• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఉద్యమ అనంతర పరిణామాలు

ఉవ్వెత్తున ఎగిసి, రాజకీయ కారణాలతో స్తబ్దుగా మారిన నాటి తెలంగాణ ఉద్యమం తెచ్చిన ప్రజా చైతన్యం ఏమైంది? చప్పగా.. నిద్రాణస్థితిలోకి జారుకుందా? లేదా మరో మార్గం పట్టిందా? ఉద్యమ చైతన్యం ఎలాంటి రూపు సంతరించుకుందో.. తెలంగాణ రాకపోయినప్పటికీ, తెలంగాణలో ఎలాంటి మార్పులకది కారణమైందో.. తెలుసుకుందాం. నాటి పరిణామాలు, పర్యవసానాలపై రాజకీయ ఐకాస ఛైర్మన్, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ వర్కింగ్ గ్రూప్ కన్వీనర్ ఆచార్య కోదండరాం విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం.

    తెలంగాణ సాధన కోసం 1968లో ప్రారంభమై దాదాపు 1972 దాకా సాగిన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం తన లక్ష్యాన్ని అప్పటికప్పుడు సాధించకున్నా.. పర్యవసానాలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. వాస్తవానికి ఇంతవరకూ ఆనాటి ఉద్యమంపై సమగ్రంగా అధ్యయనం జరగలేదు. అందుకే అన్ని విషయాలూ సంపూర్ణంగా అర్థం కావడం లేదు. ఎవరూ ఈ ఉద్యమంపై పరిశోధన చేయలేదు. ఇంతవరకు తెలిసినదాన్ని బట్టి చూస్తే.. అంతటి విస్తృతమైన, బలమైన ఉద్యమాలు చాలా అరుదుగా జరుగుతుంటాయనేది మాత్రం చెప్పక తప్పదు.
 

చైతన్యపరిచిన ఉద్యమం
    1969 ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని తేలేకపోయినా సమాజాన్ని చైతన్యపరిచింది. అంతగా చైతన్యవంతులైన యువతీయువకులు ఊరికే ఉండే ప్రసక్తే లేదు. ఎంతో సంఘటితంగా దాదాపు ఏడాది కాలంపాటు చదువుల్ని త్యాగం చేసి, తమ అవకాశాలను మరచిపోయి సమాజం కోసం పోరాటం చేశారు. అలాంటి పోరాటం పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి అమానవీయం. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ ఉద్యమాన్ని అణిచివేయడానికే చూశారు తప్ప, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు. తెలంగాణకు రక్షణల అమలు కోసం పెద్దమనుషులు, విద్యార్థులు, ప్రాంతీయ మండలి.. ఇలా చాలా ప్రయత్నించినా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి సానుకూలంగా వ్యవహరించలేదు. అనంతర పరిణామాల్లో ఉద్యమం బలపడిన తర్వాత ముఖ్యమంత్రి కళ్లు తెరిచి అఖిలపక్షం ఏర్పాటు చేసి.. రక్షణలపై కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. వాటి అమలు విషయంలో మాత్రం ఆయనలో చిత్తశుద్ధి కొరవడిందని కొండా లక్ష్మణ్ బాపూజీ చాలాసార్లు ఆయనతో మాట్లాడిన తర్వాతే ప్రకటించారు.
 

అరుదైన పోరాటం

    మొత్తంగా 1969 జూన్ దాకా జరిగిన పోరాటం లాంటి ఉద్యమాలను బహుశా ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా చూస్తాం. జనజీవితం దాదాపు స్తంభించి పోయింది. ఎక్కడికెక్కడ వేలమంది రోడ్లమీదికి వచ్చారు. అలా వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపించడం పోలీసుల తరం కూడా కాలేదు. పోలీసుల సాయంతో నియంత్రించటం మినహా సమస్యల్ని పరిష్కరించడానికి మాత్రం ప్రభుత్వం ప్రయత్నించలేదు. పోలీసు కాల్పులు తదితర అనంతర పరిణామాలు తెలంగాణ యువతీ యువకుల మనసుల్లో ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేశాయి. ఉద్యమం మధ్యమధ్యలో స్తబ్దుగా ఉన్నప్పుడు ఏదో సంఘటన రూపంలో మళ్లీ అది బలంగా చెలరేగడం అప్పుడు కనిపించిన దృశ్యం. అంతేకాదు.. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అప్పుడొచ్చిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షను ఓట్ల రూపంలో వ్యక్తపరిచారు. అంత బలమైన సామాజిక, ఆర్థిక ఆకాంక్షలను దిల్లీ ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ అధినాయకత్వం అర్థం చేసుకునే ప్రయత్నమే చేయలేదు. మరోవైపు ఇందిరాగాంధీ కూడా తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి వ్యతిరేకంగా ఉన్నారు. అప్పటి ఉద్యమంలో కేంద్రం వ్యవహరించిన తీరు.. ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వం వ్యవహరించిన తీరు కూడా ప్రజల చైతన్యస్థాయికి తగ్గట్లుగా లేవు. ఉద్యమాన్ని కాపాడాల్సిన సమయంలో అప్పటి రాష్ట్ర రాజకీయ నాయకత్వం మొత్తంగా వెళ్లి పదవుల ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం దురదృష్టం. కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ సారథ్యాన్ని మార్చి తెలంగాణ నాయకులకు పదవులిస్తే సరిపోతుందని భావించింది. అంటే తెలంగాణ సమస్యకు ఓ రాజకీయ పరిష్కారాన్ని చూసిందే తప్ప విద్యార్థుల్లో, సమాజంలోని అలజడిని గుర్తించి.. వాటి సామాజిక, ఆర్థిక మూలాలను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. 1973లో తెలంగాణకు కేంద్రం న్యాయ సమ్మతమైన పరిష్కారం చూపించి ఉంటే ఏమయ్యేదో ఊహకందని విషయం. ఊహాగానాలపై ఆధారపడి చరిత్రను విశ్లేషించలేం.
 

అంతర్మథనం నుంచే..
 నాటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రాష్ట్ర రాజకీయ నాయకత్వ వైఖరి.. విద్యార్థులు, యువతరంలో తీవ్రమైన అసంతృప్తిని మిగిల్చాయి. నిజానికి ఆనాటి యువతరంలో ఉన్న అలజడి మామూలు విషయం కాదు. వారికి వేరే ఆలోచనే లేదు. తమ వ్యక్తిగత భవిష్యత్తు గురించి కాకుండా.. ఈ రాష్ట్ర భవితవ్యం గురించే ఆలోచించారు. అలజడిలో ఉన్న యువతరం - బలమైన ప్రజాస్వామ్యం కోసం, ఆకాంక్షల్ని నెరవేర్చుకోవడం కోసం విద్యార్థులను కదిలించి సంఘటితం చేయాలనుకుంది. రగిలిన ఆ అంతర్మథనం నుంచి ప్రజల్ని బలంగా కదిలించడం ఎలా? బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవడమెలా? అనే ప్రశ్నలు ఉద్భవించాయి. దీనికి అప్పటి రాజకీయ నాయకత్వ అలసత్వమే కారణం. ప్రజల పట్ల నాయకత్వం జవాబుదారీతనంతో నిలబడాలంటే.. ప్రజల సమస్యలన్నింటినీ పట్టించుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలంటే.. ప్రజలు మరింత సంఘటితంగా నిలబడేలా వారిని సమీకృతం చేసినప్పుడే వారి ఆకాంక్షలు నెరవేరుతాయనే భావన మొదలైంది. జార్జిరెడ్డి ఆనాటి యువతరం అలజడికి ఓ చిహ్నం. అలాంటి తపన, అలజడి అందరిలోనూ ఉండేవి. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో భారత్‌లో పుట్టుకొని వస్తున్న మార్క్సిస్ట్, లెనినిస్టు ఉద్యమాలవైపు వీరు ఆకర్షితులయ్యారు.

అంతస్సూత్రం ఒక్కటే..
    అంతదాకా కమ్యూనిస్టు పార్టీల్లో భాగంగా ఉన్నవారు, ఆ పార్టీ నాయకత్వంతో విభేదించి ఏర్పాటు చేసిన.. నిర్మించిన ఉద్యమమే ఈ మార్క్సిస్ట్, లెనినిస్టు ఉద్యమం. వీరు కొత్తగా అవతరించిన కార్యకర్తలు, నాయకులు కాదనే సంగతి గుర్తుంచుకోవాలి. అంతకుముందు కమ్యూనిస్టుల్లో ఉన్నవారే. తరిమెల నాగిరెడ్డి, చారు మజుందార్, సత్యనారాయణ్ సింగ్, చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి వారంతా దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నవారే. అంతేకాదు ప్రజలతో సంబంధాలు కలిగి, పలు అంశాలపై ఉద్యమాలను అప్పటికే నిర్మిస్తున్నారు కూడా. అయితే వారిలో ఓ అసంతృప్తి ఉండేది. తాము నిర్మిస్తున్న ఉద్యమాలకు అప్పటి తమ పార్టీ (కమ్యూనిస్టు) పటిష్ఠ నాయకత్వాన్ని అందించలేక పోతోందన్నదే ఆ అసంతృప్తి. ఎన్నికల గోలలో పడి సామాజికంగా ప్రజల్లో కింది నుంచి మార్పు తెచ్చి, వారిని సంఘటితం చేయాల్సిన అవసరం అప్రధానం అవుతుందనే బాధతో వీరంతా కమ్యూనిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చారు. 1967కల్లా ప్రత్యేకమైన పార్టీని నిర్మించాలని ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ అంతా కలసి ఒకే పార్టీని నిర్మించుకోలేక పోయారు. లక్ష్యం ఒక్కటే అయినా కార్యాచరణ విషయంలో ఉన్న విభేదాల కారణంగా రెండు మూడు గ్రూపులుగా మారిపోయారు. ఎన్ని గ్రూపులున్నా అంతస్సూత్రంగా వారందరినీ కలిపి ఉంచింది మాత్రం ఒక్కటే.. అందరు కూడా చైనాలో మావోసేటుంగ్ భావాలతో ప్రభావితమైనవారే. మావో సూత్రీకరించినట్లుగా - గ్రామాల్లో పటిష్ఠం చేయకుండా, గ్రామ ప్రజలను భూస్వామ్య చెరనుంచి దూరం చేయకుండా, దేశంలో ప్రజాస్వామిక మార్పును తేలేమని నిర్ణయానికి వచ్చినవారే వీరంతా. అందుకే ప్రప్రథమంగా గ్రామాల్లో భూపంపిణీ అనే సూత్రం ఆధారంగా పేద ప్రజలందరినీ సంఘటిత పరచి, గ్రామాల్లోని భూస్వామ్య సంబంధాలను బద్దలుగొట్టి, తద్వారా గ్రామాల్లో మార్పు తేవాలనే ఆలోచనతో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ సిద్ధాంతం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో పనిచేయడానికి అనువైన ఓ రాజకీయ చట్రాన్ని వారికి ఏర్పరచి పెట్టింది. ఇలాంటి ఆలోచనలతో దేశవ్యాప్తంగా చాలామంది యువకులు ప్రభావితులయ్యారు.
    1969లో జరిగిన పరిణామాలతో నిరాశానిస్పృహలకు లోనైన యువతీ యువకులను తెలంగాణ ఉద్యమం మరింత బాగా ఆకర్షించింది. క్రమంగా వీరంతా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇదంతా 1973 తర్వాతే. ఎప్పుడైతే ఆ ప్రచారం ఉద్ధృతమైందో.. దాంతో ఉత్సాహం పొంది, ప్రభావితులై వామపక్ష విద్యార్థి సంఘాల్లోకి మళ్లారు. అంతకుముందు వామపక్ష విద్యార్థి సంఘాలేమీ పెద్దగా లేవు. అలా ఏర్పడిన విద్యార్థి సంఘాలన్నీ కలసి గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిద్దామనే ఆలోచనతో కదిలాయి. గ్రామాల్లో ప్రచారం చేయడం మొదలయ్యాక చాలామంది పూర్తిస్థాయి కార్యకర్తలుగా మారి, తెలంగాణ రైతులను సమీకరించడం మొదలుపెట్టారు. 1975కల్లా తెలంగాణలో ఇది బలమైన శక్తిగా మారింది. వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో రైతుల ఉద్యమం ఆరంభమైంది. పేద ప్రజలు, అణిచివేతకు గురైన వర్గాలవారు ఐక్యమై ఉద్యమించడం మొదలెట్టారు.

 

మూలాలు అక్కడే!
    ఏ ప్రయాణం కూడా అకస్మాత్తుగా మొదలు కాదు. ఏ ఉద్యమమైనా మొదలయ్యాక మూలాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో నక్సల్‌బరి (నక్సల్‌బరి అనేది బెంగాల్‌లో ఓ ఊరిపేరు. ఆ ఊళ్లో తొలిసారి ఉద్యమం ఆరంభమైంది కాబట్టి దానికి నక్సల్‌బరి ఉద్యమం అనే పేరు వచ్చింది. కమ్యూనిస్టు పార్టీల్లోంచి బయటకు వచ్చి మావోయిస్టు ఆలోచనల మేరకు పనిచేయాలనుకున్న వారి భావజాలాన్ని నక్సలిజమని, ఆ దిశలో పయనించేవారికి నక్సలైట్లు అని పేరు పెట్టారు.) ఉద్యమం మొదలయ్యాక కూడా అదే జరిగింది. 1949 నాటి తెలంగాణ సాయుధ పోరాటం మూలాలు తమలో ఉన్నాయని ఎంఎల్ పార్టీలు చెప్పుకున్నాయి. 1949 నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఈ రైతుల ఉద్యమాన్ని కొనసాగింపుగా చెప్పుకున్నారు. నిజానికి ఆనాడు (1949, 50ల్లో) ప్రజలు సిద్ధంగా ఉన్నా.. అప్పటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం సరిగ్గా నడిపించ లేకపోయిందనీ, దానికి కొనసాగింపుగా తాము ఇప్పుడు ఉద్యమం చేస్తున్నామని వీరు (ఎంఎల్ గ్రూపులు) తమను తాము పరిచయం చేసుకున్నారు. తెలంగాణ సమాజంలో అప్పుడున్న పరిస్థితులు కూడా వీరికి అనుకూలించాయి. అలాగని తెలంగాణలో 1949ల నాటి తెలంగాణ సాయుధ పోరాటం తెచ్చిన మార్పులు కూడా తక్కువేమీ కావు. దాన్ని తక్కువ చేసి చూడలేం. చాలా బలమైన జాగీర్దార్‌లు, దేశాయ్‌లు, దేశ్‌ముఖ్‌లు, సంస్థానాధీశులు ఆ పోరాటం వల్లే బలహీనపడ్డారు. అప్పుడు తెలంగాణలో రెండు రకాల ఉద్యమాలు నడిచాయి. ఒకవైపు వరంగల్, కరీంనగర్, నల్గొండ, మెదక్ ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో సాయుధ పోరాటం సాగింది. వెలుపల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సోషలిస్టులు చేసిన ఉద్యమాలు కూడా ప్రభావాన్ని చూపించాయి. సోషలిస్టుల పాత్రను కూడా ఈ సందర్భంగా ఘనంగా చెప్పుకోవాలి. తమదైన పద్ధతుల్లో వారు ఆధిపత్యాన్ని నిరసిస్తూ కార్యాచరణను కొనసాగించారు. నిజానికి తొలి ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో గెలిచింది కూడా సోషలిస్టు పార్టీ వారే. విశ్వనాథ్ సూరి, మాధవరెడ్డి, రాజారాం, పోలసాని నర్సింగరావు, గౌతంరావు లాంటి వారంతా బలమైన సోషలిస్టు నేతలే. సోషలిస్టులు కూడా కొన్ని సందర్భాల్లో తుపాకులు పట్టారు. భూస్వాములు, రజాకార్ల నుంచి రక్షించుకోవడానికి ఆత్మరక్షణార్థం ఆయుధాలు చేతబట్టారు. పీవీ నరసింహారావు లాంటి వారు కూడా ఆత్మరక్షణ చర్యలు చేపట్టారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఆయుధధారులయ్యారు. చాందా, నాగ్‌పూర్ శిబిరాల్లో ఆయుధ శిక్షణలిచ్చారు.
 

వెట్టి పోయినా.. విముక్తి రాలేదు!
అలా సాయుధపోరాటం కారణంగా నాటి బడా భూస్వామ్య వర్గం పోయి.. భూ పంపిణీ జరిగింది. వికృతమైన వెట్టి దోపిడీ, సామాజిక పెత్తనం పోయింది. కానీ ప్రజలందరికీ పూర్తి విముక్తి రాలేదు. దాని స్థానంలో చిన్న భూస్వాములు, ధనిక రైతులు అవతరించారు. వీరంతా కులపరమైన శ్రమవిభజన ఆధారంగానే గ్రామంపై పెత్తనం సాధించారు. కులవ్యవస్థలో - ప్రతి కులానికీ వనరు, స్థాయి, బాధ్యతలు అప్పగించారు. ఎవరికివారు తమ హోదాకు పరిమితమై, తమకప్పగించిన పనిని, ఇచ్చిన వనరుల ఆధారంగా నిర్వర్తిస్తారు. దాంతో గ్రామంలో భూమి ఉండే ఆధిపత్య కులాలకు, మిగిలిన కులాల సేవల్ని నిరంతరం పొందే పెత్తనం దక్కింది. దొర, పటేల్ అని పిలుపించుకునే వారికి ఈ శ్రమపై ఆధిపత్యం సంక్రమించింది. మిగిలినవారి శ్రమను ఉపయోగించుకొని వారు ఆర్థికంగా బలపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు రావడం కీలకమైన మార్పు. ఎన్నికలొచ్చాక గ్రామ పంచాయతీలు రావడంతో గ్రామాల్లో ప్రత్యామ్నాయ యంత్రాంగం ఏర్పడుతూ వచ్చింది. ఈ యంత్రాంగాన్ని తమ ఆధిపత్యం కోసం దొరలు, పటేళ్లు, భూస్వాములు వాడుకోవడం మొదలుపెట్టారు. పంచాయతీలు, సహకార సంఘాలను వాడుకుని ఆధునిక వ్యవస్థలను (హరిత విప్లవం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలులో భూస్వాములు దళారుల పాత్ర పోషించి, తమ మాట విన్నవాళ్లకు ఆ కార్యక్రమాల ప్రయోజనాలను ఇస్తూ పెత్తనం పెంచుకున్నారు.) గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇవి వారి ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోయాయి. ప్రజల్లో మాత్రం అప్పటికే ఓ చైతన్యం వచ్చింది.

ఆ రెండు పరిణామాలు..
1970ల్లో వచ్చిన రెండు పరిణామాలు ప్రజల్లో ధైర్యం కలిగించాయి. అవి..
1. బస్సులు రావడం - తాము ఎక్కడికైనా వెళ్లి బతుకుతామనే ధైర్యం.
2. భూసంస్కరణలు - సీలింగ్, మిగులు భూమిని పెద్దగా పంచకపోయినా అక్కడక్కడా ప్రభుత్వ భూమిని పేదలకు పంచారు. దాంతో ప్రజల్లో కాస్త ధైర్యం వచ్చింది. కూలీలుగా, జీతగాళ్లుగా మిగిలి పోకుండా వెట్టి వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు.
    ఈ నేపథ్యంలో విద్యార్థులు గ్రామాలకు వెళ్లడం, ఎంఎల్ గ్రూపులు తోడవడంతో.. గ్రామాల్లోని ఆధిపత్యాలకు, పెత్తనాలకు; దొరలు, పటేళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు అనేక రూపాల్లో సాగింది. మొదట జీతాలు పెంచాలనే డిమాండ్‌తో మొదలైంది. తర్వాత ఊళ్లోని మిగులు భూములు పేదలకు దక్కాలనే డిమాండ్; ఎన్నికల్లో తామూ పాల్గొనడం; అదనంగా ఉన్న దొరల భూములను దున్నుకోవడం వంటివి అనంతర పరిణామాలు. ఎంఎల్ గ్రూపుల్లో కొన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీని అంగీకరిస్తే.. మరికొన్ని అంగీకరించలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా వ్యవస్థలను మార్చాలన్న ఉద్దేశంతో పంచాయతీని గ్రామాభివృద్ధికి వేదికగా మార్చే ప్రయత్నం కొన్ని గ్రూపులు చేశాయి. లేనివారు ఎన్నికల చట్రం బయటి నుంచి తమదైన రీతిలో స్పందిస్తూ మార్పునకు ప్రయత్నించారు. మొత్తానికి అలా ఈ రైతుల ఉద్యమాల కారణంగా తెలంగాణ సమాజంలో దొరల పెత్తనం పోయింది.
    పౌరస్పందన వేదిక తరపున సర్వే చేసినప్పుడు 'ఇప్పుడు గ్రామాల్లో ఎవ్వరూ పెత్తనం చేయలేరు. మాకు మేముగా బతకగలం' అనే సమాధానం చాలా ఊళ్లలో ప్రజల నుంచి వచ్చింది. ఇలా రైతుల పోరాటమనేది.. తెలంగాణలో బలమైన సామాజిక మార్పునకు కారణమైంది. వెట్టి నుంచి విముక్తి చేసింది. కులపరమైన శ్రమవిభజనపై దాడి చేసింది. గ్రామాల్లో దొరల పెత్తనాన్ని కూలదోసింది. సామాజికంగా పేదప్రజల్ని విముక్తి చేసింది. స్వతంత్రశక్తిగా నిలబడటానికి అవకాశం కల్పించింది.. ఇవన్నీ కీలకమైన మార్పులే.

    1969 ఉద్యమం ఆగిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. దానికి మరోరూపమే ఆంతరంగికంగా సామాజిక మార్పు కోసం జరిగిన ఈ ఉద్యమం. అందుకే తెలంగాణ సమాజంలో జరిగిన ఉద్యమాలకు రెండు పార్శ్వాలున్నాయి. 1. బాహ్యఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా.. 2. ఆంతరంగిక మార్పులకు అనుకూలంగా.. వీటిని విడివిడిగా చూడటానికి వీల్లేదు. ఒకదాని ప్రభావం మరోదానిపై ఉంది. ఇంత బలంగా ప్రజలు స్వతంత్రంగా, రాజకీయ శక్తిగా ఉండటం వల్లనే మలిదశ ఉద్యమం మరింత బలంగా సాగడానికి కారణమైంది. తెలంగాణలో ఆనాడు అక్షరాస్యత లేకున్నా ఆధిపత్యం, వెట్టికి వ్యతిరేకంగా ఉన్న ఆగ్రహం మామూలుది కాదు. దానికి చదువులతో సంబంధం లేదు. అది నివురుగప్పిన నిప్పులా ఉంది. అవకాశం దొరికినప్పుడు బద్దలవుతూ వచ్చింది. 1969 తెలంగాణ ఉద్యమంలో అప్పటి రాజకీయ పార్టీలు విఫలమవడం ప్రత్యామ్నాయాలకు దారులు తీసింది. అదే సమయంలో ఎంఎల్ పార్టీలు ఏర్పడటం అత్యంత కీలక పరిణామం. లేదంటే ఉద్యమానంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీసేదో? విద్యార్థి ఉద్యమం తిరుగుబాటుగా వచ్చి పోయేదోమో గానీ ఈ నిర్మాణాలు రూపుదిద్దుకోవడానికి అవకాశం వచ్చేది కాదు.

మావో సూత్రం
1964లోనే సీపీఐ నుంచి సీపీఎం విడిపోయింది. తర్వాత సీపీఎం నుంచి బయటకు వచ్చిన వారిని మావోయిస్టులనీ, మార్క్సిస్టు లెనినిస్టు గ్రూపులనీ అంటారు. కేవలం మార్క్స్ చెప్పినవే కాకుండా తర్వాత లెనిన్ చెప్పిన వాటికి, మావో చెప్పిన సూత్రాలను జోడించుకొని వీరు ఆచరించడానికి ప్రయత్నించారు. మూడో ప్రపంచ దేశాల్లో మావో చెప్పిన సూత్రాలు అత్యంత ప్రభావమంతమైనవనేది ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టుల్లో బలమైన అభిప్రాయం. ఎందుకంటే మావో ఒక్కడే వలస ఆధిపత్యంలోని దేశాల్లో విముక్తి కోసం అనుసరించాల్సిన మార్గంపై సుదీర్ఘమైన ప్రయత్నాల అనంతరం ఒక పద్ధతికి రూపకల్పన చేశాడు. దానికి ఆయన నూతన ప్రజాస్వామిక విప్లవమని పేరుపెట్టారు. ఆ నూతన ప్రజాస్వామిక విప్లవం ఏం చెబుతుందంటే - మొదట గ్రామాల్లో రైతులను సమీకరించి వారిని సంఘటితం చేసి, రాజకీయంగా ఐక్యం చేయకపోతే సమాజంలో మార్పు సాధ్యం కాదంటుంది. కార్మికులనే ప్రధానంగా కదిలించాలన్నది అప్పటిదాకా ఉన్న సిద్ధాంతం. అలాకాకుండా గ్రామాల్లోని పేద రైతులు, రైతు కూలీలు, చిన్నచిన్న వృత్తులు చేసుకునేవారు కూడా మార్పునకు చోదక శక్తులవుతారనేది మావో సేటుంగ్ సిద్ధాంతం. అలాగని శ్రామికవర్గ దృక్పథాన్ని వదలిపెట్టలేదు. కాకపోతే మూడో ప్రపంచ దేశాల్లో గ్రామీణ రైతులకు, రైతు కూలీలకు కూడా సమాజాన్ని మార్చే శక్తి ఉందని, ఈ వర్గాలను కూడా ఉద్యమంలో సమీకరించాలని నిర్ణయానికి వచ్చినవారిలో మొదటివాడు మావో. ఆయన హ్యునాన్‌లో 1930ల్లో ప్రయోగం చేసి ఈ ఆలోచనకు రూపకల్పన చేశారు. ఆ ఆలోచనను తర్వాత మూడో ప్రపంచ దేశాల్లోని చాలామంది కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు దేశాలు ఉపయుక్తమైందిగా భావించాయి. అదొక్కటే కాకుండా సాంస్కృతిక అంశాలపై కూడా నిరంతర ఘర్షణ పోరాటం కూడా అవసరమని మావో చెప్పాడు. పార్టీలోనూ ఆ ఆధిపత్య ధోరణలు వ్యక్తమవుతూ ఉంటాయనీ.. వాటన్నింటితో నిరంతరం తలపడుతూ ఉండాలని మావో సూత్రీకరించాడు. సామాజిక మార్పునకు కార్మికులే కాకుండా రైతు వర్గం కూడా దోహదం చేస్తుందన్న సూత్రీకరణ చాలా గొప్పది. మార్క్సిస్టు సిద్ధాంతంలో ఆయనకదే బలమైన స్థానాన్ని కల్పించింది. ఆ సిద్ధాంతాన్ని వీరు ఆచరిస్తూ వచ్చారు. మార్క్సిస్టు లెనినిస్టు అని అనడానికి కారణం.. మార్క్స్ చెప్పినవాటికి లెనిన్ ఆచరణ రూపమిచ్చాడు. తర్వాత మూడో ప్రపంచ దేశాలకు మావో మార్గదర్శకమయ్యాడు. కాబట్టి ఈ మూడింటినీ జోడించి మార్క్సిస్టు లెనినిస్టు మావోయిస్టులుగా వీరు పేరు పొందారు. సామాజిక మార్పునకు కార్యాచరణ మొదలెట్టారు. రెండు మూడు గ్రూపులుగా విడిపోయినా.. అంతా ప్రధానంగా చెప్పేది.. రాజ్యమెప్పుడూ కొంతమేరకు ఆధిపత్య శక్తులకు అండగా ఉంటుంది. ప్రజలు సంఘటితమై దాన్ని మార్చకుండా సామాజిక మార్పు సాధ్యం కాదు. విద్యార్థులు దానికి ఆకర్షితులయ్యారు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌