• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రొవిజన్స్‌ - ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం

రూస్కో పౌండ్ అభిప్రాయం ప్రకారం 'ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే. సంక్షేమ రాజ్యాలే శ్రేయోరాజ్యాలు'.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం 'భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, వైజ్ఞానిక రంగాల్లో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించడం'.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అభిలషణీయ విధానాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన వసతులను కల్పించడం, అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన విధి.
దీన్ని సాకారం చేసేందుకు షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన కులాలు, మహిళలు, మైనార్టీలు, కార్మికులు, వికలాంగులు, బాలబాలికలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.


రాజ్యాంగంలో సంక్షేమ మూలాలు
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చింది.
సామ్యవాదం అనే పదం ద్వారా ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అవి:
జవహర్‌లాల్‌నెహ్రూ ప్రభుత్వం 1957లో దేశంలోని జీవిత బీమా సంస్థలన్నింటినీ జాతీయం చేసి ఎల్ఐసీ నియంత్రణలోకి తీసుకొచ్చింది.
ఇందిరా గాంధీ ప్రభుత్వం 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేసింది. 1970లో రాజభరణాలను రద్దుపరచింది. 1975లో 20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమాన్ని ప్రకటించింది.
భారత రాజ్యాంగంలోని 16వ భాగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను వివరించారు.
ఆర్టికల్ 15 (3) ప్రకారం మహిళలకు, బాలలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.
ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా ప్రగతికి ప్రత్యేక పథకాలను చేపట్టాలి.
 ఆర్టికల్ 243 (D) ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లోనూ, ఆర్టికల్ 243 (T) ప్రకారం నగర/ పట్టణ ప్రభుత్వాల ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.
ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్.
 ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్
‣  ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్
1989లో షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది.


ఎస్సీ వర్గాల సంక్షేమం
‣  షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వారికి 1979 నుంచి పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారు.
1989లో నిరుపేదలైన ఎస్సీ వర్గాల స్వయం ఉపాధి కార్యక్రమాల అమలుకు నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నెలకొల్పారు.
ఎస్సీ వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా వసతిగృహాల స్థాపనకు 2008లో బాబూ జగ్జీవన్‌రామ్ ఛాత్రావాస్ యోజనను ప్రారంభించారు.
 డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా ఎస్సీ వర్గాల వారికి కిడ్నీ, లివర్ వ్యాధులు, క్యాన్సర్ చికిత్స కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
 హరిజనవాడల్లో అంబేడ్కర్ జలధార పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నారు.

ఆర్టికల్ 16 (4A): రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం లేదని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లయితే కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి సీనియారిటీతో కూడిన పదోన్నతిని కల్పించడానికి ఆయా వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని, సీనియార్టీకి రిజర్వేషన్ వర్తించదని 2015 సెప్టెంబరు 12న సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆర్టికల్ 17: దీని ప్రకారం అంటరానితనం నిషేధం. అంటరానితనం పాటించడాన్ని నేరంగా పరిగణిస్తారు. 1955లో భారత పార్లమెంటు అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని రూపొందించింది. దీన్ని పార్లమెంటు 1976లో పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చింది.

ఆర్టికల్ 23: దీని ప్రకారం మనుషుల క్రయవిక్రయాలు, వెట్టిచాకిరీని నిషేధించారు. జోగిని, దేవదాసీ లాంటి సాంఘిక దురాచారాలను నిషేధించారు. 1976లో వెట్టిచాకిరీ నిషేధ చట్టం, కనీస వేతనాల అమలు చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టాలను రూపొందించారు.

ఆర్టికల్ 330: ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లోక్‌సభలో కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి. ఆర్టికల్ 332 ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని సీట్లను రిజర్వ్ చేయాలి.

 

ఆర్టికల్ 335: ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీల అర్హత మార్కులను ప్రభుత్వం తగ్గించవచ్చు.

అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకం: షెడ్యూల్డు కులాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
జాతీయ సఫాయి కర్మచారి కమిషన్: పారిశుద్ధ్య కార్మికులను వారి వృత్తుల నుంచి విముక్తి చేసి ప్రత్యామ్నాయ సదుపాయాలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.
2004 - 05 సంవత్సరం నుంచి బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతీయ ఉపకార వేతనాలను అందిస్తున్నారు.


గిరిజన ప్రాంతాలు, గిరిజనుల (ఎస్టీ) సంక్షేమం
భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూళ్లలో షెడ్యూల్డు తెగల (ఎస్టీ) పరిపాలనాంశాలను పొందుపరిచారు.
ఆర్టికల్ 366 (25) ప్రకారం హిందు, బౌద్ధ, సిక్కు మతాలను అనుసరించేవారు, ఆదిమ మత పద్ధతులను అనుసరించేవారిని షెడ్యూల్డు తెగలుగా పరిగణిస్తారు.
ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నరును సంప్రదించిన తర్వాత షెడ్యూల్డు తెగల నిర్వచనాన్ని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగానే పార్లమెంటు చట్టాలు చేస్తుంది.
2007, మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిర్వచనాన్ని తెలియజేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు.


5వ షెడ్యూల్ ముఖ్యాంశాలు

దీనిలో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనను చేర్చారు.
ఆర్టికల్ 244 (1) ప్రకారం సంబంధిత రాష్ట్ర గవర్నరుతో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఒక ప్రాంతాన్ని 'షెడ్యూల్డు ప్రాంతం'గా ప్రకటిస్తారు.
గవర్నర్లు ప్రతి సంవత్సరం తమ రాష్ట్రాల్లోని షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలనపై రాష్ట్రపతికి నివేదిక పంపాలి.
రాష్ట్రపతి ఆదేశం మేరకు షెడ్యూల్డు ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల సలహా మండలిని ఏర్పాటు చేయాలి.
ఈ మండలిలో సభ్యుల సంఖ్య 20 మంది. వీరిలో వ వంతు మంది షెడ్యూల్డు తెగలకు చెందిన శాసనసభ్యులై ఉండాలి.
షెడ్యూల్డు తెగల శాసనసభ్యులు తగినంతమంది లభించని పక్షంలో మిగిలిన స్థానాలను షెడ్యూల్డు తెగల పౌరులతో నింపాలి.


6వ షెడ్యూల్ ముఖ్యాంశాలు

‣ దీనిలో గిరిజన ప్రాంతాలను చేర్చారు.
అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర లాంటి 4 రాష్ట్రాలను చేర్చారు.
ఈ రాష్ట్రాల్లో స్వయంప్రతిపత్తి ఉన్న జిల్లాలు ఉన్నాయి.


గిరిజన జిల్లా కౌన్సిళ్లు
ఆర్టికల్ 244 (2), ఆర్టికల్ 275 (1) ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లాలు, ప్రాంతాల ఏర్పాటు ద్వారా జిల్లా కౌన్సిళ్లు, ప్రాంతీయ కౌన్సిళ్ల ఏర్పాటు ద్వారా అసోంలోని గిరిజన ప్రాంతాల్లో పరిపాలన జరగాలని నిర్దేశించారు.
గిరిజనేతరుల వడ్డీ వ్యాపారాలను, ఇతర వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడానికి జిల్లా కౌన్సిళ్లకు అధికారాలు కల్పించారు.
కేంద్ర, రాష్ట్రాల చట్టాలు తమ జిల్లాలకు వర్తించకుండా నిరోధించే అధికారాలు ఈ కౌన్సిళ్లు కలిగి ఉన్నాయి.
ఈ కౌన్సిళ్లు క్రమం తప్పకుండా ఆదాయ, వ్యయ ఖాతాలను నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఈ కౌన్సిళ్ల పనితీరును మదింపు చేయడానికి అవసరమైతే గవర్నర్ ఒక కమిషన్‌ను నియమించవచ్చు.
‣ ఈ కౌన్సిళ్ల కార్యకలాపాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని సందేహం కలిగినప్పుడు వీటిని రద్దు చేసే అధికారం గవర్నరుకు ఉంది.


జిల్లా మండళ్లు, ప్రాంతీయ మండళ్లల నిర్మాణం
ప్రతి స్వయంప్రతిపత్తి జిల్లాకు ఒక జిల్లా మండలి ఉంటుంది.
జిల్లా మండలిలో 30 మంది సభ్యులు ఉండాలి.
వీరిలో 26 మంది వయోజన ఓటు ద్వారా ఎన్నికవుతారు.
మిగిలిన నలుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు.
‣  ప్రతి స్వతంత్ర ప్రాంతానికి ఒక ప్రాంతీయ మండలి ఉంటుంది.
 ప్రతి జిల్లా మండలిని ఆ జిల్లా పేరుతో పిలుస్తారు.
 ప్రాంతీయ మండలిని ఆ ప్రాంతం పేరుతో పిలుస్తారు.
 స్వయంప్రతిపత్తి జిల్లా పరిపాలన మొత్తం జిల్లా కౌన్సిల్ చేతుల్లో ఉంటుంది.
 జిల్లాలోని స్వతంత్ర ప్రాంతాల పరిపాలన మాత్రం ప్రాంతీయ మండలి పరిధిలో ఉంటుంది.
 రాష్ట్ర గవర్నర్ ఆయా తెగల ప్రాతినిధ్య సంఘాలు, తెగల మండళ్లతోనూ సంప్రదించి జిల్లా మండలి, స్వతంత్ర మండళ్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను రూపొందిస్తారు.
జిల్లా మండలి సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.
 నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం మాత్రం గవర్నర్ అభీష్టంపై ఆధారపడి ఉంటుంది.


షెడ్యూల్డు తెగల అభివృద్ధి చట్టాలు
 నేచర్ - మ్యాన్ - స్పిరిట్ భావన ప్రకారం ప్రకృతి, మానవుడు, ఆరాధనల మధ్య విడదీయలేని సంబంధం ఉంది.
‣  కొన్ని తెగల్లో వివాహానికి ముందుగా మామిడి చెట్లను వివాహం చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది.


అటవీ చట్టం - 1878
 ఈ చట్టం ద్వారా అడవులపై రాష్ట్రాలకు ఉండే అధికారాన్ని మరింత విస్తృతపరిచారు.
 అడవుల్లో సంచరించడం, పశుపోషణ లాంటి కార్యకలాపాలను నిషేధించారు.
‣  భారతదేశ మొదటి అటవీ విధానాన్ని 1894లో ప్రకటించారు.భారత 


అటవీ చట్టం - 1927
ఈ చట్టం ద్వారా ఏర్పాటైన అటవీ శాఖ అధికారులు, అటవీ గార్డులు, ఐఎఫ్ఎస్ అధికారులతో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థకు అధికారాలు సమకూర్చారు.
ఈ చట్టం ప్రకారం అటవీ వనరులకు నష్టం చేకూర్చే ఏ వ్యక్తినైనా వారంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంది.
1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అడవులు అనే అంశాన్ని రాష్ట్ర జాబితాలోకి బదిలీ చేశారు.


గిరిజన భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం - 1959
ఈ చట్టాన్ని 1/70 అంటారు.
దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో 1959లో అమల్లోకి తెచ్చారు.


ఈ చట్టంలోని కీలకాంశాలు
గిరిజనేతరులు గిరిజనుల భూములను కొనకూడదు.
గిరిజనేతరులు తమ భూములను అమ్మాల్సి వస్తే గిరిజనులకే అమ్మాలి.
గిరిజనులు తమ భూములను తమవే అని నిరూపించుకోవాలి.


PESA చట్టం 1996
Panchayats Extension to the Scheduled Areas Act - PESA 1996, డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగంలోని 9వ భాగంలో ఆర్టికల్ 243 ప్రకారం పంచాయతీలకు సంబంధించిన అంశాలను షెడ్యూల్డు ప్రాంతాలకు కూడా వర్తించేలా చేసిన చట్టం ఇది.
దిలీప్‌సింగ్ భూరియా కమిటీ సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని చేశారు.
దిలీప్‌సింగ్ భూరియా కమిటీ గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలనకు 3 అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది. అవి:
ఎ) గ్రామసభ: ఇది గిరిజనులు నివసించే సహజ ప్రాంతంపై ఆధిపత్యం కలిగి ఉండి, ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది.
బి) గ్రామ పంచాయతీ: ఇది గ్రామ సభ నుంచి ఎన్నికైన ప్రతినిధులతో ఏర్పడుతుంది.
సి) బ్లాకు/ తాలూకా: ఇది అత్యున్నత స్థాయి సంస్థ.  జిల్లా కౌన్సిల్‌లా ఉండే సంస్థ.


కీలకాంశాలు
గ్రామ ఓటరు జాబితాలో పేరు నమోదు అయిన వ్యక్తులతో కూడిన గ్రామసభ ఉంటుంది.
గ్రామసభ తమ ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక గుర్తింపు, సామాజిక వనరులు, వివాద పరిష్కారాలు మొదలైన వాటిని భద్రంగా నిలిపి ఉంచడానికి, సంరక్షించుకోవడానికి అధికారాలు కలిగి ఉంటుంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌