలంగాణలోని రాజ్‌గోండ్‌ల్లో ఈ గోత్రకూటములు కనిపిస్తాయి. ఇదో ప్రత్యేక లక్షణం. మరియాగోండ్, రాజ్‌గోండ్, ఆవోనాగాల్లో పితృవంశీయ గోత్ర కూటములు. హోపీ, లవాహో అనే గిరిజన తెగల్లో మాతృవంశీయ గోత్ర కూటములున్నాయి.
    వీటితోపాటు గిరిజన తెగ రెండు బంధు సమూహాలుగా విభక్తమైతే దాన్ని ద్విశాఖి అంటారు. ఒకే విభాగానికి చెందిన వ్యక్తులు అదే విభాగానికి చెందిన వారిని వివాహం చేసుకోకూడదు. అంటే వేరే శాఖవారిని చేసుకోవాలి. గోండ్‌లు, నాగాల్లో ఈ ద్విశాఖి కనిపిస్తుంటుంది.


బంధుత్వ ఆచరణలు
    బంధువుల మధ్య సంబంధాలను క్రమబద్ధీకరించటానికి కొన్ని ఆచారాలు వచ్చాయి. వ్యక్తుల సామాజిక సంబంధాలకు సంబంధించిన విధి నిషేధాలివి.
1. వైదొలగు నడవడి
    ఒక కుటుంబంలోని బంధువులు ఏవిధమైన ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండకూడదో తెలిపేదిది. ఉత్తర భారతంలో, కొన్ని గిరిజన సమాజాల్లో ఉంటాయివి. ఉదాహరణకు కోడలు మామతో ప్రత్యక్షంగా మాట్లాడకుండటం. మామ కుటుంబానికి కర్త, పెద్ద. పితృస్వామ్య వ్యవస్థలో కర్తకు ఎదురుగా వెళ్లి మాట్లాడటం సంప్రదాయ విరుద్ధమనే భావన. అలాగే అత్త అల్లుడితో ప్రత్యక్షంగా మాట్లాడటానికి వీల్లేదు. ఇదే వైదొలగు నడవడి.

2. పరిహాస సంబంధం
    పరిహాస సంబంధాలు ఎవరిమధ్య ఉండొచ్చు, ఎవరి మధ్య ఉండకూడదనేది ఈ పద్ధతి చెబుతుంది. సంప్రదాయ హిందూ కుటుంబ వ్యవస్థలో పిల్లలు తండ్రితో పరిహాసమాడటానికి వీల్లేదు. కానీ తాత మనవడితో పరిహాసం ఆడొచ్చు. లేదా ఓ వ్యక్తి తన బావమరిదితో, మరదలితో పరిహాసం ఆడొచ్చు.

3. సంకేతిక సంబోధన
    కుటుంబంలో ఒక బంధువు మరో బంధువును నేరుగా పేరు పెట్టిపిలవడం నిషేధం. కొన్ని సమూహాల్లో భార్య భర్తను పేరుతో పిలవడానికి వీల్లేదు. చాలా గిరిజన సమాజాల్లో, సంప్రదాయ హిందూ సమాజాల్లో కూడా భార్య భర్తను పేరుతో పిలిస్తే ఆయనకు ఆయుష్షుక్షీణమనే నమ్మకం ఉంది. అందుకే ఉత్తరభారతంలో పిల్లల పేరుతో కలిపి భర్తను పిలుస్తారు. అలాగే కొన్ని సమూహాల్లో కోడలు అత్తను నేరుగా సంబోధించడం కుదరదు.

4. మాతులాధికారం
    వ్యక్తి జీవన వ్యవహారాల్లో తల్లి సోదరుడికి (మేనమామకు) అత్యంత ప్రాధాన్యం ఇవ్వడాన్ని మాతులాధికారం అంటారు.

5. పితృశ్వాధికారం
    వ్యక్తి జీవన వ్యవహారాల్లో తండ్రి సోదరి (మేనత్త)కి అత్యంత ప్రాధాన్యమిస్తే దాన్ని పితృశ్వాధికారం అంటారు.

6. కుహనా ప్రసూతి
    భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త - ఆమె కష్టాల్లో పాలుపంచుకోవడం, ఆమె బాధను తాను కూడా పడుతున్నట్లు (నీరసంగా ఉండటం) ఉండటం. ముఖ్యంగా ప్రసవ సమయంలో భార్య బాధను పంచుకునే పద్ధతి. తద్వారా భార్యకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాననే భావన కలిగించడం దీని ఉద్దేశం. ముఖ్యంగా ఖాసీ, తోడా తెగల్లో కుహనా ప్రసూతి పద్ధతి కనిపిస్తుంది. తోడాల్లో బహుభర్తృత్వం ఉంది. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనేది నిర్ధారించటానికి కుహనా ప్రసూతిని ఉపయోగిస్తారు. గర్భం ధరించి ప్రసవించే దాకా భర్తల్లో ఎవరైతే ఆమెకు తోడుగా ఉంటారో వారినే ఆ సంతానానికి తండ్రిగా భావిస్తారు. ప్రసూతి అనంతరం బాణం విల్లంబుల ఉత్సవం (బో అండ్ యారో సెర్మనీ) చేసి తెగకు సంబంధించిన వారందరికీ విందు ఇస్తారు. ఎవరైతే ఆ విందు ఇస్తారో ఆ వ్యక్తిని బిడ్డకు తండ్రిగా పరిగణిస్తారు. బహుభర్తృత్వంలో స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడల్లా ఎవరో ఒకరు ఈ పద్ధతిని పాటిస్తారు.


కాలక్రమం
వివాహ వ్యవస్థ అనేది ఉన్నట్టుండి పుట్టుకొచ్చింది కాదు. ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్, ఎల్‌హెచ్ మోర్గాన్ అనే మానవశాస్త్రవేత్తల అభిభాషణ ప్రకారం వివాహ వ్యవస్థ పరిణామ క్రమంలో ఏర్పడింది. అనేక మార్పులు చెందుతూ వస్తోంది. వెస్టర్ మార్క్ రాసిన 'హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్' అనే ప్రసిద్ధ గ్రంథం ప్రకారం.. సమాజం ఏర్పడిన తొలినాళ్లలో ఉన్నది స్వైరిత వ్యవస్థ. ఏ రకమైన నియమ నిబంధనలు లేనటువంటి వ్యవస్థ అది. ఆ స్వైరిత వ్యవస్థలోంచి సామూహిక వివాహం వచ్చింది. అంటే కొంతమంది పురుషులు, మరికొందరు స్త్రీలను వివాహం చేసుకునే పద్ధతి మొదలైంది. అనంతర కాలంలో బహు వివాహం ఏర్పడింది. స్త్రీలు బహుభర్తలను కలిగి ఉండటం.. మరి కొంతకాలం పురుషులు బహుభార్యలను కలిగి ఉండే కాలం ఉండేది. అవన్నీ దాటి ఇప్పుడు ఏక వివాహ పద్ధతి ఏర్పడింది. ఇలా వివాహ పద్ధతి మార్పులు చెందుతూ వస్తోంది.

ప్రశస్త సప్తపది
బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రజాపత్య వివాహాల సందర్భాల్లో కొన్ని సంస్కారాలు నిర్వహిస్తారు. వాటిని హిందూ సమాజంలో చాలా ప్రశస్తమైనవిగా భావిస్తారు. అవి 1. కన్యాదానం 2. వివాహ హోమం (లాజహోమం) 3. పాణిగ్రహణం 4. అగ్నిప్రణయనం 5. ఆశ్వారోహణం 6. సప్తపది 7. అరుంధతీ దర్శనం. వీటితోపాటు మాంగల్యధారణ కూడా ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వీటిలో పాణిగ్రహణం, సప్తపది తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన సంస్కారాలంటారు. వీటిని హిందూ సంప్రదాయ వివాహానికి సూచికలుగా చెబుతారు. అందుకే తప్పనిసరిగా నిర్వర్తించాలంటారు.

మూడు నియమాలు
భారత్‌లో వివాహానికి సంబంధించి మూడు నియమాలు కనిపిస్తాయి. అవి..

1. అంతర్‌వివాహం
    ఒక సమూహంలోని వ్యక్తి అదే సమూహంలోని వారిని వివాహమాడాలి. ఒక కులం వారు అదే కులం వారిని, ఒక మతం వారు అదే మతం వారిని వివాహమాడటం. దాదాపు అన్ని మత, కుల, గిరిజన సమూహాలు భారతీయ సమాజంలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. కులం, తెగలను చూస్తే గోత్రాలు కనిపిస్తాయి. ఒకే పూర్వీకుల నుంచి ఉద్భవించారన్న భావన కలిగి ఉన్న సమూహాన్ని గోత్రం అంటాం. అంటే ఒక గోత్రీకులంతా ఒకే రక్తసంబంధీకులనే నమ్మకం. అందుకే స్వగోత్ర వివాహాలను ఆమోదించని ధోరణి భారతీయ సమాజంలోనూ, అనేక గిరిజన తెగల్లోనూ కనిపిస్తుంది. కులం అంతర్‌వివాహ సమూహమైతే అందులోని భాగమైన గోత్రం బహిర్ వివాహ సమూహం.

2. బహిర్‌వివాహం
    ఒక సమూహానికి చెందిన స్త్రీ లేదా పురుషుడు వేరే సమూహంలోని వ్యక్తిని వివాహం చేసుకోవడం. గోత్రం బహిర్‌వివాహ సమూహం.
    భారతీయ హిందూ, ముస్లిం, గిరిజన సమూహాల్లో మేనరిక వివాహాలు, సమాంతర పిత్రీయ వివాహాలు అని ఉంటాయి. వీటినే అధిగణన వివాహాలంటారు. హిందూ కులవ్యవస్థలో మేనరిక వివాహాలు (క్రాస్ కజిన్ మ్యారేజస్) లేదా మేనమామ-మేమకోడలు వివాహాలు దక్షిణభారతంలో (ఉదాహరణకు కోస్తాంధ్రలో) కనిపిస్తాయి. ఉత్తరభారతంలో ఇవి ఉండవు. అలాగే ముస్లింలలో అన్నదమ్ముల పిల్లలు, అక్కాచెల్లెళ్ల పిల్లలు వివాహం చేసుకోవచ్చనే నియమం సమాంతర పిత్రీయ సంతతి వివాహానికి ఉదాహరణలు. ఇవి దక్షిణభారతంలో కనిపిస్తాయి.

Posted Date : 02-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు