• facebook
  • whatsapp
  • telegram

  భారత టెలీ కమ్యూనికేషన్లు - సమాచార వ్యవస్థ 

సమాచార ప్రసారం శక్తిమంతం!

​​​​​​

కొన్ని దశాబ్దాలుగా దేశ సమాచార, ప్రసార సేవల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. సమాచార సాంకేతికత, సామాజిక మాధ్యమాలు దాదాపుగా అందరికీ చేరువయ్యాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సమాచారాన్ని పంపడం, అందుకోవడం, పంచుకోవడం సర్వసాధారణ ప్రక్రియగా మారిపోయింది. తపాలా శాఖ నుంచి టెలికాం విభాగాన్ని వేరు చేయడంతో మొదలైన ఈ మార్పు, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో పరుగులు తీసింది. స్పెక్ట్రమ్, ఆప్టికల్‌ ఫైబర్‌ రాకతో ఇంటర్‌నెట్‌ అనూహ్య వేగాన్ని పుంజుకుంది. మొబైల్‌ సేవలు విస్తృతంగా విస్తరించాయి. రేడియో, టీవీ సేవలు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటే, ఓటీటీలు సరాసరి ఇళ్లలోకి చొరబడిపోయాయి. సమాచార రంగంలో సంభవిస్తున్న సమకాలీన పరిణామక్రమాలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. ఈ నేపథ్యంలో దేశం సాధించిన ప్రగతి గురించి కూడా సమగ్రంగా తెలుసుకోవాలి.


ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఉన్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. చైనాది మొదటి స్థానం. దశాబ్దాల పరిణామ క్రమంలో అనేక సంస్థలు,   మౌలిక సదుపాయాలు ఏర్పాటై, దేశంలో శక్తిమంతమైన సమాచార వ్యవస్థ రూపుదిద్దుకుంది. 

 

బాక్స్‌లు

===================

1975- తంతి తపాలా శాఖ నుంచి వేరైన టెలికాం శాఖ

1985- ఢిల్లీ, ముంబయి నగరాల్లో మహానగర్‌ టెలికాం నిగమ్‌ లిమిటెడ్‌ ప్రారంభం

2000, అక్టోబరు - భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ప్రారంభం.

---------------------------------

2021-22 నాటికి దేశంలో టెలిఫోన్, ఇంటర్నెట్, బ్రాడ్‌బాండ్‌ వివరాలు

టెలిఫోన్‌ కనెక్షన్లు - 1,191.03 మిలియన్లు

వైర్‌లెస్‌ టెలిఫోన్‌ కనెక్షన్లు - 1167.49 మిలియన్లు

మొత్తం టెలిఫోన్లలో వైర్‌లెస్‌ టెలిఫోన్ల శాతం - 98.02%

మొత్తం టెలిఫోన్లలో ప్రైవేటు రంగం వాటా - 89.35%

వైర్‌లెస్‌ టెలిఫోన్‌ కనెక్షన్లు - 126.87%

టెలిఫోన్‌ సాంద్రత (100 మందికి) - 86.69%

గ్రామీణ టెలిఫోన్‌ సాంద్రత - 59.31%

పట్టణ టెలీసాంద్రత - 138.79%

===================

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) :  పార్లమెంటు చట్టం ద్వారా 1997, ఫిబ్రవరి 20న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ప్రారంభమైంది. ప్రపంచ సమాచార వ్యవస్థలో ప్రధానమైన పాత్ర పోషించే విధంగా భారత టెలీకమ్యూనికేషన్లు, వ్యవస్థ అభివృద్ధికి అనువైన పరిస్థితులు కల్పించడం, ప్రోత్సహించడం ఈ సంస్థ లక్ష్యం.


అంతర్జాల సేవలు (ఇంటర్నెట్‌): ప్రపంచ వ్యాప్తంగా సమాచారాన్ని పొందడానికి, పంచుకోవడానికి అతిశక్తిమంతమైన సాధనం అంతర్జాలం. 1995, ఆగస్టు 15న భారతదేశంలో అంతర్జాల సేవలు ప్రారంభమయ్యాయి. మొదట 9.6 కేబీపీఎస్‌ వేగంతో పనిచేసే డయల్‌ అప్‌ యాక్సెస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1997లో ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ డిజిటల్‌ నెట్‌వర్క్‌ (ఐఎస్‌డీఎన్‌) వచ్చింది. 2011-12లో మూడోతరం సేవలు (3జీ), బ్రాడ్‌బాండ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (బీడబ్ల్యూఎ), స్పెక్ట్రమ్‌ ప్రారంభమయ్యాయి. 2012, ఏప్రిల్‌ 10న ఎయిర్‌టెల్‌ కంపెనీ 4జీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 99 శాతం 4జీ ఉపయోగిస్తున్నారు. 2021 ద్వితీయార్ధంలో 5జీ సేవలు  మొదలై,  ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వైఫై ఇంటర్నెట్‌ విస్తరించింది. ల్యాండ్‌లైన్‌ కనెక్షన్ల కంటే వైర్‌లెస్‌ కనెక్షన్లు అధికమయ్యాయి. ఈ సేవల అభివృద్ధి కోసం 100 ప్రత్యేక ప్రయోగశాలలు నెలకొల్పారు. ట్రాయ్‌ ప్రకారం 2020 నాటికి వైర్డ్‌ ఇంటర్నెట్‌ చందాదారులు 23.05 మిలియన్లు, వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ చందాదారులు 726.01 మిలియన్లు. మొత్తం ఇంటర్నెట్‌ చందాదారులు 749.06 మిలియన్లు. దేశంలో ప్రతి వంద మంది జనాభాకు 55.41 మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. పట్టణ జనాభాలో ప్రతి 100 మందికి 98.35%, గ్రామీణ జనాభాలో ప్రతి 100 మందికి 33% ఇంటర్నెట్‌ చందాదారులున్నారు. 2021-22 నాటికి మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకందార్ల సంఖ్య 469.3 మిలియన్లు.


సర్వీసు ప్రొవైడర్లు - పోటీ: వాణిజ్యపరంగా ప్రజలకు ఇంటర్నెట్‌ సేవలు అందించిన మొదటి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ప్రభుత్వరంగ సంస్థ విదేశ్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌ (వి.ఎస్‌.ఎన్‌.ఎల్‌). 1998 వరకు ఇంటర్నెట్‌ మీద టెలీకమ్యూనికేషన్ల శాఖ, వీఎస్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ (మహానగర్‌ టెలికాం నిగమ్‌ లిమిటెడ్‌) గుత్తాధిపత్యం కొనసాగింది. 1998లో ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్‌ పాలనా వ్యవస్థ (ఐపీఎస్‌ రీజీమ్‌)ను సరళీకరించారు. ఇంటర్నెట్‌ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.


ఇంటర్నెట్‌ వేగం: 2011 వరకు ఇంటర్నెట్, బ్రాడ్‌బాండ్‌ సేవలు రాగి తీగలు ఉపయోగించి డిజిటల్‌ సబ్‌స్క్రైబర్‌ లేదా సబ్‌స్క్రైబర్‌ లైన్‌ (డీఎస్‌ఎల్‌) ద్వారా అందించేవారు. రాగి తీగల ప్రసార వేగం తక్కువ. అందుకే ఇంటర్నెట్‌ వేగం 256 కేబీపీఎస్‌గా ఉండేది. 2013-14లో 512  కేబీపీఎస్‌కిపెంచారు. 2012 జాతీయ టెలికాం విధానం ప్రకారం 2015 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ తీగలు ఉపయోగించి ఇంటర్నెట్‌ వేగం 2 ఎంబీపీఎస్‌కు పెంచాలని నిర్ణయించారు. కోరిన వారికి 100 ఎంబీపీఎస్‌ వేగంతో నెట్‌ సౌకర్యం అందించాలనేది దీని లక్ష్యం. ఆప్టికల్‌ ఫైబర్‌లో ప్రసారవేగం ఎక్కువ.


జీబీపీఎస్‌ నగరం: దేశంలో 1 జీబీపీఎస్‌. వేగంతో బ్రాడ్‌ బాండ్‌ అనుసంధానం అందుబాటులోకి వచ్చిన మొదటి నగరం హైదరాబాద్‌. దీనివల్ల కేబుల్‌ టెలివిజన్‌ డైరెక్టు-టు-హోం సేవ మీద ఆధారపడకుండా టెలివిజన్‌ కార్యక్రమాలు వీక్షించే అవకాశం కలుగుతుంది. ఎక్స్‌ ఫైబర్‌ నెట్‌ 2017, మార్చి 30న దీనిని ప్రారంభించింది.


భారత్‌నెట్‌ ప్రాజెక్టు:  2011, అక్టోబరులో నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌ఓఎఫ్‌ఎన్‌) పథకం ప్రారంభమైంది. దీని అమలుకు 2011, ఫిబ్రవరి 25న ఒక స్పెషల్‌ పర్చేజ్‌ వెహికల్‌ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బాండ్‌ ప్రాజెక్టు దీని లక్ష్యం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు, 6,25,000 గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా 100 ఎంబీపీఎస్‌ వేగం కలిగిన బ్రాడ్‌బాండ్‌ అనుసంధానం చేసే విధంగా దీనిని రూపొందించారు. 2015లో ‘భారత్‌నెట్‌ ప్రాజెక్టు’గా పేరు మార్చారు. 2021, జనవరి 12న కేరళలోని ఇడుక్కి జిల్లాలో ప్రారంభించారు. 2023 నాటికి 3 దశల్లో పూర్తవుతుందని ప్రకటించారు. దీని లక్ష్యం అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం, కోరిన నివాసాలకు 2 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సౌకర్యం అందించడం. ఈ కార్యక్రమానికి కావాల్సిన నిధులను యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) అందిస్తోంది. అన్ని గ్రామాలకు ఈ-పాలన, ఈ-ఆరోగ్యం, ఈ-విద్య, ఈ-బ్యాంకింగ్, ఇంటర్నెట్, ఇతర సేవలు అందించడం దీని లక్ష్యం.

సంచార్‌ శక్తి: స్వయం సహాయక బృందాలకు సమాచార ప్రసార సాంకేతిక సేవలు అందుబాటులోకి తెచ్చి మహిళా సాధికారత పెంపొందించే లక్ష్యంతో సంచార్‌ శక్తి పథకాన్ని 2011, మార్చిలో ప్రారంభించారు. దీనికి యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ ఆర్థిక సహాయం అందిస్తోంది. మొబైల్‌ ద్వారా విలువైన సేవలు అందిస్తోంది.

రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌: భారతదేశంలో 1920లో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఆ ఏడాదే కొన్ని అమెచ్యూర్‌ రేడియో క్లబ్బులు ఏర్పడ్డాయి. 1927లో ఇండియా బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీని నెలకొల్పారు. 1936లో ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుంది. ఇదే తర్వాత ఆల్‌ ఇండియా రేడియో (ఏఐఆర్‌)గా మారింది. 1965 నుంచి ఆకాశవాణిలో భాగంగా క్రమం తప్పకుండా ప్రసారాలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం వరకు రేడియా బ్రాడ్‌కాస్టింగ్‌లో ఆల్‌ ఇండియా రేడియోదే గుత్తాధిపత్యం. 2000లో ఎఫ్‌ఎం రేడియోను ప్రారంభించి, ఇందులో ప్రైవేటు సంస్థలను అనుమతించారు. ప్రస్తుతం ఆల్‌ ఇండియా రేడియోకు చెందిన 367 మీడియం వేవ్, షార్ట్‌ వేవ్‌ సంస్థలకు ఎఫ్‌ఎం డిజిటల్‌ ట్రాన్స్‌మీటర్లు ఉన్నాయి. ప్రైవేటు రంగంలోనూ ఎఫ్‌ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు పనిచేస్తున్నాయి.

టెలివిజన్‌ టెలికాస్టింగ్‌: 1959, సెప్టెంబరు 15న భారతదేశంలో మొదటి టెలివిజన్‌ ప్రసారం ప్రయోగాత్మకంగా జరిగింది. దీనినే దూరదర్శన్‌గా పిలుస్తారు. 1972లో ముంబయి, అమృత్‌సర్‌లకు టెలివిజన్‌ ప్రసారం మొదలైంది. 1975 నుంచి శాటిలైట్‌ ద్వారా ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1975 నుంచి శాటిలైట్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌ (ఎస్‌ఐటీఈ) ప్రాజెక్టు ద్వారా పాఠశాల విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. పంచాయతీ కేంద్రాల కోసం సామాజిక కార్యక్రమాల ప్రసారం జరుగుతోంది. 1976లో ఆకాశవాణి నుంచి దూరదర్శన్‌ వేరయింది. 1982, ఆగస్టు 15 నుంచి రంగుల్లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1982లో జాతీయ ప్రసారాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన దూరదర్శన్‌ వ్యవస్థ ద్వారా టెలివిజన్‌ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. 2012లో ఒలింపిక్స్‌ ప్రసారమయ్యాయి. 2020లో దేశంలో 332 పెయిడ్‌ ఛానళ్లు నడుస్తున్నాయి. దూరదర్శన్‌ 30 శాటిలైట్‌ టెలివిజన్‌ ఛానళ్లను నడుపుతోంది. 66 ప్రసార కేంద్రాలు; 1,412 ట్రాన్స్‌మిటర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ‘మన టీవీ’ ఛానల్‌ ద్వారా ఉన్నత విద్యాకార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి.

కేబుల్‌ టెలివిజన్‌: 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కేబుల్‌ టెలివిజన్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దేశంలో పే బ్రాడ్‌కాస్టర్లు, కేబుల్‌ ఆపరేటర్లు పే డి.టి.హెచ్‌. ఆపరేటర్లు పనిచేస్తున్నాయి.

ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ): కేబుల్, బ్రాడ్‌కాస్ట్, శాటిలైట్‌ మాధ్యమ వేదికలకు భిన్నంగా అంతర్జాలం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించేదే ఓవర్‌ ది టాప్‌ వేదిక. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఆహా లాంటి వేదికలు ఈ కోవకు చెందినవి. వీటి ద్వారా సినిమాలు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌లు మొదలైన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఇటీవల కాలంలో వీటికి ప్రాచుర్యం పెరిగింది. వివిధ భాషలు, దేశాల చిత్రాలు ఈ వేదికలో ప్రసారమవుతున్నాయి. 


సామాజిక ప్రచార మాధ్యమం: డిజిటల్‌ విధానం ద్వారా వ్యక్తులు, సంస్థలు అభిప్రాయాలు వ్యక్తం చేయడం, సమాచారాన్ని పంచుకోవడానికి నేడు ఉపకరిస్తున్న సాంకేతిక వేదికను సామాజిక ప్రచార మాధ్యమం అని పిలుస్తారు. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రాం, ఎక్స్, యూట్యూబ్‌ ఇందుకు ఉదాహరణలు. ఇవి అంతర్జాతీయ సంస్థలు నడుపుతున్న వేదికలు. వీటి సేవలు ఉచితంగా అందుతాయి. 2020, నవంబరు 12న భారత ప్రభుత్వం ఈ మాధ్యమాన్ని సమాచార శాఖ పరిధిలోకి తెచ్చింది. 


సమాచార సాంకేతిక పరిశ్రమ వృద్ధి: భారతదేశంలో 1955-70 కాలంలో కంప్యూటరింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 1970-78లో దేశంలో కంపూటర్ల ఉత్పత్తి నిదానంగా జరిగింది. అప్పటికి ప్రభుత్వపరంగా స్పష్టమైన సమాచార సాంకేతిక విధానం లేదు. 1978-90 మధ్య హార్డ్‌వేర్‌ తయారీ ప్రారంభమవగా, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కంప్యూటర్ల దిగుమతులు మొదలయ్యాయి. 1991-97 మధ్య దేశంలో టెలికాం అవస్థాపన ప్రోత్సాహాల పెరుగుదల కొన్ని నగరాలకే పరిమితమైంది. 1997-2008 మధ్య ఎగుమతులకు ప్రోత్సాహం, ప్రత్యేక క్లస్టర్లు, సాప్ట్‌వేర్‌ పార్క్‌ల ఏర్పాటు జరిగింది.

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

 

 

Posted Date : 17-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌