• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయం-అనుబంధ రంగాలు

ప్రగతి సాధనలో... పేదరిక నిర్మూలనలో!

తెలంగాణలో సగానికిపైగా జనాభాకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే జీవనాధారం. పారిశ్రామిక, సేవారంగాల ప్రగతికీ అవే ఆధారంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర పేదరిక నిర్మూలనలో, సంపద వృద్ధిలో కీలకంగా ఉన్న సేద్య సంబంధ రంగాల తీరుతెన్నులపై అభ్యర్థులు సమగ్ర అవగాహన పెంచుకోవాలి. 

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ముందంజలో ఉంది. దేశానికి ఆహార ధాన్యాలను సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడిపదార్థాలను అందిస్తోంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 55.49 శాతం జీవనోపాధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ కార్యకలాపాలే ఆధారం. అందుకే పేదరికాన్ని తగ్గించాలన్నా, రాష్ట్రంలో సంపద వృద్ధి నికరంగా కొనసాగాలన్నా వ్యవసాయ ఆదాయాలను పెంచడం ముఖ్యం. వ్యవసాయ రంగం బాగుంటేనే పారిశ్రామిక వస్తువులకు డిమాండ్‌ పెరుగుతుంది. ఎగుమతుల్లోనూ ఈ రంగం ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. విదేశీమారక ద్రవ్యాన్ని సంపాదిస్తోంది.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 4 ఉపరంగాలున్నాయి. 1) పంటలు 2) పశుసంపద 3) అడవులు, కలప 4) చేపలు, రొయ్యల ఉత్పత్తి
వ్యవసాయ రంగంలో నిలకడగా వృద్ధిని సాధించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఎజెండా. వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంపై ఆధారపడి ఉన్నప్పటికీ, అధికభాగం భూగర్భ జలాల ద్వారానే సాగవుతోంది. తెలంగాణలో సరిపడా నీటి వనరులు, మంచి భూములు ఉండటంతో వివిధ రకాల పంటలు పండుతున్నాయి. ప్రధానంగా గోదావరి, కృష్ణా నదుల నుంచి సాగు నీరు లభిస్తోంది. రాష్ట్రంలోని ఆహార పంటల్లో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, పప్పుధాన్యాలు ప్రధానమైనవి. ఆహారేతర పంటల్లో పత్తి, మిరప, పసుపు, వేరుశనగ, సోయాబీన్స్, చెరకు ముఖ్యమైనవి.

* రాష్ట్రంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి (Indian Council of Agricultural Research - ICAR), వివిధ వ్యవసాయ సంబంధిత పరిశోధన సంస్థలతో పాటు ఇక్రిశాట్‌ (ICRISAT - International Crop’s Research Institute for the Semi - Arid Tropics) వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నాయి.

పశుసంపద
మొత్తం పశుసంపదలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానంలో ఉంది. గొర్రెల సంఖ్యలో ప్రథమ స్థానంలో, కోళ్ల సంఖ్యలో మూడో స్థానంలో ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో, మాంసం ఉత్పత్తిలో అయిదో స్థానంలో, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో, చేపల ఉత్పత్తిలో ఎనిమిదో స్థానంలో ఉంది.


భూ వినియోగం
దేశంలో భూవిస్తీర్ణపరంగా తెలంగాణ 11వ పెద్ద రాష్ట్రం. మొత్తం భూవిస్తీర్ణం 276.96 లక్షల ఎకరాలు (112.08 లక్షల హెక్టార్లు). ఇందులో నికర సేద్య భూమి కింద 49.07 శాతం, అడవుల కింద 24.07 శాతం ఉంది. బీడు భూములు 9.02 శాతం, బంజరు, వ్యవసాయ యోగ్యంకాని భూములు 5.42 శాతం ఉన్నాయి. వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి74.46% 
* 2015-16 గణాంకాల ప్రకారం తెలంగాణలో సగటు భూకమతం పరిమాణం ఒక హెక్టారు (2.5 ఎకరాలు). రాష్ట్రంలో ఒక హెక్టారులోపు భూకమతాల సంఖ్య 59.48 లక్షలు, వీటి విస్తీర్ణం 59.72 లక్షల హెక్టార్లు.
వర్షపాతం
రాష్ట్రంలో వ్యవసాయం వర్షపాతంపై ఆధారపడి ఉంది. ప్రధానంగా జూన్‌-సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల ద్వారా అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. అక్టోబరు- డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల వల్ల కూడా వర్షాలు పడతాయి. జనవరి - ఫిబ్రవరిల్లో శీతాకాల సమయంలో, మార్చి-మేల్లో ఎండాకాలంలో కొద్ది వర్షపాతం నమోదవుతుంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 907 మి.మీ.  ఇందులో అత్యధిక భాగం 79% నైరుతి రుతుపవనాల ద్వారా, 14% ఈశాన్య రుతుపవనాల ద్వారా లభిస్తుంది. జనవరి నుంచి మే మధ్య కాలంలో కురిసే వర్షపాతం సాధారణ వర్షపాతంలో 8% వరకు ఉంటుంది. సాధారణ వర్షపాతం ఒక కచ్చితమైన వివరణ కాదు. వాతావరణ నిపుణులు ఈ సాధారణ వర్షపాతాన్ని జిల్లాలకు, రాష్ట్రాలకు వేర్వేరుగా లెక్కిస్తారు. కాలానుగుణంగా వాస్తవ వర్షపాతం ఆధారంగా సాధారణ వర్షపాతం గణాంకాలను సవరిస్తారు. 2020-21లో రాష్ట్ర సాధారణ వర్షపాతం 905 మిల్లీమీటర్లు ఉండగా, వాస్తవ వర్షపాతం 1322.4 మిల్లీమీటర్లుగా నమోదైంది.
ప్రధాన పంటల ఉత్పత్తి
రాష్ట్రంలో 3 ప్రధాన పంటలున్నాయి. 1) వరి 2) పత్తి 3) మొక్కజొన్న
సంవత్సరం  మొత్తం వ్యవసాయ ఉత్పత్తి (లక్షల మెట్రిక్‌ టన్నుల్లో) 
2014-15      231.74
2019-20      339.83 
2020-21      353.33
వరి: 2019-20లో దేశంలో పండిన మొత్తం వడ్ల ఉత్పత్తిలో తెలంగాణ వాటా 6 శాతం. 2015-16లో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 25.85 లక్షల ఎకరాలు ఉండగా, వడ్ల ఉత్పత్తి 45.71 లక్షల మెట్రిక్‌ టన్నులు. 2020-21లో వరి సాగు విస్తీర్ణం 104.23 లక్షల ఎకరాలు కాగా, ఉత్పత్తి 218.51 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. రాష్ట్రంలోని స్థూల సాగులో 60% వరి సాగు పెద్దపల్లి, సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల, ములుగు, నిజామాబాద్‌ జిల్లాల్లోనే ఉంది.
పత్తి:  పత్తి సాగులో 2020లో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది. పత్తి ఉత్పత్తిలో 16.9% వృద్ధిరేటుతో నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో పత్తి అధికంగా సాగు చేస్తున్న జిల్లాలు 1) నల్గొండ 2) నాగర్‌ కర్నూల్‌ 3) ఆదిలాబాద్‌. రాష్ట్రంలో 2015-16లో 43.81 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా 18.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వచ్చింది. 2020-21లో 58.28 లక్షల ఎకరాల్లో సాగవగా 30.42 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వచ్చింది.
మొక్కజొన్న: మొక్కజొన్న ఉత్పత్తి 2015-16లో 17.51 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, 2020-21లో 17.55 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంది. 2019-20లో అత్యధికంగా 36.44 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది.
పప్పుధాన్యాల ఉత్పత్తి: పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2018-19, 2019-20 మధ్య జాతీయ స్థాయిలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2015-16లో కందిపప్పు ఉత్పత్తి 1.05 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, 2020-21 నాటికి 3.32 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది.
ఎరువుల వినియోగం: తెలంగాణలో ప్రధాన ఎరువుల వినియోగం 2018లో 28 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, 2019లో 39 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. రాష్ట్రంలో సగటు ఎరువుల వినియోగం 19%. రాష్ట్రంలో 2019-20, 2020-21 మధ్య ఎరువుల వినియోగం పెరుగుదల అధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లా (143.6%), సిద్దిపేట జిల్లా (123.2%)లో నమోదైంది.
ఉద్యానవన పంటలు: రాష్ట్రంలో 2020-21లో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం 11.57 లక్షల ఎకరాలు కాగా, ఉత్పత్తి 59.03 లక్షల మెట్రిక్‌ టన్నులు.

* రైతు ఆశావాది కాకపోతే అసలు రైతుగానే ఉండలేడు: విల్‌రోగర్‌
* వ్యవసాయం అనేది పంటలు పండించడమనే గుడ్డి నమ్మకమే కాదు. నీరు, మంచి ఆహారం, నార (పీచు) పదార్థాలను ఉత్పత్తి చేయడం: అలెన్‌ సవోరి

వ్యవసాయ రంగం వృద్ధి తగ్గడానికి ముఖ్య కారణాలు
1) పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో సాగు విస్తీర్ణం తగ్గడం
2) వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో సరైన ధర లేకపోవడం
3) పంట ఉత్పాదకతలో స్తబ్దత
4) ఎరువుల వాడకం, నీటిపారుదల సౌకర్యాలలో పెరుగుదల ఎక్కువగా లేకపోవడం 
5) విద్యుత్తు సరఫరా సమస్య

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 08-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌