• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ గ్రామీణాభివృద్ధి - ప్రభుత్వ చర్యలు 

పల్లెటూరు.. సాగుతీరు మారితేనే సమగ్ర ప్రగతి!
 


వ్యవసాయం భారతీయ జీవన విధానం. గ్రామాలే దేశానికి వెన్నెముకలు. ఈ రెండు అంశాలు ఆర్థిక వ్యవస్థ, జాతీయాదాయం, ఉద్యోగితలకు సంబంధించి అత్యంత కీలకమైనవి. సాగు రంగం వృద్ధితోపాటు గ్రామీణ జనాభా ఆదాయం పెరిగితేనే దేశ సమగ్ర ప్రగతి సాధ్యమవుతుంది. స్వాతంత్య్రానంతరం దేశంలో వ్యవసాయ విధానాలను, గ్రామాల స్వరూపాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ దిశగా అమలు చేసిన పథకాలు, సంస్కరణలు, ప్రణాళికల్లో ఇచ్చిన ప్రాధాన్యం, చేసిన ఖర్చు, రైతులకు అందించిన ప్రోత్సాహం, విధానపరమైన మార్పుల గురించి పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి అవగాహన ఉండాలి. వ్యవసాయ రంగంలో నిర్దేశించుకున్న వృద్ధి సాకారానికి, రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఇంకా చేపట్టాల్సిన చర్యల గురించి తెలుసుకోవాలి.

వ్యవసాయ సంబంధాలు మెరుగుపరచడానికి, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మొదటి రెండు పంచవర్ష ప్రణాళికల్లో నీటిపారుదల సదుపాయాల విస్తరణ, భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇదేకాలంలో గ్రామీణ సమగ్ర అభివృద్ధికి దోహదపడే సమాజ అభివృద్ధి కార్యక్రమం, భూ సంస్కరణలు లాంటి పథకాలను అమలు చేసింది. గ్రామీణ అక్షరాస్యత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఇళ్లు, గ్రామీణ పరిశ్రమలు, పశుసంపద మొదలైన వాటి పురోగతి కూడా సమాజ అభివృద్ధి కార్యక్రమంలో భాగమే. అయితే ఈ కార్యక్రమం సహకార వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 1965-66, 1966-67లలో తీవ్రమైన కరవు సంభవించి, 19 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో వ్యవసాయ సంస్కరణల నుంచి సాంకేతిక పరిజ్ఞానం వైపు వ్యవసాయ విధానం మార్పు చెందింది. ఫలితంగా నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టారు. 
గ్రామీణ రంగంలో ప్రణాళికా కాలంలో పలు రకాల విధానపరమైన చర్యలు ప్రవేశపెట్టారు. 

1) సాంకేతిక చర్యలు: పెరిగే జనాభా అవసరాలు తీర్చడానికి, పరిశ్రమలకు కావాల్సిన ముడిపదార్థాలు అందించడానికి విస్తృతమైన సాంద్ర వ్యవసాయం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి, నీటిపారుదల సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. 1966లో అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950-51లో ఉన్న 50.8 మిలియన్‌ టన్నుల నుంచి 2021-22 నాటికి 315.616 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

2) భూసంస్కరణలు: వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి భూసంస్కరణలను అమలు చేశారు. మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, కమతాల గరిష్ఠ పరిమితి విధింపు లాంటి చర్యలు ఇందులో భాగమే.

3) సహకార వ్యవసాయం, కమతాల సమీకరణ: కమతాల విభజన సమస్య నివారించడానికి సహకార వ్యవసాయాన్ని, కమతాల సమీకరణను ప్రవేశపెట్టారు.

4) ప్రణాళికల్లో ప్రజల భాగస్వామ్యం: ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రణాళికలు సమర్థంగా అమలు కావడం సాధ్యం కాదు. అందుకే 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు.

5) సంస్థాగత పరపతి: గ్రామాల్లో సంస్థాగత పరపతి ఇచ్చేందుకు సహకార సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాబార్డు ఏర్పాటయ్యాయి. దీనివల్ల వడ్డీవ్యాపారుల దోపిడీ తగ్గింది.

6) మద్దతు ధర, సేకరణ ధర: రైతులకు గిట్టుబాటు ధర లభించడానికి ప్రభుత్వం మద్దతు ధర, సేకరణ ధరలు ప్రకటిస్తుంది. దీనికోసం వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

7) వ్యవసాయ ఉత్పాదకాలకు రాయితీలు: వ్యవసాయ ఉత్పాదకాలైన నీటిపారుదల, విద్యుత్తు, ఎరువులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. వ్యవసాయంలో ఆధునిక పనిముట్లు అందించడానికి వ్యవసాయ ఉత్పాదకాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.

8) ఆహార భద్రత: వినియోగదారులకు చౌకగా, రాయితీ ధరలకు నిత్యావసర వస్తువులు అందించడానికి ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది ఆహార ధాన్యాలను చౌక ధరలకు లభించే విధంగా చూడటమే కాకుండా బఫర్‌ స్టాక్‌ ద్వారా ఆహారభద్రతను అందిస్తుంది.

9) గ్రామీణ ఉపాధి కార్యక్రమాలు: ప్రజాపంపిణీ వ్యవస్థ ఒక్కటే సమర్థ రక్షణను అందించలేదు. అందుకే పేదల కొనుగోలు శక్తి పెంచడానికి, పేదరికాన్ని తగ్గించడానికి ముఖ్యంగా నాలుగో ప్రణాళిక నుంచి అనేక పథకాలను ప్రారంభించారు. ఉదా: ఐఆర్‌డీపీ, ఎన్‌ఆర్‌ఈపీ, జేఆర్‌వై, జేజీఎస్‌వై, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మొదలైనవి. 

10) రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన: వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 4% వృద్ధి సాధించడానికి అనుగుణంగా ప్రభుత్వ పెట్టుబడులు పెంచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి 11వ ప్రణాళికలో రూ.25 వేల కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దాని కింద రాష్ట్రాలకు రూ.22,409 కోట్లు అందించారు.

దీనిలో ఉపపథకాల చర్యలు:

1) తూర్పు భారత్‌కు హరిత విప్లవాన్ని తీసుకెళ్లడం (బీజీఆర్‌ఈఐ).

2) వర్షాభావ ప్రాంతాల్లో 60,000 గ్రామాల్లో పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచడం.

3) కూరగాయల ఉత్పత్తి పెంచడం.

4) పామాయిల్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడం.

5) జాతీయ మిషన్‌ కింద ప్రొటీన్‌ సప్లిమెంట్లను అందించడం. ఈ పథకంలో 50% సహాయాన్ని వ్యవసాయ రంగంపై ప్రణాళికా వ్యయం పెంచే రాష్ట్రాలకు కేంద్రం అందిస్తుంది. 12వ ప్రణాళికలో ఈ పథకానికి కేటాయించిన మొత్తం రూ.63,246 కోట్లు.

11) జాతీయ ఆహార భద్రత మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్‌): ఆహార భద్రతకు సంబంధించి జాతీయ అభివృద్ధి కౌన్సిల్‌ తీర్మానంపై వ్యవసాయ సహకార శాఖ ఆధ్వర్యంలో 2007-08 రబీ సీజన్‌లో దీనిని ప్రారంభించారు. 11వ ప్రణాళిక అంతానికి వరి 10 మి.టన్నులు, గోధుమలు 8 మి.టన్నులు, పప్పుధాన్యాలు 2 మి.టన్నులు.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్‌లో 2010-11 నుంచి A3P (ఆక్సిలేటర్‌ పల్సెస్‌ ప్రొడక్షన్‌ ప్రోగ్రామ్‌) అనే ఉపపథకాన్ని ప్రారంభించారు. 12వ ప్రణాళికలో ఆహారధాన్యాలను 25 మి.టన్నులు పెంచాలని లక్ష్యం. 2014-15 నుంచి 623 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. 2015-16 నుంచి కేంద్రం - రాష్ట్రం 50:50 నిష్పత్తిలో నిధులు అందిస్తున్నాయి.

12) ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన: ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు బీమాతో రైతులకు ఆర్థిక మద్దతు అందించే పథకం. ఇది రైతుల ఆదాయాన్ని స్థిరీకరించడానికి, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించే రైతులకు ఇది వర్తిస్తుంది.

13) వ్యవసాయ పరిశోధన, శిక్షణ: అధిక దిగుబడినిచ్చే వంగడాల కోసం వ్యవసాయ పరిశోధన, శిక్షణను ప్రోత్సహించారు. ఈ రంగంలో అపెక్స్‌ సంస్థ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌).

భారత్‌ నిర్మాణ్‌: 2005లో భారత్‌ నిర్మాణ్‌ గ్రామీణ అవస్థాపన సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. అవి-

1) నీటిపారుదల  

2) గ్రామీణ రోడ్లు

3) గ్రామీణ ఇళ్లు

4) గ్రామీణ తాగునీరు

5) గ్రామీణ విద్యుత్తు

6) గ్రామీణ టెలిఫోన్‌ మొదలైన కార్యకలాపాలను అభివృద్ధి చేశారు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు: అర్హులైన రైతులకు రుణాలిచ్చేందుకు 1998-99లో ఈ పథకాన్ని ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతులు, కౌలుదార్లు కూడా దీనికి అర్హులే. ప్రమాద మరణానికి రూ.50,000, శాశ్వత అంగవైకల్యానికి రూ.25,000 బీమా కూడా ఉంటుంది. దీనిలో కాలపరిమితి రుణాలు, స్వల్పకాల రుణాలు ఇస్తారు.

భూసార కార్డులు (సాయిల్‌ హెల్త్‌ కార్డు): 12వ ప్రణాళికలో భూసార కార్డుల పథకాన్ని అమలు చేశారు.మూడేళ్ల వ్యవధిలో వాటిని రైతులకు అందిస్తారు. దీనివల్ల సరైన ఎరువులు, పోషకాలు అందించవచ్చు.

పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 50 లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు 50 ఎకరాల భూమిలో క్లస్టర్‌గా ఏర్పడితే అక్కడ ఈ పథకాన్ని అమలుపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరాకు రూ.20,000 సహాయం చేస్తుంది.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి:  కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు అందించే పథకమిది. 2018, డిసెంబరు 1 నుంచి అమలవుతోంది. రైతు కుటుంబానికి ఏటా రూ.6000 ఆదాయ మద్దతు అందిస్తారు. ప్రతి 4 నెలలకు రూ.2000 చొప్పున 3 సమాన వాయిదాల్లో అందుతుంది.

రైతుల ఆదాయం రెట్టింపు: రైతుల ఆదాయాన్ని 2015-16 నుంచి 2022-23 నాటికి ఏడేళ్లలో రెట్టింపు చేయాలని ప్రభుత్వం భావించింది. వ్యవసాయంలో సంక్షోభం వల్ల రైతులు సాగును విడిచిపెట్టడం, మధ్య తూర్పు రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల్లో పేదరికం ఎక్కువగా ఉండటం, వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయ అంతరాలు పెరగడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి కంటే వ్యవసాయ ఆదాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే 2015-16 ఆధారంగా 2022-23 నాటి రైతుల వాస్తవ ఆదాయం రెట్టింపు చేయాలంటే వారి ఆదాయం వార్షిక వృద్ధి 10.41% ఉండాలని నీతిఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ అభిప్రాయపడ్డారు. 

వ్యవసాయ వృద్ధి: ప్రణాళికా కాలంలో ఆర్థిక వ్యవస్థ ప్రగతి కంటే వ్యవసాయ వృద్ధి తక్కువగా ఉంది. సంస్కరణల తర్వాత వ్యవసాయేతర వృద్ధి పెరుగుతుంటే, వ్యవసాయ రంగ వృద్ధి క్షీణిస్తోంది. ఇప్పటికీ జనాభాలో సగం మంది వ్యవసాయం పైనే ఆధారపడుతున్నారు. అందుకే వ్యవసాయ వృద్ధిని పెంచాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ వృద్ధిలో 1981-82 నుంచి వ్యత్యాసం మరింత పెరిగింది. కారణం ఈ కాలంలో పరిశ్రమలు, సేవలు పెరగడమే. 9, 10 ప్రణాళికల్లో వ్యవసాయంలో తక్కువ వృద్ధి నమోదైంది. 10వ ప్రణాళికలో జీడీపీ వృద్ధి 7.8% అయితే, వ్యవసాయ వృద్ధి 2.4% మాత్రమే.

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 
 

Posted Date : 17-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు