• facebook
  • whatsapp
  • telegram

 శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు

 రెండు భాగాలు.. ఆరు మార్గాలు!

నాడు తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం భిన్నమైన ప్రకటనలు చేయడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఆందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు సమైక్యాంధ్ర కొనసాగింపు పోరాటం జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాజకీయ పక్షాలతో సమాలోచనలు చేసింది. పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కార్యాచరణ ప్రణాళికను సూచించమని కోరింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి ముఖ్యమైన ఈ పరిణామాన్ని అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. ఆ కమిటీ సభ్యులు, పనితీరు వివరాలు, విశ్లేషణలతోపాటు నివేదిక రూపొందించిన విధానం, అందులో పేర్కొన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 

 


మలి పోరాట కాలంలో 2009లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యమకారుల బలవన్మరణాలతో పాటు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 2009, డిసెంబరు 9న నాటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే సీమాంధ్ర ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అక్కడి శాసనసభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దాంతో కేంద్రం డిసెంబరు 23న మరో ప్రకటన చేసింది. అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపుల ప్రజలతో విస్తృత సలహా సంప్రదింపులు జరిపిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొంది. తెలంగాణ ఉద్యమకారులు నిశ్చేష్టులయ్యారు. తక్షణం తేరుకుని ఉద్యమాన్ని ప్రజాఉద్యమంగా బలోపేతం చేయాలని 2009, డిసెంబరు 24న ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కన్వీనర్‌గా తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ (టి.పి.జాక్‌)ని ఏర్పాటు చేశారు.


ఈ ఐక్యకార్యాచరణ కమిటీ తెలంగాణ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్నివర్గాల ప్రజలను ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఫలితంగా అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈ సమస్యపై చర్చించేందుకు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని 2010, జనవరి 5న దిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు సభ్యులను ఆహ్వానించారు. ఆ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీఆర్‌ఎస్‌ (నేటి భారాస), బీజేపీ, సీపీ‡ఐ పార్టీలు తెలంగాణ అంశంపై వేరే సంప్రదింపులు అక్కర్లేదని, ముందు ప్రకటించిన ప్రకారమే రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రారంభించాలని కోరాయి. కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం, పీఆర్‌పీ ఆ దశలో విస్తృత సంప్రదింపులు అవసరమని చెప్పాయి. టీడీపీ ప్రతినిధుల్లో ఒకరు సంప్రదింపులను బలపరచగా, మరొకరు ప్రత్యేక రాష్ట్రానికి సంపూర్ణ అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశానికి ప్రాధాన్యాన్నిస్తూ సంయమనం పాటించాలని ప్రజలను అన్ని పార్టీల నాయకులు కోరారు.


ఈ సమావేశానికి పార్టీలవారీగా హాజరైన నాయకులు: 1) కాంగ్రెస్‌ - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (తెలంగాణ) - కావూరి సాంబశివరావు (సీమాంధ్ర) 2) బీజేపీ - బండారు దత్తాత్రేయ (తెలంగాణ) - కె.హరిబాబు (సీమాంధ్ర) 3) టీడీపీ - రేవూరి ప్రకాశ్‌రెడ్డి (తెలంగాణ) - యనమల రామకృష్ణుడు (సీమాంధ్ర) 4) టీఆర్‌ఎస్‌ - కె.చంద్రశేఖర్‌రావు, ప్రొ.జయశంకర్‌ (తెలంగాణ) 5) ఎంఐఎం - అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీ (తెలంగాణ) 6) ప్రజారాజ్యం - చిరంజీవి, సి.రామచంద్రయ్య (సీమాంధ్ర) 7) సీపీఐ - గుండా మల్లేష్‌ (తెలంగాణ) - కె.నారాయణ (సీమాంధ్ర) 8) సీపీఐ(ఎం) - జూలకంటి రంగారెడ్డి (తెలంగాణ) - బి.వి.రాఘవులు (సీమాంధ్ర)

ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుందని కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. తర్వాత బి.ఎన్‌.శ్రీకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. 


కమిటీ ఏర్పాటు: కేంద్రం 2010, ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ అధ్యక్షుడిగా మరో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులపై సంప్రదింపులు జరిపే కమిటీగా పేర్కొంది (‘కమిటీ ఫర్‌ కన్సల్టేషన్‌ ఆన్‌ ది సిచ్యుయేషన్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’). ఈ కమిటీ తన నివేదికను 2010, డిసెంబరు 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.


అధ్యక్షుడు: జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ - మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి


సభ్య కార్యదర్శి: వినోద్‌కుమార్‌ దుగ్గల్, ఐఏఎస్‌ (విశ్రాంత), కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి


సభ్యులు:

 * ప్రొఫెసర్‌ డాక్టర్‌ రణబీర్‌ సింగ్‌ - వైస్‌ ఛాన్సలర్, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, దిల్లీ


* డాక్టర్‌ అబుసలే షరీఫ్‌ - చీఫ్‌ ఎకనామిస్ట్‌/ సీనియర్‌ ఫెలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రిసెర్చ్, దిల్లీ


* ప్రొఫెసర్‌ (డాక్టర్‌) రవీందర్‌ కౌర్‌ - హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ శాఖ, ఐఐటి, దిల్లీ


లక్ష్యం: ఈ కమిటీ ప్రధాన లక్ష్యం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రాజకీయ పార్టీలు, వివిధవర్గాల ప్రజలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి రాష్ట్ర విభజనపై అందరికీ ఆమోదయోగ్యమైన నివేదికను సమర్పించడం.


నోట్‌: అభ్యర్థులు ఈ కమిటీని రాష్ట్ర విభజన కోసం నియమించిన కమిటీగా భావించకూడదు.


శ్రీకృష్ణ కమిటీ తమకు అప్పగించిన అంశాలను అధ్యయనం చేయడానికి కొన్ని పద్ధతులను అనుసరించింది.


1) ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానిస్తూ జాతీయ, ప్రాంతీయ ప్రింట్‌ మీడియాలో పబ్లిక్‌ నోటీసులు ఇవ్వడం.


2) వివిధ రాజకీయ పార్టీలతో, కమిటీ గుర్తించిన ఇతర సంస్థలతో చర్చలు జరపడం.


3) కొన్ని కీలకమైన అంశాలపై విశ్లేషణ కోసం ప్రసిద్ధ నిపుణులు, సంస్థలను ఎంపిక చేసి వారికి బాధ్యతలు అప్పగించడం.


4) క్షేత్రస్థాయిలో సమస్యలు కనుక్కోవడానికి జిల్లాలు, గ్రామాల్లో పర్యటించడం.


5) మేధావులు, సీనియర్‌ రాజకీయ నేతలు, విశ్రాంత బ్యూరోక్రాట్లు, న్యాయ నిపుణులను కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరపడం.


6) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్రం నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించడం.


7) సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, మదింపు చేసి ఒక అంచనాకు రావడం.


8) విస్తృత అధ్యయనం, సంప్రదింపుల అనంతరం కమిటీ కాలపరిమితి పూర్తయ్యే ముందు నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించడం.


అభిప్రాయాల సేకరణలో భాగంగా కమిటీ అనేక రాజకీయ పార్టీలు, వివిధ గ్రూపులతో, స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలపై సంప్రదింపులు జరిపింది. కమిటీ ముందున్న అంశాల్లో కొన్ని చాలా సంక్లిష్టమైనవి, సాంకేతికపరమైనవి కూడా ఉన్నాయి. అలాంటి వాటి అధ్యయనాలను నిపుణులతో చేయించాలని కమిటీ నిర్ణయించింది.


1) ఆంధ్రప్రదేశ్‌లో జలవనరులు, సాగునీటి అంశాలకు సంబంధించిన అధ్యయనాన్ని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎ.వి.మోహిలీకి అప్పగించింది.


2) ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు రంగానికి సంబంధించిన అధ్యయనాన్ని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బి.వి.గుప్తాకు అప్పగించింది. 


3) ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో వివక్ష ఉందా? అనే అంశంపై అధ్యయనాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రెగ్యులేషన్‌ అండ్‌ కాంపిటీషన్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ముఖేష్‌ కె.ఖర్‌కు అప్పగించింది.


క్షేత్రస్థాయి పర్యటనలు: నాటి రాష్ట్రంలో ఉన్న మొత్తం 23 జిల్లాల్లోని పల్లెలు, పట్టణ ప్రాంతాలను కమిటీ సభ్యులు సందర్శించారు. వీరికి వివిధ పార్టీలు, సంస్థలు సహకారం అందించాయి. ఈ పర్యటనలతో అందిన సమాచారం కమిటీకి ఎంతో తోడ్పడింది.


ఈ కమిటీ తన నివేదికలో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాదు రాజ్యం భారతదేశంలో విలీనమై, దేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడటంతో ప్రారంభించి 2010 వరకు అన్ని పరిస్థితులను నివేదికలో పొందుపరిచింది. 1953-55 నాటి ఎస్సార్సీ నివేదిక, 1956 పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ఆ తర్వాత పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం, వివిధ ప్రాంతాల్లో విద్యాస్థాయుల్లో ఉన్న తేడాలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, సరైన నీటి వాటాను కేటాయించకపోవడం, తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం లాంటి అంశాల కారణంగా మొదలైన 1969 తొలి తెలంగాణ ఉద్యమం, మలి ఉద్యమ కాలంలో 2010 వరకు జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పరిణామాలన్నీ అందులో ఉన్నాయి. మొత్తంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం ఎంత ఉందో, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరం కూడా అంతే ఉందని ఈ అధ్యయనం తేల్చింది. రాయలసీమ ప్రాంతం, మరికొన్ని ప్రాంతాల వెనకబాటుతనాన్ని కూడా కమిటీ పరిగణలోకి తీసుకుంది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే వాదనకే కమిటీ మొగ్గు చూపింది. అయితే తెలంగాణ చరిత్ర, ప్రస్తుత ఆందోళనలను పరిశీలిస్తే విడిపోవాలనే కోరిక కూడా హేతుబద్ధమైనదని భావించింది.


శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను రెండు భాగాల్లో రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మొదటి భాగం వివిధ అధ్యయనాలు, ప్రతిపాదనలు, ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించింది, రెండో భాగం వివిధ వివరాలకు సంబంధించిన అనుబంధాలను పేర్కొంటుంది. ఈ నివేదిక మొదటి భాగంలో 9 అధ్యాయాలు (చాప్టర్లు) ఉన్నాయి. 1) ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు - చారిత్రక నేపథ్యం 2) ప్రాంతీయ ఆర్థిక - సమానతల విశ్లేషణ 3) విద్య, ఆరోగ్యం 4) నీటివనరులు, సాగునీటిపారుదల, విద్యుత్తు అభివృద్ధి 5) హైదరాబాద్‌లో మెట్రోపొలిస్‌కు సంబంధించిన అంశాలు 6) సామాజిక, సాంస్కృతిక అంశాలు 7) శాంతి భద్రతలు, అంతర్గత భద్రతా కోణాలు 9) మన ముందున్న మార్గం - ముగింపు


 నోట్‌: 8వ అధ్యాయంలో చర్చించిన ఆంతరంగిక భద్రతకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయకుండా దాన్ని సీల్డ్‌ కవర్‌లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

నివేదికలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ పొందుపరిచారు. చివరి అధ్యాయంలో ‘మన ముందున్న మార్గం’ అంటే ‘ది వే అహెడ్‌’ పేరుతో సమస్యకు ఆరు పరిష్కార మార్గాలు/ప్రత్యామ్నాయాలను చర్చించింది. ఈ ఆరింటిలో మొదటి మూడు ఆచరణ యోగ్యం కావని, వాటివల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని తానే తిరస్కరించింది


 

 


 

రచయిత: ఎ.ఎం.రెడ్డి

 

Posted Date : 22-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌