• facebook
  • whatsapp
  • telegram

 భారత రవాణా రంగం - విస్తరణ  (రహదారుల వ్యవస్థ)  

సుస్థిర ప్రగతికి శ్రేష్ఠమైన మార్గాలు! 

రహదారులు, పురోగతి అనేవి ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కాస్త శ్రద్ధగా గమనిస్తే గత రెండు దశాబ్దాలపైగా రోడ్డు రవాణా వ్యవస్థ విస్తృతంగా విస్తరించింది. జాతీయ రహదారుల సంఖ్య పెరిగిపోయింది. నాలుగు దిక్కుల్లోని దేశ సరిహద్దులు అనుసంధానమయ్యాయి. వాటిని ఒక నోడల్‌ సంస్థ నిర్వహిస్తోంది. రేవు పట్టణాలు కలిశాయి. నాలుగు వరుసల మార్గాలు వెలిశాయి. ఆరు వరుసల అభివృద్ధికి సిద్ధమవుతున్నాయి. కొత్త కొత్త ఎక్స్‌ప్రెస్‌ రహదారులు, రింగ్‌ రోడ్లు, బైపాస్‌లు, ఫైఓవర్లు ప్రత్యక్షమవుతున్నాయి. వంతెనల నిర్మాణంతో సేతు భారతం ఆవిషృతమవుతోంది. ఆర్థిక కారిడార్లతో భారత్‌ మాల రూపొందుతోంది. హరిత పథకాలతో కాలుష్య కట్టడికి కృషి జరుగుతోంది. కొండ ప్రాంతాలు పర్వతమాలతో కలిసిపోతుంటే, పీఎం గతిశక్తితో ప్రగతిపథంలోకి దేశం దూసుకెళుతోంది. ఈ అంశాలన్నింటినీ పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


మనిషి శరీరంలో నాడీమండల వ్యవస్థ తీరుగా, దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా వ్యవస్థ పనిచేస్తుంది. ఒక దేశం నిలకడైన ఆర్థిక వృద్ధి సాధించడానికి చక్కని సమన్వయంతో కూడిన సుస్థిర రవాణా వ్యవస్థ కీలకం. ప్రస్తుతం భారత రవాణా వ్యవస్థలో నాలుగు రకాల రవాణా మార్గాలున్నాయి. అవి 

1) రోడ్డు రవాణా 

2) రైలు రవాణా

 3) నౌకా రవాణా

 4) వాయు రవాణా.


దేశ రవాణా రంగం కొన్నేళ్లుగా వివిధ వలయాలుగా విస్తరించి గణనీయ వృద్ధి సాధించడంతో పాటు సత్ఫలితాలిస్తోంది. దేశవ్యాప్తంగా రైల్వే, విమానయానం మినహా వివిధ రవాణా సాధనాల అభివృద్ధి, సంబంధిత ప్రణాళికలు, విధానాలను కేంద్ర నౌకా రవాణా, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలు రూపొందించి అమలు చేస్తుంటాయి.


 గతంలో నౌకా, రోడ్డు రవాణాగా ఉన్న విభాగాన్ని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి 2009లో విడదీశారు. రోడ్డు రవాణా - జాతీయ రహదారులను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారు. రోడ్డు రవాణాతో పాటు రవాణా రంగ పరిశోధన, సంబంధిత నియమ నిబంధనల చట్టాల రూపకల్పన, నిర్వహణ బాధ్యతను దీనికి అప్పగించారు. ప్రపంచంలోని అతిపెద్ద రోడ్డు రవాణా వ్యవస్థల్లో భారతదేశ రోడ్డు రవాణా వ్యవస్థ ఒకటి. 2017-18లో భారతదేశం స్థూల అనుసంధాన విలువలో 3.06 శాతాన్ని రోడ్డు రవాణా దక్కించుకుంది. 1951లో దేశంలోని రహదార్ల పొడవు 4 లక్షల కి.మీ. ఉంటే, 2019 నాటికి అది 63.32 లక్షల కి.మీ.కు పెరిగింది. దేశంలో ప్రధానంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులని మూడు రకాలు ఉంటాయి.


జాతీయ రహదారులు: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్మించే వాటిని జాతీయ రహదారులుగా వ్యవహరిస్తారు. దేశంలోని మొత్తం రహదారుల నిడివి 2.08 శాతం. ఇందులో జాతీయ రహదారుల పొడవు 1.7 శాతం. దేశంలో రహదారులపై మొత్తం ట్రాఫిక్‌లో జాతీయ రహదారుల వాటా 40 శాతం ఉంది. 


నూతన విధానం: జాతీయ రహదార్లకు 2010, ఏప్రిల్‌ 28 నుంచి కొత్త విధానంలో సంఖ్యలు కేటాయించారు.


1) ఉత్తరం - దక్షిణం వైపు సాగే అన్ని జాతీయ రహదారులకు సరి సంఖ్య కేటాయించారు. ఈ సంఖ్యలు తూర్పు నుంచి పడమరకు ఆరోహణ క్రమంలో ఉంటాయి.


2) తూర్పు - పశ్చిమ వైపు సాగే అన్ని జాతీయ రహదార్లకు బేసి సంఖ్యలు కేటాయించారు. ఇవి ఉత్తరం నుంచి దక్షిణానికి ఆరోహణ క్రమంలో ఉంటాయి.


3) అన్ని ప్రధాన రహదార్లకు ఒక డిజిట్‌ లేదా రెండు డిజిట్‌ సంఖ్యలు మాత్రమే కేటాయించారు.


4) ద్వితీయ ప్రాధాన్యం ఉన్న రహదార్లకు, ప్రధాన రహదార్ల శాఖలకు మూడు డిజిట్‌ సంఖ్యలను కేటాయించారు.


5) మూడు డిజిట్ల రహదార్లకు సంబంధించిన కొద్దిపాటి ఉపశాఖలకు సంఖ్య తర్వాత ఎ, బి, సి, డి వంటి అక్షరాలు అదనంగా చేర్చారు.


ముఖ్యాంశాలు: 

* మొత్తం రహదార్ల పొడవు 63,31,800 కి.మీ.


* జాతీయ రహదార్ల పొడవు 1,32,499 కి.మీ.


* రాష్ట్ర రహదార్ల పొడవు 1,79,500 కి.మీ.


* మొత్తం వాహనాల సంఖ్య 32,62,99,000.


* రహదార్ల రవాణా ద్వారా రాబడి - కేంద్ర ప్రభుత్వం 1,21,.283 కోట్లు, రాష్ట్రాలు 73,880 కోట్లు.


* మొత్తం జాతీయ రహదారుల సంఖ్య - 599


* అత్యంత పొడవైన జాతీయ రహదారి - NH 44  (పాత అంకె 7) (శ్రీనగర్‌-కన్యాకుమారి 4,112 కి.మీ.)


* రెండో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH 27   - పోరుబందర్‌ (గుజరాత్‌) నుంచి సిల్చార్‌ (అస్సాం) (3,507 కి.మీ.)


* ఎక్కువ జాతీయ రహదార్లు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర (98)


* అతి చిన్న జాతీయ రహదారి NH1 (జమ్ము- కశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ వరకు 534 కి.మీ.)


భారత జాతీయ రహదార్ల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ):  ఇదొక భారత ప్రభుత్వ సంస్థ. జాతీయ రహదార్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన నోడల్‌ సంస్థగా పనిచేస్తుంది. 1988లో ఏర్పాటు చేశారు. మొదటి అధ్యక్షుడు డాక్టర్‌ యోగేంద్ర నారాయణ్‌. ప్రస్తుత అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌ యాదవ్‌. ఎన్‌హెచ్‌ఏఐ.కి 1995లో స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. జాతీయ రహదార్ల అభివృద్ధి పథకం అమలు బాధ్యత నిర్వహిస్తుంది. దీని కోసం పెట్రోలు, డీజిల్‌పై వసూలు చేసే మొత్తంలో కొంత భాగం ఈ సంస్థకు కేటాయిస్తారు. జాతీయ రహదార్ల అభివృద్ధి పథకం బాండ్ల విక్రయం ద్వారా అదనపు నిధులను సమకూర్చుకుంటుంది. చేపట్టే ప్రాజెక్టుల్లో పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ నుంచి రుణాలు తీసుకుంటుంది.  ఇతరత్రా చిన్న ప్రాజెక్టులతో కలిపి మొత్తం 50,329 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ సహా జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును ఈ సంస్థకు అప్పగించారు. 


జాతీయ రహదార్ల అభివృద్ధి పథకం: ఉత్తమ ప్రయాణాలకు తగినట్లుగా దేశంలోని జాతీయ రహదారుల ఉన్నతీకరణ - పునరుద్ధరణ - విస్తరణ లక్ష్యంగా జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును 1998లో ప్రారంభించారు. ఇది కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా అమలవుతుంది. ఈ పథకం కింద దశలవారీగా దేశంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తారు. ఇప్పటివరకు ఏడు దశలు అమలయ్యాయి.


1) మొదటి, రెండు దశలలో స్వర్ణ చతుర్భుజి పూర్తయింది. ప్రధాన రేవు పట్టణాలను కలుపుతూ జాతీయ రహదారులను అభివృద్ధి చేశారు.


2) మూడు, నాలుగు దశల్లో నాలుగు వరుసల రహదార్లు అభివృద్ధి చేశారు.


3) అయిదో దశలో 6,500 కి.మీ. మేర ఆరు వరుసల రహదార్లుగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించింది.


4) ఆరో దశలో ఎక్స్‌ప్రెస్‌ రహదారులను అభివృద్ధి చేయాలని సంకల్పించారు.


5) ఏడో దశలో అనేక ప్రాంతాల్లో వలయ రహదార్లు (రింగ్‌రోడ్లు), బైపాస్‌ రహదార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ పథకం భారత్‌ మాతా ప్రాజెక్టులో విలీనమైంది.


స్వర్ణ చతుర్భుజి: దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాలను కలుపుతూ అభివృద్ధి చేసిన రహదార్ల అనుసంధానం స్వర్ణ చతుర్భుజి. ఈ పథకాన్ని 2001లో అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రారంభించగా, 2012లో పూర్తయింది. దీని పొడవు 5,846 కి.మీ. ఇది నాలుగు వరుసల రహదారి వ్యవస్థ.


సేతు భారతం కార్యక్రమం: 2016, మార్చి 4న సేతు భారతం కార్యక్రమం ప్రారంభమైంది. రూ.50 వేల కోట్ల పెట్టుబడితో జాతీయ రహదార్లపై వంతెనలు నిర్మించడం దీని లక్ష్యం. 2019 కల్లా జాతీయ రహదార్లకు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌లు అవరోధం కాకుండా రూ.20,800 కోట్ల వ్యయంతో 208 రైల్వే పైవంతెనలు, కింది వంతెనలు నిర్మించడం ఈ కార్యక్రమం లక్ష్యం. దీనికితోడు 1500 పాత, శిథిలమైన వంతెనలు తొలగించడంతో పాటు వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తారు.


భారత మాల పరియోజన: ఇది దేశంలో రెండో అతిపెద్ద రహదారి నిర్మాణ ప్రాజెక్టు. 2017-18లో ప్రారంభమైంది. 26,000 కి.మీ. పొడవునా ఆర్థిక కారిడార్ల అభివృద్ధి చేపడతారు. అలాగే స్వర్ణ చతుర్భుజి ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ కారిడార్ల పరిధిలో అధికశాతం సరకు రవాణా రహదారుల మీదుగా సాగుతుందని అంచనా. తదనుగుణంగా ఆర్థిక కారిడార్ల సామర్థ్యం మెరుగుదల కోసం దాదాపు 8000 కి.మీ, మధ్యంతర కారిడార్ల కోసం 7,500 కి.మీ. అనుబంధ మార్గాలను గుర్తించారు.


జాతీయ హరిత రహదారుల కారిడార్‌ ప్రాజెక్టు: ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. దీని కింద రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా సుమారు 781 కి.మీ. పొడవైన పలు జాతీయ రహదారుల ఉన్నతీకరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం అందిస్తోంది.


ఈ పథకం లక్ష్యాలు: 

* చెట్లు, పొదలకు వాయు కాలుష్యకారకాల సంగ్రహణ స్వభావం ఉంటుంది. అందుకే జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటేందుకు విధానచట్రం రూపకల్పన

* వాహనాల సంఖ్య పెరుగుదలతో నానాటికీ అధికమవుతున్న శబ్ద కాలుష్య ప్రభావం తగ్గింపు.

* రోడ్డు గట్లు, వాలు వద్ద నేలకోతను అరికట్టడం.


పర్వతమాల పరియోజన: పర్వత ప్రాంతాల్లో ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుతో పాటు పర్యాటక రంగం ప్రగతి దిశగా జాతీయ మోకు మార్గాల (రోప్‌ వే) అభివృద్ధికి ఉద్దేశించిన పథకం. కొండ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో (ఉదా: వారణాసి, ఉజ్జయిని) ప్రత్యామ్నాయ రవాణా మార్గంగానూ రోప్‌ వేలు నిర్మిస్తున్నారు.


పీఎం గతిశక్తి ప్రణాళిక: పీఎం గతిశక్తి అనేది బహుళ రవాణా సాధన, అనుసంధాన జాతీయ బృహత్‌ ప్రణాళిక. 2021లో దీనిని ఒక డిజిటల్‌ వేదికగా ప్రకటించారు. దేశంలో రైలు, రోడ్డు మార్గాలు సహా మౌలిక సదుపాయాల అనుసంధాన పథకాలపై సమగ్ర ప్రణాళిక రచనకు, సమన్వయంతో అమలు చేయడానికి వీలుగా 16 మంత్రిత్వ శాఖలను ఒకే తాటిపైకి తేవడం దీని లక్ష్యం.


ఈ-టోల్‌ రహదారి రుసుం వసూళ్లు: రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా జాతీయ ఎలక్ట్రానిక్‌ రహదారి రుసుం వసూళ్ల కార్యక్రమం (ఎన్‌ ఈటీసీ) పేరుతో కీలక వ్యవస్థను ప్రవేశపెట్టింది. టోల్‌ కేంద్రాల నుంచి నిరంతరం సాగే వాహన రాకపోకల పర్యవేక్షణ సహా ఫాస్టాగ్‌ సదుపాయాలతో రుసుం వసూళ్లలో పారదర్శకత పెంచడం ఈ వ్యవస్థ లక్ష్యం. దీనికి జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) పర్యవేక్షక కేంద్రంగా వ్యవహరిస్తుంది.

 

 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

 

 

Posted Date : 15-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌