• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక రంగం

శోధించు.. స్థాపించు.. సంపద సృష్టించు!

వనరుల సద్వినియోగం, ఉద్యోగావకాశాల కల్పన, సంపద సృష్టి పారిశ్రామికీకరణ పరమ లక్ష్యాలు. వాటి సాధనలో తెలంగాణ మంచి పురోగతిని సాధిస్తోంది. టీఎస్‌-ఐపాస్, టీ-హబ్‌ వంటి విధానాలను రూపొందించి సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది, అభివృద్ధి చేస్తోంది, పారిశ్రామిక రంగాన్ని పటిష్ఠం చేస్తోంది. పరిశోధనలు చేసి, స్టార్టప్‌లు స్థాపించి, సంపదను వృద్ధిచేసి ప్రగతి పథంలో నడుస్తోంది.  

 

  తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక రంగానికి చాలా ప్రాధాన్యం ఉంది. బలమైన పారిశ్రామిక రంగం ఉన్న రాష్ట్రాలు అధిక ఆర్థికవృద్ధి, ఆర్థిÄకాభివృద్ధిని సాధిస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయాన్ని పెంచడంలో పరిశ్రమలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. ఇది ప్రజల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని పొందవచ్చు.

   తెలంగాణ ఎన్నో భారీ పరిశ్రమలకు నిలయం. సిమెంటు, బల్క్‌డ్రగ్స్, ఔషధాలు, టెక్స్‌టైల్స్, ఆగ్రోప్రాసెసింగ్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, కోళ్ల పెంపకం లాంటివి ప్రధాన పరిశ్రమలు. ఐటీ ఆధారిత పరిశ్రమలు ఎంతోమందికి ఉపాధిని కల్పించడంతో పాటు ఇతర దేశాలకు సేవలందిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నాయి.

 

ప్రసిద్ధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు

  బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఈసీఈఎల్, డిఫెన్స్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్‌), ఐఐసీటీ, సీసీఎంబీ, నేషనల్‌ రిసెర్చ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ), సర్వే ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ), ఎన్‌ఐఆర్‌డీ, ఇక్రిశాట్‌ తదితర ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి.

  పరిశ్రమల పరంగా తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో, పరిశ్రమల నుంచి సమకూర్చే స్థూల విలువ ఆధారిత అంశాలను అనుసరించి ఎనిమిదో స్థానంలో ఉంది. విదేశీ, దేశీయ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని మలచడానికి ప్రోత్సాహకరమైన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు; ఎస్సీ, ఎస్టీలకు అనుకూలమైన సాధికారిక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

  తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక దృక్పథం (సోషియో ఎకనామిక్‌ అవుట్‌లుక్‌) - 2022 నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమల రంగం వాటా 20.40 శాతంగా ఉంది. ఈ రంగంలో రాష్ట్రంలో 18.23 శాతం వయోజనులు అంటే సుమారు 25,69,134 మంది ఉపాధి పొందుతున్నారు. ఎక్కువ మందికి నిర్మాణ, తయారీ రంగాలు ఉపాధి కల్పిస్తున్నాయి. 2019 - 20లో రాష్ట్రంలో తయారీ రంగంలో 58.6%, నిర్మాణ రంగంలో 36.3% మంది ఉపాధి పొందారు (15 - 59 మధ్య వయసు ఉన్నవారు).

 

రాష్ట్ర స్థూల అదనపు విలువలో పరిశ్రమల రంగం వాటా (ప్రస్తుత ధరల వద్ద) సంవత్సరం  పరిశ్రమల రంగం వాటా (%)  పారిశ్రామిక రంగం వృద్ధిరేటు (%)
2014 - 15 22.4 1.5
2015 - 16 23.6 19.8
2016 - 17 21.5 3.4
2017 - 18 22.2 16.6
2018 - 19 23.5 20.9
2019 - 20 20.7 (-)1.6
2020 - 21 19.8 (-)1.7
2021 - 22 20.4 20.2

ఆధారం: సోషియో ఎకానమీ అవుట్‌లుక్‌ - 2022, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 

 

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ

  పారిశ్రామిక వృద్ధిని కొలిచేందుకు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ్బఖిఖిశ్శి ఒక కొలబద్ద లాంటిది. పరిశ్రమల రంగంలో నిర్దిష్ట కాలంలో అంతకుముందు సంవత్సరపు అదే నిర్దిష్ట కాలంతో పోలుస్తూ ఉత్పత్తిలో వచ్చిన సాపేక్ష మార్పును ఈ సూచీ తెలియజేస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీని తయారీరంగ మైనింగ్, క్వారీయింగ్, విద్యుచ్ఛక్తికి సంబంధించిన ఎంపిక చేసిన యూనిట్ల నుంచి డేటా సేకరించి, నెలవారీగా అంచనా వేస్తారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ్బబిళీదీశ్శిలో పారిశ్రామిక రంగం వాటాను అంచనా వేయడం ఈ సూచీ ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీని 2011 - 12 ఆధార సంవత్సరంగా సంకలనం చేస్తున్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (2011-12తో పోలిస్తే 2021-22లో) 

ఏప్రిల్‌ - 153.3

మే - 154

జూన్‌ - 181.9

జులై - 158.9

ఆగస్టు - 152.4

సెప్టెంబరు - 156

అక్టోబరు - 175.8

నవంబరు - 155.4

  పరిశ్రమల వార్షిక సర్వే: రాష్ట్రంలో పారిశ్రామిక గణాంకాలకు ముఖ్యమైన ఆధారం పరిశ్రమల వార్షిక సర్వే. రాష్ట్ర ఆదాయానికి మొత్తం తయారీరంగం పరిశ్రమలతో పాటు ఒక్కో పరిశ్రమ అందించిన వాటాను అంచనా వేయడం దీని ఉద్దేశం. మొత్తం పరిశ్రమల రంగంతో పాటు ఒక్కో పరిశ్రమ నిర్మాణాన్ని క్రమానుగతంగా అధ్యయనం చేయడం, పరిశ్రమలను ప్రభావితం చేసే కారకాలను విశ్లేషించడం, విధాన రూపకల్పనకు అవసరమైన సమగ్ర వాస్తవిక క్రమానుగత ప్రాతిపదికను అందించడం ఈ సర్వే లక్ష్యాలు.

 

నూతన పారిశ్రామిక విధానం - 2014

  తెలంగాణలో ఆర్థిక వృద్ధికి, అభివృద్ధికి అనుసరించాల్సిన కీలక వ్యూహం పారిశ్రామికీకరణ. యువతరానికి ఉద్యోగ కల్పన, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, అందుబాటులో ఉన్న వనరులను ఆదర్శవంతంగా వినియోగించుకోవడం ద్వారా వృద్ధి అవకాశాలను పెంచడం, తద్వారా ప్రతి ఇంట్లో సంపదను సృష్టించడం లాంటి అంశాల్లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మీద భారీ ఆకాంక్షలు ఉన్నాయి. తెలంగాణ ప్రజల్లో నెలకొన్న ఈ ఆశలను  నెరవేర్చే సామర్థ్యం పారిశ్రామికీకరణకు ఉంది. దీనిలో భాగంగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం - 2014ను ప్రవేశపెట్టింది. 

  నవ్యావిష్కరణల కోసం పరిశోధన, పరిశ్రమల కోసం నవ్యావిష్కరణ, సంపద కోసం పరిశ్రమలు అనేది తెలంగాణ పారిశ్రామికీకరణ విషయంలో ప్రభుత్వ దార్శనిక దృక్పథం. ‘ఇన్నోవేట్, ఇన్‌క్యుబేట్, ఇన్‌కార్పొరేట్‌. (నవ్యావిష్కరణలు చేయండి, నూతన పరిశ్రమలకు శ్రీకారం చుట్టండి, సువ్యవస్థిత పరిశ్రమగా అవతరించండి)’ అనే నినాదం పారిశ్రామిక విధానం నిర్మాణానికి చోదకశక్తి. కరచాలనం చేసుకున్నంత సులువుగా వ్యాపారం సాగించే నియంత్రణ వాతావరణాన్ని కల్పించడమే ఈ విధానం ఉద్దేశం. నవ్యావిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను ముందుకు నడిపిస్తున్నాయి.

 

లక్ష్యాలు: * ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను మరింత పోటీ పడే విధంగా తీర్చిదిద్దడం.

* పారిశ్రామిక రంగంలోకి కొత్తగా అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం.

* పట్టణ, గ్రామీణ యువతరానికి ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా ఉత్పాదక రంగాలపై దృష్టి కేంద్రీకరించడం.

* అత్యంత పోటీ ధరలకు అత్యున్నత స్థాయి వస్తువులను ఉత్పత్తి చేయడం.

* ‘మేడ్‌ ఇన్‌ తెలంగాణ, మేడ్‌ ఇన్‌ ఇండియా’ను అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్‌గా నెలకొల్పడం.

 

పారిశ్రామిక విధానంలో పొందుపరిచే అంశాలు: 

* పరిశ్రమలకు లైసెన్సు మంజూరు 

* అవస్థాపన సౌకర్యాల ఏర్పాటు 

* మూలధన సమీకరణ 

* రాయితీలు 

* ప్రోత్సాహకాలు 

* పరపతి విధానం 

* పారిశ్రామిక సంబంధాలు 

* ఎగుమతులకు సంబంధించిన ఆంక్షలు 

* ఉద్యోగాల సృష్టి 

* విదేశీ మారక నిబంధనలు

 

టీఎస్‌-ఐపాస్‌: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, స్వయం ధ్రువీకరణ విధానం (TS-IPASS)  విధానాన్ని 2015 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పెట్టుబడుదారులకు అనుకూలంగా, పెట్టుబడులను పెద్ద మొత్తంలో ఆకర్షించేందుకు ఏర్పాటు చేశారు.  

 

టీ - హబ్‌:  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో టీ-హబ్‌ పేరుతో నవ్యావిష్కరణల కోసం ఒక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది సాంకేతికపరమైన స్టార్టప్‌లను అందించడం ద్వారా కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, మార్గదర్శకాలను సూచిస్తుంది. భిన్నమైన పరిశ్రమలను అనుసంధానం చేసేందుకు సహాయపడుతుంది. ఇందులో వ్యవస్థాపక భాగస్వాములైన ఐఎస్‌బీ, ఐఐఐటీ - హైదరాబాద్, నల్సార్‌ సంస్థలు ఈ సమగ్ర వ్యవస్థకు వ్యాపార సాంకేతిక, న్యాయ, నైపుణ్యాలను అందిస్తాయి. ప్రస్తుతం ఎడ్యుకేషన్, ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌ రంగం, క్లౌడ్‌ కంప్యూటింగ్, మొబైల్‌ అప్లికేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో స్టార్టప్‌లు పురోగతి సాధిస్తున్నాయి. ద్వితీయశ్రేణి టీ - హబ్‌గా వరంగల్‌ పట్టణాన్ని గుర్తించారు.

 

వై-ఫై సౌకర్యం: తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా సౌలభ్యం, కార్యనిర్వాహక సామర్థ్యం పెంచడం కోసం వై-ఫై కేంద్రాలను ఏర్పాటు చేసింది.

 

టీ - స్కాన్‌ (తెలంగాణ సచివాలయ క్యాంపస్‌ ఏరియా నెట్‌వర్క్‌): డేటా కోసం నెట్‌వర్క్‌ మీద 500 నోడ్స్‌తో అనుసంధానించేందుకు సచివాలయంలో తెలంగాణ సచివాలయ క్యాంపస్‌ ఏరియా నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేశారు.

 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 15-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌