• facebook
  • whatsapp
  • telegram

 వ్యవసాయ రంగం-అల్ప ఉత్పాదకత

కష్టాలసాగులో నష్టాల దిగుబడి!

  సరాసరి సాగుభూమి తక్కువ. దానిపై ఉపాధికి ఆధారపడిన శ్రామికులు ఎక్కువ. రైతుల్లో చాలామంది పేదలు, నిరక్షరాస్యులు. ఉత్పత్తి రవాణాకు సరైన సౌకర్యాలు లేవు. మాయలతో నిండిన మార్కెటింగ్‌. పెట్టుబడుల కొరత. వడ్డీల మోత. దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి. ఇన్ని కష్టాల మధ్య నష్టాలతో సేద్యం సాగుతోంది.  మన దేశంలో పంట ఉత్పాదకత తగ్గడానికి ఇవన్నీ కారణాలే. 

 

ఉత్పాకత అంటే ఒక హెక్టారులో పండే సగటు ఉత్పత్తి పరిమాణం. సాధారణంగా వివిధ పంటలకు సంబంధించి ఒక హెక్టారు లేదా ఎకరా భూమి నుంచి వచ్చే దిగుబడి అని చెప్పవచ్చు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు భారతదేశ వ్యవసాయ ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు 2014లో బెల్జియంలో ఒక హెక్టారుకు గోధుమల ఉత్పాదకత 9430 కిలోలు కాగా అమెరికాలో మొక్కజొన్నల ఉత్పాదకత 10,073 కిలోలు. 2018 - 19లో భారతదేశంలో ఈ రెండు పంటల ఉత్పాదకత కేవలం ఒక హెక్టారుకు 3000 కిలోలుగా ఉంది. 2000 - 2020 మధ్య కాలంలో మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి మనదేశంలో హెక్టారుకు సరాసరిన 1380 కి.గ్రా. నుంచి 2325 కి.గ్రాకు పెరిగింది. ఇదేకాలంలో నూనెగింజల దిగుబడి 810 కి.గ్రా. నుంచి 1236 కి.గ్రా.కు పెరిగింది. అంటే ఈ 20 ఏళ్ల కాలంలో చెప్పుకోదగిన రీతిలో పంట దిగుబడి పెరగలేదు.

 2018-19 నాటికి దేశంలో మొత్తం భూవిస్తీర్ణం 328.7 మిలియన్‌ హెక్టార్లు, నికర సేద్య భూమి 139.3 మిలియన్‌ హెక్టార్లు, స్థూల లేదా మొత్తం సాగుభూమి 197.3 మిలియన్‌ హెక్టార్లు. పంటల సాంద్రత 141.6 శాతం (నిర్ణీత భూవిస్తీర్ణంలో ఏడాదిలో ఎన్నిసార్లు ఒక పంటను పండిస్తారో తెలిపే సూచీని పంటల సాంద్రత/ తీవ్రత అంటారు). మొత్తం భూవిస్తీర్ణంలో 42.4 శాతం నికర సేద్యభూమి ఉంది. 


నికర సాగునీటిపారుదల విస్తీర్ణం 71.6 మిలియన్‌ హెక్టార్లు, భూవినియోగ విస్తీర్ణం 3,07,787 వేల హెక్టార్లు, అడవులు 72,011 వేల హెక్టార్లు, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి 27,344 వేల హెక్టార్లు; బంజరు, వ్యవసాయ యోగ్యం కాని భూములు 17,168 వేల హెక్టార్లు; పచ్చికబయళ్లు, పశువుల మేత పెంచే భూములు 10,376 వేల హెక్టార్లు, బంజరుగా ఉన్న సేద్యభూమి 12,219 వేల హెక్టార్లు, నికర సేద్యభూమిలోకి చేర్చని వివిధ వృక్ష తోటలు 3154 వేల హెక్టార్లు, ప్రస్తుత బీడు భూములు 14,531 వేల హెక్టార్లు, నికర సేద్యభూమి 1,39,351 వేల హెక్టార్లు, వ్యవసాయ భూమి 1,80,888 వేల హెక్టార్లు, సాగుభూమి 1,53,882 వేల హెక్టార్లు. 

 

ప్రభావితం చేసే అంశాలు


సాగుభూమి నాణ్యత, తగిన నీటిపారుదల సౌకర్యాల కల్పన, మేలురకం విత్తనాలు, ఎరువుల వాడకం లాంటివి పంటల ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. అలాగే నాసిరకం విత్తనాలు, అధిక మోతాదులో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పంటల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి హెక్టారులో పండించే పంట దిగుబడిని టన్నులు,  కిలోగ్రాములు/బేళ్లలో లెక్కించి ఉత్పాదకతను అంచనా వేస్తారు. సంప్రదాయ లేదా పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల స్వాతంత్య్రానికి పూర్వం  ఉత్పాదకత తక్కువగా ఉండేది. ప్రణాళికల అమలు ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది పంట ఉత్పాదకత పెరిగింది. ముఖ్యంగా 1966-67 తర్వాత నూతన వ్యవసాయ వ్యూహం అమలు, అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల దిగుబడి పెరిగింది. హరిత విప్లవానికి ముందు 9 హెక్టార్లకు 900 కేజీలుగా ఉన్న వరి దిగుబడి 1100 కిలోలకు పెరిగింది. ఆ కాలంలో వరి వార్షిక వృద్ధిరేటు కూడా 2.1 శాతం ఉండేది. హరిత విప్లవం ప్రభావం వల్ల వరి వార్షిక వృద్ధిరేటు కంటే తక్కువగా ఉన్న గోధుమ పంట వార్షిక వృద్ధిరేటు బాగా పెరిగింది.

తక్కువ దిగుబడి ఎందుకంటే?

భారత దేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిని మూడు ప్రధాన భాగాలుగా విభజించి విశ్లేషించవచ్చు.


సాధారణ కారణాలు:


ఎ) భూమిపై జనాభా ఒత్తిడి: ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) వరల్డ్‌ పాప్యులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌-2022 నివేదిక ప్రకారం మన దేశంలో 2022లో మొత్తం జనాభా 141.2 కోట్లు ఉంది. 2050 నాటికి అది 166.8 కోట్లకు చేరుతుందని అంచనా. భారత దేశంలో అధిక శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆంగ్లేయుల కాలంలో సంప్రదాయ పరిశ్రమలు దెబ్బతిని వారు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. స్వాతంత్య్రం తర్వాత 1951లో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా, మొత్తం శ్రామిక జనాభాలో 72 శాతం. 1991 నాటికి ఇది 67 శాతానికి, 2001 నాటికి 59 శాతానికి తగ్గింది.


          భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇచ్చిన రైతుల సంక్షేమం, వార్షిక నివేదిక - 2021-22 ప్రకారం ప్రస్తుతం దేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా 54.6 శాతం. ఇదే నివేదిక ప్రకారం 2021- 22 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద మన దేశంలో స్థూల అదనపు విలువ (జీవీఏ)లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 18.8 శాతంగా ఉంది. పరిశ్రమ, సేవా రంగాలు అభివృద్ధి చెందినప్పటికీ వ్యవసాయ రంగం మిగులు శ్రామికులకు అవి ఉపాధి కల్పించలేకపోతున్నాయి. దాంతో వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏర్పడింది. అంటే ఉత్పత్తి ప్రక్రియల్లో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది ఉంటే వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. తలసరి సాగుభూమి 1901లో 0.43 హెక్టార్ల నుంచి 2001లో 0.20 హెక్టార్లకు తగ్గిపోయింది. కమతాల విభజన, విఘటన వల్ల వాటి పరిమాణం తగ్గిపోయింది. ఫలితంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అనువుగా ఉండదు. 

బి) గ్రామీణ సాంఘిక వాతావరణం: వ్యవసాయదారుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. వీరు సంప్రదాయ అలవాట్లు, మూఢ నమ్మకాలతో అనాదిగా వస్తున్న ఆచారాలు, కట్టుబాట్లను పాటిస్తారు. ఈ సామాజిక వాతావరణం ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అనుసరించడానికి అవరోధంగా ఉంటోంది. గ్రామ ప్రజలు పట్టుదల, పంతాల వల్ల తగాదాలతో ధనం, కాలాన్ని వృథా చేసుకుంటున్నారు.


సి) వ్యవసాయేతర సేవల లోపం: వ్యవసాయాభివృద్ధికి వ్యవసాయ పరపతి, మార్కెటింగ్, రవాణా, సమాచార సౌకర్యాలు అవసరం. భారతదేశంలో మొదటి నుంచి సంస్థాగత పరపతి సౌకర్యం లేక రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా ఆధారపడుతూ వచ్చారు.అధిక వడ్డీలతో రుణభారం పెరిగి భూములు అమ్ముకుని కౌలుదారులు, కూలీలుగా మారే పరిస్థితులు తలెత్తాయి. దాంతోపాటు గ్రామాలను పట్టణాలకు కలిపే రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడం, గిడ్డంగి సౌకర్యాలు లేక పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడం, మార్కెట్‌ సమాచారం, మార్కెటింగ్‌ వసతులు తక్కువగా ఉండటం తదితర లోపాలు కూడా రైతులకు నిరుత్సాహాన్ని కలిగించాయి. వీటి వల్ల వ్యవసాయాభివృద్ధికి అవరోధం కొనసాగుతూ వచ్చింది.


డి) వలస పాలన: ఆంగ్లేయుల పాలనలో వ్యవసాయాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోలేదు. ఇంగ్లండ్‌లో వ్యవసాయ విప్లవం ఏర్పడినప్పటికీ మన దేశంలో అందుకు అనుకూల పరిస్థితులను కల్పించలేదు. రైల్వేల అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యం నీటి పారుదల సౌకర్యాలు పెంచడానికి ఇవ్వలేదు.

 

వ్యవస్థాపూర్వక లోపాలు:


ఎ) చిన్న కమతాలు: భారతదేశంలో వంశపారంపర్య హక్కులు, వ్యవసాయంపై జనాభా ఒత్తిడి, రైతులపై రుణభారం లాంటి కారణాల వల్ల కమతాల విభజన, విఘటన జరుగుతూనే ఉంది. దాంతో వ్యవసాయ కమతం సగటు పరిమాణం 1991 నాటికి 1.57 హెక్టార్లకు క్షీణించింది. 2010 - 11లో సగటు భూకమతాల పరిమాణం 1.15 హెక్టార్లు ఉండగా 2015 - 16 నాటికి 1.08 హెక్టార్లకు తగ్గింది. ఆధునిక పనిముట్లు ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి చిన్న కమతాలు అనుకూలం కాదు.  కొత్త ఉత్పత్తి పద్ధతులు ఉపయోగించడానికి చిన్న, ఉపాంత రైతుల ఆర్థిక స్థోమత కూడా సరిపోదు. 


బి) భూస్వామ్య పద్ధతులు - కౌలు విధానాలు: ఆంగ్లేయుల పాలనా కాలంలో ఏర్పాటు చేసిన జమీందారీ వ్యవస్థ వ్యవసాయాభివృద్ధికి  ఆటంకమైంది. కౌలు విధానంలో కౌలుదారులకు భద్రత కరవైంది.

 

సాంకేతిక ఇబ్బందులు:


ఎ) పురాతన ఉత్పత్తి పద్ధతులు: అవగాహన రాహిత్యం, పేదరికం కారణంగా అనేక మంది  అన్నదాతలు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పాదకతను పెంచుకోలేకపోతున్నారు. నాణ్యమైన విత్తనాల వినియోగం, ఎరువుల వాడకం, క్రిమిసంహారక మందుల వాడకం పెద్దగా లేకపోవడంతో ఉత్పాదకత తక్కువగా ఉంది. ఆధునిక వ్యవసాయ పనిముట్ల వాడకమూ అంతంత మాత్రమే. హరిత విప్లవం అన్ని ప్రాంతాలకు విస్తరించలేదు. పేద రైతులు కొత్త వ్యవసాయక వ్యూహాన్ని అమలు చేసే స్థితిలో లేరు. 


బి) నీటి పారుదల సౌకర్యాల కొరత: భారత దేశంలో వ్యవసాయ రంగం ప్రధాన సమస్య నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడం. 60 శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రైతుల సంక్షేమం, వార్షిక నివేదిక 2021-22 ప్రకారం నికర నీటి పారుదల విస్తీర్ణం 71,554 వేల హెక్టార్లు, స్థూల నీటి పారుదల భూమి 1,02,667 వేల హెక్టార్లు. మనదేశంలో అనేక మార్గాల ద్వారా భూమి సాగు చేస్తున్నారు. ప్రధానంగా కాలువలు, చెరువులు, గొట్టపు బావులు, భారీ, మధ్య తరహా, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా సాగుభూమి విస్తరణ జరుగుతోంది. 


కొన్నేళ్లు వర్షాలు సకాలంలో పడక, మరికొన్నేళ్లు అసలు వర్షాలే లేకపోవడంతో వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతింటోంది. నీటి నిర్వహణ లోపం లాంటివి.

 

ప్రభుత్వం తీసుకున్న చర్యలు


వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం పలురకాల చర్యలు చేపట్టింది. 


* భూసంస్కరణలను ప్రవేశపెట్టింది. 

* జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది.

* 1966 నుంచి నూతన వ్యవసాయ వ్యూహం ప్రవేశపెట్టింది.

* అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, పంటల మార్పిడి పద్ధతులతో హరిత విప్లవం వచ్చింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికమై ఉత్పాదకత పెరిగింది.

* గిడ్డంగుల నిర్మాణం, కనీస మద్దతు ధరల విధానం వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అదేవిధంగా సహకార, వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యవసాయ పరపతి సౌకర్యం పెంచారు. 

* ఎరువుల సబ్సిడీ, మేలు రకం విత్తనాల పంపిణీ లాంటి చర్యల వల్ల ఉత్పాదకత పెరిగింది. 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 04-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌