• facebook
  • whatsapp
  • telegram

1969 తెలంగాణ ఉద్యమ ప్రస్థానం

 'షట్' సూత్రాలకే పరిమితం
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం అంతర్వాహినైంది. తెలంగాణ ప్రజా సమితి చివరికి కాంగ్రెస్‌లో విలీనమైంది. 1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీపీఎస్ కథ అలా కాంగ్రెస్ కంచికి చేరింది. ముఖ్యనేత మర్రి చెన్నారెడ్డి 'షట్ సూత్రాలకు మొగ్గుచూపారు. ఇలా టీపీఎస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి విలీనం దాకా సాగిన ప్రస్థానంలో ఆయన ఎత్తుపల్లాలు రెండూ చవి చూడాల్సి వచ్చింది. విరామదశకు చేరుకున్న ఉద్యమానికి ఊపిరిలూదే ప్రయత్నంలో ఆయన ఎంతమేర విజయం సాధించారు? కాంగ్రెస్‌లో విలీనం పూర్వాపరాలేమిటి? తదితర అంశాలపై రాజకీయ పరిశీలకులు, ఆచార్య జయశంకర్ పరిశోధనాభివృద్ధి సంస్థ సంచాలకులు వి. ప్రకాశ్ విశ్లేషణ 'ఈనాడు ప్రతిభకు ప్రత్యేకం..
    తెలంగాణ ప్రజా సమితి కీలకపాత్రతో ఉవ్వెత్తున ఎగిసిన 1969 ఉద్యమం ఆ ఏడాది చివరి నెలలకు వచ్చేసరికి కొంత చప్పబడినా.. ఉద్యమానికి ఊపిరిలూదటానికి మర్రి చెన్నారెడ్డి ప్రయత్నాలు ఆపలేదు. 1970 మార్చిలో మళ్లీ ఆయన్ను 6 రోజులు అరెస్టు చేశారు. పిలుపిచ్చినా పదిమంది కూడా రాలేని పరిస్థితి. ఉద్యమం కష్టమని ఒక దశలో నిర్వేదం చెందారు కూడా. మరోవైపు ఉద్యమంలో ఉన్నవారిలో అసంతృప్తి. ప్రజల్లోనూ వైరాగ్యం, అశక్తత. అదే సమయంలో చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు తెలంగాణ ఉద్యమంపైనా పరోక్ష ప్రభావం చూపించాయి. జాకీర్ హుస్సేన్ మరణించడంతో రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలం సంజీవరెడ్డి. ఆయన పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప ప్రకటించారు. ఆయనకు మద్దతిస్తూ ఇందిర కూడా ఓ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కానీ మూడు రోజుల్లో మనసు మార్చుకున్న ఇందిర - వి.వి.గిరి పేరుకు మద్దతు ప్రకటించారు. అంతరాత్మ ప్రభోదం మేరకు ఓటు వేయాలని ఆమె పిలుపిచ్చింది అప్పుడే. అప్పటిదాకా నిజలింగప్పకు మద్దతిస్తూ వచ్చిన బ్రహ్మానందరెడ్డి ఈ ఎన్నికల్లో మాత్రం ఇందిరకు సాయం చేశారు. అదే ఆయన పదవిని నిలబెట్టింది. నీలం సంజీవరెడ్డి ఓటమితో నిజలింగప్ప వర్గం ఇందిరపై అవిశ్వాసానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ దశలో బ్రహ్మానందరెడ్డి మద్దతు ఇందిరకు అవసరమైంది. ఇదే సమయంలో సరిహద్దుల్లో పాక్-బంగ్లా గొడవలు.. బంగ్లాదేశ్ నుంచి భారీస్థాయిలో శరణార్థులు భారత్‌లోకి రావడం మొదలైంది. ఇలా అంతర్జాతీయ అంశాలు కూడా ఇందిరను ఒత్తిడికి గురిచేశాయి. దీంతో తెలంగాణ నేతలను పిలిపించుకొని 'తెలంగాణ సమస్యను పరిష్కరిస్తా. కాస్త సమయం ఇవ్వండి. అంతర్జాతీయంగా, జాతీయంగా సమస్యలు మీకు తెలియంది కాదు. ఈ సమయంలో నన్ను చికాకు పెట్టకండి.. అని ఇందిరాగాంధీ విజ్ఞప్తి చేయడంతో నవంబరు 25న చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, వీబీ రాజు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు.
    ఇలా 1969, జనవరి 15న ఉస్మానియాలో మొదలైన ఉద్యమం 1969, నవంబరు 25న విరామం పొందింది. తిరిగి దాన్ని నిద్ర లేపడానికి చెన్నారెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చెన్నారెడ్డిని టీపీఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు సదాలక్ష్మి తదితరులు ప్రకటించారు. ప్రతిగా చెన్నారెడ్డి మళ్లీ సమావేశం పెట్టి తనను అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇలా వివాదాలతో తెలంగాణ ప్రజా సమితి ప్రతిష్ఠ మసకబారడం కూడా ఉద్యమం స్పందించకపోవడానికి కొంత కారణమైంది.

చల్లారిన ఉద్యమం
    బంగ్లాదేశ్‌లో యుద్ధ వాతావరణం, అఖిల భారత కాంగ్రెస్‌లో చీలిక.. తెలంగాణలో ఉపశమన చర్యలు.. ముఖ్య నేతలంతా ఉద్యమానికి దూరంగా జైల్లో ఉండటం.. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి విస్తృత అధికారాలివ్వడానికి కేంద్రం అంగీకరించడం.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం.. మిగులు నిధుల్లో నష్టం జరిగిన రూ.80 కోట్లనూ ఇవ్వడానికి ముందుకు రావడం.. రాష్ట్ర ప్రభుత్వ ఉపశమన చర్యలతో ఉద్యమం పైకి చల్లారింది. 1970లో ఉద్యమం పెద్దగా ఏమీ లేదు.

అమరుల స్తూపం కోసం..
    అంతా స్తబ్దుగా సాగుతున్న సమయంలో గన్‌పార్క్‌లో, కంటోన్మెంట్ పరిధిలోని సికింద్రాబాద్ క్లాక్‌టవర్‌లో అమరవీరుల స్తూపాలు నిర్మించాలని 1970, జనవరి 17న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించింది. కానీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఎంసీహెచ్‌కు ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చింది. దీంతో అమరవీరుల స్తూపాల కోసం ఘర్షణ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలోనూ దీనిపై చర్చ జరిగింది. గన్‌పార్క్ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. మళ్లీ ఉద్రిక్తత, ఉద్వేగాల వాతావరణం.. ప్రతాప్‌కిశోర్, విలియమ్స్‌లు అమరవీరుల వస్తువులను వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి సేకరించి, అంతకుముందురోజు అర్ధరాత్రి వెళ్లి గన్‌పార్క్‌లో శంకుస్థాపన చోట పూడ్చిపెట్టి వచ్చారు. మరుసటి రోజు ఉదయం ప్రభుత్వ ఆంక్షలను, పోలీసుల భద్రత వలయాన్ని సినిమా ఫక్కీలో ఛేదిస్తూ - అప్పటి ఎంసీహెచ్ మేయర్ లక్ష్మీనారాయణ తదితరులు ఫిబ్రవరి 23న గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే మాణిక్‌రావును అరెస్టు చేశారు. దీనిపై అసెంబ్లీలో దుమారం రేగింది. 'వాడవాడలా పొట్టి శ్రీరాములు విగ్రహాలు పెట్టంగా లేనిది.. అమరుల స్తూపం కడితే అభ్యంతరం ఎందుకు అంటూ ఈశ్వరీబాయి చేసిన ప్రసంగానికి ప్రశంసలు లభించాయి. చల్లారిన ఉద్యమాన్ని అనవసరంగా ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ సమైక్యవాదుల నుంచి కూడా విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో 24న సికింద్రాబాద్ క్లాక్‌టవర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా శంకుస్థాపన జరిగింది.

టీపీఎస్‌కు రెండు సీట్లు
విద్యార్థులు, ఉద్యోగుల ఉద్యమం స్తబ్దుగా మారి చల్లారినా.. అంతర్లీనంగా అసహనం, అసంతృప్తి మాత్రం అలాగే ఉన్నాయని తర్వాతి రాజకీయ పరిణామాలు రుజువు చేశాయి. ప్రజల ఆకాంక్షలు, ఆవేదన అంతర్వాహినై ఓట్ల రూపంలో బయటికొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేస్తోంది, అణిచివేస్తోందన్న అంతర్లీన భావనను ఓట్ల రూపంలో వెల్లడించారు. గురుమూర్తి మరణంతో మూడు నెలల తర్వాత వచ్చిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఈ ప్రభావం కనిపించింది. 1970, జూన్ 16న ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ప్రజా సమితి తరపున పోటీ చేసిన నాగం కృష్ణ 14 వేల మెజార్టీతో విజయం సాధించారు. అప్పటికి టీపీఎస్ ఇంకా సంఘమే. రాజకీయ పార్టీగా మారలేదు. ఈ మధ్యలో.. బ్రహ్మానందరెడ్డికి సమస్యలు సృష్టిస్తున్న వీబీ రాజు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ఎమ్మెల్యేలను కూడగట్టారు. 287 మంది సభ్యులున్న సభలో 28 మంది ఉంటే విపక్షనేత హోదా వస్తుంది. అప్పటికి ఎవ్వరికీ లేదది. కానీ 31 మంది తెలంగాణ ఎమ్మెల్యేలంతా కలసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడటంతో, వారి నేత నూకల రామచంద్రారెడ్డికి విపక్ష నేత హోదా ఇవ్వాల్సి వచ్చింది. ఇది మరో సమస్యకు దారి తీస్తుందనే ఉద్దేశంతో దీనికి మూలకారకుడైన వీబీ రాజును రాజ్యసభకు పంపించారు. దీంతో సిద్ధిపేటకూ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబరు 17న వెల్లడైన ఫలితాల్లో మదన్‌మోహన్ రూపంలో అక్కడా టీపీఎస్ జయభేరి మోగించింది. అలా పార్టీగా మారకుండానే టీపీఎస్ రెండు స్థానాలు గెలుచుకుంది.

టీపీఎస్ జయభేరి
    అలా పట్టణ ప్రాంతంతోపాటు గ్రామీణంలో కూడా టీపీఎస్‌కు బలం ఉందని తెలియడంతో కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి చెన్నారెడ్డికి పిలుపొచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీపీఎస్ తరపున అభ్యర్థులను నిలబెట్టకుండా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని, వీలైతే పార్టీని విలీనం చేయాలని ఇందిరాగాంధీ ప్రతిపాదించారు. తెలంగాణ ఇవ్వాలని చెన్నారెడ్డి బృందం ప్రతి షరతు విధించింది. '8 సూత్రాల పథకం అమలు జరుపుతున్నాం. అయిదేళ్ల తర్వాత కూడా అన్యాయం జరుగుతోందని మీరు భావిస్తే, మూడింట రెండొంతుల మంది కోరుకుంటే చూద్దాం అని ఇందిర హామీ ఇచ్చారు. దీనిపై చెన్నారెడ్డి పార్టీలోని 14 మందితో కమిటీ వేశారు. నూకల రాంచంద్రారెడ్డి ఆ కమిటీకి ఛైర్మన్. అయిదేళ్లు కాకుండా రెండేళ్లే ఇందిరకు గడువు ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. 1972లో అసెంబ్లీకి ఎన్నికలొస్తున్నాయి. అంతకుముందే లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలొస్తున్నాయి. కాబట్టి 1972 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవారిలో మూడింట రెండొంతుల మంది తెలంగాణ కోరితే ఇవ్వాలని టీపీఎస్ షరతు విధించింది. దానికి ఇందిర అంగీకరించలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికలకు 1971 జనవరిలో ప్రకటన వచ్చింది. మార్చి 5న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. 11న ఫలితాలు ప్రకటించారు. తెలంగాణలో 14 సీట్లకు టీపీఎస్ తరపున 10 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. ఖమ్మం, మిర్యాలగూడ, నిజామాబాద్, ఆదిలాబాద్‌ల్లో తప్ప అన్నింటా తెలంగాణ ప్రజా సమితి జయభేరి మోగించింది. అప్పటికే టీపీఎస్ పార్టీగా మారింది. పార్టీ గుర్తు 'పార. తెలంగాణ పటం బొమ్మగా ఉండేది.
 

కాంగ్రెస్‌లో విలీనం
    మధ్యంతర ఎన్నికల్లో అఖిల భారత స్థాయిలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ కూడా ఘన విజయం సాధించింది. పార్టీపై ఆమె పూర్తి పట్టు సంపాదించింది. తెలంగాణలో పది మంది గెలవడంతో.. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజాసమితిని క్రమంగా కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే ప్రయత్నాలు మొదలెట్టారు ఇందిర. కేంద్ర సహాయమంత్రి సుబ్రహ్మణ్యం ద్వారా చర్యలు మొదలయ్యాయి. తెలంగాణకు, నేతలకు ఏం కావాలో ఆయన తెర వెనకాల చర్చలు కొనసాగించారు. పలుసార్లు దిల్లీ, హైదరాబాద్ మధ్య ప్రయాణం చేశారు. 1971 ఆగస్టులో ఇందిరాగాంధీ నుంచి బ్రహ్మానందరెడ్డికి కూడా పిలుపొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ నేతను ముఖ్యమంత్రిని చేస్తే టీపీఎస్‌ను మచ్చిక చేసుకోవచ్చని భావించారు. రెండు పార్టీల మధ్య చర్చలు సాగాయి. టీపీఎస్ ఎంపీల ద్వారా ఇందిర ఒత్తిడి తెచ్చారని ఓ వాదనుంది. మొత్తానికి విలీనానికి టీపీఎస్ తరపున చెన్నారెడ్డి 6 సూత్రాలు (షట్‌సూత్రాలు) ఇందిర ముందుంచారు. అందులో మొదటిది బ్రహ్మానందరెడ్డి తొలగింపు. 1971, సెప్టెంబరు 15న బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. సెప్టెంబరు 18న కాంగ్రెస్‌లో విలీనానికి టీపీఎస్ కార్యవర్గం నిర్ణయించింది. 19న టీపీఎస్ అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన రాష్ట్ర కౌన్సిల్ దీన్ని ఆమోదించింది. 24న దిల్లీలో ఏఐసీసీ కూడా టీపీఎస్ విలీనానికి తీర్మానం చేసింది. అలా టీపీఎస్ కాంగ్రెస్‌లో కలిసిపోయింది. 1971, సెప్టెంబరు 25న పీవీ నరసింహారావును ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. (చెన్నారెడ్డి సూచన మేరకే ఇది జరిగిందని అంటారు). 1971 సెప్టెంబరు 30న పీవీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం. కానీ చివరకు చెన్నారెడ్డి చెప్పిన పేర్లలో కేవలం ఇద్దరికి మాత్రమే పీవీ మంత్రివర్గంలో చోటు లభించింది. అలా కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. అప్పటిదాకా తెలంగాణపై తెగ్గొట్టకుండా మాట్లాడుతూ వచ్చిన ఇందిరాగాంధీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే అవకాశం లేదని చెప్పకనే చెప్పారు. 15 ఏళ్ల ప్రణాళికను తెలంగాణ ముందుంచారు. 15 ఏళ్లలో అద్భుతమైన ప్రాంతంగా మారుస్తామని ప్రకటించారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మళ్లీ పీవీ ముఖ్యమంత్రిగా (రెండోసారి) ప్రమాణ స్వీకారం చేశారు.
 

చివరికేం మిగిలింది?
 తెలంగాణ ఏర్పాటు తప్ప మరి దేనికీ అంగీకరించొద్దని పట్టుబట్టిన చెన్నారెడ్డి.. చివరకు షట్ సూత్రాల షరతులతో కాంగ్రెస్‌లో టీపీఎస్ విలీనానికి అంగీకరించారు. ఈ షట్‌సూత్రాలను ప్రధాని ఇందిరకు సమర్పించి బయటకు రాగానే దిల్లీలో ఆనాడు చెన్నారెడ్డిని విలేకరులు 'రాష్ట్ర నాయకత్వంలో మార్పుపై పట్టుపట్టవద్దని ప్రధాని ఏమైనా కోరారా? అని ప్రశ్నించగా.. 'ఈ ఆరింటిలో ఏ సూత్రాన్నీ వదిలి పెట్టాలని ఆమె నన్ను అడగలేదు. అలాగని ఆమె వీటిలో దేనినీ ఆమోదించనూ లేదు అని డాక్టర్ చెన్నారెడ్డి చెప్పారు. విలీనం పూర్తయ్యాక కొద్ది నెలలకు 6 షరతుల్లో మిగిలిన అయిదింటి మాటేంటని అడిగితే.. 'మొదటిది (బ్రహ్మానందరెడ్డిని తొలగించడం) తప్ప మిగిలినవాటి సంగతి తనకు తెలియదని ఇందిర స్పష్టం చేశారు. ఈ విషయం వినగానే టీపీఎస్‌లోంచి వెళ్లిన ఇద్దరు (సత్యనారాయణ రావు, ఎస్.బి.గిరి) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇంతకూ టీపీఎస్ అధ్యక్షుడిగా చేసినా, ఉద్యమాన్ని నడిపించినా, ఎన్నికల్లో గెలిపించినా, విలీనం చేసినా.. చివరకు చెన్నారెడ్డికి ఒరిగిందేమిటి? తనపై నిషేధం ఉండటంతో ఎక్కడా ఆయన పోటీ చేయలేకపోయారు. మంత్రివర్గంలో తెలంగాణ నుంచి తాననుకున్న వారందరికీ మంత్రి పదవులు ఇప్పించుకోలేకపోయారు. 'ఉద్యమం కారణంగా వచ్చిన ఎంపీ సీట్లను అప్పనంగా కాంగ్రెస్‌కు అప్పగించారని, ఉద్యమాన్ని మోసం చేశారనే అపప్రద మాత్రం చెన్నారెడ్డి మిగుల్చుకున్నారు. ఒకవేళ టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా 1972 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఏం జరిగేదో? టీపీఎస్ విలీనం తర్వాత కూడా తెలంగాణ కోసం చెన్నారెడ్డి రాజీ లేకుండా పోరాటం కొనసాగించారు. 1973లో 6 సూత్రాల పథకాన్ని వ్యతిరేకించారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ ఫోరం పెట్టి తెలంగాణలో కూడా ఉద్యమానికీ, జై ఆంధ్ర - జై తెలంగాణ ఉద్యమాలను సమన్వయం చేయడానికీ ప్రయత్నించారు. కానీ ఆయన వెంట ఎవరూ నడవలేదు. తనపై పడ్డ ముద్ర కారణంగా ఉద్యమానికి వెనుకటి వైభవాన్ని తీసుకురాలేకపోయారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా వెళ్లడం.. 1978లో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కావడం తర్వాతి పరిణామాలు. విశేషమేమంటే కీలక సమయంలో తనపై ఆరేళ్ల నిషేధానికి కారణమైన వందేమాతరం రామచంద్రారావును చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా నియమించారు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఎస్పీ పవిత్రన్‌ను హైదరాబాద్ కమిషనర్‌గా నియమించారు. 'నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను.. పోరాడాను. కానీ చివరకు ద్రోహి అనే ముద్రతో పోతున్నాను. మీరైనా నిజం చెప్పండి అంటూ చివరి రోజుల్లో చెన్నారెడ్డి వాపోయారన్నది ఆయన సన్నిహితుల మాట.

టీపీఎస్ విలీనానికి షట్ సూత్రాలు
1. ముఖ్యమంత్రి పదవి నుంచి బ్రహ్మానందరెడ్డి వైదొలగడం.
2. కొత్తప్రభుత్వ పనితీరు ఆధారంగా సరైన పద్ధతిలో ప్రత్యేక రాష్ట్ర సమస్యపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ శాసనసభ్యులకు అవకాశం ఇవ్వడం.
3. తెలంగాణకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.
4. ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రాంతం వారికి ప్రాధాన్యం ఇచ్చే ముల్కీ నిబంధనలను నిర్మాణాత్మక రీతిలో రూపొందించడం.
5. తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని సమర్థంగా పనిచేయించడం.
6. తెలంగాణ ప్రాంత ఆర్థికాభివృద్ధిలో వ్యత్యాసాలను లేకుండా చేయడం.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌