• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక సంస్కరణలు - తెలంగాణలో ప్ర‌భావం

సంస్కరణలు సృష్టించిన సంక్షోభం!

  దేశ గతిని మార్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు తొలినాళ్లలో తెలంగాణలో ప్రతికూల ఫలితాలనిచ్చాయి. హైదరాబాద్‌ మినహా మిగతా ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యోగ రంగాల్లో సంక్షోభం తలెత్తింది. పేదలు, కార్మికులు కష్టాలపాలయ్యారు. విద్యుత్తు సంస్కరణలపై ప్రజల్లో పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. వేగంగా అమలైన ఆర్థిక సంస్కరణలు అసమానతలను పెంచాయి. ఆ దశకంలో చోటుచేసుకున్న పరిణామాలను అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాలి.

 

   దేశవ్యాప్తంగా 1991లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు వల్ల వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణలో ఉద్యోగ, వ్యవసాయ రంగాల్లో సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. అందుకు కారణం ప్రాంతీయ వివక్ష అనే భావన ఇక్కడి ప్రజల్లో వ్యక్తమైంది. 

  స్వతంత్య్ర భారతదేశంలో 1991 వరకు సామ్యవాద తరహా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాలు అమలయ్యాయి. ఆ వ్యవస్థలో ఆర్థిక వనరులు, ఉత్పత్తి సాధనాల యాజమాన్యం, నియంత్రణ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. దీంతో 1991 వరకు దేశంలో పారిశ్రామిక, ఆర్థిక విధానాలన్నీ ప్రభుత్వరంగ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. 1990 దశకంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కమ్యూనిస్టు దేశాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరళీకృత, ప్రైవేటీకరణ ఆర్థిక విధానాల వైపు మొగ్గు చూపింది. ఫలితంగా 1991, జులై 24న నూతన ఆర్థిక విధానాన్ని ప్రకటించింది. ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం త్వరితగతిన ఆర్థికవృద్ధి సాధించడం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) విధానాలు సామ్యవాద సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమైనవి. అవి దేశ ఆర్థికవృద్ధికి దోహదపడినప్పటికీ పేదవర్గాలు, వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కొంతమంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

 

నూతన పారిశ్రామిక విధానం

* డీలైసెన్సింగ్‌ విధానం: లైసెన్సుల సరళీకరణ ద్వారా శాసనపరమైన, పాలనాపరమైన నియంత్రణలు తొలగించడం.

* ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను అనుసంధానించడం.

* అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకోవడం.

* నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను (పీఎస్‌యూ) ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం. దీని ద్వారా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం.

* ప్రభుత్వ సంస్థలకు మాత్రమే కేటాయించిన ఉత్పత్తులను ప్రైవేటు సంస్థలకూ అనుమతించడం.

దేశంలో 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను నాటి పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారు. కానీ ఆ సంస్కరణల  వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగాయనే భావన తెలంగాణలో ఏర్పడింది. 

 

సరళీకరణ విధానాల ప్రభావం

  మిశ్రమ ఆర్థిక విధానం, సంక్షేమ రాజ్యం అనే భావనలకు వ్యతిరేకంగా మార్కెట్‌ ఆర్థిక విధానం, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు వచ్చాయి. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం చేసే కేటాయింపులు తగ్గించడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. ఆర్థిక సంక్షోభంలో పడిన అప్పటి రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదా పూర్తిగా మూసివేయడం వంటి విధానాల వల్ల ఆ సంస్థల్లో పనిచేసే శ్రామికులు రోడ్డున పడ్డారు. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల పనితీరు మెరుగై లాభాల బాట పట్టినప్పటికీ, శ్రామికులకు ఏ మాత్రం మేలు చేకూరలేదు. 

  నూతన ఆర్థిక సంస్కరణలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి పారిశ్రామిక, సేవారంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. దీంతో వ్యవసాయ రంగంపై ఆధారపడిన తెలంగాణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసలే అష్టకష్టాలతో వ్యవసాయాన్ని నెట్టుకొస్తున్న  తెలంగాణ రైతులపై ఈ ఆర్థిక సంస్కరణలు గోరు చుట్టుపై రోకటిపోటులా మారాయి. సేవా రంగంలో హైదరాబాద్‌ గణనీయమైన అభివృద్ధి సాధించినప్పటికీ, తెలంగాణ విద్యావంతులకు తగిన అవకాశాలు అందలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.  తెలంగాణ ప్రాంతంలో నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణుల కొరత కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోవడానికి కారణంగా మారింది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రైవేటు పెట్టుబడులు కేంద్రీకృతం కావడంతో తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలు ప్రగతికి నోచుకోలేదు. ఫలితంగా హైదరాబాద్‌ మినహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగాయి. ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభ దశలో ఆంధ్ర ప్రాంతంలో దారిద్య్రరేఖ (బీపీఎల్‌) దిగువనున్న వారి శాతం తక్కువగా ఉండగా, తెలంగాణలో దారిద్య్రరేఖ దిగువన నివసించే వారి శాతం అధికంగా ఉండేది. తెలంగాణలోని 5 జిల్లాల్లో 10 శాతం మించి జనాభా దారిద్య్రరేఖ దిగువన ఉంటే కోస్తాంధ్రా ప్రాంతంలో 2 జిల్లాల్లో మాత్రమే 10 శాతానికి మించి దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు.

  తెలంగాణ ప్రాంతంలో దళిత, గిరిజన జనాభా అధికంగా ఉండటం వల్ల వారిలో ఎక్కువ శాతం బీపీఎల్‌ దిగువన ఉండి సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడ్డారు. వీరికి సంస్కరణల ఫలితాలు ఏమాత్రం మేలు చేయకపోగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో సెజ్‌ల ఏర్పాటు వల్ల ఈ వర్గాలకు చెందిన చిన్నకారు, ఉపాంత రైతులు, తమ భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. ఆర్థిక సంస్కరణల అమలు కాలంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెలంగాణాయేతరులు పెట్టడంతో ఉద్యోగాలూ ఆ ప్రాంతాల వారికే వచ్చాయి. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో హైదరాబాదు చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించలేదు. 

 

ప్రైవేటీకరణతో..

విద్య, ఆరోగ్యాల్లో ప్రైవేటు రంగం ప్రభావం ఎక్కువ కావడంతో తెలంగాణ ప్రాంత పేద ప్రజలు విద్యకు దూరమయ్యారు. ముఖ్యంగా ఉన్నత విద్య, వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందలేదు.  ఆర్థిక సంస్కరణల అమలు కాలంలో ప్రభుత్వ పథకాలు, విధానాల వల్ల వ్యవసాయ సంక్షోభం తలెత్తింది. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేతివృత్తులు బాగా దెబ్బతిన్నాయి.నాటి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి విద్యుత్తు, ఉన్నతవిద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించే ఉద్దేశంతో తగిన సూచనలు చేయడానికి అనేక కమిటీలను నియమించింది.

 

హితేన్‌ భయ్యా కమిటీ:  ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు సంస్కరణలపై సూచనలు చేయడానికి అప్పటి ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఇది  రాష్ట్ర విద్యుత్తు మండలిని ప్రైవేటీకరించి, దాన్ని మూడు విభాగాలుగా వేరు చేయాలని సూచించింది. ఫలితంగా విద్యుత్తు ఉత్పత్తి (ఏపీజెన్‌కో), విద్యుత్తు ట్రాన్స్‌మిషన్‌ (ఏపీట్రాన్స్‌కో), విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏర్పాటయ్యాయి. విద్యుత్తు సరఫరాలో రాయితీలు తొలగించాలని, ఛార్జీలను సాలీనా 15-20 శాతానికి పెంచాలని కూడా ఈ కమిటీ  సూచించింది. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఛలో అసెంబ్లీ ఊరేగింపు చేయగా హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. హితేన్‌ భయ్యా కమిటీ సూచనల మేరకు విద్యుత్తు సంస్కరణలు అమలుచేయడంతో భూగర్భ జలాలపై ఆధారపడిన అనేకమంది తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

 

గంగోపాధ్యాయ కమిటీ: ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య, వారి జీతభత్యాలు, పింఛన్లను తగ్గించి ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించేందుకు సూచనలు చేయాలని నాటి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సిబ్బందిలో అదనంగా ఉన్న వారిని సాలీనా 0.9 శాతం తగ్గించాలని కమిటీ సూచించింది. దీనివల్ల ఉద్యోగం తప్ప మరో ఆధారం లేని తెలంగాణలో నిరుద్యోగిత మరింతగా పెరిగింది. 

 

కోనేరు రామకృష్ణారావు కమిటీ: ఉన్నత విద్య ప్రైవేటీకరణపై సూచనలు చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ పాత్ర తగ్గించి, నాణ్యమైన విద్య అందించేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ఉన్నత విద్య కావాలనుకునేవారు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి పొందాలని పేర్కొంది. దాంతో ఉన్నత విద్య ఒక రకంగా వాణిజ్య సరుకుగా మారిపోయింది. దానికి అనుగుణంగానే 1996-97 తర్వాత చాలా వరకు ఉన్నత విద్యకు సంబంధించి, ముఖ్యంగా వృత్తివిద్య, సాంకేతిక విద్యాసంస్థలు ప్రైవేటు రంగంలోనే ఏర్పాటయ్యాయి. దాని వల్ల తెలంగాణలోని పేద ప్రజలు ఉన్నతవిద్యకు దూరమయ్యారు. 

 

సుబ్రమణ్యం కమిటీ: ఇది నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడానికి సంబంధించిన కమిటీ. దీని  సూచనల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది. ఉదా: ఆల్విన్‌ కంపెనీ, ఏపీ స్కూటర్స్‌ కంపెనీ, నిజాం షుగర్స్‌ మొదలైనవి.

  ఆ విధంగా ఆర్థిక, విద్యుత్తు సంస్కరణల వల్ల వ్యవసాయరంగం దెబ్బతింది. చేతివృత్తులు క్రమంగా కనుమరుగయ్యాయి. వాటిపై ఆధారపడిన వారంతా బతుకు తెరువు కోసం నగరాలకు వలస వెళ్లి దుర్భర జీవితాలు గడపాల్సి వచ్చింది. 

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌