• facebook
  • whatsapp
  • telegram

విదేశీ వర్తక విధానం

రక్షణ ప‌ద్ధ‌తి వీడి.. స్వేచ్ఛా వైఖ‌రి వైపు!


 

ఆధునిక యుగంలో ప్రతి దేశానికి విదేశీ వర్తకం తప్పనిసరి. సహజవనరులు, మానవ వనరుల నైపుణ్యం, సాంకేతిక ప్రగతిలో వ్యత్యాసాల కారణంగా వివిధ దేశాల మధ్య వస్తుసేవల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. స్వాతంత్య్రానంతరం అప్పటి పరిస్థితులకు తగినట్లుగా విదేశీ వ్యాపారంలో రక్షణాత్మక వైఖరిని అవలంబించిన భారత ప్రభుత్వం తర్వాత పద్ధతి మార్చింది. ప్రపంచీకరణకు అనుగుణంగా స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని పాటిస్తోంది. ఈ పరిణామ క్రమంపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఎగుమతులు పెంచి ప్రపంచ వాణిజ్యంలో వాటా పెంచుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థాగత చర్యలు, వ్యాపార సంస్థలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

ఒక దేశానికి చెందిన విదేశీ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వం అవలంబించే నియమ నిబంధనలను తెలియజేసేదే వర్తక విధానం. ప్రభుత్వ వ్యాపార విధానాలు ప్రధానంగా రెండు రకాలు.

1) స్వేచ్ఛా వ్యాపార విధానం: ఒక దేశం ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఎలాంటి సుంకాలు, కోటాలు, నియంత్రణలు విధించకుండా, ఎగుమతులపై ఏ విధమైన ప్రోత్సాహకాలు, సుంకాలు లేకుండా వ్యాపారం నిర్వహిస్తే అది స్వేచ్ఛా వ్యాపార విధానం.

2) రక్షణ విధానం: ఇది స్వేచ్ఛా వ్యాపార విధానానికి వ్యతిరేకం. దిగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా లేదా స్వదేశీ పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు రక్షణ కల్పిస్తే అది రక్షణ విధానం. అలెగ్జాండర్‌ హామిల్టన్, ఫ్రెడరిక్‌ లిస్ట్‌ లాంటి ఆర్థికవేత్తలు రక్షణ విధానాన్ని సమర్థించారు. దిగుమతులపై రెండు రకాల ఆంక్షలు విధించవచ్చు. అవి 1) సుంకాల అవరోధాలు 2) సుంకేతర అవరోధాలు

దిగుమతులపై అధిక పన్ను వేస్తే దాన్ని టారిఫ్‌/సుంకాల అవరోధాలు అంటారు. దిగుమతులపై పన్ను రూపంలో కాకుండా వాటి పరిమాణంపై ఆంక్షలు విధిస్తే వాటిని సుంకేతర/పరిమాణాత్మక/కోటా అవరోధాలు అంటారు. స్వేచ్ఛా వ్యాపారంతో ప్రపంచ వాణిజ్యం విస్తరిస్తే, రక్షణ విధానంతో సంకోచిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు రక్షణ విధానాన్ని నామమాత్రంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల మధ్య స్వేచ్ఛా వ్యాపారం జరిగేందుకు స్వేచ్ఛా వ్యాపార ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. భారతదేశం మొదట్లో దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని పాటించింది. అంటే 1991 వరకు భారత్‌ ‘ఇన్‌వార్డ్‌ లుకింగ్‌ పాలసీ’ని అవలంబించింది.


భారత ప్రభుత్వ వ్యాపార విధానం:  భారత వ్యాపార విధానాన్ని సంస్కరణలకు ముందు, తర్వాత అని విడదీసి పరిశీలించవచ్చు. 1991లో విదేశీ వ్యాపారానికి సంబంధించి భారీ వ్యాపార సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టడంతో ఆ ఏడాది కీలక మైలురాయిగా నిలిచిపోయింది.

సంస్కరణలకు ముందు దిగుమతి విధానం: దిగుమతులపై ఆంక్షలు, దిగుమతుల ప్రతిస్థాపన విధానాన్ని అవలంబించేవారు.

ఎ) దిగుమతులపై ఆంక్షలు: మహలనోబిస్‌ వృద్ధి వ్యూహంలో భారీ పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించడం వల్ల మూలధన యంత్రాలు, విడి పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో విదేశీ మారకద్రవ్యం భారీగా ఖర్చయింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు వాటి కోసం కూడా దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. మరోవైపు ఎగుమతుల ఆదాయం దానికి అనుగుణంగా పెరగలేదు. ఫలితంగా 1956-57 నుంచి దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ వచ్చారు. ఆ సమయంలో దిగుమతులకు లైసెన్సింగ్‌ విధానంతోపాటు పరిమాణాత్మక ఆంక్షలు కూడా ఉండేవి.

బి) దిగుమతుల ప్రతిస్థాపన: కొరతగా ఉన్న విదేశీమారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం, పెద్దమొత్తంలో వస్తువుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడం అనే లక్ష్యాలతో దిగుమతుల ప్రతిస్థాపన చేపట్టాలి. మొదటి దశలో దేశీయ వినియోగ వస్తువుల ఉత్పత్తి స్థానంలో, రెండో దశలో దిగుమతి చేసుకునే మూలధన వస్తువుల స్థానంలో, మూడో దశలో దిగుమతి చేసుకునే సాంకేతిక పరిజ్ఞానం స్థానంలో ప్రవేశపెట్టారు. 1977-78లో దిగుమతుల సరళీకరణ ప్రారంభమైంది. ఎక్కువగా మూలధన వస్తువులను దిగుమతుల లైసెన్స్‌ లేకుండానే దిగుమతి చేసుకునే విధంగా ఓపెన్‌ జనరల్‌ లైసెన్స్‌ను ప్రారంభించారు.


సంస్కరణలకు ముందు ఎగుమతుల విధానం: ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. 

* ఎగుమతుల కోసం దిగుమతులు చేసుకునే వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు 1957లో ఇంపోర్ట్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 

* ఎగుమతిదారులకు స్వేచ్ఛా వ్యాపార వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ఈపీజడ్‌ (ఎక్స్‌పోర్ట్‌ ప్రాసెసింగ్‌ జోన్స్‌)లను 1965లో ఏర్పాటు చేసింది.

* పన్ను చెల్లింపు ఎగుమతిదారులకు నగదు పరిహార మద్దతు కోసం ‘క్యాష్‌ కాంపెన్‌సేటరీ సపోర్ట్‌’ పద్ధతిని 1966లో ప్రవేశపెట్టింది. 

* 1966లో 36.5% రూపాయి మూల్యహీనీకరణ చేసింది.* 1981లో ఈఓవీలను ప్రారంభించింది.

సంస్కరణ కాలం - నూతన వ్యాపార విధానం: ప్రభుత్వం సంస్కరణల తర్వాత వ్యాపార విధానంలో సరళీకరణ చర్యలు ప్రవేశపెట్టింది. 1995లో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌-డబ్ల్యూటీఓ)లో భారతదేశం వ్యవస్థాపక సభ్యదేశంగా ఉండటంతో దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలు తొలగించడం తప్పనిసరైంది. దిగుమతి టారిఫ్‌లను తగ్గించి అంతర్జాతీయ వ్యాపారంతో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానించింది. ప్రపంచీకరణ దిశగా చర్యలు చేపట్టింది.

1) ఎగుమతి, దిగుమతులకు స్వేచ్ఛ: 1996లో ఆరు వేలకు పైగా వస్తు దిగుమతులపై సుంకాలు తొలగించారు. 2000-01 ఎగ్జిమ్‌ విధానంలో 714 అంశాలు, 2001-02 ఎగ్జిమ్‌ విధానంలో 715 అంశాల దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను తొలగించారు.

2) టారిఫ్‌ నిర్మాణం హేతుబద్ధీకరణ: రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సులపై 1993-94 బడ్జెట్‌లో 110% ఉన్న దిగుమతి సుంకాన్ని 2007-08 నాటికి 10 శాతానికి తగ్గించారు.

3) కరెంట్‌ ఖాతాలో రూపాయి పూర్తి మార్పిడి: 1991, జులై 1, 3 తేదీల్లో భారత రూపాయి వినిమయ రేటుని 18% నుంచి 19%కు సర్దుబాటు చేశారు. 1992-93లో రూపాయికి పాక్షిక మార్పిడి, 1993-94లో రూపాయికి పూర్తి మార్పిడి, 1994 ఆగస్టులో కరెంట్‌ ఖాతాలో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించారు.

4) ట్రేడింగ్‌ హౌసెస్‌: ఎగుమతుల కోసం ఉపయోగించే దిగుమతులపై పన్ను మినహాయింపు ఇచ్చారు. 2004-09 వ్యాపార విధానంలో ఎక్స్‌పోర్టు హౌస్‌లను 5 రకాలుగా విడదీశారు. అవి 1) ఎక్స్‌పోర్టు 2) స్టార్‌ ఎక్స్‌పోర్టు 3) ట్రేడింగ్‌ 4) స్టార్‌ ట్రేడింగ్‌ 5) ప్రీమియం ట్రేడింగ్‌ హౌస్‌

5) సెజ్‌లు (SEZ): 2000 సంవత్సరంలో ఎగ్జిమ్‌ పాలసీలో ఎగుమతులను ప్రోత్సహించేందుకు సెజ్‌ల ఏర్పాటును ప్రకటించారు. 2005లో సెజ్‌ చట్టం రాగా దాని నిబంధనలు 2006, ఫిబ్రవరి 10 నుంచి అమలయ్యాయి.
6) 1981లో ఎక్స్‌పోర్ట్‌ ఓరియంటెడ్‌ యూనిట్స్‌ని ప్రవేశపెట్టారు.

7) వ్యవసాయ ఎగుమతుల జోన్‌: 2001 ఎగ్జిమ్‌ పాలసీలో అగ్రి ఎక్స్‌పోర్ట్‌ జోన్స్‌ అనే భావనను ప్రవేశపెట్టారు. ఇవి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు దోహదపడతాయి.

8) మార్కెట్‌ యాక్సెస్‌ ఇనీషియేటివ్‌ స్కీమ్‌: 2001-02లో మార్కెట్‌ యాక్సెస్‌ ఇనీషియేటివ్‌ స్కీమ్‌ని ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం ఎంపిక చేసిన దేశాల్లో ఎంచుకున్న వస్తువుల విషయంలో మార్కెట్లను అధ్యయనం చేసి ఎగుమతులను ప్రోత్సహించడం.

9) అయిదు రంగాలపై దృష్టి: 2004-09 ట్రేడ్‌ పాలసీలో అయిదు రంగాల్లో నిర్దిష్ట వ్యూహాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అవి 1) వ్యవసాయం 2) చేతివృత్తులు 3) చేనేత 4) జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ 5) తోలు - పాదరక్షల రంగాలు

10) ఫ్రీ ట్రేడ్‌ వేర్‌హౌసింగ్‌ జోన్స్‌ (ఎఫ్‌టీడబ్ల్యూజడ్‌): 2004-09 వ్యాపార విధానంలో వ్యాపార సంబంధ అవస్థాపన సదుపాయాల కల్పనకు ఎఫ్‌టీడబ్ల్యూజడ్‌ల ఏర్పాటును ప్రతిపాదించారు.

11) వ్యవహారాల వ్యయాన్ని తగ్గించడం: 2004-09 వ్యాపార విధానంలో వ్యవహారాల వ్యయాన్ని తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు.

ఉదా: ఎగుమతి చేసేటప్పుడు ఫైల్‌ చేయాల్సిన రిటర్న్‌లు, ఫారమ్‌ల సంఖ్య తగ్గించారు.

12) ఫారిన్‌ ట్రేడ్‌ పాలసీ 2004-09: సాధారణంగా ప్రతి అయిదేళ్లకు విదేశీ వ్యాపార విధానాన్ని ప్రకటిస్తారు. దీనిలో భాగంగా విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు మూడు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి, పన్ను మినహాయింపు ఇచ్చి, తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు.

ఎ) టార్గెట్‌ ప్లస్‌ స్కీమ్‌: ఏటా 20% లేదా అంతకంటే ఎక్కువ ఎగుమతులను వృద్ధి చేసుకునే ఎగుమతిదారులకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

బి) విశేష్‌ కృషి ఉపాజ్‌ యోజన: వ్యవసాయ (పండ్లు, కూరగాయలు, పూలు, అటవీ ఉత్పత్తుల) ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. 2007-08లో దీని పేరు ‘కృషి ఉపాజ్‌ గ్రామ్‌ ఉద్యోగ్‌ యోజన (కేయూజీవీవై)’గా మార్చారు.

సి) సర్వ్‌డ్‌ ఫ్రమ్‌ ఇండియా: సేవా రంగంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టారు. రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన సేవలు ఎగుమతి చేసేవారి కోసం దీనిని ఉద్దేశించారు.


విదేశీ వ్యాపార విధానం 2009 - 14: గతంలో ఉన్న అన్ని పథకాలు కొనసాగే విధంగా ఈ విధానాన్ని ప్రకటించారు.

విదేశీ వ్యాపార విధానం 2015-20: నాటి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌ 2015, ఏప్రిల్‌ 1న ఈ నూతన విదేశీ వ్యాపార విధానాన్ని ప్రకటించారు. కొవిడ్‌ కారణంగా దీన్ని 2023, మార్చి వరకు పొడిగించారు. ఇందులో పలు అంశాలు ఉన్నాయి. 

విజన్‌ మిషన్‌ అండ్‌ ఆబ్జెక్టివ్స్‌: 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ప్రాధాన్యం ఉన్న భాగస్వామిగా రూపొందించాలి. భారత ఎగుమతులను 900 బిలియన్‌ డాలర్లకు పెంచాలి. దాంతోపాటు వాటి శాతాన్ని ప్రపంచ ఎగుమతుల్లో 2% నుంచి 3.5%కి పెంచాలి. ఇందుకోసం మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా పథకాలను అభివృద్ధి చేయాలి.

ప్రవేశపెట్టిన నూతన పథకాలు: 1) మెర్చండైజ్డ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్రమ్‌ ఇండియా స్కీమ్‌ (MEIS) 2) సర్వీస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్రమ్‌ ఇండియా స్కీమ్‌ (SEIS)

* MEIS: దీనిని గతంలో ఉన్న అయిదు పథకాల స్థానంలో తీసుకొచ్చారు.అవి 

ఎ) ఫోకస్‌ ప్రొడక్ట్‌ స్కీమ్‌ (FPS)

బి) మార్కెట్‌ లింక్డ్‌ ఫోకస్‌ ప్రొడక్ట్‌ స్కీమ్‌ (MLFPS) 

సి) ఫోకస్‌ మార్కెట్‌ స్కీమ్‌ (FMS)   

డి) అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌సెంటివ్‌ స్క్రిప్‌ (AIIS)

ఇ) విశేష్‌ కృషి గ్రామీణ ఉద్యోగ్‌ యోజన (VKGVY)

సర్వ్‌డ్‌ ఫ్రమ్‌ ఇండియా స్కీమ్‌ స్థానంలో SEISను తీసుకొచ్చారు. సూక్ష్మ చిన్న, మధ్యతరహా సంస్థల ఎగుమతిదారులకు విత్తవనరుల కొరత ఉంది. వీరికి ఎగుమతి పరపతి అవసరం. అందుకే వడ్డీ రాయితీతో మూడేళ్లపాటు వీరికి పరపతి అందిస్తారు.

స్టేటస్‌ హోల్డర్స్‌: ప్రస్తుత, గత రెండేళ్లలో ఎగుమతుల సామర్థ్యం ఆధారంగా వారికి హోదా (స్టేటస్‌) ఇస్తారు. 1) వన్‌ స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ హోదా - 3 మిలియన్‌ డాలర్లు 2) టూ స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ హోదా - 25 మిలియన్‌ డాలర్లు 3) త్రీ స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ హోదా - 100 మిలియన్‌ డాలర్లు 4) ఫోర్‌ స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ హోదా - 500 మిలియన్‌ డాలర్లు 5) ఫైవ్‌ స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ హోదా - 2000 మిలియన్‌ డాలర్లు

రచయిత: ధరణి శ్రీనివాస్‌  

Posted Date : 05-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - అభివృద్ధి సమస్యలు, మార్పు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌