• facebook
  • whatsapp
  • telegram

  పౌర విమానయానం

ఆకాశంలో ప్రగతి ప్రయాణం! 

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం పౌర విమానయానం. వేగవంతమైన ప్రగతికి చోదక శక్తిగా ఉపయోగపడుతోంది. ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రైవేటు సంస్థల రంగప్రవేశంతో వేగం పుంజుకుంది. గతంలో ధనవంతులకే పరిమితమైన విమాన ప్రయాణం సగటు పౌరులందరికీ చేరువైంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త విమానాశ్రయాల నిర్మాణం, విస్తరణ శరవేగంగా జరుగుతోంది. ఈ పరిణామక్రమాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. విమానయాన నిర్వహణ, నియంత్రణ సంస్థలు, వాటి విధులు, భారతీయులకు దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు అందుతున్న తీరు, దేశవ్యాప్తంగా అనుసంధానానికి అమలుచేస్తున్న పథకాలు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం వినియోగిస్తున్న సాంకేతికత గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల్లో గగనతల రవాణా ఒకటి. ఆర్థిక వ్యవస్థతో పాటు ఉపాధి కల్పనను విశేషంగా ప్రభావితం చేయగలిగిన రంగాల్లో ఇదొకటి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. గగన రవాణా, ఆకాశమార్గ నిర్వహణ సహా వాణిజ్య, పౌర విమానయాన మౌలిక సదుపాయాలు ఈ శాఖలో అంతర్భాగం. విమానయాన చట్టం - 1934, విమానయాన నిబంధనల చట్టం - 1937, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ చట్టం - 1994, విమాన రవాణా చట్టం - 1972 ప్రకారం పౌర విమానయాన రంగం, సంబంధిత ఇతర చట్టాల అమలు బాధ్యతను ఈ శాఖ నిర్వర్తిస్తుంది. ఇదొక సూర్యోదయ రంగం (సన్‌రైజ్‌)గా గుర్తింపు తెచ్చుకుంది.


* 2022లో విమానాల సంఖ్య 714


* మొత్తం ప్రయాణికుల సంఖ్య 1156 లక్షలు


* సరకు రవాణా 3140 వేల టన్నులు


* అంతర్జాతీయ విమానాశ్రయాలు 34


* అతిపెద్ద విమానాశ్రయం - ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - న్యూఢిల్లీ


* రెండో అతి పెద్ద విమానాశ్రయం - ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం - ముంబయి.


* పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో నిర్మించిన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం - కొచ్చిన్‌


* అతిచిన్న విమానాశ్రయం - తిరుచ్చి


* దేశంలో మూడు రకాల విమానాశ్రయాలున్నాయి.


1) ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ప్రభుత్వ సంస్థ) నిర్వహించేవి.


2) సంయుక్తరంగ అంతర్జాతీయ విమానాశ్రయాలు


3) ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించే విమానాశ్రయాలు

-------------------------------------------------


అంతర్జాతీయ విమాన సేవలు: విదేశాలకు భారతీయ ప్రయాణికుల రాకపోకల్లో అధిక వాటా విదేశీ విమాన సంస్థలదే. వీటిలో ఎక్కువ భాగం గల్ఫ్‌ దేశాలకు సంబంధించిన సంస్థలది. తర్వాత స్థానం ఆగ్నేయాసియా దేశాలది. భారతీయ సంస్థలు తమ వాటాను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.


మన దేశం నుంచి అత్యధికంగా విదేశీ ప్రయాణం జరిగేది గల్ఫ్‌ దేశాలకే. భారత్‌ నుంచి విదేశీ ప్రయాణ రాకపోకల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వాటా 33.6 శాతం, సౌదీ అరేబియా 6.2%, ఇంగ్లండ్‌ 5.1%, సింగపూర్‌ 6.7%, అమెరికా 2%. 


భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ (ఐఏఐ):  దేశంలో ఏర్‌ఫోర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ - 1994 ప్రకారం భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థను 1995, ఏప్రిల్‌ 1న పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దీనికి మినీ రత్నా హోదా ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, జాతీయ విమానాశ్రయ ప్రాధికార సంస్థల విలీనం ద్వారా ఇది ఏర్పడింది. గగనతల రవాణా సేవలు, విమానాశ్రయాలు, పౌర విమాన కేంద్రాల నిర్వహణ, విమానయాన సమాచార కేంద్రాలు, విమానాశ్రయాల స్థాపన మొదలైనవి ఐఏఐ ప్రాథమిక కర్తవ్యాలు. ప్రస్తుతం సుమారు 2.8 మిలియన్‌ చదరపు నాటికల్‌ మైళ్ల భారత్‌ గగనతలం దీని పరిధిలో ఉంది. ఇందులో భూ వైశాల్యం దాదాపు 1.0 మిలియన్‌ చదరపు నాటికల్‌ మైళ్లు కాగా, సముద్ర గగనతలం విస్తీర్ణం 1.8 మిలియన్‌ చదరపు నాటికల్‌ మైళ్లు. 133 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. అందులో 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్స్‌ విమానాశ్రయాలు, 100 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి.

విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ ప్రాధికార సంస్థ (ఏఈఆర్‌ఏ):  ఇది ఏర్‌ఫోర్ట్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్‌-2008 ప్రకారం ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ. విమానాశ్రయాల్లో అందించే ఏరోనాటికల్‌ సేవలు, విమానాశ్రయాల పనితీరు పర్యవేక్షణ, రుసుంలు, ఇతర ఛార్జీల నియంత్రణ లాంటి బాధ్యతలు ఉంటాయి. విమానయాన నిబంధనల చట్టం- 1937లోని 88వ నిబంధన ప్రకారం ప్రయాణికుల సేవా రుసుం నిర్ణయించడం కూడా దీని బాధ్యత.


బయోమెట్రిక్‌ ఆధారిత నిరంతర ప్రయాణం


పలు విమానాశ్రయాల్లో ప్రతిసారీ టికెట్‌ గుర్తింపు ధ్రువీకరణ తనిఖీ లాంటి అవరోధాలకు ఆస్కారం లేకుండా నిరంతర ప్రయాణం దిశగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ డిజి యాత్ర విధానాన్ని ప్రారంభించింది. ఇది ముఖ కవళికల గుర్తింపు సాంకేతికత ఆధారంగా విమానాశ్రయాల్లో ప్రయాణ తనిఖీ ప్రక్రియ సదుపాయం కల్పిస్తుంది.


 ప్రయాణ అనుమతి సమాచారం ప్రయాణికుల స్మార్ట్‌ ఫోన్‌లోని సురక్షిత వాలెట్‌లో నిల్వ ఉంటుంది. ఉపయోగించిన 24 గంటల్లో అదృశ్యమవుతుంది. ఈ డిజి యాత్ర యాప్‌ 2023, అక్టోబరు నాటికి ఆండ్రాయిడ్, ఐఒఎస్‌ ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయం ప్రస్తుతం దిల్లీ, బెంగళూరు, వారణాసి, హైదరాబాద్, పుణె, కోల్‌కతా, విజయవాడ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్, జైపుర్, కొచ్చి, గువాహటి నగరాల్లోని 13 విమానాశ్రయాల్లో పనిచేస్తోంది.

జీపీఎస్‌ ఆధారిత జియో ఆగ్‌మెంటెడ్‌ నావిగేషన్‌ (గగన్‌): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ (ఐఏఐ) సంయుక్తంగా ‘గగన్‌’ పేరుతో సహకారాత్మక వ్యవస్థను రూపొందించాయి. జీపీఎస్‌ సంకేతాల కచ్చితత్వం, విశ్వసనీయత, నాణ్యతతోపాటు ప్రత్యేకించి పౌరవిమానయానాల్లో నిర్దిష్ట విధానాలను అనుసరించడమే దీని లక్ష్యం. ఇది 2015 నుంచి దేశవ్యాప్తంగా 24 గంటలూ అందుబాటులోకి వచ్చింది.

అంతర్జాతీయ అనుసంధానం: ప్రపంచంలోని 116 దేశాలతో విమాన సేవల ఒప్పందాలున్న భారతదేశం ప్రస్తుతం విస్తృతశ్రేణి అంతర్జాతీయ విమాన సేవలు అందిస్తోంది. 52 దేశాలకు పైగా ప్రత్యక్షంగా, 100కు పైగా దేశాలకు పరోక్షంగా సంధానం కల్పిస్తోంది. 2023, అక్టోబరు నాటికి 24 దేశాలతో సార్వత్రిక గగనతల ఒడంబడిక కుదుర్చుకుంది. రష్యాతో ఉన్న ప్రత్యేక ఒప్పందం మేరకు దేశీయ కోడ్‌ వాటా కోసం కాల్‌ పాయింట్ల భాగస్వామ్యం, సామర్థ్యం పెంచుకునే హక్కులు లభించడంతో పాటు రష్యా విమానయాన సంస్థలకు మార్గాల వారి పరిమితులు తొలగించారు. 

ఉడాన్‌ (యూడీఏఎన్‌):  2016, అక్టోబర్‌లో భారత ప్రభుత్వం జాతీయ పౌర విమాన విధానంలో భాగంగా ‘ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌’ (యూడీఏఎన్‌) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది 10 సంవత్సరాలు అమలులో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య వైమానిక అనుసంధానం పెంచడం దీని ప్రధాన లక్ష్యం.


ఒక గంట కంటే మించని విమాన ప్రయాణానికి ఛార్జీగా రూ.2500 నిర్ణయించారు. ఈ సౌకర్యం కోసం దేశీయ విమాన సంస్థలు తమ విమానాల్లో కొంత శాతం రిజర్వ్‌ చేస్తాయి. ఈ పథకం కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న 100 విమానాశ్రయాలను కలుపుతూ, 1000 మార్గాల్లో విమానాలు నడుపుతారు. ఇప్పటికే 459 మార్గాలు వినియోగంలోకి వచ్చాయి. ఉడాన్‌ కింద 2017లో సిమ్లా నుంచి దిల్లీకి తొలి విమానం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ పథకంలో 1300 మార్గాల్లో విమానయాన సేవలు అందించేందుకు వివిధ సంస్థలకు అనుమతి లభించింది. తక్కువగా సేవలు అందుతున్న 495 మార్గాల్లో 2023, అక్టోబరు 10 నాటికి 9 హెలీపోర్టులు, 2 వాటర్‌ ఏరోడ్రమ్‌లు, 75 విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి. ఉడాన్‌ కింద తూర్పు ఈశాన్య ప్రాంతంలో 13 విమానాశ్రయాలు, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో 12 చొప్పున విమానాశ్రయాలున్నాయి. దక్షిణ ప్రాంతంలో 8 విమానాశ్రయాలను గుర్తించారు.

కృషి ఉడాన్‌ 2.0: దేశంలో ఎంపికచేసిన విమానాశ్రయాలకు విమానాల ద్వారా సరకు తరలింపు దిశగా భారతీయ రహదారులను ప్రోత్సహించడం కోసం 2021లో కృషి ఉడాన్‌ 2.0 పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనికింద సరకు రవాణాతో పాటు, ప్రయాణికులకు ల్యాండింగ్, పార్కింగ్, టెర్మినల్‌ నావిగేషన్‌ ల్యాండింగ్‌ ఛార్జీలు, రూట్‌ నావిగేషన్‌ ఫెసిలిటేషన్‌ ఛార్జీలు పూర్తిగా రద్దు చేసింది. ఈశాన్య భారతంతో పాటు, కొండలు, గిరిజన ప్రాంతాల ద్వీపాలు, ఇతర గుర్తించిన ప్రాంతాలకు ప్రభుత్వం ఇందులో ప్రాధాన్యం ఇచ్చింది. దీని కింద దేశవ్యాప్తంగా గుర్తించిన మొత్తం 58 విమానాశ్రయాల్లో ఈశాన్య, పర్వత గిరిజన, ద్వీప ప్రాంతాల్లో 25 ఉండగా, ఇతర ప్రాంతాల్లో మరో 33 ఉన్నాయి.

ఏర్‌ - ఇండియా ప్రైవేటీకరణ: 1953లో టాటా గ్రూపు నుంచి జాతీయం చేసిన ఏర్‌ ఇండియా సంస్థను ప్రైవేటీకరణలో భాగంగా తిరిగి 2023, జనవరిలో టాటా గ్రూపునకే ప్రభుత్వం విక్రయించింది. రుణ భారం భరించలేక ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఏర్‌బస్, బోయింగ్‌ లాంటి 840 విమానాల కొనుగోలుకు ఏర్‌ ఇండియా ఆర్డర్లు పెట్టింది.


ఏర్‌ సేవ:  విమాన ప్రయాణికులు ప్రయాణ సేవల సమాచారం పొందడానికి, ఫిర్యాదుల నమోదుకు అవకాశం కల్పించే చరవాణి యాప్‌ ‘ఏర్‌ సేవ’. పౌర విమానయాన మంత్రిత్వశాఖ 2016, నవంబరులో దీన్ని ప్రారంభించింది. 2018లో మెరుగుపరచి (అప్‌డేట్‌) ‘ఎయిర్‌సేవ 2.0’ను తీసుకొచ్చింది.

విమానాశ్రయాల ప్రైవేటీకరణ: ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయడానికి తొలుత 6 విమానాశ్రయాలను ఎంపిక చేశారు. అవి 

1) అహ్మదాబాద్‌ 

2) గువాహటి 

3) జైపుర్‌

 4) లఖ్‌నవూ    

 5) మంగళూరు 

6) తిరువనంతపురం


గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు: భారతదేశంలో మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం పాక్యాంగ్‌ (సిక్కిం). కేంద్ర ప్రభుత్వం 2013లో 18 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఒకటి.


భారత విమాన రంగం చరిత్ర


1911, ఫిబ్రవరి 18న భారతదేశంలో వాణిజ్య పౌర విమాన రవాణా ప్రారంభం - అలహాబాద్‌ నుంచి నైనిటాల్‌ వరకు.


1928 మొదటి విమానాశ్రయం - బొంబాయి సమీపంలోని జూహు వద్ద వైల్‌పార్లే ఫ్లైయింగ్‌ క్లబ్‌గా ప్రసిద్ధి.


1910 - పాటియాల మహారాజు భూపేందర్‌ సింగ్‌ సొంత విమానం కొనుగోలు.


1912 - కరాచీ - ఢిల్లీ మధ్య విమాన సేవలు బ్రిటిష్‌ ఇంపీరియల్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ మొదటి దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసు.


1915 - మొదటి భారతీయ విమాన సంస్థ టాటా సన్స్‌ లిమిటెడ్, కరాచీ - మద్రాసు మధ్య జంతువుల రవాణా.


1920 - రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌.. కరాచీ - బొంబాయిల వద్ద పౌరవిమానాశ్రయాల నిర్మాణం.


1927 - ప్రభుత్వ పౌర విమానయాన శాఖ ఏర్పాటు


1932 - టాటా సన్స్‌ లిమిటెడ్‌ సంస్థ శాఖగా టాటా ఎయిర్‌లైన్స్‌ ప్రారంభం. తర్వాత కాలంలో 1946లో ఎయిర్‌ ఇండియాగా మార్పు.


1940 - హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు (హెచ్‌.ఎ.ఎల్‌.)


1945 - నిజాం నవాబు, టాటాల సంయుక్త దక్కన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభం


1953 - భారతదేశంలో 8 దేశీయ విమాన ప్రయాణ సంస్థలు ప్రారంభం


1953 - భారత పార్లమెంటులో ఎయిర్‌ కార్పొరేషన్‌ చట్టం ఆమోదం.


ఈ చట్టంతో అప్పటి 8 ప్రైవేటు విమాన సంస్థలను జాతీయం చేశారు. వీటితో ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ అని రెండు విమాన సంస్థలను ఏర్పాటు చేశారు. ఎయిర్‌ ఇండియా విదేశీ ప్రయాణాల నిర్వహణ; ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ దేశీయ విమాన ప్రయాణాల నిర్వహణ చేసేవి.


1972 - ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐ.ఎ.ఎ.ఐ.) స్థాపన.


1986 - నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌.ఎ.ఎ.ఐ.) ఏర్పాటు. (1995లో ఐ.ఎ.ఎ.ఐ., ఎన్‌.ఎ.ఎ.ఐ. రెండింటినీ విలీనం చేసి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాగా ఏర్పాటు చేశారు)


1987 - బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఏర్పాటు.


1991 - భారతీయ విమాన రంగంపై ప్రభుత్వం క్రమబద్ధీకరణ తొలగింపు. ప్రైవేటు రంగంలో విమాన ప్రయాణాలు ప్రారంభం.


ఉదా: జెట్‌ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, ఇండిగో

 

- రచయిత: ధరణి శ్రీనివాస్‌

 

 

Posted Date : 02-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌