• facebook
  • whatsapp
  • telegram

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (పార్లమెంటరీ ప్రక్రియ)

 అత్యున్న‌త చ‌ట్ట‌స‌భలో ఆఖ‌రి ఘ‌ట్టం

దశాబ్దాల పోరాటాల ఫలితమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఆఖరికి అత్యున్నత చట్టసభకు చేరింది. అక్కడ కూడా అనేక అవాంతరాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిరసనలు, సస్పెన్షన్లు, ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేతల నడుమ మూజువాణి ఓటుతో కొత్త రాష్ట్రానికి ఆమోదముద్ర పడింది. కేంద్రం ప్రతిపాదనను సొంత రాష్ట్ర శాసనసభ తిరస్కరించినా, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటూ రకరకాల ప్రతిపాదనలు పెట్టినా, అంతిమంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం ఆవిర్భవించింది. సుదీర్ఘకాల స్వప్నం సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలోని పార్టీలవారీ చర్చలతో మొదలైన ఈ ప్రక్రియ పార్లమెంటు చేసిన శాసనంతో పూర్తయింది. ఈ క్రమంలో భాగస్వాములైన పార్టీలు, వ్యక్తులు, వారి పాత్రల గురించి అభ్యర్థులు పూర్తిగా తెలుసుకోవాలి. రాష్ట్ర శాసనసభలో, లోక్‌సభలో ఎదురైన అవరోధాలు, ఆందోళనలు, రాజీనామాలు, తదనంతర పరిస్థితులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 

భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పునర్విభజన, రాష్ట్రాల సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్ల మార్పులకు సంబంధించిన ప్రక్రియను సూచిస్తుంది. ఈ విషయంలో పార్లమెంటుకు ఉన్న విశిష్ట అధికారాన్ని పేర్కొంటుంది. ఇందుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితో పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అయితే రాష్ట్రపతి ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపాలి. నిర్ణీత గడువు లోపు అభిప్రాయాన్ని తెలియజేయకపోయినా లేదా బిల్లును తిరస్కరించినా రాష్ట్ర శాసనసభ దానిని ఆమోదించినట్లుగానే రాష్ట్రపతి భావించవచ్చు. ఎందుకంటే ఇది అభిప్రాయాన్ని తెలియజేయాలని పేర్కొంటోందే తప్ప ఆమోదించాలని నిర్దేశించడం లేదు. అంటే ఈ విషయంలో శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభ అధికారం నామమాత్రమైనదే. అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆ బిల్లును ఉభయసభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది.


ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమకారులు 2011-2012లో వినూత్న ప్రదర్శనలతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 2012, డిసెంబరు 28న యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నాటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేకు సూచించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఇద్దరేసి ప్రతినిధులను పంపాలని కేంద్రం కోరింది. 


ఈ సమావేశం తర్వాత నాటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరిష్కార మార్గాన్ని నెల రోజుల్లోపు కేంద్రం సూచిస్తుందని ప్రకటించారు. కానీ ఆ ప్రకటన అమలుకు 6 నెలల పైగా ఆలస్యమైంది. ఆ తర్వాత 2013, జులై 30న సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన యూపీఏ సమావేశంలో భాగస్వామ్య పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలత తెలియజేయడంతో, అదేరోజు జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఫలితంగా 2013, ఆగస్టు 5న నాటి కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో ప్రకటించారు.


ఎ.కె.ఆంటోని కమిటీ: పార్లమెంటులో  పి.చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన ప్రకటన ఫలితంగా ఆగస్టు 6న సీమాంధ్రలో చెలరేగిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుంది. సీమాంధ్ర ప్రజల భయాలను నివృత్తి చేయడానికి సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులతో చర్చించడానికి ఆగస్టు 7న నాటి కేంద్ర రక్షణ శాఖా మంత్రి ఎ.కె.ఆంటోని అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులోని సభ్యులు

 1) దిగ్విజయ్‌ సింగ్‌ 

2) వీరప్ప మొయిలీ 

3) అహ్మద్‌ పటేల్‌. ఈ కమిటీ సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులతో, రాష్ట్ర మంత్రులతో ఆగస్టు 13, 14 తేదీల్లో; ఆ తర్వాత రెండోసారి ఆగస్టు 19, 20వ తేదీల్లో చర్చలు జరిపింది. అందులో తెలంగాణ ఏర్పాటు అనివార్యమైతే హైదరాబాదు నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కమిటీ తన నివేదికను 2013, అక్టోబరు 4న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఒక వైపు ఆంటోని కమిటీ చర్చలు జరుపుతుండగానే 2013, ఆగస్టు 24న యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, 27న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై సానుకూల ప్రకటనలు చేశారు.


గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ కమిటీ: ఈ కమిటీని 2013, అక్టోబరు 8న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విధివిధానాలపై సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎ.కె.ఆంటోని అధ్యక్షుడు, ఇతర సభ్యులు కేంద్ర కేబినెట్‌ మంత్రులు. ఈ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేసింది.


*  జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌ నగరం 


రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ల కాలం కొనసాగడం. 


* రెండు రాష్ట్రాల మధ్య నదీజలాలు, ఖనిజ వనరులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజన చేపట్టడం.


పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం. 


* రాజ్యాంగంలోని 371 D ప్రకరణ (ఆరు సూత్రాల పథకాన్ని)ను రెండు రాష్ట్రాల్లో అమలుపరచడం.


* రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ ఏర్పాటుపై సూచనలు చేయడం.


మంత్రుల సంఘం సూచనలతో పాటు ఇతర అంశాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన బిల్లు (తెలంగాణ బిల్లు)ను రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనినే అధికారికంగా ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు’ అంటారు.


తెలంగాణ బిల్లు (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు): 


2013, డిసెంబరు 5న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అదే రోజున కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పి.చిదంబరం లోక్‌సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రకటించారు. అదే రోజు (డిసెంబరు 5న) కేంద్ర కేబినెట్‌ తెలంగాణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపి, మరుసటి రోజు డిసెంబరు 6న రాష్ట్రపతికి పంపింది.


రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలంగాణ ముసాయిదా బిల్లుపై న్యాయకోవిదులతో సంప్రదించి డిసెంబరు 11న దానిపై సంతకం చేశారు. డిసెంబరు 12న రాష్ట్రపతి తెలంగాణ ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ (తెలంగాణ) ముసాయిదా బిల్లు ప్రతులను నాటి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌ కుమార్‌ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి, అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి స్వయంగా అందజేశారు. ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని ఆరువారాల్లోపు (42 రోజులు) అంటే జనవరి 23 లోగా తెలియజేయాలని చెప్పారు. డిసెంబరు 13న ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసన సభకు చేరింది. 15న ఈ ముసాయిదా బిల్లు కాపీలను శాసనసభ సభ్యులందరికీ అందించగా, సీమాంధ్ర శాసన సభ్యులు వాటిని చింపేసి నిరసన తెలిపారు. అప్పటి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిసెంబరు 16న బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైందని ప్రకటించారు. ఆ తర్వాత సభ వాయిదా పడి 2014, జనవరి 2న పునఃప్రారంభమైంది. నాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి శ్రీధర్‌బాబును తొలగించి సీమాంధ్రకు చెందిన శైలజానాథ్‌కు ఆ శాఖను బదలాయించారు. దీనికి నిరసనగా శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014, జనవరి 6న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై రాష్ట్ర శాసనసభలో చర్చ ప్రారంభమైంది (అప్పటి రాష్ట్ర విధానసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌).


2014, జనవరి 10న టీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష నేత ఈటల రాజేందర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై ప్రసంగించి బిల్లుకు తన మద్దతు తెలిపారు. 23న నాటి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి విభజన బిల్లును నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. అదే రోజున శాసనసభ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు బిల్లులో అనేక తప్పులున్నాయని పేర్కొన్నారు. జనవరి 23 తేదితో రాష్ట్రపతి ఇచ్చిన ఆరు వారాల గడువు ముగియడంతో గడువును మరో మూడు వారాలు పొడిగించాలని రాష్ట్ర విధానసభ ఒక తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపింది. అయితే రాష్ట్రపతి ఈ గడువును ఒక వారం మాత్రమే, అంటే జనవరి 30 వరకు పొడిగించారు. 30న ఆ బిల్లును రాష్ట్ర విధానసభ వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపించింది. ఆ విధంగా రాష్ట్ర విధానసభ తిరస్కరించిన బిల్లును కేంద్ర కేబినెట్‌ ఫిబ్రవరి 7న ఆమోదించి, ఫిబ్రవరి 9న రాష్ట్రపతికి పంపించింది.


కేంద్ర కేబినెట్‌ నిర్ణయానికి నిరసనగా ఫిబ్రవరి 11న లోక్‌సభలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ సభ్యులు ఆరుగురు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా కాంగ్రెస్‌ వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ విధంగా సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, సబ్బం హరి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.


 

 


 

రచయిత: ఎ.ఎం.రెడ్డి


 

 

Posted Date : 01-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌