• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళికా సంఘం - నీతి ఆయోగ్‌

నిర్వచనం: నిర్ణీత కాలంలో ముందుగా నిర్ణయించిన లక్ష్యాలు, వాటి సాధన మార్గాల ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం చేసే కృషిని ప్రణాళిక ప్రక్రియ అంటారు. ఫెడరల్‌ వ్యవస్థ అయిన భారతదేశంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఒకే రకమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిశ్రమ ఆర్థిక‌ వ్యవస్థ అయిన మన దేశంలో ఆర్థిక - సామాజిక లక్ష్యాల సాధనకు ప్రభుత్వ రంగం ప్రణాళికా విధానంలో కొన్ని ప్రాధాన్యతలతో పనిచేయాలి. ప్రైవేట్‌ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. ఈ ప్రక్రియలో అనేక ప్రోత్సాహకాలు కల్పించి ప్రభుత్వం ప్రైవేట్‌ రంగానికి మార్గదర్శకాన్ని నిర్దేశిస్తూ నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి భారతదేశం ఒక ప్రణాళికా పద్ధతిని అవలంబించే వ్యవస్థ అని చెప్పవచ్చు. భారతదేశంలో 1951 - 2017 మధ్య ప్రణాళికల కాలంలో మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. ఆర్థిక ప్రణాళికలు అనే భావనను తొలిసారిగా ఉపయోగించినవారు గున్నార్‌ మిర్దాల్‌ (స్వీడన్‌ ఆర్థికవేత్త).

 

   1929లో ప్రబల ఆర్థిక మాంద్యం (Great Economic Depression) ఏర్పడింది. ప్రపంచంలో తొలిసారిగా అప్పటి రష్యా అధ్యక్షుడైన జోసెఫ్‌ స్టాలిన్‌ ఆధ్వర్యంలో ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రబల ఆర్థిక మాంద్యానికి ముందే 1928, అక్టోబరు 1న  (1928 - 32) ఆర్థిక ప్రణాళికలు ప్రవేశ పెట్టారు. ఆర్థిక ప్రణాళికలు భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాకు చెందిన అంశం. రష్యాను  ఆదర్శంగా తీసుకొని భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్థిక ప్రణాళికలను ప్రవేశ పెట్టారు. ఈయనను భారత పంచవర్ష ప్రణాళికల రూపశిల్పిగా పేర్కొంటారు. 


    మొదట 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించిన ‘ప్లాన్డ్ ఎకానమీ ఫర్‌ ఇండియా’ గ్రంథం ప్రణాళికా విధానాన్ని అమలు చేయాలని వివరించింది. భారతదేశ ఆర్థికాభివృద్ధి కోసం పది సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆర్థిక ప్రణాళికలను రూపొందించారు. ఈయనను భారత పంచవర్ష ప్రణాళికల పితామహుడని (దేశంలో ఆర్థిక ప్రణాళికా రచనలకు ఆధ్యుడు) పిలుస్తారు. 1937లో భారత జాతీయ కాంగ్రెస్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసింది.1938లో తొలిసారిగా ఆర్థికాభివృద్ధి ప్రణాళిక రచన చేపట్టారు. 1948లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. 

* 1938లో ఏర్పాటు చేసిన జాతీయ ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ. 

* 1938లో మన దేశానికి ప్రణాళికా సంఘం అవసరమని తెలిపిన మొదటి జాతీయ నాయకుడు సుభాష్‌ చంద్రబోస్‌.

  బాంబే ప్రణాళిక: పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యమిస్తూ 1943లో బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు ‘ఎ ప్లాన్‌ ఫర్‌ ది ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో 15 సంవత్సరాల కాలానికి బాంబే ప్రణాళికను తయారుచేశారు. దీన్ని 1944లో ముద్రించారు. ఇది పెట్టుబడిదారి లక్షణాలను పోలి ఉంది. ఈ ప్రణాళిక ఖర్చు రూ.10 వేల కోట్లు. బాంబే ప్రణాళికను రూపొందించిన ప్రముఖ వ్యాపారవేత్తలు పురుషోత్తం దాస్, జె.ఆర్‌.డి.టాటా, జి.డి.బిర్లా.

  గాంధీయన్‌ ప్రణాళిక: ఈ ప్రణాళికను శ్రీమన్నారాయణ్ అగర్వాల్‌ 1944లో రూపొందించారు. దీని ప్రధాన ఉద్దేశం చిన్న కుటీర పరిశ్రమల అభివృద్ధి. ఈ ప్రణాళిక కోసం రూ.3500 కోట్లు కేటాయించారు. కాలవ్యవధి 10 సంవత్సరాలు.

ప్రణాళికాభివృద్ధి శాఖను సర్‌ అర్దెషిర్‌ దలాల్‌ ఆధ్వర్యంలో 1944లో ఏర్పాటు చేశారు.

  ప్ర‌జా ప్ర‌ణాళిక‌ (People's plan)దీన్ని మానవేంద్ర నాథ్‌ రాయ్‌ (ఎం.ఎన్‌.రాయ్‌) 1945లో ప్రచురించారు. దీని కాలం 10 సంవత్సరాలు. ఇది సామ్యవాద భావాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రణాళిక ఉద్దేశం వ్యవసాయాభివృద్ధి, వినియోగ వస్తువుల పరిశ్రమల అభివృద్ధి. దీని కోసం రూ.15 వేల కోట్లు కేటాయించారు. ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఇన్‌ ఇండియా) స్థాపకుడు ఎం.ఎన్‌.రాయ్‌. 

 

ప్రణాళికా సంఘం

    ప్రణాళికా సలహా మండలిని 1946లో అర్దెషిర్‌ దలాల్‌ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. దీనికి నెహ్రూ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1948లో ప్రణాళికా సలహా మండలి సిఫార్సు ప్రకారం మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం - 1948లో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు.1949లో ప్రణాళిక సలహా మండలిలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

  1950, జనవరిలో జరిగిన  పార్లమెంట్‌ సమావేశ ఉపన్యాసంలో ప్రణాళికా సంఘం స్థాపన గురించి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ప్రస్తావించారు. 1950 ఫిబ్రవరిలో భారత స్వాతంత్య్ర మొదటి ఆర్థికమంత్రి ఆర్‌.కె.షణ్ముఖం చెట్టి బడ్జెట్‌ ఉపన్యాసంలో ప్రణాళికా సంఘం ఏర్పాటు గురించి ప్రస్తావించారు. 

  1950లో జయప్రకాష్‌ నారాయణ్‌ సర్వోదయ ప్రణాళిక పేరుతో ఆర్థిక ప్రణాళికను రూపొందించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ తీర్మానం ప్రకారం 1950, మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం (యోజన భవన్‌)  న్యూదిల్లీలో ఉంది. ప్రణాళికా సంఘం రాజ్యాంగేతర, చట్టబద్ధత లేని శాశ్వత సంఘం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సలహా సంఘంగా పనిచేస్తుంది. దీని ముఖ్య లక్ష్యం దేశంలో లభించే వనరులను సమర్థంగా ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధిని సాధించే ప్రణాళికలను రచించడం.

 

ముఖ్యాంశాలు:

ప్రణాళికా సంఘం యోజన అనే పత్రికను ప్రచురించింది.

ప్రణాళికా సంఘాన్ని ఆదేశిక సూత్రాల్లోని 39వ నిబంధనకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. 

ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందిన అంశం.

ప్రణాళికా సంఘం ఎక్స్‌ - అఫీషియో (పదవీరీత్యా సభ్యుడు) అధ్యక్షుడు ప్రధానమంత్రి.

మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ. ఈయన ప్రణాళికా సంఘానికి ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేశారు. 

చివరి ప్రణాళికా సంఘం (12వ ప్రణాళిక) అధ్యక్షుడిగా మన్మోహన్‌ సింగ్‌ (2004 - 2014) పనిచేశారు

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదా ఉంటుంది.    

ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్‌ నందా (1953 - 63). చివరి (12వ ప్రణాళిక) ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా (2004 - 2014).

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేసిన తెలుగువారు పి.వి.నరసింహారావు, పి.శివశంకర్‌. 

ప్రణాళికా సంఘాన్ని కేంద్ర మంత్రివర్గ తీర్మానం ఆమోదానికి అనుగుణంగా 2014, ఆగస్టు 17న రద్దు చేశారు.   

ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. 


జాతీయ అభివృద్ధి మండలి (NDC) 

    దీన్ని 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘానికి అనుసంధానంగా ప్రణాళికా విధానంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించడానికి జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగేతర, చట్టబద్ధత లేని శాశ్వత సంఘం. దీని ప్రధాన కార్యాలయం (జవహర్‌ వ్యాపార్‌ భవన్‌) న్యూదిల్లీలో ఉంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే దీనికి కూడా ఉపాధ్యక్షుడిగా ఉంటారు.

మొదటి అధ్యక్షుడు - జవహర్‌లాల్‌ నెహ్రూ

మొదటి ఉపాద్యక్షుడు - గుల్జారీలాల్‌ నందా 

ప్రస్తుత అధ్యక్షుడు - నరేంద్ర మోదీ

జాతీయ అభివృద్ధి మండలిలో మొదట ప్రధానమంత్రితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత 1967 నుంచి కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, కేంద్రమంత్రులను నీతి ఆయోగ్ సభ్యులు కూడా ఈ మండలిలో సభ్యులుగా చేశారు. 

 

విధులు: 

జాతీయ ప్రణాళిక రూపకల్పనకు తగిన విధి విధానాలను నిర్ణయించడం. 

నీతి ఆయోగ్‌ రూపొందించిన జాతీయ ప్రణాళిక ఆమోదాన్ని పరిశీలించడం.

జాతీయ ప్రణాళిక అమలుకు అవసరమైన వనరులను అంచనా మేయడం, పెంచడం.

జాతీయాభివృద్ధి వల్ల ప్రభావితమయ్యే సామాజిక, ఆర్థిక విధానాన్ని సమీక్షించడం. 

ఎప్పటికప్పుడు జాతీయ ప్రణాళిక పని తీరును పరిశీలించి లక్ష్యాలను సాధించే చర్యలను సిఫార్సు చేయడం. 

 

లక్ష్యాలు:    

జాతీయ ప్రణాళికలకు అవసరమైన వనరుల సమీకరణ

అన్ని ప్రాంతాల సంతులిత, శీఘ్ర అభివృద్ధి 

ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం


భారత పంచవర్ష ప్రణాళికలు - కాలాలు 


ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో 12 ప్రణాళికలను ప్రవేశపెట్టారు. 

మొదటి ప్రణాళిక - 1951 - 56
రెండో ప్రణాళిక - 1956 - 61
మూడో ప్రణాళిక - 1961 - 66
నాలుగో ప్రణాళిక - 1969 - 74
అయిదో ప్రణాళిక - 1974 - 78/79
ఆరో ప్రణాళిక - 1980 - 85
ఏడో ప్రణాళిక - 1985 - 90
 ఎనిమిదో ప్రణాళిక - 1992 - 97
తొమ్మిదో ప్రణాళిక - 1997 - 2002
పదో ప్రణాళిక - 2002 - 2007
పదకొండో ప్రణాళిక - 2007 - 12
పన్నెండో ప్రణాళిక - 2012 - 17

 

మొదటి ప్రణాళిక (1951 - 56): ప్రణాళికా సంఘం నిర్వహించిన మొదటి ప్రణాళిక కాలం 1951 - 56. ఈ ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. దీన్ని వ్యవసాయ ప్రణాళిక, నీటిపారుదల ప్రణాళిక అని కూడా పిలుస్తారు. హరాడ్‌ - డోమర్‌ వృద్ధి నమూనాను అనుసరించి మొదటి ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం 2.1% కాగా 3.6% సాధించింది.

 

రెండో ప్రణాళిక (1956 - 61): ఈ ప్రణాళికను మహలనోబిస్‌ నమూనాను అనుసరించి రూపొందించారు. ఇది భారతదేశ సత్వర పారిశ్రామికాభివృద్ధికి పునాది వేసింది. సామ్యవాద రీతి సమాజ స్థాపనే లక్ష్యంగా నిర్ణయించిన తర్వాత ఈ ప్రణాళికను రూపొందించారు. వృద్ధి రేటు లక్ష్యం 4.5%, సాధించినది 4.1%.

    రెండో ప్రణాళిక ప్రధాన లక్ష్యం మౌలిక, భారీ పరిశ్రమల వృద్ధి. దీన్ని ‘పరిశ్రమల అభివృద్ధి ప్రణాళిక’ అని పిలుస్తారు. దీన్ని ప్లవన దశను (Take of stage) చేరిన ప్రణాళిక, ధైర్యంతో కూడిన ప్రణాళిక (Bold plan) అని కూడా పిలుస్తారు. ఈ ప్రణాళికలో బిగ్‌పుష్‌ సిద్ధాంతాన్ని అనుసరించారు. రెండో ప్రణాళికలో మూడు ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేశారు.  

1) బిలాయ్‌ ఉక్కు కర్మాగారం (చత్తీస్‌గఢ్‌) - రష్యా సహాయంతో ఏర్పాటు

2) రూర్కెలా ఉక్కు కర్మాగారం (ఒడిశా) - పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు

3) దుర్గాపూర్‌ ఉక్కు కర్మాగారం (పశ్చిమ్‌ బంగా) - బ్రిటన్‌ సహాయంతో ఏర్పాటు

 

మూడో ప్రణాళిక (1961 - 66): ఇది తీవ్ర వైఫల్యం చెందిన ప్రణాళిక. 1962లో భారత్, చైనా యుద్ధం (చైనా దురాక్రమణ), (మూడో ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం 5.6%, సాధించినది 2.8%).1966లో  భారత్, పాక్‌ యుద్ధం, 1965 - 66లో తీవ్ర కరవు కారణంగా మూడో ప్రణాళిక విఫలమైంది. ఈ ప్రణాళిక కాలంలో 1964లో బొకారో ఉక్కు కర్మాగారాన్ని (ఝార్ఖండ్‌) రష్యా సహకారంతో ఏర్పాటు చేశారు. 

మొదటి ప్రణాళిక విరామ కాలం: 1966 - 69 మధ్య కాలాన్ని ప్రణాళిక విరామ కాలం అంటారు. ఈ కాలంలో మూడు వార్షిక ప్రణాళికలను (1966 - 67, 1967 - 68, 1968 - 69)  అమలుచేశారు. ఈ ప్రణాళిక విరామానికి ముఖ్య కారణాలు మూడో ప్రణాళిక వైఫల్యం (రూపాయి మూల్య హీనీకరణ), ఆర్థిక తిరోగమనం, ద్రవ్యోల్బణం. వార్షిక ప్రణాళికలను పిగ్మీ ప్రణాళికలు అంటారు.

 

నాలుగో ప్రణాళిక (1969 - 74): ఈ ప్రణాళిక ద్వంద్వ లక్ష్యాలు - సుస్థిరతతో కూడిన అభివృద్ధి, క్రమంగా స్వావలంబన సాధన. వృద్ధి రేటు లక్ష్యం 5.7%, సాధించినది 3.3%.

    ఈ ప్రణాళిక కాలంలో ఇందిరా గాంధీ 1971లో గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు. దీని అర్థం పేదరికాన్ని తరిమివేయండి. బంగ్లాదేశ్‌ యుద్ధం, భారీగా కాందీశీకుల రాక, ధరల పరిస్థితి కారణంగా ఈ ప్రణాళిక వైఫల్యం చెందింది. 

 

అయిదో ప్రణాళిక (1974 - 78/79): హిందూ వృద్ధిరేటు అనే మాటను మొదటిసారిగా ఉపయోగించిన ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ (1978), ఆ వృద్ధిరేటు 3.5%. ఈ ప్రణాళిక కాలంలో 20 సూత్రాల పథకం (1975) ప్రారంభించారు. దీనికి 1982, 1986లో సవరణలు చేశారు. వృద్ధి రేటు లక్ష్యం 4.4%, సాధించినది 4.8% (విజయం).

    అయిదో ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు పేదరిక నిర్మూలన, స్వావలంబన. దీన్ని పేదరిక నిర్మూలన ప్రణాళిక అని పిలుస్తారు. ఈ ప్రణాళికను ఒక సంవత్సరం ముందుగానే (1978) రద్దు చేశారు.

నిరంతర ప్రణాళికలో భాగంగా ఆరో ప్రణాళికను రెండుసార్లు ప్రవేశపెట్టారు. ఈ ప్రణాళికా కాలం 1978 - 83 కాగా దీన్ని 1978 - 80 కాలానికి అమలుచేశారు.

నిరంతర ప్రణాళికను (1978) ప్రవేశ పెట్టిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్డావాలా. నిరంతర ప్రణాళిక భావనను ప్రవేశపెట్టినవారు గున్నార్‌ మిర్దాల్‌ (స్వీడన్‌ ఆర్థికవేత్త), ఈ ప్రణాళికను తొలిసారి నెదర్లాండ్‌లో ప్రవేశపెట్టారు. 

 

ఆరో ప్రణాళిక (1980 - 85): ఈ ప్రణాళికను వేర్వేరు కాల వ్యవధుల్లో రూపొందించారు (జనతా ప్రభుత్వం 1978-83, కాంగ్రెస్‌ ప్రభుత్వం 1980 - 85). ఈ ప్రణాళికను నిరంతర ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టారు. దీన్ని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని పిలుస్తారు.వృద్ధి రేటు లక్ష్యం 5.2%, సాధించినది 5.7%.

 

ఏడో ప్రణాళిక (1985 - 1990): దీన్ని శక్తి ప్రణాళిక అని పిలుస్తారు. దీని ప్రధాన లక్ష్యాలు ఉత్పాదకత పెంచడం, ఉపాధి కల్పన, ఆహార ధాన్యాల సరఫరాను మెరుగుపరచడం. వృద్ధి రేటు లక్ష్యం 5%, సాధించినది 6%.

1990- 1992 మధ్య కాలంలో రెండోసారి ప్రణాళిక విరామం ఏర్పడింది. ఏడో ప్రణాళిక తర్వాత ఎనిమిదో ప్రణాళిక ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మధ్య కాలాన్ని అనధికార ప్రణాళిక సెలవుగా పిలుస్తారు. రెండో ప్రణాళిక విరామానికి కారణాలు రాజకీయ అస్థిరత, ప్రభుత్వాల మార్పు, విదేశీ చెల్లింపుల లోటు.

 

ఎనిమిదో ప్రణాళిక (1992 - 1997): దీన్ని నూతన సంస్కరణల నేపథ్యంలో రూపొందించారు. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి. దీనిలో సూచనాత్మక ప్రణాళికను అనుసరించారు. ఈ సూచనాత్మక ప్రణాళికను మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక అంటారు. ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పోలి ఉంటుంది. ఎనిమిదో ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం 5.6% కాగా 6.8% వృద్ధిని సాధించింది.

 

తొమ్మిదో ప్రణాళిక (1997 - 2002): ఈ ప్రణాళికను సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి లక్ష్యంతో రూపొందించారు.వృద్ధి రేటు లక్ష్యం 6.5%, సాధించినది 5.4% .

 

పదో ప్రణాళిక (2002 - 2007): ఈ ప్రణాళికలో 11 కీలక అభివృద్ధి సూచికలను పర్యవేక్షించడానికి లక్ష్యాలను నిర్ణయించారు. పదో ప్రణాళికలో 9% వృద్ధిరేటును లక్ష్యంగా నిర్ణయించగా 7.6% సాధించింది.

 

పదకొండో ప్రణాళిక (2007 - 12): ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు శీఘ్ర వృద్ధి, అధిక సమ్మిళిత వృద్ధి. ఈ ప్రణాళికలో విద్యపై అధిక కేటాయింపులు చేయడం వల్ల దీన్ని విద్యా ప్రణాళిక అని పిలుస్తారు. ఈ ప్రణాళికలో తొలిసారిగా సత్వర, సమ్మిళిత వృద్ధి అనే భావనను ఉపయోగించారు. వృద్ధి రేటు లక్ష్యం 8.1%(మొదట్లో 9%), సాధించినది 7.94% (8%).

 

పన్నెండో ప్రణాళిక (2012 - 17): ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు శీఘ్ర వృద్ధి, సుస్థిర వృద్ధి, అధిక సమ్మిళిత వృద్ధి. 12వ ప్రణాళికలో ప్రభుత్వ రంగ వ్యయం రూ.47,70,000 కోట్లు. ఈ ప్రణాళికలో పర్యవేక్షించదగిన ప్రధాన లక్ష్యాలను సాధించడానికి రంగాల వారీగా నిర్ణయించిన మౌలిక సూచికల సంఖ్య 25. 12వ ప్రణాళికలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు.లక్ష్యం 8%, సాధించినది 6.82%తీవ్రంగా విఫలమైన ప్రణాళికలు - 3, 4వ ప్రణాళికలు

విజయవంతమైన ప్రణాళికలు - 1, 5, 6, 8వ ప్రణాళికలు. అధికంగా విజయవంతమైన ప్రణాళికలు - 1, 8వ ప్రణాళికలు 

1951 - 2000 మధ్యకాలంలో సాధించిన వార్షిక వృద్ధిరేటు (1993 - 94 ధరల్లో) 4.4%.


నీతి ఆయోగ్‌

  నీతి ఆయోగ్‌ను (NITI Aayog - నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) 2015 జనవరి 1న కేంద్ర మంత్రి వర్గ తీర్మానం ఆమోదం ద్వారా ఏర్పాటు చేశారు. ప్రణాళికల రూపకల్పనలో ప్రణాళికా సంఘం పై నుంచి కిందికి (Top to Bottom) పద్ధతిని అనుసరించింది. నీతి ఆయోగ్‌ జనరల్‌ కౌన్సిల్‌ను 2015 ఫిబ్రవరి 2న మొదటిసారి ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు (వైస్‌ ఛైర్మన్‌), ముఖ్య కార్యనిర్వహణాధికారిని (సీఈవో) ప్రధాన మంత్రి నియమిస్తారు. దీనిలోని శాశ్వత సభ్యుల సంఖ్య 5. ప్రస్తుతం డాక్టర్‌ వి.కె.సారస్వత్, రమేష్‌ చంద్, డాక్టర్‌ వి.కె.పాల్‌ శాశ్వత సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం పదవీరీత్యా సభ్యులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్‌ తోమర్‌. ప్రత్యేక ఆహ్వానితులు నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్, వీరేంద్ర కుమార్, అశ్విని వైష్ణవ్, రావ్‌ ఇందర్‌జిత్‌ సింగ్‌. 

 

ముఖ్యాంశాలు:

నీతి ఆయోగ్‌ రాజ్యాంగేతర, చట్టబద్ధతలేని సంస్థ.  

దీని ప్రధాన కార్యాలయం (విజ్ఞాన్‌ భవన్‌) న్యూదిల్లీలో ఉంది.  

నీతి ఆయోగ్‌ నినాదం ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా ప్రయాస్‌’.

నీతి ఆయోగ్‌ అధ్యక్షుడు ప్రధానమంత్రి. మొదటి అధ్యక్షుడు నరేంద్ర మోదీ. 

దీని మొదటి ఉపాధ్యక్షుడు డాక్టర్‌ అరవింద్‌ పనగారియా, ప్రస్తుత ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌. 

నీతి ఆయోగ్‌ మొదటి సీఈవో సింధు శ్రీ ఖుల్లార్, ప్రస్తుత సీఈవో డాక్టర్‌ అమితాబ్‌ కాంత్‌. 

నీతి ఆయోగ్‌ అనుసరిస్తున్న సమాఖ్య వ్యవస్థ రకాలు 

1) సహకార సమాఖ్య (కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం) 

2) పోటీ సమాఖ్య (కాôపిటీటివ్‌ ఫెడరలిజం)

 

నీతి ఆయోగ్‌ అనుబంధ స్వయం ప్రతిపత్తి సంస్థలు

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (AIM)

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లేబర్‌ ఎకనామిక్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (NIERD)

డెవలప్‌మెంట్, మానిటరింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆఫీస్‌ (DMEO)

నీతి ఆయోగ్‌ పాలక మండలి (గవర్నింగ్‌ కౌన్సిల్‌) మొదటి సమావేశం 2015, ఫిబ్రవరి 8న జరిగింది. ఈ సమావేశానికి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ఎజెండా లక్ష్యాలు ..... 

‣   కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్దీకరణ

‣  నైపుణ్యాభివృద్ధి

‣  స్వచ్ఛభారత్‌ అభియాన్‌

‣  నీతి ఆయోగ్‌ ఆరో సమావేశం 2021 ఫిబ్రవరి 20న నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది.  

 

ఎజెండా లక్ష్యాలు:

భారతదేశాన్ని ఉత్పాదకశక్తి కేంద్రంగా మార్చడం.

వ్యవసాయాన్ని పునర్‌ నిర్మించడం.

భౌతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.

మానవ వనరుల అభివృద్ధిని వేగవంతం చేయడం.

గ్రాస్‌ రూట్‌ స్థాయిలో సర్వీస్‌ డెలివరీని మెరుగుపరచడం.

ఆరోగ్యం, పోషకాహారం

 

నీతి ఆయోగ్‌ విజన్‌ ప్లాన్‌ కాలం (2017 - 32)

నీతి ఆయోగ్‌ కార్యాచరణ ప్రణాళిక పత్రాలు, కాలం మూడు రకాలు

1) 15 సంవత్సరాల దార్శనిక పత్రం (దీర్ఘదర్శి ప్రణాళిక)

2) 7 సంవత్సరాల మధ్యకాలిక వ్యూహ పత్రం (మధ్యకాలిక ప్రణాళిక)

3) 3 సంవత్సరాల కార్యాచరణ ఎజెండా (స్వల్పకాలిక ప్రణాళిక)

న్యూ ఇండియా జీ 75 ప్రధాన లక్ష్యం 2022 సంవత్సరానికి భారతదేశాన్ని నాలుగు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం. దీని ప్రధాన కార్యక్రమం కోసం 41 రంగాలను ఎంపిక చేశారు. 

ఆకాంక్షిత జిల్లాల పరివర్తన కార్యక్రమాన్ని (ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌) 2018 జనవరిలో ప్రారంభించారు. దీనిలోని జిల్లాల సంఖ్య 117. దీని మౌలిక సూత్రాలు కేంద్రీకృతం, సహకారం, పోటీ.  

పారిశ్రామిక వ్యాపార రంగంలో నవకల్పనల సాధన కోసం రూపొందించిన కార్యక్రమం అటల్‌ నవకల్పనల మిషన్‌. 

నీతి ఆయోగ్‌ 2020లో ఎగుమతులకు సంబంధించి ఎగుమతుల సంసిద్ధత సూచికను (2020) విడుదల చేసింది.  

2016 పెద్ద నోట్ల రద్దు ప్రభుత్వ చర్య ఫలితంగా నీతి ఆయోగ్‌ ఆశించిన ప్రయోజనకర పెద్ద మార్పు డిజిటల్‌ చెల్లింపుల పెరుగుదల.

2030 నాటికి 10% ముడిచమురు దిగుమతులను తగ్గించడానికి నీతి ఆయోగ్‌ మిథనాల్‌ వాడకం విధానాన్ని సూచించింది.


రచయిత: బండారి ధనుజంయ్‌ 

Posted Date : 10-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌