• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ‌లో 1969 నాటి ప‌రిణామాలు

 ఓ క‌చ్చిత‌మైన నాయ‌కుడంటూ లేకుండా ఆరంభ‌మై...పాయ‌లుపాయ‌లుగా సాగుతూ...తొమ్మిది జిల్లాల‌ను చుట్టుకొచ్చి..విద్యార్థుల ఏడాది చ‌దువును ఫ‌ణంగా పెట్టిన 1969 నాటి 10 నెల‌ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేక మ‌లుపులు తిరిగింది. ర‌క్షణ‌ల లొల్లి కాస్తా ప్రత్యేక డిమాండ్‌గా మారింది.. గ‌ల్లీ నుండి దిల్లీ దాకా ఆస‌క్తిరేపిన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప‌రిణామాలు, సంఘ‌ట‌న‌ల‌పై రాజ‌కీయ ప‌రిశీలకులు, జ‌య‌శంక‌ర్ తెలంగాణ ప‌రిశోధ‌నాభివృద్ధి కేంద్రం సంచాల‌కులు వి. ప్రకాశ్ విశ్లేష‌ణ 'ఈనాడు ప్రతిభ‌'కు ప్రత్యేకం...
ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఘనంగా హామీ ఇచ్చి, నాన్‌ముల్కీలను వెనక్కి పంపుతున్నామంటూ జారీ చేసిన జీవో 36 అమలు కాలేదు. తెలంగాణ రక్షణలు మళ్లీ గాలిలో దీపాలయ్యాయి. 1969, జనవరి 21న జీవో జారీ అయ్యింది. దీని ప్రకారం నాన్ ముల్కీలను ఫిబ్రవరి 28లోగా ఆంధ్రాకు వెనక్కు పంపేయాలి. కానీ వారంలోపే అంటే జనవరి 27, 28 కల్లా ఆంధ్ర ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. బదిలీ ఉత్తర్వులు చేతికందగానే న్యాయస్థానాల్లో కేసులు వేశారు. ఫిబ్రవరి 17న జీవో 36 అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జీవో 36తో సంబంధం లేకుండా అంతకుముందు వచ్చిన జీవోపై దాఖలైన కేసుల్లో హైకోర్టులో జస్టిస్ చిన్నపరెడ్డి కూడా ముల్కీ నిబంధనలు చెల్లవంటూ తీర్పిచ్చారు. ఫిబ్రవరి 20న (అంటే సుప్రీంకోర్టు స్టే తర్వాత) చిన్నపరెడ్డి తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ పింగళి జగన్మోహన్‌రెడ్డి, ఆవుల సాంబశివరావుల ధర్మాసనం విచారించింది. జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పుతో విభేదిస్తూ ముల్కీ నిబంధనలు చెల్లుతాయని ధర్మాసనం తీర్పిచ్చింది. దీంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి అది తేలేదాకా జీవో 36ను ముట్టుకోవద్దని, బదిలీ ఉత్తర్వులు తీసుకున్నవారంతా కొత్త ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది. అలా జీవో 36 అమలు కాకుండా ఎక్కడివారక్కడే ఉండిపోయారు. ఈ దశలో అప్పటిదాకా తెలంగాణ వద్దు.. రక్షణలు అమలైతే చాలనుకున్న వారి (వర్ధన్నపేట అప్పటి ఎమ్మెల్యే పురుషోత్తంరావు తదితరులు)లోనూ ఆశ నశించింది. రక్షణలు అమలుకావనే ఉద్దేశంతో మార్చి 8న రెడ్డి హాస్టల్‌లో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ (ఇదే తర్వాత తెలంగాణ ప్రజాసమితిగా రూపాంతరం చెందింది) ఆధ్వర్యంలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పురుషోత్తంరావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ (తర్వాత ఈయనకు ఉస్మానియా వీసీ పదవి ఇచ్చారు) ప్రారంభించగా, ఉద్యమనేత సదాలక్ష్మి సారథ్యంలో ఈ సమావేశం జరిగింది. మరుసటి రోజు కూడా మళ్లీ సమావేశం భారీగా జరిగింది. దాదాపు 30 వేల మంది హాజరు కావడంతో రెడ్డి హాస్టల్ కిటకిటలాడింది. రెండో రోజు రాత్రి 2 గంటల దాకా సమావేశం కొనసాగింది. ఈ సమావేశం ఘనవిజయం కావడంతో రాజకీయ నాయకులు కూడా ఉద్యమం వైపు మళ్లడం మొదలుపెట్టారు. ఈ సమావేశంలో తెలంగాణ పటాన్ని ఆవిష్కరించారు. జన్‌సంఘ్, సోషలిస్టు పార్టీల నేతలూ తమ పార్టీలను ధిక్కరించి తెలంగాణకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ వచ్చేదాకా బడులు, కళాశాలలకు వెళ్లవద్దని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఉద్యోగుల్లో కదలిక మొదలైంది. మార్చి 17న తెలంగాణ ఉద్యోగులు పోరాట దినంగా ప్రకటించారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ ఏప్రిల్ 1 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చి 24, 25 నుంచి కళాశాలలు, కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేశారు. వారి డిమాండ్లలో ఇంకా తమకు రక్షణలు కల్పించాలనే తపన తప్ప ప్రత్యేక తెలంగాణ అనే డిమాండ్ కనిపించలేదు.

మారిన మనసులు
     మంత్రులు ఉద్యమంలోని ఆయా జిల్లాల నేతలను పిలిచి మాట్లాడారు. రక్షణల కోసం ఉద్యమం కొనసాగాలే తప్ప ప్రత్యేక రాష్ట్రం దిశగా వెళ్లకుండా చూడాలని సూచించారు. తెలంగాణకు రక్షణలు అమలైతే చాలంటూ 'భావ సమైక్యత ప్రజా సంఘటన' అనే సంస్థను మార్చి 12న స్వామి రామానంద తీర్థ ఆరంభించారు. దీని వెనక బ్రహ్మానందరెడ్డి ఉన్నారనేది ఆరోపణ. ఇంతలో మిగులు నిధులపై ఏర్పాటైన కుమార్ లలిత్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రూ.34.10 కోట్ల నిధులు మళ్లించారని పేర్కొంటూనే ప్రభుత్వం అందించిన సమాచారం పట్ల కుమార్ లలిత్ అసంతృప్తిని, అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ గొడవల మధ్యనే 1969, మార్చి 25న మదన్‌మోహన్ కన్వీనర్‌గా తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్) సంస్థ ఏర్పడింది. 1956 నాటికి తెలంగాణ, ఆంధ్ర కలసి సమైక్యం కావాలని.. విశాలాంధ్ర కావాలని కోరుకున్న కాళోజీ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ దాకా చాలామంది మేధావులు, రాజకీయ నాయకులు, కళాకారులు తదితరులంతా 1969 నాటికి పరిస్థితులను చూసి.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికారు. అప్పటిదాకా రక్షణలు అమలైతే చాలన్న తెలంగాణ ప్రాంతీయ కమిటీ నేత, ఎమ్మెల్యే అచ్యుతరెడ్డి తొలిసారి ప్రత్యేక తెలంగాణ కావాలని నినదించారు. అప్పుడు మంత్రిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీ వెళ్లి.. అస్సాం విషయంలో మేఘాలయకు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్లు తెలంగాణకు ఇవ్వాలని సూచించారు. కానీ ప్రధాని ఇందిరాగాంధీ అందుకు అంగీకరించలేదు. దీంతో మార్చి 28న కొండా లక్ష్మణ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన తొలి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ. తొలుత ఆయన కూడా విశాలాంధ్రవాదే.
     మంత్రులను, వారి ఇళ్లను ఘెరావ్ చేయడంతో ఉద్యమంలో వేడి పెరిగింది. చెన్నారెడ్డి కూడా పరోక్షంగా మద్దతివ్వడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేలు కూడా సమావేశాలు పెట్టుకొని ఆలోచించడం మొదలెట్టారు. రాష్ట్రం అరెస్టులు, నిరసనలు, బాష్పవాయు ప్రయోగాలు, కాల్పులతో నిత్యకృత్యమై అట్టుడికిపోయింది. పరీక్షలు వాయిదాపడ్డాయి. చదువులు అటకెక్కాయి. ఎక్కడ చూసినా ఆందోళనలే. పరిస్థితులు దిగజారడంతో ఏప్రిల్ 9, 10 తేదీల్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కొంతమంది నేతలను చర్చలకు పిలిపించారు. మొదట 9న కేంద్రంలోని అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 10న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితరులతోపాటు ఆంధ్ర నేతలతో చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న నేతలెవరూ ఈ చర్చల్లో లేరు. 11న ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు. చర్చల్లో పాల్గొన్న చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీలతోపాటు ఉద్యోగులు కూడా వీటికి అంగీకరించలేదు. 'ఉద్యమంలో ఉన్నవారితో మాట్లాడకుండా తెలంగాణ కాంగ్రెస్ వారితో మాట్లాడితే సరిపోదు. ఉద్యమం చేస్తున్న వారిని పిలిచి మాట్లాడాల'ని వాజ్‌పేయి తదితరులు ఇందిరాగాంధీకి సూచించారు. అయితే నీలం సంజీవరెడ్డి సూచన మేరకు విపక్షాల మాటలను పక్కనబెట్టి ఆమె 8 సూత్రాలను ప్రకటించారు. వీటికి వ్యతిరేకంగా సదాలక్ష్మి పిలుపు మేరకు ఏప్రిల్ 15న తెలంగాణలో జరిపిన పోరాటదినం విజయవంతమైంది. పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు దీనిపై స్పందించి ఇందిరాగాంధీకి లేఖ రాశారు. ఉద్యమంలో ఉన్నవారితో చర్చలు జరిపితే ఫలితం ఉంటుందంటూ ఆయన కోరారు. 'మీరు మధ్యవర్తిత్వం వహిస్తే ఉద్యమంలో ఉన్నవారితో చర్చించడానికి మేం సిద్ధం' అని ఇందిర ఆయనకు ప్రత్యుత్తరం పంపించారు. కానీ ఉద్యమంలో ఉన్న కీలక నేతలందరినీ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అప్పటికే జైళ్లలో పెట్టింది.

     ఇదంతా జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రోద్బలంతో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక తెలంగాణ వద్దని, రక్షణలు అమలు చేస్తే చాలని ఓ ప్రకటన విడుదల చేశారు. (మళ్లీ వైఎస్ విపక్షనేతగా ఉన్నప్పుడు అదే సంఖ్యలో (41 మంది) ఎమ్మెల్యేలు ప్రత్యేక తెలంగాణ కోసం సంతకాలు చేయడం యాదృచ్ఛికం.) ఏప్రిల్ 16న ఉద్యమ నేతలందరినీ జిల్లాలవారీగా మళ్లీ అరెస్టులు చేశారు. ఇదే సమయంలో 11న ప్రధాని ప్రకటన మేరకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వాంఛూ (మద్రాసు నుంచి ఆంధ్ర వేరుపడినప్పుడు వచ్చింది కూడా ఈయనే) సారథ్యంలో ఏప్రిల్ 19న కమిటీని ఏర్పాటు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ముల్కీ విషయంలో ఏం చేయాలనే అంశంపై రాజ్యాంగాన్ని సవరించడానికి అవకాశం లేదని వాంఛూ స్పష్టం చేశారు. కానీ జిల్లాస్థాయి పోస్టులకు స్థానికంగానే ఉద్యోగ ప్రకటనలిస్తే, ఇతరులకు తెలియకుండా చేయవచ్చని సూచించారు. దీన్ని తెలంగాణ వాదులు అంగీకరించలేదు.

చార్మినార్ నుంచి రాజ్‌భవన్

     మే 1న తెలంగాణ కోర్కెల దినం. వృద్ధాప్యంలో ఉన్న కేవీ రంగారెడ్డి అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 'బానిస బతుక్కంటే చావడం మేలు' అనే అర్థం వచ్చేలా ప్రసంగించారు. నిషేధాజ్ఞల మధ్య చార్మినార్ దగ్గర మొదలైన ఊరేగింపులో అడుగడుగునా జనాలు కలిశారు. రాజ్‌భవన్ వద్దకు వచ్చేసరికి ఊరేగింపు జన సముద్రంగా మారింది. మధ్యలో బాష్పవాయు ప్రయోగాలు, లాఠీఛార్జీలు, కాల్పులు జరుగుతున్నా ప్రజలు ఆగలేదు. చివరకు రాజ్‌భవన్‌లోకి కొంతమంది నాయకులను మాత్రమే అనుమతించారు. లోపల చర్చలు జరుగుతుంటే బయట కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఉద్యమ నేత, సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి సంఘం నేత ఉమేందర్‌రావుతో పాటు మరో ఇద్దరు మరణించారు. దీంతో మళ్లీ బంద్‌లు, ఆందోళనలు పందుకున్నాయి. అరెస్టు చేసిన వారిని నింపడానికి జైళ్లు సరిపోని పరిస్థితి. దీంతో నిజాం, అన్వర్ ఉల్ ఉలూం, కోఠి ఉమెన్స్ కాలేజీలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాటిలోకి అరెస్టయిన వారిని తరలించారు. ఫరీదాబాద్ జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో మే 1 నాటి సంఘటనలను నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యమ నేతలు ప్రధానితో చర్చలకు రావాలంటే జైలు నుంచి విడుదల కావాలని చెప్పారు. అందుకు బ్రహ్మానంద రెడ్డి అంగీకరించలేదు. మే 6న ప్రధానితో చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఉద్యమ నేతలను విడుదల చేయకపోవడంతో ఈ చర్చలు రద్దయ్యాయి. పోలీసు కాల్పులతో చంపుతున్నారనే ఆగ్రహంతో కొంతమంది నాటుబాంబులతో ప్రతి దాడులకు దిగారు. మంత్రుల ఇళ్లు, పోలీసు వ్యాన్లపై బాంబులు విసిరారు. ఫరూక్ అలీ అనే కానిస్టేబుల్ చనిపోయాడు. ఈ బాంబులకు సూత్రధారి సదాలక్ష్మి. ఆమె ఆత్మకథలో కూడా ఈ విషయం రాసుకున్నారు.
 

తొలి పుస్తకం
     తెలంగాణ ఉద్యమంలో మేధావుల పాత్ర కూడా చాలా కీలకం. తమకు జరుగుతున్న అన్యాయాలను కరపత్రాలు, చిన్నచిన్న పుస్తకాల రూపంలో ఉద్యోగులు తీసుకొచ్చారు. ఇతర విషయాల్లో, రంగాల్లో జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ మే 20న వైఎంసీఏలో కళాశాల అధ్యాపకుల సంఘం కన్వీనర్ ఆనందరావు తోట సారథ్యంలో సదస్సు జరిగింది. ఉస్మానియా ఉపకులపతి రావాడ సత్యనారాయణ దీన్ని ఆరంభించారు. జయశంకర్ తదితర 9 మంది మేధావులు తెలంగాణకు సేవారంగం, నీటిపారుదల, బడ్జెట్‌లో వివక్ష, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ నియామకాలు తదితర అంశాల్లో జరిగిన అన్యాయంపై పత్రాలు సమర్పించారు. వీటన్నింటినీ తర్వాత పుస్తకంగా వేశారు. అదే తెలంగాణకు జరిగిన అన్యాయాలపై వచ్చిన తొలి పుస్తకం. ఆ పుస్తకం తెలంగాణలోని చాలామందిలో ఆలోచన రేకెత్తించింది.

ఆనాడూ సకల జనుల సమ్మె
     తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. సమకాలీన ఉద్యమంలో సకల జనుల సమ్మెలాంటిదే 1969లోనూ జరిగింది. మార్చిలోనే ప్రత్యేక తెలంగాణ కోసం తమ అంతర్గత సమావేశంలో టీఎన్‌జీవోలు తీర్మానం చేసినా, మే 7న తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేశారు. దీంతో అంతకుముందు రక్షణల కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నందుకు సస్పెండ్ చేసి జైల్లో పెట్టిన టీఎన్‌జీవో అధ్యక్షుడు ఆమోస్‌ను ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఆగమేఘాల మీద విడిపించారు. ఎందుకంటే ఆమోస్ అయితే కేవలం రక్షణలు కోరతారే తప్ప ప్రత్యేక రాష్ట్రం అనరనే భావనతో. కానీ జైలు నుంచి వచ్చాక ఆమోస్ కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేయడంతో ఆయన్ను ఏకంగా ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగించింది. అంతేకాకుండా టీఎన్‌జీవోకు ప్రభుత్వ గుర్తింపును కూడా రద్దు చేశారు. వీరికి పోటీగా మరికొందరితో టీఎన్‌జీవో సంఘాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేయించారు. ప్రత్యేక రాష్ట్రం వద్దు.. రక్షణలు చాలంటూ ఈ పోటీసంఘం ప్రకటనలు ఇచ్చింది. కానీ అవి అంతగా ప్రభావం చూపలేదు. మొత్తానికి జూన్ 10 నుంచి జులై 16 దాకా (37 రోజులు) ఉద్యోగులు తెలంగాణలో సార్వత్రిక సమ్మె చేశారు. మున్సిపల్, విద్యుత్తు శాఖల నుంచి మొదలైన సమ్మె తర్వాత అన్ని శాఖలకూ పాకింది. విద్యుత్తు ఉద్యోగుల సమ్మె కారణంగా విజయవాడలోనూ అంధకారం ఏర్పడింది. పరిశ్రమలకు ఇబ్బంది ఎదురైంది. అయితే ప్రతి శాఖ విడివిడిగా సమ్మె చేసిందే తప్ప ఇప్పటి మాదిరి అన్ని సంఘాలు, శాఖలను సమన్వయ పరిచే ఐక్య కార్యాచరణ సమితి లేదు. అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చే ప్రయత్నం అప్పట్లో జరగలేదు. తీసుకొచ్చి ఉంటే ఎలా ఉండేదో? మొత్తానికి విద్యార్థుల్లో, రాజకీయ నేతల్లో, టీఎన్‌జీవోల్లో చీలికలు తేవడం ద్వారా ప్రత్యేక ఉద్యమాన్ని నీరుగార్చటానికి బ్రహ్మానందరెడ్డి శతవిధాలా ప్రయత్నించారు. రక్షణలకే ఉద్యమాన్ని పరిమితం చేయాలని చూశారు. కానీ ప్రభుత్వ చిత్తశుద్ధిలోపం, కాల్పులు, కోర్టుల తీర్పులు తదితర పరిణామాలతో రక్షణల కోసం మొదలైన ఉద్యమం కాస్తా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌వైపు వడివడిగా అడుగులేసింది. కార్చిచ్చులా అంటుకుంటున్న ఉద్యమానికి ఓ పెద్దదిక్కులాంటి సారథి లేకపోవడం విశేషం.

మంత్రి పదవి ఇస్తానన్నా...
     1967లో నిజామాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికైన నారాయణరెడ్డి తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలందరినీ సమన్వయం చేసేవారు. పంజాబ్‌లో మాదిరిగా పార్లమెంటరీ కమిటీ తెలంగాణలో పర్యటించాలని కూడా నారాయణరెడ్డి ప్రతిపాదించారు. పదేపదే తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇబ్బంది సృష్టిస్తుండటంతో కాంగ్రెస్‌లో చేరితే కేంద్రంలో మంత్రిపదవి ఇస్తానంటూ ఇందిరాగాంధీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ద్వారా సమాచారం పంపించారు. కానీ నారాయణరెడ్డి అందుకు ససేమిరా అని, తెలంగాణ కోసం నిలబడ్డారు. ఒక దశలో సోషలిస్టు నేత మధులిమాయె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిపై పార్లమెంటులో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా నారాయణరెడ్డే కారణం.

తెలంగాణకు ఆంధ్ర నేతల మద్దతు
     ఆంధ్ర మాజీ ఎమ్మెల్యే కొరపాటి పట్టాభిరామయ్య అసెంబ్లీ ముందు తెలంగాణ ఇవ్వాలంటూ దీక్ష చేశారు. తెలంగాణకు అన్యాయం చేశాం.. ఒప్పందాలను ఉల్లంఘించాం.. వారి డిమాండ్‌లో న్యాయం ఉందంటూ తెలంగాణకు మద్దతు పలికారు. అరెస్టు చేసి ఆస్పత్రికి తీసుకు వెళ్లినా ఆయన దీక్ష కొనసాగించారు. దీంతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయనపై ప్రభుత్వం కేసు పెట్టింది.
     మార్చి 17న ముల్కీ నిబంధనలపై పార్లమెంటులో చర్చకు రాగా.. ఆంధ్ర నేత, అప్పటి సోషలిస్టు పార్టీ ఎంపీ ఎన్‌జీ రంగా తెలంగాణకు మద్దతుగా ప్రసంగించారు. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టాన్ని మళ్లీ కొనసాగిస్తూ పొడిగించే బదులు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మేలు.. హిందీ మాట్లాడేవారికి నాలుగు రాష్ట్రాలున్నప్పుడు తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని రంగా చాలా బలంగా వాదించారు. తెలంగాణ ఎంపీల కంటే బలంగా ఆయన మాట్లాడటం విశేషం.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌