• facebook
  • whatsapp
  • telegram

భారత తపాలా వ్యవస్థ డిజిటల్‌ ఇండియా

తరతరాల తపాలా  సేవలు!

దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత సేవల్లో తపాలాకు ప్రత్యేక స్థానం ఉంది. సమాచార వ్యవస్థలో తొలి అడుగుగా ప్రారంభమైన ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా తన పరిధిని, సేవలను విస్తరించింది. ఎప్పటికప్పుడు సంస్థాగత మార్పులు చేసుకుంటూ, ఆధునిక ధోరణుల్ని అనుసరిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. తపాలా వ్యవస్థ పూర్వాపరాలు, కాలానుగుణంగా ఎలాంటి మార్పులకు గురైంది, ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఆధునిక సాంకేతికతతో ప్రజల అవసరాలు ఎలా తీరుస్తోందనే అంశాలను అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. సమాచార ప్రసార రంగంలో టెలికాం విప్లవం తీసుకొచ్చిన పెనుమార్పులు, ప్రస్తుతం డిజిటల్‌ ఇండియా లక్ష్య సాధనలో ప్రభుత్వం చూపుతున్న చొరవ, ఈ దిశగా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి పూర్తి అవగాహనతో ఉండాలి.

భారతదేశంలో మౌర్య సామ్రాజ్యంలో పాలనా అవసరాల కోసం తపాలా వ్యవస్థ ప్రారంభమైనట్లు ఆధారాలున్నాయి. మధ్యయుగంలో 14వ శతాబ్దంలో మైసూరును పాలించిన వడయార్లు కూడా పరిపాలనా అవసరాల కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆధునిక యుగంలో ఆంగ్లేయ పాలనలో ఈస్టిండియా కంపెనీ తన వాణిజ్య వ్యవహారాలు, నిర్వహణ నిమిత్తం తపాలా వ్యవస్థను నడిపింది. 1727లో కలకత్తాలో మొదటి ఆధునిక తపాలా కార్యాలయం ప్రారంభమైంది. 1774లో కలకత్తాలో, 1786లో మద్రాస్, 1793లో బొంబాయిలో సాధారణ తపాలా కార్యాలయాలు మొదలయ్యాయి. 1837లో తపాలా కార్యాలయాల చట్టం వచ్చింది. దీని స్థానంలో 1854లో మరింత సమగ్ర చట్టం ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం దేశంలో రైల్వే తపాలా సేవలు; ఇంగ్ల్లండ్, చైనాలకు సమగ్ర తపాలా సేవలు ప్రారంభమయ్యాయి. 1851లో కలకత్తా, డైమండ్‌ హార్బర్‌ల మధ్య తంతి సౌకర్యం ఆరంభమైంది. మొదట ప్రజా పనుల శాఖలో భాగంగా ప్రారంభించిన తంతి తపాలా వ్యవస్థను 1854 నుంచి ప్రత్యేక శాఖగా వేరుచేశారు. 1882, జనవరి 28న కలకత్తా, ముంబయి, మద్రాస్‌ పట్టణాలలో టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీలు ఏర్పాటయ్యాయి. 1902లో వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ను ప్రవేశపెట్టారు. 1913లో సిమ్లాలో ఆటోమాటిక్‌ టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ (లఖ్‌నవూ - కాన్పుర్‌ మధ్య) ఏర్పాటైంది. 1953లో టెలెక్స్, 1960లో ఎస్‌.టి.డి. సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. 1975లో తంతి తపాలా శాఖ నుంచి టెలికాం వ్యవస్థను వేరుచేశారు. మొదటి శాటిలైట్‌ ఎర్త్‌ స్టేషన్‌ 1980లో నెలకొల్పారు. 1984లో సి-డాట్‌ సౌకర్యం ఏర్పాటైంది. 1986, ఆగస్టులో స్పీడ్‌పోస్ట్, 1996లో బిజినెస్‌ పోస్ట్‌ ప్రవేశపెట్టారు. 1995, ఆగస్టు 15న ఢిల్లీలో మొబైల్‌ సౌకర్యం ప్రారంభమైంది. 2008లో ఎలక్ట్రానిక్‌ మనీ ఆర్డర్‌ పద్ధతి, 2012లో మొబైల్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ సర్వీస్‌ (ఎం.ఎం.టి.ఎస్‌.), 2017 అక్టోబరులో ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ ఆర్డర్‌ పద్ధతి ప్రారంభమయ్యాయి.

భారత రాజ్యాంగం ప్రకారం తపాలా సేవలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. తపాలా కార్యాలయాలు కార్డులు, ఇన్లాండ్‌ కవర్లు, ఎన్వలప్, తపాలా బిల్లలు విక్రయించడం, జాతీయ, అంతర్జాతీయ ఉత్తరాలు, పార్సిళ్లు బట్వాడా చేయడం, పోస్టల్‌ ఆర్డర్లు విక్రయించడం, మనీఆర్డర్‌ ద్వారా నగదు బదిలీ చేయడం, పొదుపు ఖాతాలు నిర్వహించడం, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్‌ వికాస్‌ పత్రాలు విక్రయించడం, తపాలా జీవిత బీమా, పాస్‌పోర్టు దరఖాస్తులు పంపిణీ వంటి సేవలు అందిస్తాయి. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచార వ్యాప్తితో పాటు సాంఘిక భదత్రా ప్రయోజనాల పంపిణీ వంటి విధులు నిర్వర్తిస్తున్నాయి. అంధ్రప్రదేశ్‌లో తిరుపతి - తిరుమల దేవస్థానం టిక్కెట్లను కూడా విక్రయిస్తున్నాయి. విశ్రాంత ఉద్యోగుల జీవిత ధ్రువీకరణ పత్రాలను, జీవన్‌ ప్రమాణ్‌ విధానం ద్వారా నమోదు చేస్తున్నాయి.

భారతదేశంలో తపాలా కార్యాలయాలు (తపాలా వ్యవస్థ 2021-22 వార్షిక నివేదిక ప్రకారం)

తపాలా సర్కిల్‌ కార్యాలయాలు - 23

తపాలా ప్రాంతీయ కార్యాలయాలు - 54

తపాలా డివిజన్‌ కార్యాలయాలు - 446

సాధారణ తపాలా కార్యాలయాలు - 24

ప్రధాన తపాలా కార్యాలయాలు - 810

ఉప తపాలా కార్యాలయాలు - 25,123

మొత్తం తపాలా కార్యాలయాలు - 1,56,434

పట్టణ తపాలా కార్యాలయాలు - 15,379

గ్రామీణ తపాలా కార్యాలయాలు - 1,41,055

శాఖా తపాలా కార్యాలయాలు - 1,31,311

గ్రామీణ డాక్‌ సేవక్‌ తపాలా కార్యాలయాలు - 2,44,328

రాత్రి తపాలా కార్యాలయాలు - 115

తపాలా డివిజన్లు - 450

సగటున ఒక తపాలా కార్యాలయం సేవలు అందుకునే జనాభా - 8,713

సగటున ఒక తపాలా కార్యాలయం సేవలు అందుకునే గ్రామ జనాభా - 6,336

సగటున ఒక తపాలా కార్యాలయం సేవలు అందుకునే పట్టణ జనాభా - 30,519

సగటున ఒక తపాలా కార్యాలయం సేవలు అందించే ప్రాంత విస్తీర్ణం - 21.36 చ.కి.మీ.

రైల్వే మెయిల్‌ డివిజన్లు - 69

అంతర్జాతీయ స్పీడ్‌ పోస్ట్‌ సౌకర్యం ఉన్న దేశాలు 100

తపాలా జీవిత బీమా (పీఎల్‌ఐ)

ఈ సౌకర్యం 1884లో ప్రారంభమైంది. భారతదేశంలో ఎంతోకాలంగా అమలులో ఉన్న పథకాలలో ఇదొకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల కోసం ఈ బీమా ప్రవేశపెట్టారు. ఇందులో ఆరు రకాల బీమా పాలసీలు అందిస్తారు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చేయవచ్చు. గ్రామీణ తపాలా జీవిత బీమా (ఆర్‌.పి.ఎల్‌.ఐ) పథకం 1995లో గ్రామీణ జనాభా కోసం ప్రవేశపెట్టారు. ఇందులో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు బీమా చేయవచ్చు.


ఫిలేటలీ: తపాలా స్టాంపులు సేకరించే హాబీని ఫిలేటలీ అంటారు. తపాలా శాఖ వివిధ డినామినేషన్లలో తపాలా బిళ్లలు ముద్రిస్తుంది. తపాలా సేవలకు ఛార్జీలు ఈ రూపంలో వసూలు చేస్తుంది. అయితే అనేక సందర్భాలలో స్థానికతను ప్రతిబింబించే బిళ్లలు ముద్రిస్తుంది. మహనీయులు, నాయకులు, ప్రముఖ దినాలు వంటివి ఏవైనా స్మారక బిళ్లల అంశం కావచ్చు. 2021లో 11 బిళ్లలు విడుదల చేసింది. ఆయా సందర్భాలలో ఫస్ట్‌ డే కవర్స్‌ కూడా విడుదల చేస్తుంది. ఈ తపాలా బిళ్లలకు మంచి గిరాకీ ఉంటుంది.

ఐటి ఆధునికీకరణ ప్రాజెక్టు: తపాలా సంస్థ సామర్థ్యాన్ని పెంచడం, పరిపాలన, సేవలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ-పరిపాలన ప్రాజెక్టు 2012-13లో ప్రారంభమైంది. దీనితో తపాలా శాఖ నిర్వహణ ఆధునిక సాంకేతికతతో జరుగుతుంది. దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలు నెట్‌వర్కింగ్‌ ద్వారా అనుసంధానమవుతాయి. 2021, డిసెంబరు నాటికి వైడ్‌ ఏరియా నెట్‌వర్కింగ్‌ (డబ్ల్యూఏఎన్‌) ద్వారా 26,708 కార్యాలయాలను కలిపారు.

దర్పణ్‌: సమాచార ప్రసార ఆధునికీకరణ ప్రాజెక్టు కింద 2017లో ప్రారంభించిన కార్యక్రమం దర్పణ్‌. డిజిటల్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ ఫోస్ట్‌ ఆఫీసెస్‌ ఫర్‌ ఎ న్యూఇండియా (డి.ఎ.ఆర్‌.పి.ఎ.ఎన్‌) కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సామాజిక రంగ పథకాలు అమలవుతాయి. గ్రామీణ జనాభాకు బ్యాంకింగ్‌ సేవల నాణ్యత పెంచడం, అదనపు విలువ చేకూర్చడం దీని లక్ష్యాలు. 

జీవన ప్రమాణ్‌ కేంద్రాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పింఛన్‌దారులు బయోమెట్రిక్‌ పద్ధతిలో తమ జీవన ధ్రువీకరణ పత్రం సమర్పించేందుకు వీలు కల్పిస్తున్న పథకమే జీవన ప్రమాణ్‌. ఇది 2015, జూన్‌ 30 నుంచి అమలులోకి వచ్చింది. పింఛను చెల్లింపు అధికారుల ముందు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న పింఛన్‌దారులకు ప్రయాస తప్పించింది. మొబైల్‌ యాప్‌లో ఎలక్ట్రాన్‌ పద్ధతిలో కూడా డిజిటల్‌ ధ్రువపత్రాలు సమర్పించవచ్చు. 2021-22 నాటికి 8.38 లక్షల లైఫ్‌ సర్టిఫికెట్లు ఈ కేంద్రాల్లో ఇచ్చారు.

పాస్‌పోర్టు సేవాకేంద్రాలు

2017, జనవరి 25న మైసూరులోని మెటగల్లి, గుజరాత్‌లోని దాహోద్‌ తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవాకేంద్రాలు ప్రారంభమయ్యాయి. క్రమేణా 235 ప్రధాన తపాలా కార్యాలయాలలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

డిజిటల్‌ ఇండియా

ఈ కార్యక్రమాన్ని 2015, జులై 1న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశాన్ని పూర్తిగా డిజిటల్‌ దేశంగా మార్చడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది.

మౌలిక సౌకర్యాలు

1) ఆధార్‌

2) భారత్‌ బ్రాండ్‌ నెట్‌వర్క్‌

3) సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌

4) ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ - ఇండియా (సి.ఇ.ఆర్‌.టి-ఇన్‌)

5) కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు

6) సైబర్‌ కేంద్రం

7) డిజిటల్‌ సాక్షరతా అభియాన్‌

ఈ కార్యక్రమంలో కీలకమైన అంశాలు మూడు

1. డిజిటల్‌ అవస్థాపన సౌకర్యాలు

దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు, సాంఘిక, ఆర్థిక ప్రయోజనాలు సులభంగా, వేగంగా అందాలంటే అన్ని గ్రామాలకు, పట్టణాలకు అధిక వేగంతో పనిచేసే ఇంటర్నెట్‌ సౌకర్యం విస్తరించాలి. బ్రాడ్‌బాండ్‌ మార్గాలు ఏర్పడాలి. 2016-17 నాటికల్లా జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పథకం కింద 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు సామాజిక సేవా కేంద్రాల ద్వారా బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2015-16 నాటికి 1.5 లక్షల తపాలా కార్యాలయాలను బహుళ సేవా కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించారు. 2018 కల్లా మొబైల్‌ సేవలు అందని 55,619 గ్రామాలకు మొబైల్‌ అనుసంధానం చేయాలనుకున్నారు.

2) పరిపాలన కోసం, ప్రజల డిమాండ్‌ మేరకు సేవలు

సంప్రదాయ పద్ధతిలో కార్యాలయ సేవలు అందించటంలో ఆలస్యం, అసౌకర్యం ఎక్కువ. అందుకే ప్రభుత్వ రికార్డులను, పని ప్రక్రియను కంప్యూటరీకరించి ఇ-పరిపాలన వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత తీసుకురావడానికి ఇ-పాలన ఉపయోగపడుతుంది. ఇందుకోసం మేఘరాజ్‌ క్లౌడ్‌ వేదిక, మొబైల్‌ సేవ, పే-గవ్, ఐ-సంగం, మొదలైన వేదికలు ఏర్పాటయ్యాయి.

3. డిజిటల్‌ సాధికారత: డిజిటల్‌ సాంకేతికత ద్వారా అందే సేవలు ఉపయోగించుకుని డిజిటల్‌ అక్షరాస్యత, సాధికారత పొందవచ్చు. సామర్థ్యాలను పెంచుకోవచ్చు. ఆన్‌లైన్‌ కోర్సులు, నైపుణ్య శిక్షణ వంటివి ఇందులో భాగం. స్థానిక భాషల్లో సమాచారం, వనరులు, పత్రాలు పొందవచ్చు.

ఐజీఓటీ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నమెంట్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌) కర్మయోగి వేదిక 

ఇది ప్రభుత్వ ఉద్యోగులు ఆన్‌లైన్‌ పద్ధతిలో తమ వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకోవడానికి, చర్చించుకోవడానికి ఏర్పాటుచేసిన అభ్యసన వేదిక. ఏ సమయంలోనైనా, ఎక్కడినుంచైనా ఈ పోర్టల్‌లో 2 కోట్ల మంది శిక్షణ పొందటానికి అవకాశం ఉంది. మిషన్‌ కర్మయోగి కింద నిర్వహించే ఈ పోర్టల్‌ను 2022, జనవరిలో ఏర్పాటుచేశారు.

జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం: దీన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. 2016లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. 2018, జూన్‌ 19న జాతికి అంకితం చేశారు. ఇందులో ఆన్‌లైన్‌ ద్వారా 10 భాషల్లో గ్రంథాలు చూడవచ్చు. గూగుల్‌ ప్లే నుంచి దీని యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పిల్లలు, యువకుల కోసం ప్రత్యేకంగా ఒక జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటును 2023-24 బడ్జెట్‌లో ప్రకటించారు.

డిజిటల్‌ లాకర్‌: డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం 2015లో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. వ్యక్తులు, సంస్థలు తమ పత్రాలు, ధ్రువపత్రాలను ఈ లాకర్‌తో అనుసంధానం చేయవచ్చు. ప్రజలు తమ పత్రాలను భౌతికంగా తీసుకెళ్లకుండా, ఎక్కడినుంచైనా ఈ లాకర్‌ ద్వారా అందుకోవచ్చు.

జాతీయ డేటా పాలనా ఫ్రేంవర్క్‌ విధానం: 2022, మే లో కేంద్ర ప్రభుత్వం ఈ విధానం ముసాయిదా విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వ్యక్తిగతం కాని సమాచారాన్ని, పరిశోధనకు, నూతన ఆవిష్కరణలకు అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం. అంకుర సంస్థలు, విద్యావేత్తలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. 2023-24 బడ్జెట్‌లో ప్రకటించారు.

ఈ-కోర్టు మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టు: 2005లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. 2023లో ఏర్పాటుచేసిన ఈ-కమిటీ దీన్ని సిఫార్సు చేసింది. కేంద్ర న్యాయశాఖ నిధులు సమకూరుస్తుంది. కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయాధికారులకు కొన్ని ఎంపికచేసిన న్యాయ సంబంధ సమాచార సేవలు దీనిద్వారా అందుతాయి. దీని మూడవ దశను 2023-24 బడ్జెట్‌లో ప్రకటించారు.

ఆధార్‌: ఇది 12 అంకెల ఏకైక గుర్తింపు సంఖ్య. 2009లో ఏర్పాటు చేసిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ పౌరులకు వారి బయోమెట్రిక్‌ డేటా ఆధారంగా కేటాయిస్తుంది. పౌరులు స్వచ్ఛందంగా దీన్ని పొందవచ్చు. అనేక ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు, పౌరుల ఆర్థిక లావాదేవీలకు ఇది గుర్తింపు కార్డు. ఆదాయపన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ కార్డుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కేవైసీ: ‘మీ వినియోగదారుడు/ఖాతాదారుడిని తెలుసుకోండి’ అనే ఒక నిబంధన ద్వారా విత్త సంస్థలు/ వ్యాపార సంస్థలు తమ వినియోగదార్ల/ఖాతాదార్లను గుర్తిస్తాయి. ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలైన పత్రాలు, చిరునామా వంటి వివరాలు సేకరిస్తాయి. ఇది తప్పనిసరి.


 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 10-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌