• facebook
  • whatsapp
  • telegram

రాజీనామాల పర్వం (టీఆర్‌ఎస్‌ ఎన్నికల పొత్తుల నేపథ్యం)

రాజకీయ పొత్తులు  రాజీనామాల ఎత్తులు!

  ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా అవతరించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అనతికాలంలోనే ప్రధాన ప్రాంతీయ రాజకీయ శక్తిగా ఎదిగింది. అప్పటికే తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించింది. తొలి ప్రయత్నంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా చేరింది. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఎలాంటి కదలిక లేకపోవడంతో రాజీనామాల బాట పట్టింది. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు తిరిగి ప్రజల్లోకి వెళ్లింది. ఆ విధంగా టీఆర్‌ఎస్‌ తన పోరాటంలో భాగంగా పెట్టుకున్న రాజకీయ పొత్తులు, తెలంగాణవాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వేసిన రాజీనామాల ఎత్తుల గురించి పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1990 దశకంలో జరిగిన అనేక సదస్సులు, సభల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాయి. తెలంగాణ మేధావులు, వామపక్ష భావజాల   ఉద్యమకారులు నిర్వహించిన ఆ సభల్లో నాటి కాంగ్రెస్‌నాయకులు కూడా పాల్గొని ప్రత్యేక తెలంగాణ వాదాన్ని సమర్థించారు. 1990-92లో కె.జానారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరం ఈ ప్రాంత ప్రయోజనాల కోసం గళం వినిపించింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై నాటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి 1997, ఫిబ్రవరి 26న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విధానసభలో     సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆ తర్వాత 2000, ఆగస్టు 11న, 41 మంది తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను తెలియజేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతిపత్రం సమర్పించారు. దానికి స్పందించిన ఆమె తెలంగాణతో పాటు, విదర్భ వంటి ఇతర చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె.అడ్వాణీకి లేఖ రాశారు. ఈ చర్యతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తాను సానుకూలమని కాంగ్రెస్‌ పార్టీ చాటుకుంది.

* 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరం క్రియాశీ లకంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలను చైతన్యవంతులను చేస్తూ సభలు, సదస్సులు నిర్వహించింది. ఆ విధంగా టీఆర్‌ఎస్, తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరం ఉమ్మడి లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనేనని స్పష్టమైంది. దీంతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు   కుదిరేందుకు ప్రధాన కారణం నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఉమ్మడి శత్రువుగా భావించడం, ప్రత్యేక తెలంగాణ వాదానికి తెదేపా ప్రభుత్వం సుముఖంగా లేకపోవడమే. తెదేపాను వరుసగా మూడోసారి అధికారంలోకి రాకుండా నివారించడం కోసమే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందని భావిస్తారు (తెదేపా ఓటుబ్యాంకును చీల్చడం ద్వారా). కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆ పార్టీతో పొత్తుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఈ కూటమిలో సీపీఐ, సీపీఎం కూడా చేరాయి. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 119 స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు 42 స్థానాలను కేటాయించగా, 26 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ 52 స్థానాలు గెలిచింది. టీఆర్‌ఎస్‌ పోటీ చేసిన 6 లోక్‌సభ స్థానాల్లో 5 స్థానాల్లో విజయం    సాధించింది. 2004 ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ 19 పార్టీల కూటమితో    ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్ని భాగస్వామ్య పార్టీలను సంతృప్తి పరిచేందుకు కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం)ను రూపొందించింది. అందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా చేర్చడంతో యూపీఏలో భాగస్వామ్య పార్టీగా టీఆర్‌ఎస్‌ చేరింది. కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు. కేసీఆర్‌కు క్యాబినెట్‌ హోదా ఉన్న ఓడరేవుల మంత్రిత్వ శాఖ     కేటాయించగా, నరేంద్రకు గ్రామీణాభివృద్ధి సహాయ (స్టేట్‌) మంత్రి పదవి ఇచ్చారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన డీఎంకే కోరికపై షిప్పింగ్‌ శాఖను   కేసీఆర్‌ వదులుకున్నారు. ఫలితంగా ఆయన ఏ శాఖ లేకుండా క్యాబినెట్‌ మంత్రిగానే కొనసాగారు. ఆ తర్వాత కొంతకాలానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఇచ్చారు.

* 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో మొత్తం 294 స్థానాలకు 185 స్థానాలు గెలిచి పూర్తి   మెజారిటీని సాధించింది. 2004, మే 13న   వైఎస్‌ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆహ్వానంపై 2004, జూన్‌ 23న టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీలోని ఆరుగురికి మంత్రి పదవులు దక్కాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ చేరడంపై ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల నుంచి విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి. నిజానికి నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు టీఆర్‌ఎస్‌కు కొంత  వరకు కలిసివచ్చింది. దీనికి కారణం 1990 దశకం నుంచి కాంగ్రెస్‌ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమించడమే. టీఆర్‌ఎస్‌ కేంద్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా తెలంగాణ వాదాన్ని జాతీయ నాయకులతో చర్చించి, ఒప్పించే అవకాశం ఉంటుందని భావించింది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం 2004, మే 26న ప్రత్యేక తెలంగాణ అంశాన్ని యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చింది. జూన్‌ 7న పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి నాటి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పొందుపరిచారు. 

 

ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ

అప్పటి కేంద్ర మంత్రిమండలిలో చేరిన కేసీఆర్, నరేంద్రలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం 2005, జనవరి 18న ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. యూపీఏ భాగస్వామ్య పార్టీలతో, ప్రతిపక్ష పార్టీల నాయకులతో విస్తృత సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ముగ్గురు క్యాబినెట్‌ మంత్రులతో ఈ కమిటీని నియమించింది. అందులో 1) ప్రణబ్‌ ముఖర్జీ - కేంద్ర రక్షణ శాఖా మంత్రి (కాంగ్రెస్‌) 2) దయానిధి మారన్‌ - కేంద్ర సమాచార, సాంకేతిక శాఖా మంత్రి (డీఎంకే) 3) రఘువంశ ప్రసాద్‌ సింగ్‌ - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి (ఆర్జేడీ) సభ్యులు. ఈ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభిప్రాయాలు లిఖితపూర్వకంగా తెలపాలంటూ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు పంపింది. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ తన నివేదికను ఎనిమిది వారాల్లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో కేసీఆర్, నరేంద్రలు ప్రొఫెసర్‌ జయశంకర్‌తో కలిసి యూపీఏ, ఎన్డీఏ కూటముల్లోని పార్టీల నాయకులను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ అభిప్రాయాలను, ఆవశ్యకతను వివరించి, వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ ప్రధానులు వి.పి.సింగ్, చంద్రశేఖర్, దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్, వాజ్‌పేయీలను కూడా కలిసి మద్దతును కోరారు.

* మరోవైపు నాటి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రత్యేక తెలంగాణవాదాన్ని వ్యతిరేకించారు. ఆయన అనుసరిస్తున్న చర్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ టీఆర్‌ఎస్‌ మంత్రులు 2005, జులై 4న రాజీనామాలు చేశారు. అందుకు దారితీసిన పరిస్థితులను ప్రజలకు వివరించి, తెలంగాణవాదాన్ని మరింత బలోపేతం చేయడానికి 2005, జులై 17న వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. దానికి దాదాపు లక్ష మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, నాటి కేంద్ర క్యాబినెట్‌ మంత్రి శరద్‌ పవార్‌ హాజరై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన సహకారం ఉంటుందని ప్రకటించారు.

  టీఆర్‌ఎస్‌ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డికి మధ్య ఏర్పడిన  వివాదాల పరిష్కారానికి కాంగ్రెస్‌ హైకమాండ్‌  సూచనల మేరకు దిల్లీలోని ఏపీ భవన్‌లో కేసీఆర్, వైఎస్‌ఆర్‌ల మధ్య చర్చలు జరిగాయి. అందులో  1) పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాల తరలింపు 2) పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం 3) పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 4) నక్సలైట్ల సమస్య 5) 610 జీవో అమలు 6) సింగూరు ప్రాజెక్టు జలాలను హైదరాబాద్‌ తాగునీటికి వినియోగించడానికి  బదులుగా కృష్ణానదీ జలాలను హైదరాబాద్‌కు తరలించడం, సింగూరు జలాలను మెదక్‌ జిల్లాలో సాగు నీరుగా వినియోగించడంపై మాట్లాడారు. కానీ ఆ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీని చీల్చడానికి  వైఎస్‌ఆర్‌ వర్గం ప్రయత్నించినట్లు విమర్శలు వచ్చాయి. 

 

కేంద్ర పదవులకు రాజీనామా

  ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ నివేదికను 8 వారాల్లో సమర్పించాల్సి ఉండగా, 80 వారాలైనా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కేసీఆర్, నరేంద్రల విన్నపాలను కేంద్రం పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలోనూ రాజశేఖర్‌ రెడ్డితో విభేదాల కారణంగా 2006, ఆగస్టు 23న కేసీఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మరుసటి రోజు కేసీఆర్‌ దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శరద్‌ పవార్‌ కోరిక మేరకు 25న దీక్ష విరమించారు. కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన కేసీఆర్, తన లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి గెలవాలని కరీంనగర్‌కు చెందిన నాటి రాష్ట్ర మంత్రి కె.సత్యనారాయణ రావు సవాలు విసిరారు. కేసీఆర్‌ ఆ సవాలును స్వీకరించి 2006, సెప్టెంబరు 12న ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది డిసెంబరు 4న జరిగిన ఉప ఎన్నికల్లో, మళ్లీ దాదాపు 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం తెలంగాణ ఉద్యమకారుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

 

సిద్ధిపేట సమర శంఖారావం సభ:  కేసీఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రిమండలి నుంచి వైదొలిగిన తర్వాత ప్రజలకు వివరించేందుకు సిద్ధిపేటలో 2006, అక్టోబరు 8న సమర శంఖారావం సభ నిర్వహించారు. తెలంగాణ సమస్య పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

 

తెలంగాణ సంబురాలు:  ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి, విశిష్టతను హైదరాబాద్‌లోని ప్రజలకు తెలియజేయడానికి నిజాం కళాశాల మైదానంలో 2007, మార్చి 23 నుంచి 27 వరకు, అయిదు రోజుల పాటు తెలంగాణ సంబురాలు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను, ప్రత్యేక వంటల రూపంలో ప్రదర్శించారు. ఈ అయిదు రోజులు తెలంగాణ కళారూపాల ప్రదర్శన, కవి సమ్మేళనాలు, ధూం ధాం కార్యక్రమాల నడుమ జై తెలంగాణ నినాదాలతో నిజాం కళాశాల మైదానం అర్ధరాత్రి దాకా దద్దరిల్లింది.

 

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామా:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతకు నిరసనగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు లోక్‌సభ సభ్యులు 2008, మార్చి 3న రాజీనామా చేశారు. అలాగే 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది రెబెల్స్‌గా మారిపోగా, మిగిలిన 16 మంది 2008, మార్చి 4న రాజీనామా చేశారు. ఫలితంగా జరిగిన ఉపఎన్నికల్లో నాలుగు లోక్‌సభ స్థానాలకుగాను రెండు చోట్ల, 16 విధానసభ స్థానాలకుగాను 7 స్థానాలను మాత్రమే టీఆర్‌ఎస్‌ నిలబెట్టుకుంది. కేసీఆర్‌కు ఈసారి కేవలం 15 వేల మెజార్టీనే వచ్చింది. దాంతో తెలంగాణవాదం బలహీనపడిందని కొందరు తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానించారు.

 

రచయిత:  ఎ.ఎం.రెడ్డి 

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌