• facebook
  • whatsapp
  • telegram

పర్యాటక రంగం

ఆర్థికాభివృద్ధికి చోదక యంత్రం!

ఆర్థిక ప్రగతిలో పర్యాటకం ప్రాధాన్యం అంతకంతకు ఎక్కువవుతోంది. ఈ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, విస్తృతంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు, కీలకమైన విదేశీమారక ద్రవ్య ఆర్జనకు దోహదపడుతోంది. దాంతోపాటు రవాణా, బ్యాంకింగ్, బీమా, హోటళ్లు, చేనేత, చేతివృత్తుల ఉత్పత్తుల అమ్మకాలు తదితరాలను ఉత్తేజితం చేస్తోంది. సేవా రంగంలో ప్రధాన విభాగమైన పర్యాటకంలో నెలకొన్న దేశీయ, అంతర్జాతీయ ధోరణులపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. టూరిజం దేశంలో వృద్ధి చెందుతున్న తీరు, సంబంధిత ప్రభుత్వ విధానాలతో పాటు అన్ని రకాల యాత్రికులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలు, ప్రదేశాల గురించి తెలుసుకోవాలి.


పర్యాటకం ఆర్థిక ప్రాధాన్యం ఉన్న సామాజిక కార్యకలాపం. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ   (యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ - యూఎన్‌డబ్ల్యూఓ) ప్రకారం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 5 శాతం వరకు పర్యాటక రంగం నుంచే లభిస్తోంది. పర్యాటకం ఆర్థిక పురోగతి చోదక యంత్రంగా భావించే దేశాల్లో వాటి స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా 10 శాతం పైగా ఉంటుంది. ప్రపంచ ఉద్యోగితలో 6-7 శాతం వరకు ఈ రంగం కల్పిస్తోంది. 2008-09 నుంచి భారతదేశం స్థూల జాతీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటా 9-10 శాతం మధ్య ఉంటోంది. 2018లో సుమారు 4.3 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. మొత్తం ఉద్యోగితలో పర్యాటక రంగం వాటా 12.36 శాతం. 2017ను ‘అభివృద్ధి కోసం నిలకడ ఉన్న పర్యాటక అంతర్జాతీయ సంవత్సరం (ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ సస్టెయినబుల్‌ టూరిజం ఫర్‌ డెవలప్‌మెంట్‌)’ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2021-22లో ప్రపంచ ప్రయాణ, పర్యాటక  అభివృద్ధి సూచికలో భారతదేశం 54వ స్థానంలో ఉంది.


నిర్వచనం:  ‘పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణాలు చేయడం’ అని క్లుప్తంగా చెప్పవచ్చు. విశ్రాంతి, వ్యాపారం కోసం లేదా సందర్శన ప్రదేశం నుంచి పారితోషికం గ్రహించని ఏ ఇతర కార్యక్రమం కోసమైనా ప్రజలు తమ సాధారణ పరిసరాల వెలుపల ఉన్న ఏదైనా ఇతర ప్రదేశాలకు ప్రయాణం చేసి 24 గంటలకు మించి, ఒక సంవత్సరానికి మించని సమయం గడిపితే అలాంటి వారిని పర్యాటకులుగా ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వచించింది. దీని ప్రకారం భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యాటకులెవరో పేర్కొంది. విదేశీ పాస్‌పోర్టు కలిగి విశ్రాంతి, వినోదం, వైద్యం, మతసంబంధ కార్యక్రమం, క్రీడలు, వ్యాపారం, సభలు, సమావేశాలు మొదలైన వాటి కోసం భారతదేశాన్ని సందర్శించి ఒక రోజు కంటే ఎక్కువ, ఏడాది కంటే తక్కువ కాలం గడిపిన విదేశీయుడు మనకు విదేశీ పర్యాటకుడు అవుతాడు. పర్యాటకులకు సలహాలు, సమాచారం అందించడం, పర్యాటకాన్ని నిర్వహించడం, పర్యాటక రంగ కార్యకలాపాలను ప్రోత్సహించడం, అవసరమైన వసతులు అభివృద్ధి చేయడం లాంటివన్నీ పర్యాటక రంగం విధి అవుతుంది.


పర్యాటక ఆర్జనలు: విదేశీమారక ద్రవ్య ఆర్జనకు పర్యాటక రంగం ఎంతో తోడ్పడుతుంది. అంతర్జాతీయ పర్యాటకుల ద్వారా ఆర్జించిన విదేశీ మారక ద్రవ్యం అమెరికా డాలర్లలో 2001లో 3.198 మిలియన్‌ డాలర్లు, 2019లో 30.058 మిలియన్‌ డాలర్లు, 2020లో 6,950 మిలియన్‌ డాలర్లు. అంతర్జాతీయ పర్యాటక ఆర్జనలో మన దేశానికి 64.49% అమెరికా నుంచి లభిస్తోంది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, ఫ్రాన్స్‌ ఉన్నాయి. ఈ విషయంలో భారత్‌ వాటా 2001లో 0.69%, 2019లో 2.05%, 2020లో 2.38%. ప్రపంచ ఆర్జనలో భారతదేశం స్థానం 2001లో 36, 2019-20లో 13, 2020-21లో 12. ఆసియా పసిఫిక్‌ దేశాల ఆర్జనలో భారత్‌ వాటా 2001లో 3.63%, 2019లో 6.78%.


విదేశీ పర్యాటకులు:  2021లో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు 1.52 మిలియన్లు. వీరిలో అత్యధికంగా 28.15 శాతం అమెరికా నుంచి వచ్చారు. రెండు, మూడు స్థానాల్లో బంగ్లాదేశ్‌ 15.75 శాతం, ఇంగ్లాండు 10.75 శాతం. తర్వాతి స్థానాల్లో కెనడా, నేపాల్, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్‌ ఉన్నాయి. 2021-22లో భారత్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకుల్లో 37.7 శాతం భారతీయ ప్రవాసులు. మొత్తం విదేశీ పర్యాటకుల్లో 19.9% వైద్యం, 12.4% వ్యాపారం, వృత్తిపరమైన అవసరాలు;    8.1% మంది విశ్రాంతి, వినోదం కోసం సందర్శించారు. అత్యధికంగా 39.7% విదేశీ పర్యాటకులు దిల్లీ విమానాశ్రయం ద్వారా రాగా, హైదరాబాద్‌ విమానాశ్రయం ద్వారా 5.65% మంది సందర్శించారు.

భారతీయుల విదేశీ సందర్శన: ఇతర దేశాలను సందర్శించిన భారతీయులు 2001లో 4.56 మిలియన్ల నుంచి 2019లో 26.92 మిలియన్లకు పెరిగారు. 2021లోనే 8.55 మిలియన్లుగా నమోదయ్యారు. 2021లో భారత పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (42.4%), రెండో స్థానం అమెరికా (8.1%), మూడో స్థానం ఖతార్‌ (7.9%). మొత్తం భారతీయ పర్యాటకుల్లో పునఃప్రవేశం కోసం 40.25%, పర్యాటకం కోసం  14.99%, సందర్శన కోసం 17.70%, ఉద్యోగాల కోసం 9.5%, చదువుల కోసం 5.2% మంది ఇతర దేశాలను సందర్శించారు.

రాష్ట్రాల్లో పర్యాటకం - విదేశీ పర్యాటకులు: 2021-22లో భారతదేశంలో అత్యధిక విదేశీ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాల్లో పంజాబ్‌ (29.2%), మహారాష్ట్ర (17.6%), దిల్లీ (9.6%) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడంలో 89.2 శాతం వాటా 10 రాష్ట్రాలదే. అవి 

1) పంజాబ్‌ 

2) మహారాష్ట్ర, 

3) దిల్లీ 

4) కర్ణాటక 

5) కేరళ 

6) తమిళనాడు 

7) ఉత్తర్‌ప్రదేశ్‌ 

8) మధ్యప్రదేశ్‌ 

9) పశ్చిమ బెంగాల్‌ 

10) రాజస్థాన్‌.

దేశీయ పర్యాటకులు:  2021లో దేశీయ పర్యాటకులు సందర్శించిన మొదటి పది రాష్ట్రాలు 

1) తమిళనాడు 

2) ఉత్తర్‌ప్రదేశ్‌ 

3) ఆంధ్రప్రదేశ్‌ 

4) కర్ణాటక 

5) మహారాష్ట్ర 

6) తెలంగాణ 

7) పంజాబ్‌ 

8) మధ్యప్రదేశ్‌ 

9) గుజరాత్‌ 

10) పశ్చిమ బెంగాల్‌. 2021-22లో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించిన మొదటి మూడు ప్రదేశాలు 

1) తాజ్‌మహల్‌ (3.29 మిలియన్లు) 

2) ఎర్రకోట (1.32 మిలియన్లు) 

3) కుతుబ్‌ మినార్‌ (1.15 మిలియన్లు). విదేశీ పర్యాటకులు సందర్శించిన ప్రదేశాలు 1) మహాబలిపురం (0.14 మిలియన్లు) 2) తాజ్‌మహల (0.038 మిలియన్లు)   4) పలువం కుప్పం (0.025 మిలియన్లు)


పర్యాటకంలో రకాలు: పర్యాటకం ద్వారా ఆశించే ప్రయోజనం, దాని స్వభావం ఆధారంగా పర్యాటకాన్ని పలు రకాలుగా విభజించవచ్చు.  అవి 

1) తీరిక సమయం పర్యాటకం 

2) వ్యాపార పర్యాటకం 

3) వైద్య పర్యాటకం 

4) ఆరోగ్య పర్యాటకం 

5) సాంస్కృతిక పర్యాటకం, 

6) సాహస పర్యాటకం 

7) పర్యావరణ పర్యాటకం 

8) క్రీడా పర్యాటకం 

9) మతపరమైన పర్యాటకం


పర్యాటక విధానం: పర్యాటకాన్ని వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమగా భారత ప్రభుత్వం గుర్తించింది. దీనిని ప్రోత్సహించేందుకు 1982లో జాతీయ పర్యాటక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. 1992లో దానిని మెరుగుపరిచి మరో ప్రణాళిక రూపొందించింది. 2002లో జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటించింది. అందులో పలు అంశాలు ఉన్నాయి. 

1) పర్యాటకం ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదక యంత్రం 

2) పర్యాటకం గుణక ప్రభావం వల్ల ఉద్యోగావకాశాలు అధికంగా పెరుగుతాయి. 

3) దేశీయ పర్యాటకం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం.

4) పర్యాటక గమ్యస్థానంగా భారతదేశానికి ఉన్న సంభావ్యతను ప్రపంచ స్థాయిలో ప్రచారం చేసి ప్రయోజనం పొందడం. 

5) ప్రైవేటు రంగం పాత్రను గుర్తించి ప్రోత్సహించడం.


పర్యాటక విధానం - కీలక అంశాలు: 

1) స్వాగతం 

2) సూచన 

3) సువిధ 

4) సురక్ష 

5) సహయాగ్‌ 

6) సంరచన, సఫాయి

లక్ష్యాలు: 

1) పర్యాటకాన్ని జాతీయ ప్రాధాన్య కార్యకలాపంగా నిర్వహించడం  

2) ప్రపంచ పర్యాటకంలో భారత పోటీ సామర్థ్యాన్ని పెంచడం 

3) ప్రస్తుతం ఉన్న పర్యాటక స్థలాలు, వసతులు మెరుగు పరుస్తూ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా నూతన స్థలాలు, వసతులు కల్పించడం 

4) ప్రపంచ స్థాయి అవస్థాపనా సౌకర్యాలు కల్పించడం 

5) సుస్థిర, సమర్థవంతమైన మార్కెటింగ్‌ ప్రణాళికలు, కార్యక్రమాలు రూపొందించడం. 


2017 నూతన పర్యాటక విధానం: పర్యాటక అభివృద్ధిలో ఉపాధి కల్పన, సామాజిక భాగస్వామ్యంపై దృష్టి, సుస్థిర బాధ్యతాయుతమైన పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ విధానం ప్రధాన లక్ష్యం

 


 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 25-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌