• facebook
  • whatsapp
  • telegram

తెరాస పార్టీ ఆవిర్భావం - ప్రారంభ సదస్సులు - సమావేశాలు

సాధన సంకల్పం.. సమితిగా.. సమరంగా!

 

అన్నదాతలపై పడిన అప్పుల భారాన్ని ఒక గళం ప్రస్తావించింది. అప్పటికే అదే పథంలో సాగుతున్న కొందరు మేధావులు తమ గొంతులు కలిపారు. మథనం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం దృఢమైంది. ఆ సంకల్పంలో నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లోకి విస్తరించింది. జరుగుతున్న అన్యాయాలపై గర్జించింది. పల్లెబాట పట్టింది. చలో దిల్లీ అంటూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను దేశ రాజధానికి చేర్చింది. జన జైత్రయాత్రగా మారింది. పాదయాత్రలతో సాగునీటి కోసం సమరాలు చేసింది. పొలికేకలతో మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంలో అతి కీలకమైన తెరాస ఏర్పాటు, నేపథ్యం, తదనంతరం చేపట్టిన కార్యక్రమాలు, పోరాటాల గురించి అభ్యర్థులు అదే క్రమంలో తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి.


ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనల నాటి నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదన చాప కింద నీరులా విస్తరించింది. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠంగా అమలు చేయడం వెనుకబడిన తెలంగాణ ప్రాంతంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. ప్రధానంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో పారిశ్రామికీకరణ పేరుతో పేద రైతులు తమ వ్యవసాయ భూములను కోల్పోయి, సొంత భూముల్లోనే వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. హైదరాబాదు నగర విస్తరణ, పారిశ్రామికీకరణ, నగరీకరణ పనుల కోసం తెలంగాణ ప్రాంతంలోని నదులు, వాగుల్లోని ఇసుకను విచక్షణారహితంగా తవ్వి తరలించారు. ఫలితంగా భూగర్భ జలాలు పాతాళానికి చేరి వ్యవసాయం కుంటుపడింది. నిర్మాణ పనులకు కావాల్సిన ఇటుక తయారీకి హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లోని పంట పొలాలు ఇటుక బట్టీలుగా మారాయి. ప్రైవేటీకరణతో ఇక్కడి ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. ప్రపంచీకరణ ఫలితంగా గ్రామాల్లోని చేతివృత్తుల వారు జీవనోపాధిని కోల్పోయి పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వ్యవసాయ పనులు లేక కూలీలు, ఉపాంత, సన్నకారు రైతులు కూడా ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ నగరాల బాట పట్టారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు రంగ సంస్థ (APSEB)ను మూడుగా విభజించి ప్రైవేటీకరించడంతో వ్యవసాయ విద్యుత్తు పంపుసెట్లు ఎక్కువగా ఉన్న తెలంగాణలోని పేద రైతులపై ఆర్థిక భారం పడింది. ఈ నేపథ్యంలో 1997 మార్చిలో భువనగిరి సభ, 1997 ఆగస్టులో సూర్యాపేట మహాసభ, ఆ తర్వాత 1997, డిసెంబరులో వరంగల్‌ సభ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను విస్తృతం చేశాయి.

 


2000 సంవత్సరంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన విద్యుత్తు సంస్కరణలతో తెలంగాణ రైతులపై ఛార్జీల భారం గణనీయంగా పెరిగింది. దీంతో అత్యధికంగా భూగర్భ జలాలపై ఆధారపడిన రైతులకు పంపుసెట్ల నిర్వహణ భారమై అప్పులఊబిలో ఇరుక్కుపోయారు. ఈ పరిస్థితుల్లో నాటి రాష్ట్ర విధానసభ డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న రాష్ట్ర మాజీ రవాణా శాఖ మంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) విద్యుత్తు ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దాని ప్రతిని వార్తాపత్రికలకు విడుదల చేశారు. ఈ సంఘటనతో నాటి తెలంగాణ మేధావులు, తెలంగాణ ఐక్యవేదిక స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ నేతృత్వంలో కేసీఆర్‌ను కలిశారు. 1956 నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. స్పందించిన కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయాలనే దృఢ సంకల్పంతో 2001, ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీని స్థాపించారు. అదే రోజున తన డిప్యూటీ స్పీకర్‌ పదవికి, అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట విధాన సభ సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సాధనే తన లక్ష్యమని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని అప్పటికే తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా కొనసాగుతున్న కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసమైన జలదృశ్యంలోనే ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ ఐక్యవేదిక టీఆర్‌ఎస్‌లో విలీనమైంది.


టీఆర్‌ఎస్‌ ఏర్పాటుకు ముందు కేసీఆర్‌ తెలంగాణ సమస్యపై తెలంగాణలోని రాజకీయ పార్టీలతో సహా, తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థి, న్యాయవాద, వైద్య సంఘాల నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పార్టీని స్థాపించారు. 2001 మే 4న పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2001, మే 5న కేసీఆర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఈ సమావేశం ‘ఫోరం ఫర్‌ తెలంగాణ’ అనే సంస్థ, ప్రొఫెసర్‌ మధుసూదన్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో జరిగింది.


2001, మే 11న తెలంగాణ ప్రాంతమంతా గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏకకాలంలో తెలంగాణ జెండా ఆవిష్కృతమైంది. ఈ సభల్లో స్థానిక నాయకులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించి, పార్టీని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు విస్తరింపజేశారు. 

 

కరీంనగర్‌ సింహగర్జన

తెలంగాణ మలి ఉద్యమ కాలంలో నిర్వహించిన మొదటి భారీ బహిరంగ సభ ఇది. కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగింది. గొట్టె భూపతి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా నాయకుడు శిబు సోరెన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సింహగర్జన సభలో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తన ప్రసంగంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. కరీంనగర్‌ సభ స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ పలు జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించింది. అవి 


* 2001, జూన్‌ 1న - మహబూబ్‌నగర్‌ 

* 2001 జూన్‌ 2న - నల్గొండ

* 2001 జూన్‌ 4న - నిజామాబాద్‌ 

* 2001 జూన్‌ 5న - నిర్మల్‌ 

* 2001 జూన్‌ 21న - వరంగల్‌


ఈ భారీ బహిరంగ సభల్లో కేసీఆర్, ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలిసి తెలంగాణకు అప్పట్లో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలు, దోపిడీలను వివరించి ప్రజలను ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం వైపు కార్యోన్ముఖులను చేశారు. ఈ బహిరంగ మహాసభలన్నీ విజయవంతమవడంతో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. దేవాదుల ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రకటించి, శంకుస్థాపన చేశారు. దాన్ని యుద్ధప్రాతిపదికన 18 నెలల కాలంలోనే పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. తద్వారా తెలంగాణలో నీటి పారుదలను పెంపొందించి, తెలంగాణ ప్రజలను కొంతవరకు సంతృప్తి పరచాలని భావించారు.


అనంతరం 2001, జులైలో నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాగలి చిహ్నంతో పోటీ చేసి 87 జడ్పీటీసీ స్థానాలు, దాదాపు వెయ్యికి పైగా ఎంపీటీసీ స్థానాలు, 84 మండలాధ్యక్ష పదవులు, 2 జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవులను గెలుచుకుంది. ఆ తర్వాత 2001, ఆగస్టులో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 3 వేల సర్పంచ్‌ పదవులు, 12 వేలకు పైగా వార్డు సభ్యులను గెలుచుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆంకాక్షను తెలియజేశాయి.


స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత 2001, ఆగస్టు 18న టీఆర్‌ఎస్‌ పార్టీ భారత ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొని రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. కేసీఆర్‌ రాజీనామా చేసిన సిద్ధిపేట విధాన సభ స్థానానికి 2001, సెప్టెంబరు 22న జరిగిన ఉపఎన్నికలో ఆయన భారీ మెజారిటీతో మళ్లీ గెలుపొందారు.


2002, ఏప్రిల్‌ 27న నల్గొండలో టీఆర్‌ఎస్‌ పార్టీ తన మొదటి వార్షికోత్సవ సభను నిర్వహించింది. ఈ సభకు ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా నాయకుడు శిబు సోరెన్‌తో పాటు రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు అజిత్‌సింగ్‌ హాజరయ్యారు.

 

తెలంగాణ సాధన సమితి

భారతీయ జనతా పార్టీకి చెందిన ఆలె నరేంద్ర 2001, సెప్టెంబరు 19న తెలంగాణ సాధన సమితిని స్థాపించారు. దీని లక్ష్యం కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడమే. అప్పటివరకు తెలంగాణ ముక్తి మోర్చా అధ్యక్షుడైన మాచినేని కిషన్‌ రావు, మాజీ మంత్రి సమరసింహారెడ్డి తెలంగాణ సాధన సమితిలో చేరారు. అలంపూర్‌ అప్పటి శాసనసభ సభ్యుడు రవీంద్రనాథ్‌ రెడ్డి పూర్తి మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ సాధన సమితి రెండింటి లక్ష్యం ప్రత్యేక తెలంగాణ పోరాటమే కావడం వల్ల తెలంగాణ సాధన సమితి 2002, ఆగస్టు 11న టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. ఆలె నరేంద్ర టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.


తొలి పల్లె బాట: గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి 2002, సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 7 వరకు 15 రోజుల పాటు టీఆర్‌ఎస్‌ తొలి పల్లెబాట కార్యక్రమం చేపట్టింది. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించింది.


జల సాధన ఉద్యమం:  తెలంగాణ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అన్యాయాలను నిరసిస్తూ 2002, డిసెంబరు 25 నుంచి 2003, జనవరి 5 వరకు ఉద్యమాన్ని టీఆర్‌ఎస్‌ విజయవంతంగా కొనసాగించింది. జనవరి 5న తెలంగాణ బంద్‌ కూడా నిర్వహించింది.


తెలంగాణ గర్జన సభ: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో 2003, జనవరి 6న భారీగా తెలంగాణ గర్జన సభను టీఆర్‌ఎస్‌ నిర్వహించింది. ఈ సభకు ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా నాయకుడు శిబు సోరెన్‌తో పాటు నర్మదా బచావో ఆందోళన్, నేషనల్‌ అలయన్స్‌ ఫర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ నాయకురాలు మేధా పాట్కర్, లోక్‌ జనశక్తి పార్టీ నాయకుడు, నాటి కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ హాజరయ్యారు. సభలో తెలంగాణకు జరిగే అన్యాయాలపై నాయకులు ప్రసంగిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.


దిల్లీ చలో కార్ల యాత్ర (ర్యాలీ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గళాన్ని దేశ రాజధాని దిల్లీలో ప్రతిధ్వనింపజేసేందుకు దాదాపు వెయ్యి కార్లతో కేసీఆర్‌ నాయకత్వంలో ర్యాలీ  చేశారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ర్యాలీ విదర్భ, నాగ్‌పుర్, గ్వాలియర్‌ మార్గంలో పయనించి దిల్లీకి చేరుకుంది. అక్కడ ఒక బహిరంగ సభను రాంలీలా మైదానంలో రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కేసీఆర్‌ వివరించారు. ఆ ప్రసంగాలను దిల్లీ వార్తా పత్రికలు ప్రచురించడంతో తెలంగాణవాదం దిల్లీకి పాకింది.


వరంగల్‌ జైత్రయాత్ర: టీఆర్‌ఎస్‌ రెండో వార్షిక సభను వరంగల్‌లోని హన్మకొండలో భారీగా నిర్వహించారు. ఈ సభకు కేసీఆర్‌ సిద్ధిపేట నుంచి హన్మకొండకు సైకిల్‌ ర్యాలీ ద్వారా చేరుకున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాది మంది హాజరయ్యారు. ముఖ్య అతిథిగా భారతదేశ మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడతో పాటు రాష్ట్రీయ లోక్‌దళ్‌ నాయకుడు అజిత్‌సింగ్, విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు బన్వర్‌లాల్‌ పురోహిత్, బుందేల్‌ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు బాబులాల్‌ తివారీ హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు.


కేసీఆర్‌ పాదయాత్రలు: * కేసీఆర్‌ తన మొదటి పాదయాత్రను 2003, జులై 20 నుంచి 25వ తేదీ వరకు అలంపూర్‌ నుంచి గద్వాల్‌ వరకు నిర్వహించారు. ఈ పాదయాత్ర లక్ష్యం రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌కు చెందిన రాయలసీమకు సాగు నీరు కల్పించే కాలువను మూసివేసి, పూర్తి జలాలను మహబూబ్‌నగర్‌ జిల్లాకు మళ్లించాలని డిమాండ్‌ చేయడం.* రెండో పాదయాత్రను 2003, ఆగస్టు 25 నుంచి 30వ తేదీ వరకు కోదాడ నుంచి హాలియా వరకు నిర్వహించి, నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింది రైతుల సమస్యలపై చర్చించారు.


తెలంగాణ పొలికేక: 2003, జూన్‌ 14న హైదరాబాద్‌ నిజాం కాలేజీ క్రీడా మైదానంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన తెలంగాణ ఐక్య వేదికకు ఆలె నరేంద్ర అధ్యక్షత వహించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై వక్తలు ప్రసంగించారు. 


కేసీఆర్‌ పల్లెబాట: ఈ కార్యక్రమాన్ని కేసీఆర్‌ 2003, అక్టోబరు 22న నాటి వరంగల్‌ జిల్లా మేడారం నుంచి ప్రారంభించి కొనసాగించారు.


2003 సింహగర్జన సభలు: 2003, నవంబరు - డిసెంబరు నెలల్లో సింహగర్జన సభలను వరుసగా సంగారెడ్డి, పాలమూరు (మహబూబ్‌నగర్‌), నిజామాబాద్, వరంగల్, సిరిసిల్లల్లో నిర్వహించి తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని కొనసాగించారు.


నోట్‌: తెలంగాణ మలి ఉద్యమ కాలంలో జరిగిన ఈ సభలు, సమావేశాలపై ప్రశ్నలు కాలక్రమానుసారం (Chronological Order) పై ఉంటాయని అభ్యర్థులు గమనించి, గుర్తుంచుకోవాలి.

- రచయిత: ఎ.ఎం.రెడ్డి

Posted Date : 14-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌