• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ వ్యవసాయ రంగం  

సగానికిపైగా.. సాగుపైనే!
 

 వ్యవసాయమే భారత జీవన విధానం. సేద్యమే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఇప్పటికీ సగానికిపైగా జనాభాకు ఆదాయ, ఉపాధి వనరులను ఈ రంగమే అందిస్తోంది. ఆహారభద్రతకు, గ్రామీణాభివృద్ధికి కీలకమైన ఆ ప్రాథమిక రంగం స్వరూపం, ప్రాధాన్యంపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. స్వాతంత్య్రానికి పూర్వం వలస విధానాలతో అన్నివిధాలుగా దెబ్బతిన్న సాగు రంగం, స్వాతంత్య్రానంతరం ప్రణాళికలు, ప్రభుత్వ విధానాలతో జవసత్వాలను సంతరించుకోవడం, ఈ పరిణామ క్రమంలో పంటల తీరులో వచ్చిన మార్పులు, ప్రభావితం చేసిన అంశాలు, సంబంధిత గణాంకాల గురించి తెలుసుకోవాలి.

ఆంగ్లేయులు రాక ముందు భారతదేశంలో వ్యవసాయం, పరిశ్రమల మధ్య సమతౌల్యం ఉండేది. బ్రిటిష్‌ పాలనలో అవలంబించిన విధానాల వల్ల గ్రామీణ చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించాయి. వ్యవసాయం అభివృద్ధి జరగలేదు. వ్యవసాయదారుడికి జీవనాధార ఆదాయం మాత్రమే మిగిలేది.ఫలితంగా స్వాతంత్య్రానికి ముందు వ్యవసాయం జీవనాధార ఉపాధిగానే ఉండేది. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికలు, ముఖ్యంగా హరిత విప్లవం వల్ల కొంతమంది వ్యవసాయదారులు వాణిజ్య ప్రాతిపదికన వ్యవసాయం చేపట్టారు.

జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 2/3వ వంతు జాతీయ ఆదాయం వ్యవసాయం నుంచే వచ్చేది. పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు, అవస్థాపనా సదుపాయాలు అభివృద్ధి కాకపోవడమే దీనికి కారణం. ప్రణాళికలు ప్రారంభించిన తర్వాత ద్వితీయ, తృతీయ రంగాలు అభివృద్ధి చెందడంతో వ్యవసాయం వాటా తగ్గుతూ వచ్చింది. 1950-51లో జీడీపీలో వ్యవసాయం రంగం వాటా 53.1 శాతం ఉండగా, 1980-81 నాటికి 36 శాతానికి, 1990-91 నాటికి 29.6 శాతానికి తగ్గింది. ప్రస్తుత ధరల్లో వ్యవసాయ రంగం వాటా 21.1% (2022-23). అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం నుంచి తక్కువ వాటా వస్తుంది.

ఉదా: అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లో జీడీపీలో వ్యవసాయం వాటా 2% మాత్రమే.

ఉపాధిలో వాటా: 1950-51లో మొత్తం ఉపాధిలో వ్యవసాయంపై ఆధారపడినవారు 72%. అంటే 3/4వ వంతు మంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 54.6% వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 27వ రౌండ్‌ (1972-73) ప్రకారం 73.9%, 68వ రౌండ్‌ (2011-12) ప్రకారం 48.9% జనాభాకు వ్యవసాయమే ఆధారం. ఇతర రంగాలు సరిపడా ఉపాధి కల్పించకపోవడంతో పెరిగే జనాభా వ్యవసాయంపైనే జీవించాల్సి వస్తోంది. ఫలితంగా అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏర్పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికాలో 2%, ఇంగ్లండ్‌లో 2%, జపాన్‌లో 4% ప్రజలు మాత్రమే సాగు రంగంలో ఉపాధి పొందుతున్నారు.

వ్యవసాయంపై ఆధారపడిన వారిని రెండు రకాలుగా పేర్కొనవచ్చు. 1) వ్యవసాయదారులు 2) వ్యవసాయ కూలీలు. దేశంలో వ్యవసాయదారులు రోజురోజుకి తగ్గిపోతుంటే, కూలీల శాతం పెరుగుతోంది. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. ఉదా: మొత్తం వ్యవసాయంపై ఆధారపడినవారిలో వ్యవసాయదారులు 1951లో 72% ఉండేవారు. 2011 నాటికి 45 శాతానికి తగ్గారు. ఇదేకాలంలో వ్యవసాయ కూలీలు 28% నుంచి 54.9 శాతానికి పెరిగారు. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121.09 కోట్లు. వీరిలో మొత్తం శ్రామికులు 48.19 కోట్లు. ఇందులో వ్యవసాయరంగ శ్రామికులు 26.3 కోట్లు (54.6%). వీరిలో వ్యవసాయదారులు 11.88 కోట్లు (45.1%), వ్యవసాయ కూలీలు 14.4 కోట్లు (54.9%).

వృద్ధి రేటు: రంగరాజన్‌ ప్రకారం వ్యవసాయ రంగంలో ఒక శాతం వృద్ధి సాధిస్తే అది పారిశ్రామిక ఉత్పత్తిని  0.5%, జాతీయ ఆదాయం వృద్ధిరేటుని 0.7% పెంచుతుంది. అందుకే 12వ ప్రణాళికలో జీడీపీ వృద్ధి 8% ఉండాలంటే వ్యవసాయ రంగం 4% వృద్ధి సాధించాలని నిర్ణయించారు. కానీ సాధించింది 2.86% మాత్రమే.

స్థూల మూలధన కల్పన:  మూలధన కల్పన రేటు పెరగకపోతే ఆర్థికాభివృద్ధిని సాధించడం సాధ్యం కాదు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతిపెద్ద పరిశ్రమ వ్యవసాయమే. అందుకే మూలధన కల్పన రేటు పెంచడంలో వ్యవసాయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగినప్పుడు వ్యవసాయ మిగులు అధికమవుతుంది. ప్రస్తుత ధరల్లో దేశ స్థూల మూలధన కల్పనలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 8.0 శాతానికి పెరిగింది.

ఆహారధాన్యాల సరఫరా: భారత్‌ లాంటి అధిక జనాభా దేశాల్లో ఆహారధాన్యాల డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. తలసరి ఆదాయం అధికమైనకొద్దీ ఆహారానికి డిమాండ్‌ అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది. ఆదాయ డిమాండ్‌ వ్యాకోచత్వం ఆహారానికి అధికంగా ఉంటుంది. పెరిగే జనాభాకు అవసరమైన ఆహారధాన్యాలు సరఫరా చేయాలి. లేకపోతే భారీమొత్తంలో ఆహారధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సి  వస్తుంది. 2023-24లో ఆహారధాన్యాల ఉత్పత్తి 332.0 మిలియన్‌ టన్నులు. 

పారిశ్రామికాభివృద్ధి: జాతీయ ప్రాధాన్యం ఉన్న కొన్ని పరిశ్రమలకు వ్యవసాయ రంగమే ముడి పదార్థాలను అందిస్తుంది.

ఉదా: వస్త్ర, జనపనార, పంచదార, వనస్పతి పరిశ్రమలు. చాలా చిన్న పరిశ్రమలకు వ్యవసాయమే ఆధారం. ఉదా: చేనేత, రైస్, ఆయిల్‌ మిల్స్‌ మొదలైనవి.ఠాగ్నర్‌ నర్క్స్‌ ప్రకారం గ్రామాల్లో పేదలు ఎక్కువగా ఉండటం వల్ల పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్‌ కల్పించలేకపోతున్నారు.


అంతర్జాతీయ వ్యాపారం: దేశ ఎగుమతుల ఆదాయంలో చాలా కాలంపాటు వస్త్రాలు, జనపనార, తేయాకు కలిపి 50% అందించేవి. వీటితోపాటు జీడిపప్పు, పొగాకు, కాఫీ, వనస్పతి నూనెలు, పంచదార కూడా తర్వాతి కాలంలో ఎగుమతి అయ్యాయి. దీనివల్ల ఎగుమతుల్లో కూడా 70 శాతం వరకు వ్యవసాయంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇది వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. అయితే అభివృద్ధి జరిగి ఉత్పత్తుల్లో వైవిధ్యం రావడంవల్ల వ్యవసాయఎగుమతులు తగ్గుతున్నాయి. ఉదా: మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయఎగుమతులు 1960-61లో 44% ఉంటే, 2022-23 నాటికి 11.94%కి తగ్గాయి. విదేశీమారక ద్రవ్యం ఆర్జనకు వ్యవసాయఉత్పత్తుల ఎగుమతులు కీలకమవుతున్నాయి. భారతఉత్పత్తులు ఎక్కువగా అమెరికా, సౌదీ అరేబియాకు వెళుతున్నాయి. అలాగే దిగుమతుల్లో వ్యవసాయ ఉత్పత్తుల వాటా 5.07%.

ఆర్థిక ప్రణాళికల్లో వ్యవసాయ రంగం పాత్ర: ప్రణాళికల రూపకల్పనలో కూడా వ్యవసాయం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఉదా: మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగంపై 31% నిధులు కేటాయించగా 12వ ప్రణాళిక నాటికి 17.2 శాతానికి తగ్గింది. పైగా 12వ ప్రణాళిక లక్ష్యాన్ని సాధించాలంటే వ్యవసాయ రంగం అంతకంటే ముందు 4% వృద్ధి సాధించాలి.

పేదరికం తగ్గింపు: బ్రిక్స్‌ దేశాల నివేదిక ప్రకారం వ్యవసాయ రంగంలో 1% వృద్ధి సాధిస్తే కనీసం 2-3 రెట్లు ఎక్కువ సమర్థంగా పేదరికాన్ని తగ్గించవచ్చు. దేశంలో రవాణా, బ్యాంకింగ్‌ రంగాల అభివృద్ధి, పశుసంపద ప్రగతి, బడ్జెట్‌ల రూపకల్పనకు వ్యవసాయం దోహదపడుతుంది. ప్రపంచంలో పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తుల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉంది. వరి, గోధుమ, పండ్లు, కూరగాయలు, చెరకు, వేరుశెనగ, పత్తి ఉత్పత్తుల్లో రెండో స్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. నేటికీ భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగానే పిలుస్తారు. దేశానికి ఆహార భద్రత అందించేది కూడా వ్యవసాయమే. 2015-16 జాతీయ ఉద్యానవనాల బోర్డు గణాంకాల ప్రకారం పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానంలో; అరటి, మామిడి, నిమ్మ, బొప్పాయి ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉంది.

 

పంటల తీరు: నిర్దిష్ట కాలంలో వివిధ పంటల కింద ఉన్న భూమి అనుపాతాన్ని, అందులోని మార్పులను పంటల తీరు తెలియజేస్తుంది. భారతదేశంలో పంటల తీరును సహజ కారకాలు, ఆర్థిక కారకాలు, సాంకేతిక కారణాలు, ప్రభుత్వ విధానాలు ప్రభావితం చేస్తాయి. 

ఎ) మొత్తం పంట విస్తీర్ణంలో ఆహార పంటలు (కాయధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు) 3/4వ వంతు ఉన్నాయి. ఉదా: 1950-51లో ఆహార ధాన్యాల్లో కాయధాన్యాల విస్తీర్ణం కింద ఉన్న వాటా 80.4%. ఈ వాటా 2021-22 నాటికి 76 శాతానికి తగ్గింది. పప్పుధాన్యాల వాటా 20 నుంచి 24 శాతానికి పెరిగింది.

బి) ఆహార ధాన్యాల్లో ప్రధాన పంట వరి: 1950-51లో ఆహార ధాన్యాల విస్తీర్ణంలో వరి 31.6% ఉండగా, 2021-22 నాటికి 36 శాతానికి పెరిగింది.అంటే ఆహారధాన్యాల విస్తీర్ణంలో 1/3వ వంతు కంటే ఎక్కువ ఉంది.

సి) ఆహార ధాన్యాల్లో రెండో ప్రాధాన్య పంట గోధుమ: 1950-51లో ఆహార ధాన్యాల విస్తీర్ణంలో గోధుమ 10% ఉండేది. 2021-22 నాటికి 37% శాతానికి పెరిగింది. అంటే సుమారు 1/3వ వంతుకు చేరింది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో ఇది ఎక్కువగా పెరిగింది. ఈ విస్తీర్ణానికి కారణం సాంకేతిక పరిజ్ఞానం, మద్దతు ధర, మార్కెట్‌ అవస్థాపన.

డి) ముతక ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. జొన్న, సజ్జలు, మొక్కజొన్న మొదలైన పంటల వాటా 1950-51లో 28.6% ఉండగా, 2021-22 నాటికి 17 శాతానికి పడిపోయింది.

ఇ) నూనెగింజల్లో స్వయంసమృద్ధి సాధించేందుకు 1985-86లో నేషనల్‌ ఆయిల్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఎన్‌ఓడీపీ), 1986లో టెక్నాలజీ మిషన్‌ ఆన్‌ ఆయిల్‌ సీడ్స్‌ (టీఎమ్‌ఓ), 1987-88లో ఆయిల్‌ సీడ్స్‌ ప్రొడక్షన్‌ ట్రస్ట్‌ ప్రోగ్రామ్‌ (ఓపీటీపీ) పథకాలను ప్రారంభించారు. వీటి వల్ల నూనెగింజల సాగు విస్తీర్ణం 2021-22 నాటికి 29.2 మిలియన్‌ హెక్టార్లకు చేరింది.

ఎఫ్‌) వాణిజ్య పంటల సేద్య విస్తీర్ణం కూడా పెరుగుతోంది. ఉదా: చెరకు పంట 1950-51లో 1.7 మి.హె. ఉండగా, 2021-22 నాటికి 5.1 మి.హె.లకు పెరిగింది.

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 
 

Posted Date : 29-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌