• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయాభివృద్ధి - వ్యూహాలు - మార్పులు

ఆహార భద్రత.. ఆర్థిక సుస్థిరత!

  ప్రాచీనకాలం నుంచి ప్రజల జీవనానికి, ఉపాధికి ప్రధాన ఆధారం వ్యవసాయం. భిన్న నైసర్గిక స్వరూపాల మధ్య ప్రాంతాలవారీగా విభిన్న రీతుల్లో, వివిధ పద్ధతుల్లో సేద్యం సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతోంది. ఆధునిక సాగు విధానాలు ఆహార భద్రతకు, ఆర్థిక సుస్థిరతకు దోహదపడినప్పటికీ కొన్ని అనర్థాలకూ కారణమయ్యాయి. దాంతో సంప్రదాయ సేంద్రీయ సేద్యం, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధిలో వ్యవసాయరంగం పాత్ర, సాగు రకాలు తదితర అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

  

భూమిని దున్ని పంటలు సాగు చేయడాన్ని వ్యవసాయం అంటారు. పంటల సాగుతో పాటు మొక్కలు పెంచడం, పశువుల పోషణ, కోళ్లు, చేపల పెంపకం లాంటివన్నీ వ్యవసాయంలో భాగమే. మానవుడు సంచార జీవనం నుంచి స్థిర నివాస జీవనం ప్రారంభించిన కాలం నుంచే సాగు మొదలైంది. నాటి నుంచే మానవుడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం ప్రారంభించాడు. సాంఘిక జీవనానికి వ్యవసాయం పునాది వంటిది. ప్రాంతం, శీతోష్ణస్థితి, భూసారం, నీటిపారుదల, సాంకేతిక పరిజ్ఞాన లభ్యత, యాంత్రీకీకరణ లాంటి అంశాలపై వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. పారిశ్రామిక విప్లవం వల్ల సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం హరితవిప్లవానికి దారితీసింది. దాని ద్వారా వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ హరిత విప్లవం అధికంగా నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలకే పరిమితమైంది.

  2020-21 భారత ఆర్థిక సర్వే ప్రకారం నేటికీ దేశ జనాభాలో 54.6 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జాతీయాదాయంలో 18.8% శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తోంది. భారత ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 1966 - 69 మధ్య కాలంలో అనుసరించిన నూతన వ్యవసాయ వ్యూహం హరిత విప్లవసాధనకు ఉపయోగపడింది. సాగు నీటిపారుదల సౌకర్యాలు అధికమై సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. పంటల తీరులో మార్పు వచ్చి వాణిజ్య పంటల ప్రాధాన్యం పెరిగింది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు సంస్థాగత పరపతిని విస్తృతం చేశాయి.

  మన దేశంలో వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. అవి ఆలస్యమైనా, ఆగిపోయినా వ్యవసాయం విఫలమవుతుంది. అందువల్ల మన వ్యవసాయాన్ని ‘రుతుపవనాలతో ఆడే జూదం’గా స్వీడిష్‌ ఆర్థికవేత్త గున్నార్‌ మిర్దాల్‌ వర్ణించాడు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక మార్పు ప్రధానంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల పనితీరుపై ఆధారపడుతుంది. గ్రామీణ ప్రజల జీవనోపాధి, ఉద్యోగిత, ఆహార భద్రత విషయంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర పోషిస్తోంది.ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం మూడు రకాలుగా దోహదపడుతుంది

 

ఉత్పత్తి సహకారం: ప్రజలందరికీ ఆహార ధాన్యాలు సరఫరా చేయండంతో పాటు పారిశ్రామిక రంగానికి కావాల్సిన ముడి పదార్థాలను సమకూరుస్తుంది. 

 

కారక సహకారం: అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగానికి అవసరమయ్యే శ్రమ, మూలధనాన్ని బదిలీ చేస్తుంది. అలాగే వ్యవసాయ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. 

 

మార్కెట్‌ సహకారం:  సరఫరా, డిమాండ్‌ పరస్పరం ఆధారపడటాన్నే మార్కెట్‌ సహకారం అంటారు. దేశీయ, విదేశీ మార్కెట్లకు ఉత్పత్తులను వ్యవసాయ రంగం సరఫరా చేస్తుంది. ఇతర రంగాల నుంచి కొన్ని ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది.

 

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ ప్రాధాన్యం

* స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం గణనీయ వాటా కలిగి ఉంది.

* అధిక ఉద్యోగితను కల్పిస్తుంది.

* పరిశ్రమలకు ముడిపదార్థాలను అందిస్తుంది

* పారిశ్రామిక వస్తువులకు గిరాకీ సృష్టిస్తుంది.

* మూలధన సమీకరణ చేస్తుంది.

* ఆహార భద్రతను కల్పిస్తుంది.

* ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది.

* నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది. 

* వ్యవసాయ ఎగుమతులు జరుగుతాయి.

* పండ్లు, కూరగాయలకు తరగని డిమాండ్‌ ఉంటుంది.

 

వ్యవసాయం - రకాలు

వ్యవసాయం ఒక ప్రాంతం, శీతోష్ణస్థితి, భూసారం, నీటి పారుదల, సాంకేతిక పరిజ్ఞానం లభ్యత లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ వ్యత్యాసాన్ని బట్టి వ్యవసాయాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు.

 

విస్తాపన వ్యవసాయం: దీన్ని స్థల మార్పిడి వ్యవసాయం అని కూడా అంటారు. ఇందులో అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంటలు సాగు చేస్తారు. విస్తాపన వ్యవసాయం పూర్తిగా మనిషి శ్రమతోనే నడుస్తుంది. నాలుగైదేళ్ల తర్వాత భూసారం తగ్గుతుంది. అప్పుడు ఆ భూమిని వదిలి వేరే చోట అడవిని చదును చేసి పంటలు పండిస్తారు. ప్రధానంగా అటవీ ప్రాంతాల్లోని ఆటవిక తెగల వారు ఇలాంటి సాగు చేస్తారు.

 

స్థిర వ్యవసాయం: ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని ఒకే భూమిలో వ్యవసాయం చేస్తుంటారు. భూసారం తగ్గినప్పుడు దాన్ని సారవంతం చేయడానికి కొంత భూభాగాన్ని బీడుగా ఉంచి కొన్నేళ్ల తర్వాత మళ్లీ సాగు చేస్తారు.

 

జీవనాధార వ్యవసాయం: ఈ వ్యవసాయ ప్రధాన ఉద్దేశం గృహ, ఆహార అవసరాల కోసం పంటలు పండించడం. ఈ విధానంలో ఎక్కువగా ఆహార పంటలే పండిస్తారు.

 

వాణిజ్య వ్యవసాయం: అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. 

ఉదా: అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, తెగులు నివారణ మందులను ఉపయోగిస్తారు. ఇందులో ఆదాయాన్ని ఆర్జించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. 

 

విస్తృత వ్యవసాయం: ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమిలో అధిక పెట్టుబడితో సాగు చేయడాన్ని విస్తృత వ్యవసాయం అంటారు. ఈ పద్ధతిలో ఎక్కువ మంది కూలీలతో పాటు యంత్రాలను ఉపయోగిస్తారు.సాంద్ర వ్యవసాయం: తక్కువ విస్తీర్ణ భూమిలో ఆధునిక పద్ధతిలో సాగుచేసి ఎక్కువ దిగుబడిని పొందడాన్ని సాంద్ర వ్యవసాయం అంటారు.

 

మెట్ట సేద్యం: సాధారణంగా సహజ వర్షపాతంపై మాత్రమే ఆధారపడే భూములను మెట్ట భూములు అంటారు. 50 నుంచి 120 సెంటీమీటర్ల వరకు వర్షపాతం లభించే భూములను మెట్ట భూములుగా పరిగణిస్తారు. వీటికి నీటిపారుదల సదుపాయం ఉండదు. భారతదేశంలో 94 మిలియన్‌ హెక్టార్ల మెట్టభూమి ఉంది. దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 40 శాతం మెట్ట భూముల నుంచే లభిస్తోంది. వీటిలో పండే ప్రధాన పంటలు జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ, కందులు, మినుములు, పెసలు, నువ్వులు, వేరుశనగ. దేశంలో సుమారు 120 మెట్టసాగు జిల్లాలు ఉన్నాయి. ఇందులో 91 జిల్లాలు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి. మెట్ట నేలలో తేమ శాతంతో పాటు నత్రజని, భాస్వరం లాంటి పోషకపదార్థాలు తక్కువగా ఉండి ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. ఎక్కువగా చిన్నకమతాలుగా ఉండే ఈ భూములు నేల కోత, కరవుకు గురవుతూ ఉంటాయి. దేశంలో నేటికీ 50 శాతం పైగా పంట భూములు వర్షపాతం మీదే ఆధారపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పోషక విలువలున్న చిరుధాన్యాల వినియోగం పెరుగుతోంది. ఈ ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరగాల్సిన ఆవశ్యకత దృష్ట్యా మెట్ట సాగు ప్రాధాన్యం పెరిగింది.

 

సేంద్రియ వ్యవసాయం: అధిక దిగుబడుల కోసం రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడటంతో సేద్యపు భూములు కలుషితమయ్యాయి. భూసారం క్షీణించిపోయింది. చీడపీడలు నిరోధక శక్తి పెంచుకోవడంతో, నేలలో ఉండే వ్యవసాయానికి మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోయాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో పంట దిగుబడులు పెరగకపోగా, అనర్థాలు ఎక్కువయ్యాయి. సాగు వ్యయం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ముందుకొచ్చింది. ఇందులో సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు ఉపయోగిస్తారు. వ్యవసాయ, పశు వ్యర్థాలు, రాలిన ఆకులు ఎరువులుగా వినియోగమవుతాయి. పంట మార్పిడి, అంతర పంటల సాగు ఉంటుంది. భూమిలో సూక్ష్మజీవులు, వానపాముల సంఖ్య పెరిగి భూసారం పెరుగుతుంది. సేద్యపు ఖర్చుల తగ్గి పంట దిగుబడులు పెరుగుతాయి.

* కేంద్ర ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి 2015లో పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి.

 

ప్రకృతి వ్యవసాయం (జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌): ప్రకృతి వ్యవసాయం భావనను తొలిసారిగా 1975లో జపాన్‌కు చెందిన ఒక రైతు ప్రవేశపెట్టాడు. భారతదేశంలో ఈ విధానానికి సుభాష్‌ పాలేకర్‌ విస్తృత ప్రచారం కల్పించారు. ఇది ‘జీరో బడ్జెట్‌’ అంటే ఖర్చు లేని వ్యవసాయం. విత్తనాలు, ఎరువులకు పెట్టుబడి అవసరం ఉండదు. విత్తనాలను రైతులే తమ పంట నుంచి తయారు చేసుకుంటారు. మట్టిలోని సూక్ష్మజీవులు, వానపాములే మొక్కల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎరువులు వాడే పనిలేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే భూమికి బలాన్ని ఇవ్వవచ్చు. అందుకే ఈ సాగు పద్ధతిలో ఖర్చులు ఉండవు.

  దేశీయ ఆవు పేడ, మూత్రంతో భూసారం పెంచే ద్రావణాలు (బీజామృతం, జీవామృతం) తయారుచేసుకొని భూమికి తిరిగి జవసత్వాలను అందించడం, రసాయనిక అవశేషాలు లేని ఆహారాన్ని పండించుకోవడం సుభాష్‌ పాలేకర్‌ పద్ధతిలోని ప్రత్యేకత. పొడిసున్నం, పొడిమట్టి, బెల్లం, బావి/బోరు/నది నీరును కూడా ఈ ద్రావణాల్లో కలుపుతారు. ‘భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. పోషకాలను మొక్కల వేర్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చేది సూక్ష్మజీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘనజీవామృతం ఇచ్చి వీలైన పద్ధతిలో మల్చింగ్‌ చేస్తే చాలు’ అంటారు పాలేకర్‌. పొలంలో పలు రకాల అంతర పంటలు వేయడం ద్వారా పంటల జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకునే వీలుండటం ప్రకృతి వ్యవసాయంలోని మరో ప్రత్యేకత. పండ్ల తోటల సాళ్ల మధ్య అడుగులోతు వరకు కందకాలు తీయడం ద్వారా వాననీటి సంరక్షణ చేపట్టి కరవు పరిస్థితులను తట్టుకునేలా చేస్తారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది (2019-20 కేంద్ర బడ్జెట్‌ ఆధారం) రైతులు అప్పుల నుంచి విముక్తి పొందారని పాలేకర్‌ తెలిపారు. నాణ్యమైన, పోషక ఔషధ విలువలతో కూడిన సహజాహారం పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుందని తెలిపారు.           

  జీరో బడ్జెట్‌ వ్యవసాయం దిశగా దేశం ముందుకుసాగాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పూర్వపద్ధతుల వైపు మళ్లాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 బడ్జెట్‌ ప్రకటనలో తెలిపారు. యూఎన్‌ఓకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) కూడా సహజ వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 2020 - 21లో రాష్ట్రాలకు కేంద్రం దాదాపు రూ.49.91 కోట్లు ఇచ్చింది. 2025 నాటికి 3.50 లక్షల హెక్టార్ల భూమిని ఈ విధానం కిందకి తీసుకురావాలనేదే లక్ష్యం. కర్ణాటకలో సుభాష్‌ పాలేకర్, రైతు సంఘాలతో కలిసి దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టారని, తర్వాత మిగతా రాష్ట్రాలు అనుసరించాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నీతిఆయోగ్‌ సైతం రైతులతో శూన్య బడ్జెట్‌ వ్యవసాయం చేయించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మేరకు రైతులకు శిక్షణ శిబిరాలు నిర్వహించింది.

  సుస్థిర వ్యవసాయం: నిలకడ కలిగిన వ్యవసాయాన్ని ప్రోత్సహించడాన్ని సుస్థిర వ్యవసాయం అంటారు. దీనిలో భాగంగా 2014-15లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ (నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టయిన్‌బుల్‌ అగ్రికల్చర్‌ - ఎన్‌ఎంఎస్‌ఎ) అమల్లోకి వచ్చింది. వ్యవసాయాన్ని మరింత ఉత్పాదకతతో సుస్థిర కార్యకలాపంగా, లాభదాయకంగా, వాతావరణ ఒడిదొడుకులు తట్టుకునేలా అభివృద్ధి చేయడం ఈ మిషన్‌ లక్ష్యం. దీనికోసం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంఘటిత సేద్యపు వ్యవస్థలను ప్రోత్సహిస్తారు. భూసారాన్ని, నేలలో తేమను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటారు. 12వ ప్రణాళిక (2012-17)లో ఏడు అంశాలను వ్యవసాయ శాఖ పథకాలు/కార్యక్రమాలు/మిషన్లలో అంతర్భాగం చేశారు. నీటి నిర్వహణ సామర్థ్యాలను పెంచే పద్ధతులు, వర్షాధార సాంకేతిక పద్ధతులను విస్తృతం చేయాలనేది ఈ మిషన్‌ లక్ష్యం.

 

1) వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, సంఘటిత వ్యవసాయ వ్యవస్థ

వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం 2011 - 12 నుంచి 2013 - 14 వరకు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కార్యక్రమంలో భాగంగా అమలైంది. సన్నకారు, ఉపాంత రైతులకు గరిష్ఠ ప్రతిఫలం వచ్చేలా ప్యాకేజీని అందించి వారి జీవితాల నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. 2014 - 15లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌లో దీన్ని ఉపమిషన్‌గా కలిపారు. ఈ పద్ధతిలో పంటల వ్యవస్థతో పాటు ఉద్యాన వ్యవసాయం, పశుపోషణ; చేపలు, వ్యవసాయ అడవులు, తేనెటీగల పెంపకం లాంటి కార్యకలాపాలను సంఘటితం చేస్తారు.

 

2) నేల ఆరోగ్య నిర్వహణ

ఒక ప్రదేశానికి, అక్కడి పంటకు తగినట్లు నేల ఆరోగ్య నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఇందులో మిగులు నిర్వహణ, సేంద్రియ పద్ధతులు ఒక భాగం. వీటికోసం నేల రకాన్ని బట్టి భూసార పంటలను పోషక పదార్థాల నిర్వహణతో అనుసంధానం చేస్తారు. భూసార ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తారు. అందులో కొన్ని సంచార ప్రయోగశాలలు కూడా ఉంటాయి. జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారక మందుల యూనిట్లతో పాటు పండ్లు, కూరగాయల మార్కెట్ల వ్యర్థాలు, వ్యవసాయ వృథాల కంపోస్ట్‌ యూనిట్లను కూడా ఏర్పాటుచేస్తారు. వీటన్నింటికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది.

  భూసార నిర్వహణ ప్రధాన ఉద్దేశం: న్యూ ఇండియా సమాచార్‌ (2022, మే 16 - 31) మాసపత్రిక నివేదిక ప్రకారం భూసార పరీక్ష ఆధారిత పోషక నిర్వహణ, అభివృద్ధి ప్రోత్సాహకం దీని లక్ష్యం. ఈ పథకం కింద 2018 - 19 నుంచి 2020 - 21 వరకు 5.67 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. ఈ మేరకు 2022, ఏప్రిల్‌ 19 వరకు 22.19 కోట్లకు పైగా భూసార కార్డులు జారీ అయ్యాయి. 

 

3) వ్యవసాయ అడవుల సబ్‌ మిషన్‌: జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌లో సబ్‌ మిషన్‌గా వ్యవసాయ అడవుల కార్యక్రమాన్ని 2016 - 17లో ప్రవేశపెట్టారు. సాగుభూముల్లో పంటలతో పాటు చెట్లను విస్తరింపజేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. 2014లో ప్రకటించిన జాతీయ వ్యవసాయ అడవుల విధానం ప్రకారం వ్యవసాయ అడవుల పెంపకాన్ని వ్యవసాయ వ్యవస్థలో అంతర్భాగం చేస్తారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ పెరగడమేకాకుండా కలప, వంటచెరకు, పశుగ్రాసం లాంటి అటవీ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ కొంతవరకు తీరుతుంది.

 

జాతీయ నూనె గింజల పామాయిల్‌ మిషన్‌ 

  ప్రపంచంలో నూనె గింజల వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది.  ప్రపంచంలోని అతిపెద్ద కూరగాయ నూనె వ్యవస్థల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. దేశంలోని స్థూల సాగు భూమిలో 13 శాతం వాటా నూనెగింజలది. స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతం, వ్యవసాయ ఉత్పత్తుల విలువలో 10 శాతం వాటా వీటిదే. 1986లో నూనెగింజల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం నూనె గింజలపై సాంకేతిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2004 - 05లో సమగ్ర నూనెగింజలు, పామాయిల్, మొక్కజొన్న పథకాన్ని (ఇంటిగ్రేటెడ్‌ స్కీమ్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్, ఆయిల్‌పామ్, మైజ్‌) ప్రారంభించింది. ఇది 2014 మార్చి వరకు అమల్లో ఉంది. ఈ కార్యక్రమంతో పాటు 2011 - 12, 2012 - 13లలో పామాయిల్‌ విస్తరణ కార్యక్రమాన్ని అమలుచేసింది.  

  2014 - 15లో ఈ రెండు కార్యక్రమాలు, వృక్ష జనిత నూనెగింజల కార్యక్రమాన్ని పునర్నిర్మించి జాతీయ నూనెగింజలు పామాయిల్‌ మిషన్‌ను ప్రారంభించారు. నూనెగింజలు, పామాయిల్, వృక్ష జనిత నూనెగింజలకు సంబంధించిన మూడు ఉపమిషన్లను ఇందులో కలిపారు. ఈ కార్యక్రమం అమలుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 90 : 10 నిష్పత్తిలో భరిస్తాయి. ఈ పథకాల అమలు వల్ల దేశంలో నూనెగింజల ఉత్పాదకత, ఉత్పత్తి పెరిగింది.

ముఖ్యాంశాలు: * నూనెగింజల పంటలకు సాగునీటి లభ్యత 26 నుంచి 36 శాతానికి పెంచడం. 

* తృణధాన్యాల ఉత్పాదకత తక్కువగా ఉన్న భూమిని నూనెగింజలు సాగుకు మళ్లించడం. 

* తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చెరకు పంటలతో పాటు మధ్యంతర నూనెగింజలు పండించడం. 

* వాటర్‌షెడ్‌ ప్రాంతాలు, వృథా నేలలకు నూనెగింజల సాగును విస్తరించడం. 

  2021 - 22 భారత ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2015 - 16 నుంచి 2020-21 మధ్య దేశంలో నూనెగింజల ఉత్పత్తి 43 శాతం పెరిగింది. 2019 - 20లో నూనెగింజల ఉత్పత్తి 33.2 మిలియన్‌ టన్నులు ఉండగా 2020 - 21 నాటికి 36.1 మిలియన్‌ టన్నులకు పెరిగింది. 2018 - 19 నుంచి కేంద్ర ప్రభుత్వం నూనెగింజల ఉత్పత్తి, ఉత్పాదకత కోసం దేశంలోని అన్ని జిల్లాల్లో ‘నేషనల్‌ పుడ్‌ సెక్యూరిటీ మిషన్‌’ను ప్రోత్సహించింది.

* 2012 - 13లో దేశంలో వంట నూనెల ఉత్పత్తి 7.2 మిలియన్‌ టన్నులు ఉండగా 2019 - 20 నాటికి 7.9 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

* 2012 - 13లో వంట నూనెల దిగుమతులు 10.6 మిలియన్‌ ఉండగా 2019 - 20 నాటికి 13.4 మిలియన్‌ టన్నులకు  పెరిగాయి.

 

జాతీయ ఆహార భద్రత - పప్పుధాన్యాల మిషన్‌ 

  హరిత విప్లవం వల్ల పప్పుధాన్యాల ఉత్పత్తి పెరగలేదు. దీంతో జాతీయ ఆహార భద్రత మిషన్‌ - పుప్పుధాన్యాలు (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్‌ - పల్సెస్‌) అనే పథకం ద్వారా దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించారు. 2021 - 22 భారత ఆర్థిక సర్వే ప్రకారం 2019 - 20లో పప్పుధాన్యాల ఉత్పత్తి 23 మిలియన్‌ టన్నులు ఉండగా 2020 - 21 నాటికి 25.7 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌