• facebook
  • whatsapp
  • telegram

మలిదశ ఉద్యమంలో మైలురాళ్లు

ముమ్మర పోరుకు మరోమారు!

  దశాబ్దాలుగా రగిలిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష దశలవారీగా బలపడింది. అందుకోసం సభలు నిర్వహించారు. సదస్సులు జరిగాయి. రాజకీయ నేతలు, ఉద్యమకారులు మొదలు విద్యార్థుల వరకు పలువురు వాటిలో భాగస్వాములయ్యారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పుస్తకాలు ప్రచురించారు. నినాదాలతో హోరెత్తించారు. ఎందరో నాయకులు ఎన్నో రకాల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పోరాటాలను తీవ్రస్థాయికి చేర్చి మలిదశ ఉద్యమానికి గట్టి పునాదులు వేశారు. ముమ్మరపోరుకు మరోసారి అందరూ ఏకమై కదిలారు. 

  

 జై తెలంగాణ ఉద్యమం-1969 తర్వాత అంతర్లీనంగా కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష 1996 నుంచి మరింత బలపడింది. ఆ దశలో అనేక భారీ బహిరంగ సభలు, సదస్సుల ద్వారా ప్రజా ఉద్యమానికి బాటలు వేసే ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాలను నిరసించారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల వల్ల తమ విద్యా, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళన కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వైపు ప్రజానీకం సాగడానికి మరో ప్రధాన కారణంగా నిలిచింది. ఫలితంగా 1996 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రజా పోరాటంగా రూపుదిద్దుకుంది.ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర మేధావులు, సామాజికవేత్తలు, పాత్రికేయులు, వామపక్ష భావజాలం ఉన్న ఉద్యమకారులు భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో 1997లో జరిగిన ఫోరం ఫర్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ సదస్సు, భువనగిరి సభ, సూర్యాపేట తెలంగాణ మహాసభ, వరంగల్‌ డిక్లరేషన్, 1998 నాటి తెలంగాణ జనసభ మొదలైనవన్నీ భౌగోళిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాకుండా ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణను సాధించాలని నినదించాయి.మలిదశ తెలంగాణ ప్రజా ఉద్యమాలకు దారులు వేశాయి.

 

అశోక టాకీస్‌ సదస్సు (1997 జనవరి 19)

  ఇది మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి తెలంగాణ ఆత్మగౌరవ సభ. 1997, జనవరి 19న హైదరాబాద్‌ మొజంజాహీ మార్కెట్‌లోని అశోక టాకీస్‌లో తెలంగాణ సంస్కృతి - వివక్షలపై ఒక సదస్సును సుదీర్ఘంగా నిర్వహించారు. తెలంగాణ పాత్రికేయుడు గులాం రసూల్‌ఖాన్‌ పోలీసుల కాల్పుల్లో మృతి చెందడాన్ని ఖండిస్తూ ప్రముఖ పాత్రికేయుడు పాశం యాదగిరి ఆధ్వర్యంలో ‘ఫోరం ఫర్‌ ఫ్రీడం ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌’ పేరుతో ఈ సదస్సు జరిగింది. గులాం రసూల్‌ స్మారకార్థం ప్రతి ఏడాది సభ నిర్వహించాలనే ఉద్దేశంతో తెలంగాణ పాత్రికేయులు ఫోరం ఫర్‌ ఫ్రీడం ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.విభిన్న భావాలు కలిగిన రాజకీయ నాయకులు, పాత్రికేయులు, కవులు, కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు పలు రంగాలకు చెందిన మేధావులు ఈ వేదికపైకి వచ్చి తెలంగాణవాదాన్ని వినిపించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై మలిదశ ఉద్యమంలో వెలువడిన రెండు ముఖ్యమైన పుస్తకాలను ఈ సదస్సులోనే ఆవిష్కరించారు. అందులో ఒకటి గాదె ఇన్నయ్య వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన అధికారిక గణాంకాలతో ముద్రించిన ‘దగాపడ్డ తెలంగాణ’ సంచిక. రెండోది 1997 - 2000 మధ్య కాలంలో వేలాది మందిని ప్రభావితం చేసిన ఆచార్య జయశంకర్‌ రచించిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకం. ఈ సదస్సులోనే తొలిసారిగా ప్రజా గాయకుడు గద్దర్‌ ‘అమ్మా తెలంగాణమా - ఆకలి కేకల గానమా’ అనే పాట పాడి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి నాంది పలికారు. మలిదశ ఉద్యమంలో ఆ పాట బహుళ జనాదరణ పొందింది. ఈ సమావేశంలోనే 1997 మార్చి 8, 9 తేదీల్లో భువనగిరి సభ నిర్వహించాలని నిర్ణయించారు. అశోక టాకీస్‌ సదస్సును మలిదశ ఉద్యమానికి మలుపుగా పేర్కొంటారు.

 

భువనగిరి సభ (1997 మార్చి 8, 9)

  1997 మార్చి 8న భువనగిరి మిషన్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో తెలంగాణ మేధావులు ‘దగాపడ్డ తెలంగాణ’ అనే బ్యానర్‌తో సుదీర్ఘమైన సదస్సు నిర్వహించారు. ఈ ప్రాంగణానికి ‘తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణం’ అని పేరు పెట్టారు. కవులు, కళాకారులు, పాత్రికేయులు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, కాళోజి నారాయణరావు, పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, గాదె ఇన్నయ్య, గద్దర్, కె.శ్రీనివాస్, నందిని సిధారెడ్డి లాంటి ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలపై రంగాలవారీగా పరిశోధనా పత్రాలు (వ్యాసాలను) సమర్పించి చర్చించారు. సదస్సుకు ఉస్మానియా వర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా కాళోజి నారాయణరావు ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణకు జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిని పాలకులు అణచివేస్తున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. 

  ప్రొఫెసర్‌ జయశంకర్‌ విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో; గాదె ఇన్నయ్య సాగునీరు, విద్యుత్తు రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణ వనరులు, పరిశ్రమలు, పారిశ్రామిక కాలుష్యం అంశాలపై ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ ప్రసంగించారు. ‘తెలంగాణ ఉద్యమం - అవగాహన’ అంశంపై గద్దర్‌ మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించడానికి జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి గజ్జెకట్టి పాటలతో వివరిస్తానని ప్రకటించారు. సీనియర్‌ పాత్రికేయుడు కె.శ్రీనివాస్‌ పత్రికా రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రసంగించారు. సాంఘిక సంక్షేమంపై ప్రసంగించిన ఘంటా చక్రపాణి తెలంగాణ దళిత, గిరిజన, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. ప్రాంతాలవారీగా రిజర్వేషన్ల వర్గీకరణ గురించి డాక్టర్‌ ముత్తయ్య మాట్లాడారు. తెలంగాణలో ఆదివాసీల సమస్యపై కాకతీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌ ప్రసంగించారు. పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ మాజీ నక్సలైట్‌ నాయకుడు కె.జి.సత్యమూర్తి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై మాట్లాడారు. పాశం యాదగిరి, మందాడి సత్యనారాయణరెడ్డి తదితరులు తెలంగాణలో కరెంటు కష్టాలు, విద్య, ఉద్యోగ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను వివరించారు. 

  1997 మార్చి 9న సాయంత్రం భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ రైతుల సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న భువనగిరి వాసి, స్వాతంత్య్ర సమరయోధుడు జైని మల్లయ్య గుప్త అధ్యక్షత వహించారు. భువనగిరి న్యాయవాదుల సంఘం (బార్‌ కౌన్సిల్‌) నాటి అధ్యక్షుడు నాగారం అంజయ్య, న్యాయవాది పి.బాలకృష్ణారెడ్డి సభ నిర్వహించారు. గొల్ల కురుమ, డోలు దెబ్బ నాయకురాలు బెల్లి లలిత తన పాటలతో సభను ఉర్రూతలూగించారు (ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె దారుణ హత్యకు గురయ్యారు). భువనగిరి సభలో గాదె ఇన్నయ్య ప్రతిపాదించిన పలు డిమాండ్లతో తీర్మానం ఆమోదం పొందింది.

* ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాంతీయ వర్గీకరణ ప్రాతిపదికన రిజర్వేషన్లు.

* భూమి లేని వారికి ప్రభుత్వ భూముల పంపిణీ.

* అటవీ భూములకు సంబంధించి 1/70 చట్టం అమలు.

* వ్యవసాయ రంగానికి కోతలు లేని విద్యుత్తు సరఫరా.

* రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేసి ప్రాంతాల వారీగా నిర్వహించడం.

* తెలంగాణలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం.

* తెలంగాణ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి శ్రీరాంసాగర్, శ్రీశైలం ఎడమ కాలువ, ఇచ్చంపల్లి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చడం. ఎల్లంపల్లి (శ్రీపాదనగర్‌) ప్రాజెక్టు చేపట్టడం.

* తెలంగాణ యాసను కించపరచడాన్ని నిషేధించడం.

* సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించడం.

* మద్యపాన నిషేధ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయడం.

* తెలంగాణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయడం.

భువనగిరి సభ తర్వాత 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. దాన్ని తెలంగాణవాదంపై జరిగిన దాడిగా తెలంగాణవాదులు భావించారు.

 

సూర్యాపేట మహాసభ (1997 ఆగస్టు 11)

  దీన్నే తెలంగాణ మహాసభగా పేర్కొంటారు. నాటి నల్గొండ జిల్లా (నేటి సూర్యాపేట జిల్లా) సూర్యాపేటలో 1997 ఆగస్టు 11న నిర్వహించారు. ఈ సభ ప్రధాన లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేయడం. దీన్ని జరపడంలో పరోక్షంగా ప్రధాన పాత్ర వహించినవారు మారోజు వీరన్న. జనశక్తి పార్టీ నుంచి బయటికి వచ్చిన వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. ఈయన అజ్ఞాతంలో ఉండటంతో సూర్యాపేట మహాసభకు అధికారికంగా చెరుకు సుధాకర్‌ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్, నారం కృష్ణారావు (రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌), ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దనరావు, కంచె ఐలయ్య, గాదె ఇన్నయ్య (తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి నాయకుడు), రాపోలు భాస్కర్‌ (తెలంగాణ ప్రగతి వేదిక అధ్యక్షుడు), పాశం యాదగిరి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు. తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉద్యమకారులు హాజరయ్యారు. ఈ సభలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి 16 డిమాండ్లతో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ‘తెలంగాణ మహాసభ’ మాస పత్రికను ఆవిష్కరించారు. 

 

వరంగల్‌ డిక్లరేషన్‌ (1997 డిసెంబరు 28, 29)

  వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో ‘ప్రజాస్వామిక తెలంగాణ- ప్రజల ఆకాంక్ష’ పేరుతో మహాసభ జరిగింది. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఒక డిక్లరేషన్‌ ద్వారా ప్రకటించారు. సభను అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక (ఆలిండియా పీపుల్స్‌ రెసిస్టన్స్‌ ఫోరమ్‌ - ఏఐపీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్వహించారు. ఈ సంస్థకు, ప్రొఫెసర్‌ సాయిబాబాకు పీపుల్స్‌వార్‌ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ నాటి రాష్ట్ర ప్రభుత్వం సభ ఏర్పాటుకు మొదట నిరాకరించింది.నిర్వాహకులు హైకోర్టు నుంచి అనుమతి పొంది సభను నిర్వహించారు. అనేక నిర్బంధాల మధ్య ఈ బహిరంగ సభ జరిగింది. ప్రొఫెసర్‌ సాయిబాబా అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్, కాళోజి నారాయణరావు, గద్దర్, వరవరరావు, ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌రావు ప్రసంగించారు. ఈ సభ 50 డిమాండ్లతో వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రకటించింది.

ప్రధాన డిమాండ్లు: * తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.

* తెలంగాణలో భూసంస్కరణలను పటిష్ఠంగా అమలు చేయడం.

* అటవీ హక్కుల పరిరక్షణకు 1/70 చట్టాన్ని అమలు చేయడం.

* ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఆక్రమించిన గిరిజన భూములను తిరిగి గిరిజనులకు బదిలీ చేయడం.

 

తెలంగాణ జనసభ (1998 జులై 5, 6)

  ఈ సభను హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఉన్న మహారాణా ప్రతాప్‌ హాలులో నిర్వహించారు. వరంగల్‌ డిక్లరేషన్‌ సభకు వచ్చిన ప్రముఖులంతా (ప్రొఫెసర్‌ సాయిబాబా మినహాయించి) హాజరయ్యారు. మహ్మద్‌ఖాన్‌ అధ్యక్షత వహించారు. ఈ సభ నినాదం ‘ప్రజాస్వామిక తెలంగాణ’. తెలంగాణ సంక్షిప్త చరిత్ర - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు - పెద్ద మనుషుల ఒప్పందం - దాని ఉల్లంఘనలు, 1968-69 తెలంగాణ ఉద్యమం - ఆరు సూత్రాల పథకం - తెలంగాణ వనరుల దోపిడీ లాంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఒకే ఒక సాధనం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటేనని, ప్రజా పోరాటాల ద్వారానే దాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జమ్ము-కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన ఆల్‌పార్టీ హురియత్‌ నాయకుడు యాసిన్‌ మాలిక్‌ హాజరయ్యారు. ఈ సభలోనే కాళోజి నారాయణరావు ‘జన తెలంగాణ’ మాస పత్రికను ఆవిష్కరించారు. దీని సంపాదకుడు ఆకుల భూమయ్య. సభాముఖంగా క్విట్‌ తెలంగాణ అనే నినాదాన్ని ప్రకటించి, ఆ పేరు మీదనే ఉద్యమం సాగించాలని కాళోజి ప్రకటించారు.  ఆ తర్వాత ఈ సభ నిర్వాహకులు తెలంగాణ జిల్లాల్లో కూడా తెలంగాణ జనసభ సమావేశాలు జరిపారు. 1998 నవంబరు 1ని బ్లాక్‌ డే (చీకటిరోజు)గా  పేర్కొన్నారు.

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి


 

Posted Date : 15-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌