• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయ వృద్ధిరేటు   

   ఒక దేశ అభివృద్ధి గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంటుంది. అదే ఆ దేశ జాతీయాదాయ వృద్ధిరేటు. దీని గురించి అవగాహన ఉంటే ఆర్థికాభివృద్ధిలోని ఎత్తుపల్లాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
         ఒక దేశ ప్రగతిని ఆ దేశ స్థూల జాతీయాదాయం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల జాతీయాదాయం (Gross National Income) అంటారు. దేశ సరిహద్దు లోపల ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఆదాయం (Gross Domestic Income) అంటారు. ఎక్కువ దేశాలు జీడీపీని దేశ అభివృద్ధికి కొలమానంగా ఉపయోగిస్తున్నాయి. 

GNP=GDP + విదేశీ ఆదాయం
    అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం వస్తుసేవల విలువల నుంచి మాధ్యమిక వస్తువుల విలువను తీసివేయగా మిగిలిన అంతిమ వస్తుసేవల విలువలను కూడితే జాతీయాదాయం వస్తుంది. మాధ్యమిక వస్తువుల విలువ కూడా అంతిమ వస్తువు విలువలో కలిసి ఉంటుంది. కాబట్టి మాధ్యమిక వస్తువుల విలువ తీసివేయకపోతే జాతీయాదాయం అధికంగా, అవాస్తవంగా లెక్కించబడుతుంది. 
ఉదా: సెల్‌ఫోన్‌ తయారీలో దాని విడిభాగాలు మాధ్యమిక వస్తువులు అవుతాయి. వాటన్నింటి విలువలు కలిసి సెల్‌ఫోన్‌ విలువ అవుతుంది. కాబట్టి విడిభాగాల విలువలు విడిగా లెక్కించనవసరం లేదు.

లభించే మార్గాలు
ఒక దేశానికి జాతీయాదాయం ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా లభిస్తుంది.
ప్రజలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ప్రవేశించి కింది విధులు నిర్వర్తించడం ద్వారా జాతీయాదాయం లభిస్తుంది.  

ప్రజల వినియోగం(Consumpion): కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తు సేవలపై వ్యయం చేస్తుంటారు. అలా ఖర్చు చేసే ప్రతి రూపాయి అమ్మకందారుడికి ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం మరో కొత్త వస్తుసేవలకు డిమాండ్‌ను సృష్టిస్తుంది. అలా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం చక్రంలా ఒకరి నుంచి మరొకరికి ప్రయాణించి జాతీయాదాయాన్ని పెంచుతుంది.

పెట్టుబడి వ్యయం(Investment): వ్యాపార సంస్థలు ప్రజల డిమాండ్‌ ఆధారంగా వస్తువులను తయారుచేసి సప్లయ్‌ చేయడానికి పెట్టుబడులు పెడతాయి. ఇది కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. వారి జీతాలు పెరిగి, కొనుగోలు శక్తిని పెంచుతుంది. యజమానుల లాభాలు పెరిగితే మూలధన సంచయనం జరిగి కొత్త సంస్థలు, వస్తువులు, ఉద్యోగాల ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ వ్యయం(Governament ependiture): ఇది మరో ప్రధాన సూత్రధారి. ప్రజల అవసరాలు, అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి, శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం ప్రజల ఉపాధిని, ఆదాయాలను, కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను పెంచుతుంది. సంస్థలకు అనుకూల పెట్టుబడి వాతావరణాన్ని కల్పిస్తుంది.

విదేశీ ఆర్థిక వ్యవహారాలు(foreign economic transactions): ఒక దేశం వివిధ ప్రపంచ దేశాలతో వస్తుసేవల వ్యాపారం చేస్తుంది. దాంతో పెట్టుబడులు వివిధ దేశాల మధ్య ప్రవహిస్తాయి. దీనివల్ల ఇతర దేశాలకు చెల్లింపులు జరిగి వాటి నుంచి ఆదాయాలు వస్తాయి. చెల్లింపుల కంటే ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆదాయానికి కలుపుతాం. తక్కువగా ఉంటే దేశ ఆదాయం నుంచి తీసివేస్తాం. 
        ప్రస్తుతం ప్రపంచీకరణ కాలంలో మన దేశంతో పాటు అనేక దేశాలు అంతర్జాతీయ వ్యాపారంలో భాగమయ్యాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ప్రభావం మన ఆదాయవృద్ధిపై పడుతుంది.
GNP= C + I + G + (X - M) + (R - P)
C = వినియోగం,  I  = పెట్టుబడులు,
G = ప్రభుత్వ వ్యయం
X - M = విదేశీ వ్యాపార శేషం, 
R - P = విదేశీ చెల్లింపుల శేషం

లెక్కింపు 
   జాతీయాదాయం లెక్కింపు పద్ధతి వీలైనంత సమగ్రంగా, శాస్త్రీయంగా ఉంటే ఒక దేశ అభివృద్ధి తాలూకు దశదిశలను సులభంగా అంచనా వేయవచ్చు.
    జాతీయాదాయం విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
   1) వస్తు సేవల పరిమాణంలో మార్పు
    2) వాటి ధరల్లో మార్పు
    ఈ రెండింటలో కలిసి లేదా ఏ ఒక్కదానిలోనైనా మార్పు వచ్చినప్పుడు జాతీయాదాయం విలువ మారుతుంది. వస్తుసేవల పరిమాణం పెరగడమే నిజమైన అభివృద్ధి. అయితే ఒక్కోసారి వస్తుసేవల సంఖ్య పెరగకుండానే కేవలం వాటి ధరలు పెరగడం వల్ల జాతీయాదాయం పెరిగినట్లుగా కనిపిస్తుంది. కానీ అది వాంఛనీయ అభివృద్ధి కాదు. 
    మన దేశంలో జీడీపీ డిఫ్లేటర్‌ను కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు శాఖ నిర్ణయిస్తుంది. జీడీపీని త్రైమాసికానికి ఒకసారి చొప్పున ప్రతి ఏడాది కేంద్ర గణాంక సంస్థ లెక్కిస్తుంది. మన దేశంలో గత 7 త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తుంది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 2019-20 ఏప్రిల్‌ - డిసెంబరు మధ్య కాలంలో కేవలం 5.1%  వృద్ధి రేటు నమోదైంది. 
2012 - 13లో నమోదైన 4.3% తర్వాత ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. మన దేశ వృద్ధిరేటు పడిపోయి ప్రపంచ అత్యధిక వృద్ధిరేటు కలిగిన దేశంగా చైనా నిలిచింది. పైన పేర్కొన్న ప్రజల వినియోగం, పెట్టుబడులు, విదేశీ ఎగుమతుల్లో (ప్రైవేటు రంగం) క్షీణత కనిపిస్తుంది. డిమాండ్‌ కొరత వల్ల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
    ప్రధానంగా కీలక పరిశ్రమల వృద్ధి బాగా తగ్గింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ ప్రగతిపై పడి మన దేశ వృద్ధిరేటు తగ్గుదలకు కారణమైంది.
    2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్‌టీ అమలుచేయడం వల్ల స్వదేశీ మార్కెట్‌లో కొంత అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ఆదాయాలు తగ్గి, డిమాండ్‌ తగ్గింది. వ్యాపారాల్లో మార్పు సంధి దశలో అనుమానాలు, భయాలు కూడా కొంతమేర అమ్మకాలు పడిపోవడానికి కారణమయ్యాయని నిపుణుల అంచనా.
    నమోదైన వృద్ధిరేటుకు ప్రధాన చోధకం ప్రభుత్వ వ్యయం. ఇప్పటికే ప్రభుత్వం విత్తలోటుకు సమానంగా నిధులు అప్పులుగా తెచ్చి వివిధ కార్యక్రమాలపై వెచ్చిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటురంగం సుమారు 87% కలిగి ఉన్నా, గత తొమ్మిది నెలల్లో కేవలం 4.01% వృద్ధి నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. అయితే ప్రభుత్వ వ్యయం అంచనాలకు మించి 15.64% పెరిగింది. ఆర్థిక మందగమన కాలంలో ప్రైవేటురంగం వెనకడుగు వేసినప్పుడు ప్రభుత్వ రంగం కీలకపాత్ర పోషించాల్సి వస్తుందని ఇది రుజువు చేస్తుంది.

మార్పులు - గణన
జాతీయాదాయంలో మార్పులను రెండు రకాల మార్కెట్‌ ధరల సహాయంతో గణిస్తారు.

ఆధార సంవత్సర ధరల్లో.. 
(GNP at base year or constant priece)

    ప్రజలకు అవసరమైన వస్తుసేవలు పెరగడమే నిజమైన అభివృద్ధి. కాబట్టి ధరలతో ప్రమేయం లేకుండా వస్తుసేవల పరిమాణంలో మార్పులు లెక్కించాలి. దీనికి గణాంక శాస్త్రవేత్తలు ఆధార సంవత్సరాన్ని సూచించారు. ఒడిదొడుకులు లేని  సాధారణ పరిస్థితులు కలిగిన సంవత్సరాన్ని ఎన్నుకుంటారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఈ ఆధార సంవత్సరాన్ని మారుస్తుంటారు. ఆధార సంవత్సర ధరల్లో తర్వాతి సంవత్సరాల వస్తుసేవల ఉత్పత్తి విలువను లెక్కిస్తారు. దీనివల్ల ధరలు మారకుండా కేవలం వస్తుసేవల పరిమాణం మార్పులను తెలుపుతుంది. ధరలు మారవు కాబట్టి దీన్ని స్థిర ధరల్లో జాతీయాదాయం లేదా వాస్తవిక ఆదాయం అని పిలుస్తారు. మన దేశంలో ఇప్పుడు  ఆధార సంవత్సరంగా 2011 - 12ను ఉపయోగిస్తున్నారు. త్వరలో 2017 - 18కి మారాలని గణాంక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుంది. పట్టికలోని చక్కెర, పాలు, టీ పొడి విలువలను 2011 - 12 నాటి ధరల్లో 2018, 2019 నాటి ఉత్పత్తులను లెక్కిస్తారు. అప్పుడు ధరల్లో మార్పు ఉండకుండా వాస్తవ ఆదాయంలో మార్పులను సులభంగా తెలుసుకోవచ్చు. 
    సాధారణంగా వాస్తవ ఆదాయం కంటే ద్రవ్యోల్బణం సమయంలో ధరలు పెరుగుతుండటం వల్ల నామమాత్ర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్యకాలంలో వాస్తవ ఆదాయం కంటే నామమాత్రపు ఆదాయం తక్కువగా ఉంటుంది. వాస్తవ ఆదాయ విలువను కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు.
 
    డిఫ్లేటర్‌ అంటే ప్రస్తుత సంవత్సర ధరలకు, ఆధార సంవత్సర ధరలకు మధ్య ఉన్న నిష్పత్తి. ఇది వినియోగదారుల సూచిక మాదిరి (దిశిఖి) ధరల స్థాయిని తెలియజేస్తుంది.

ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం(GNP at current prices)
    ఏ సంవత్సరంలో ఉత్పత్తయిన వస్తుసేవల విలువలను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జాతీయాదాయం అంటారు. 2018లో ఒక లక్ష కార్లు తయారైతే వాటి విలువను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తాం. ఇక్కడ ధరల మార్పు జాతీయాదాయ విలువపై పడుతుంది. వస్తువుల సంఖ్య పెరిగినా, తగ్గినా, స్థిరంగా ఉన్నా వాటి ధరల్లో పెరుగుదల ఉంటే జాతీయాదాయం పెరుగుతుంది. ధరలు తగ్గితే జాతీయాదాయం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం వల్ల  పెరిగినట్లు కనిపిస్తుంది. అసలైన అభివృద్ధిని తెలుపదు.

    పట్టికలో చూపినట్లుగా ధరల్లో మార్పు వచ్చినప్పుడు వస్తువు విలువలో మార్పు కనిపిస్తుంది. కానీ, ప్రజలకు కావాల్సిన వస్తుసేవల పరిమాణంలో మార్పులను ఇది తెలపడం లేదు.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌