• facebook
  • whatsapp
  • telegram

ముల్కీ నిబంధనలు

ఉద్యమ పరిణామ క్రమం
దరాబాద్‌ ముల్కీ నిబంధనలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. హైదరాబాద్‌ను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా పరిపాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ముల్కీ నిబంధనలు వచ్చాయి. ఒకటో సాలార్‌జంగ్‌ 1853లో ప్రధాని అయ్యాక హైదరాబాద్‌ పాలనా యంత్రాంగాన్ని నవీకరించే ప్రయత్నం చేశాడు. అంతకుముందు హైదరాబాద్‌లో కొంతమేర పరిపాలన యంత్రాంగం ఉండేది. అలాగే జిల్లాస్థాయిలో కొందరు, గ్రామస్థాయుల్లో అక్కడక్కడా కొందరు అధికారులున్నా గ్రామస్థాయిదాకా విస్తరించి, విస్తృత అధికారాలుండి, సామాజిక వ్యవస్థతో విడిపడి.. ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన పరిపాలన యంత్రాంగం మాత్రం హైదరాబాద్‌లో లేదు. అలాంటి పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని ఒకటో సాలార్‌జంగ్‌ చేశాడు. ఆయన చేసిన సంస్కరణల్లో మొదటిది పన్ను వసూలు పద్ధతి. అంతకుముందు దాకా భూమిశిస్తు, ఇతర పన్నులు వసూలు చేసే అధికారాన్ని గుత్త(కాంట్రాక్టు)కు ఇచ్చేవారు. దీన్నే ‘సర్‌బస్తా’ వ్యవస్థ అంటారు. ఈ పద్ధతిలో గుత్తేదారులు పన్ను వసూలు చేసి, కొంత భాగం తాముంచుకొని   మిగిలింది ప్రభుత్వానికి ఇచ్చేవారు. సాలార్‌జంగ్‌ ఈ పద్ధతిని రూపుమాపాడు. శిస్తు వసూలు కోసం ప్రత్యేకమైన రెవెన్యూ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. అదే విధంగా బ్రిటిష్‌ విధానంలో ఉన్న రైత్వారీ పద్ధతిని ప్రవేశ పెట్టాడు. భూమిని సర్వే చేసి, దాని యజమానికి ఓ పట్టాదారు పుస్తకం ఇచ్చి, ఆ పట్టాను గుర్తిస్తూ, ఆ నేల రకాన్ని, సాగునీటి సౌకర్యం.. పండించే పంటలను బట్టి దానికి శిస్తును నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇవే కాకుండా విద్యాశాఖ, పబ్లిక్‌ వర్క్స్‌ విభాగం, నీటిపారుదల శాఖ, కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్, ఆబ్కారీ శాఖలను తొలిసారిగా తీసుకొచ్చాడు. దాదాపు 30 సంవత్సరాలు ప్రధానిగా పనిచేశాక 1883లో చనిపోయాడు. అనంతరం ఆయన మేనల్లుడు రెండో సాలార్‌జంగ్‌ ప్రధాని పదవిని అధిష్ఠించాడు. ఆయన హయాంలోనూ సంస్కరణల పర్వం కొనసాగింది. ఆధునిక పాలనా యంత్రాంగం బలపడింది. దీన్ని సమర్థంగా నిర్వహించడానికి వారికి కొంత ఆధునిక పరిజ్ఞానం, ఆధునిక విద్య పొందినవారి అవసరం ఏర్పడింది. అప్పటికి హైదరాబాద్‌ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కళాశాలలు లేవు. (1887లో నిజాం కాలేజీ ఏర్పడింది.) దీంతో ఉత్తర హిందుస్థాన్‌ నుంచి విద్యావంతులైనవారిని నిజాం ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. వీరందరినీ దిగుమతి అధికారులని స్థానికులు పిలిచేవారు. ఇలా చాలామందిని తీసుకునే క్రమంలో స్థానికుల్లో నిరసన మొదలైంది. ఇక్కడ మనం ఉండగా బయటివారినెందుకు తీసుకు రావడమనే భావన ఎక్కువైంది. ఉన్నంతలో ఇప్పటిదాకా పనిచేసిన, అనుభవమున్న వారినే వినియోగించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. తగిన శిక్షణ ఇప్పిస్తే ఇక్కడి యువకులకే ఉద్యోగాలు వస్తాయి.. పైగా బయటి వాళ్లు వస్తే స్థానిక పద్ధతులు తెలియవు కాబట్టి పాలన బాగుండదనే భావన బలంగా ఏర్పడింది. దీనికితోడు బయటి నుంచి దిగుమతై వచ్చిన అధికారులు స్థానికులతో అహంభావ పూరితంగా వ్యవహరిస్తున్నారనేది కూడా వ్యక్తమైంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మొదటి సాలార్‌జంగ్‌ హయాంలోనే స్థానికులకు శిక్షణ ఇచ్చే చర్యలు ప్రారంభమయ్యాయి. 1868లో స్థానికులకు అవకాశాలివ్వాలంటూ తొలి ఉత్తర్వులు వెలువడ్డాయి. వాటినే పదేపదే (1884లో, 1919లో) మారుస్తూ.. మెరుగు పరుస్తూ వచ్చారు. 1919లో ఆ ఉత్తర్వులు మరింత మెరుగయ్యాయి. అంటే అప్పటినుంచే ఈ స్థానిక, స్థానికేతర తేడాను చూడడం మొదలైంది. ‘హైదరాబాదీయులు హిందువులైనా, ముస్లింలైనా కలసిపోతారు.. గంగాజమున సంగమంలా భిన్న మతాలవారు కలసిమెలసి ఉండే సంస్కృతిని ఇక్కడివారైతేనే పాటించగలుగుతారు.. బయటివారైతే మతతత్వానికి కారణమవుతార’నే వాదన పదేపదే వినిపించేది. బయటి నుంచి వచ్చినవారేమో స్థానికులకు పరిపాలన చేతగాదని, తెలివిలేనివారని, వారికి అధికారమిస్తే హైదరాబాద్‌ పాలనయంత్రాంగం కుప్పకూలుతుందని అనేవారు. రెండు భిన్నమైన దృక్పథాల కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు తమను తాము నిర్వచించుకోవడం.. తమను పరిపాలించే అధికారం తమకే ఉండాలని కోరుకోవడం.. క్రమేపీ బలపడింది. 19వ శతాబ్దం రెండో అర్ధభాగం నుంచే ఈ కోరిక వ్యక్తమైంది. ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించింది. స్థానికులకిస్తే లాభం, రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో క్రమంగా స్థానికులకు ఉద్యోగాలివ్వాలని నిర్ణయించారు. ఉర్దూలో ముల్క్‌ అంటే దేశం (ప్రాంతం).. ముల్కీలంటే దేశపౌరులు (ప్రాంతీయులు).. హైదరాబాద్‌లో అప్పట్లో వాడిన మాటలేమంటే ముల్కీ, గైర్‌ ముల్కీ. స్థానికులు(హైదరాబాద్‌లో పుట్టిపెరిగినవారు), స్థానికేతరులు (బయటి నుంచి దిగుమతై వచ్చినవారు) అనే అర్థంలో వాడేవారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలను గైర్‌ ముల్కీలకు ఇవ్వొద్దు, ముల్కీలకే అవకాశం కల్పించాలనే అభిప్రాయం బాగా బలపడింది.

ముల్కీ ఉద్యమం..
1948లో పోలీసు చర్య జరిగి, భారతదేశంలో హైదరాబాద్‌ విలీనమయ్యాక నాలుగేళ్లపాటు (రెండేళ్లు సైనికులు, రెండేళ్లు అధికారులు) బయటి నుంచి వచ్చిన వారే పాలన కొనసాగించారు. ఈ సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నాలుగేళ్లలో ఉన్న పాలకులు ఆంగ్లం, తెలుగు రాదనే కారణంతో చాలామంది స్థానికులను ఉద్యోగాల నుంచి తీసేశారు. స్థానికులపై ఉన్న అపనమ్మకంతో పాలన కొనసాగించడానికి బయటి నుంచి ముఖ్యంగా మద్రాసు నుంచి చాలామందిని మళ్లీ దిగుమతి చేసుకున్నారు. ఇక్కడి వారిని నమ్మక తహసీల్దార్ల నుంచి కార్యదర్శుల దాకా సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అలా వచ్చిన అధికారులు దొంగ ముల్కీ పత్రాలు జారీచేసి, స్థానికేతరులను ఉద్యోగాల్లో నియమించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, పోలీసులుగా చాలామంది వచ్చి చేరారు. వ్యవసాయశాఖలో కూడా చాలామంది చేరారు. ఇలా వచ్చినవారు స్థానికుల పట్ల అహంభావపూరితంగా వ్యవహరించారు. ‘మీకు జీవనవిధానం తెలియదు, అనాగరికులు, వెనకబడినవారు, తెలుగు కూడా రాదు, మేం మిమ్మల్ని పైకి తీసుకొస్తాం..’ అని పదేపదే చులకనగా మాట్లాడుతుండేవారు. దీంతో స్థానికుల్లో గైర్‌ ముల్కీలపై వ్యతిరేకత పెరిగింది. ఈ వ్యతిరేకత క్రమంగా తీవ్రమై ముల్కీ ఉద్యమంగా మారింది. 1952లోనే ముల్కీ ఉద్యమం ఎందుకు ఆరంభమైందనేది ఆసక్తికరం.

వరంగల్‌తో ఆరంభం..
1952 నాటికి అధికారుల పాలన కూడా ముగిసి, తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మేలో బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూన్‌ - జులైలో విద్యార్థి సంఘాలకు (అన్ని బడులు, కాలేజీల్లో) ఎన్నికలు జరిగాయి. ఈ విద్యార్థి సంఘాలన్నీ కలసి ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడ్డాయి. అప్పటికే స్థానికేతరులను వెనక్కి పంపాలంటూ అసెంబ్లీలో చాలామంది డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. అయితే ‘గత ప్రభుత్వం కొంతమందిని శాశ్వతంగా నియమించింది. వారిని ఏమీ చేయలేం. మరికొందరిని తాత్కాలిక పద్ధతిలో నియమించింది. వీరిని వెనక్కి పంపుతాం. దొంగ ముల్కీ పత్రాలతో చేరినట్లు ఆధారాలు దొరికిన వారందరిపైనా చర్యలు తీసుకుంటాం’ అని బూర్గుల ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీకి అనుగుణంగా చర్యలుండక పోవడంతో విద్యార్థుల్లో అసంతృప్తి పెరిగింది. దీంతో వాళ్లు నాన్‌ ముల్కీలను వెనక్కి పంపాలంటూ జులై ఆఖరి వారంలో వరంగల్‌లో ఊరేగింపు చేపట్టి ఉద్యమం మొదలెట్టారు. విద్యార్థులు ఐక్య కార్యచరణ సమితిగా ఏర్పడి.. ‘నాన్‌ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్‌ గోబ్యాక్‌’ అంటూ నినాదాలిచ్చారు. ఊరేగింపులు, హర్తాళ్లు మొదలు పెట్టారు. ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆగస్టు మొదటివారంలో వరంగల్‌ నుంచి విద్యార్థి బృందం వచ్చి ముఖ్యమంత్రిని కూడా కలిసింది. ‘కేబినెట్‌ సబ్‌కమిటీ వేసుకుని అంతా కలసి మాట్లాడుకుని, ముల్కీ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటా’మంటూ ముఖ్యమంత్రి బూర్గుల నచ్చజెప్పడంతో వారు ఉద్యమాన్ని ఆపారు. కానీ ప్రభుత్వం నుంచి కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆగస్టు చివర్లో మళ్లీ ముఖ్యమంత్రికి (ఆయన వరంగల్‌ వెళ్లినప్పుడు) గుర్తుచేశారు. సబ్‌కమిటీ ప్రకటన రాకుంటే ఆగస్టు 27 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 26 రాత్రి ప్రభుత్వం సబ్‌కమిటీ వేసింది. ఆ సమాచారం విద్యార్థులకు తెలియలేదు. దీంతో 27న వరంగల్‌లో ఆందోళన ప్రారంభమైంది. అంతలో విషయం తెలిసిన కొంతమంది సమ్మెను విరమిద్దామంటే, మరికొందరేమో ప్రభుత్వం నుంచి పకడ్బందీ హామీలు వచ్చేదాకా సమ్మె కొనసాగిద్దామని అన్నారు. దీంతో కొంతమంది 28న సమ్మె కొనసాగించడంతో వారిపై లాఠీఛార్జి జరిగింది. నాన్‌ముల్కీలను పంపించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జి చేయటమేంటని హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టగా.. దానిపైనా లాఠీఛార్జి జరిగింది. ప్రభుత్వం నాన్‌ముల్కీలను పంపకుండా తమపై లాఠీఛార్జి చేయడమేమిటనే వాదనతో ఆందోళన రోజురోజుకీ తీవ్రమైంది. సెప్టెంబరు 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ ఊరేగింపు చేయాలనుకుంటే ప్రభుత్వం నిషేధించింది. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో రెండ్రోజుల్లో ఏడుగురు చనిపోయారు.

రాజ్యాంగ, రాజకీయ ప్రాతిపదిక
తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న అనుమానాలు, ఆందోళనలు తెలిసిన ఆంధ్రప్రాంత అసెంబ్లీ, రాజకీయ నాయకులు తెలంగాణకు కొన్ని హామీలిచ్చారు. ‘ముల్కీ నిబంధనల్ని కొనసాగిస్తాం. మీ ప్రాంత వనరులు మీ అభివృద్ధికి ఉపయోగించడానికి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తామ’ని హామీ ఇచ్చారు. ఈమేరకు పెద్దమనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరిలో జరిగింది. ఆగస్టులో పార్లమెంటు సమావేశాల్లో ఈ ఒప్పందాన్ని నోట్‌ ఆన్‌ సేఫ్‌గార్డ్స్‌ పేరిట ప్రవేశపెట్టారు. పెద్దమనుషుల ఒప్పందంలోను, ఈ నోట్‌ ఆన్‌ సేఫ్‌గార్డ్‌లోనూ ముల్కీ నిబంధనలను యథాతథంగా కొనసాగిస్తామన్న హామీ ఉంది. రద్దు చేయబోమని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కూడా సమానత్వ హక్కుపై చర్చ జరుగుతుంటే ఇలాంటి స్థానికత, అర్హత సమస్యలు వారి దృష్టికి వచ్చాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, హైదరాబాద్‌లో ఇది ఉన్నట్లు గుర్తించి 35(బి)ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం కొన్ని కొన్ని సందర్భాల్లో నివాసమనేది ఒక అర్హతగా పెట్టుకోవచ్చు. ప్రభుత్వం దీనికి సబంధించిన ఆదేశాలు ఇచ్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సమర్థనగా పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ యాక్ట్, రూల్స్‌ తీసుకొచ్చింది. ఇలా ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి రాజ్యాంగపరమైన, రాజకీయ పరమైన ప్రాతిపదిక ఏర్పడింది.

‘ముల్కీ’ మార్పులు
హైదరాబాద్‌ రాష్ట్రంలో - అంటే నిజాం పాలనలోగానీ, నిజాం పాలన అంతమైన తర్వాత ఉన్న హైదరాబాద్‌లో గానీ ముల్కీకి సంబంధించిన నిర్వచనం వేరు. అప్పుడు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన వారు మొదటి కేటగిరి. ఇక్కడే పదిహేనేళ్లుగా స్థిరనివాసం ఉంటూ, మున్ముందు కూడా ఇక్కడే శాశ్వతంగా స్థిరనివాసం ఏర్పరచుకుంటామంటూ ప్రమాణపత్రం మెజిస్ట్రేట్‌ ముందు దాఖలు చేసేవారు రెండోరకం. ఇలాంటివారు కూడా ముల్కీలవుతారు. గైర్‌ముల్కీలను (స్థానికేతరులను) పెళ్లిచేసుకున్న మహిళలకు హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉన్నంత వరకు ముల్కీగానే ఉంటారు. ఒకవేళ వారి అత్తగారు వేరేప్రాంతాలవారై, మళ్లీ ఏదైనా కారణం వల్ల వారు వెనక్కి తిరిగివస్తే అప్పుడు కూడా ముల్కీ హక్కును అనుభవించగలగడం మూడో రకం. తర్వాత ఈ ముల్కీ నివాస అర్హతను వరుసగా 15 సంవత్సరాలుంటే చాలు, ప్రమాణపత్రం అవసరం లేదని 1951లో సవరించారు. ఆ తర్వాత 12 సంవత్సరాలకు కుదించారు. అంటే ఎవరు 12 సంవత్సరాలు వరుసగా స్థిర నివాసమున్నా ముల్కీలైపోతారని మార్చారు.

1969 ఉద్యమం..
ముల్కీ నిబంధనలైతే ఉన్నా.. వాటి అమలు అనుమానంలో పడింది. ఈ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారనేది 1969 తెలంగాణ ఉద్యమం లేవనెత్తిన అంశం. ఉల్లంఘన జరగడానికి కారణం ముల్కీలు దొరకనప్పుడు స్థానికేతరులను తీసుకోవచ్చనే మినహాయింపు! దీన్ని ఆధారంగా చేసుకొని చాలా ఉద్యోగాల్లో స్థానికేతరులను నింపారు. మినహాయింపునిచ్చిన ఉద్యోగాల్లో - స్టోర్‌కీపర్, ఎల్‌డీసీ, టైపిస్టుల్లాంటివి కూడా ఉన్నాయి. ఇవి స్థానికంగా వనరులు లభించనివి కావు. ఒకవేళ దొరకకున్నా ఎవరికైనా ఏడాది శిక్షణిస్తే చేయగలిగిన ఉద్యోగాలు. స్టోర్‌కీపర్‌ లాంటివి ఎవరైనా చేయొచ్చు. దానికి పెద్ద విద్యార్హతలు అవసరం లేదు. అయినా అలాంటివాటిల్లోనూ స్థానికేతరులను తెచ్చారు. బోగస్‌ స్థానిక పత్రాలతో వచ్చిన వారు మరికొందరు. చివరకు తెలంగాణలో స్థానికేతరులు వచ్చి ఉద్యోగాల్లో చేరారని ప్రభుత్వమే 1969లో అంగీకరించి 36 జీవో జారీచేసింది. దీనిప్రకారం ‘22 వేల మంది ప్రాంతేతరులు తెలంగాణలో ఉన్నారు. వారందరినీ వెనక్కి పంపిస్తాం. తెలంగాణవారికి ఉద్యోగాలిస్తాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఆయా ఉద్యోగులు హైకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు అసలు ముల్కీ నిబంధనలే రాజ్యాంగ విరుద్ధమని.. అవి చెల్లవంటూ తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో తెలంగాణ ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఉమ్మడిరాష్ట్రంలో తమకు న్యాయం జరగదనే భయాందోళనలతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ఊపందుకుంది. అప్పటిదాకా రక్షణలు కావాలని అడిగిన వారు కాస్తా, ఇక అప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించడం ప్రారంభించారు. తర్వాత 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమే అని తీర్పునిచ్చింది. దీంతో అటు ఆంధ్రలో ఆందోళన ఆరంభమైంది. ముల్కీ నిబంధనలు కొనసాగేట్లయితే తమకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలనే డిమాండ్‌ పుట్టుకొచ్చింది. సమస్యకు పరిష్కారంగా కేంద్రం ఆరుసూత్రాల పథకం తీసుకొచ్చింది.

610 జీవో
1973లో కేంద్రం ఆరు సూత్రాల పథకం ప్రకటించడంతో తెలంగాణకున్న రక్షణలన్నీ రద్దయిపోయాయి. ఆరు సూత్రాల పథకం ప్రకారం రాష్ట్రం మొత్తంలో ఎక్కడి ఉద్యోగాలు అక్కడి స్థానికులకు ఇవ్వాలనే ఒక కొత్త సూత్రం అమల్లోకి వచ్చింది. పోస్టులను వారు మూడు కేటగిరీలుగా జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలుగా వర్గీకరించి, రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు. సచివాలయం, సంచాలకుల కార్యాలయం లాంటి రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో నియామకాలను అందరికీ వర్తింపజేసి మిగిలిన వాటికి జిల్లా, జోనల్‌స్థాయిల్లో స్థానిక రిజర్వేషన్లను నిర్వచించారు. ఆరు సూత్రాల పథకం అమలు కోసం రాజ్యాంగాన్ని సవరించి (32వ సవరణ) 371(డి)ని అమల్లోకి తెచ్చారు. దీని ఆధారంగా రాష్ట్రపతి స్థానిక రిజర్వేషన్లను కల్పిస్తూ 1975లో ఉత్తర్వులిచ్చారు. వీటినే రాష్ట్రపతి ఉత్తర్వులంటారు. కానీ ఇవి కూడా సరిగ్గా అమలు కావడం లేదంటూ తెలంగాణలో అసంతృప్తి వ్యక్తమైంది. 1985 నాటికి తెలంగాణ ఎన్జీవోలు ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం జయభారత్‌రెడ్డి కమిటీ వేసింది. ఈ కమిటీ దాదాపు 59 వేల మంది ప్రాంతేతరులు తెలంగాణలో కొలువుల్లో ఉన్నట్లు గుర్తించింది. వీరందరినీ వెనక్కి పంపాలని అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అదే 610 జీవో. వెనక్కి పంపడమే కాకుండా స్థానిక (కార్పొరేషన్లు తదితర) సంస్థల్లో కూడా స్థానిక రిజర్వేషన్లను కచ్చితంగా అమలుచేయాలి.. రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో కూడా న్యాయ సమ్మతమైన వాటా దక్కేందుకు చర్యలు తీసుకోవాలి.. ఇవన్నీ చెప్పిన 610 జీవో కూడా అమలు కాలేదు.

గిర్‌గ్లానీ సిఫార్సులు
ఇలా స్థానిక రిజర్వేషన్లు ఎప్పటికీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం మళ్లీ తలెత్తిన తర్వాత కూడా స్థానిక రిజర్వేషన్లపై చర్చ జరిగింది. అందులో భాగమే ప్రభుత్వంచే గిర్‌గ్లానీ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ కూడా 18 రకాల ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చింది. గిర్‌గ్లానీ నివేదికను అమలు చేయడమంటే ఒక్కో నియామకాన్ని పరిశీలించాలి. నిబంధనలెలా పాటించారో చూడాలి. జిల్లాస్థాయి పోస్టులను జోనల్‌గా మార్చడం, పోస్టుల స్థాయి మార్చి తెలంగాణకు వచ్చే వాటాను తగ్గించడం, ఓపెన్‌ మెరిట్‌ పోస్టులను స్థానికేతరులకు రిజర్వ్‌ చేసి భర్తీ చేయడంలాంటివెన్నో ఉన్నాయి. వీటన్నింటి కారణంగా ప్రతి నియామకాన్ని చూడాలని గిర్‌గ్లానీ కమిటీ పేర్కొంది. రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన స్థానిక రిజర్వేషన్లను ఉల్లంఘించడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని 2004లో గిర్‌గ్లానీ కమిటీ స్పష్టం చేసింది. గిర్‌గ్లానీ కమిటీ నివేదికను, సిఫార్సులను కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. వారు తేల్చిన లోపాలను సరిచేయలేదు. చివరకు తెలంగాణ ఉద్యమం మలిదశకు మళ్లీ నియామకాలే మూలకారకమయ్యాయి. నీళ్లు, నిధులు, నియామకాలంటూ నినదించి తెలంగాణ సాధించుకోవడానికి దోహదం చేశాయి. మొత్తం మీద తెలంగాణ అస్తిత్వ రూపకల్పనలోగానీ.. తెలంగాణ ప్రాంత వాసులు తమ ఉద్యోగాలను తామే సాధించుకోవడం విషయంలో గానీ.. ఈ ముల్కీ ఓ బలమైన ప్రజాస్వామిక ఆకాంక్ష. హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌గా మారినప్పటికీ ‘మా ఉద్యోగాలు మాకే ఉండాలె, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలె!’ అనే డిమాండ్‌తో నిరంతరంగా తెలంగాణ ప్రజలు కార్యాచరణను కొనసాగిస్తూ వచ్చారు. తెలంగాణ చరిత్రను ముల్కీ నిరంతరం నిర్వచిస్తూ వచ్చింది. తెలంగాణ స్వయంపాలన సాధించడానికి కూడా ముల్కీనే మూలకారణం.

‘ఉస్మానియా’ కంటే ‘నిజాం’ పెద్దది
ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918లో ఏర్పడింది. ఈ విశ్వవిద్యాలయం వచ్చాక చదువుకున్నవారి సంఖ్య పెరిగింది. హైస్కూళ్లు, కాలేజీలు పెరిగాయి. దీంతో తమకే ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌ స్థానికుల్లో మరింత ఊపందుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కంటే ముందే నిజాం కాలేజీ ఏర్పడింది. దీనిపై ఓ నానుడి కూడా ఉంది. ‘తల్లికంటే పిల్ల పెద్దది!’ అని.. నిజాం కాలేజీ అనేది ఉస్మానియాకు అనుబంధ కళాశాల. మాతృసంస్థ ఉస్మానియా. కానీ అంతకుముందే (1887లో) నిజాంకాలేజీ ఆరంభమైంది కాబట్టి - తల్లికంటే ముందు పిల్ల పుట్టిందంటుంటారు.

ఫజల్‌ అలీ కమిటీ
‘మా ఉద్యోగాలు మాకే కావాలి, స్థానికులకే పరిపాలించే అధికారం ఉండాల’నే బలమైన కోరిక ముల్కీ ఉద్యమంలో వ్యక్తమైంది. దీన్నుంచే తెలంగాణ అస్తిత్వ రూపకల్పన మరింత దృఢమైంది. అంటే ‘ఆంధ్ర ప్రాంతంతో విలీనమైతే.. చదువుల్లో, సామాజికంగా ఓ అడుగు ముందున్న ఆంధ్రుల పెత్తనానికి, దోపిడీకి గురయ్యే ప్రమాదముంది. ఎట్టి పరిస్థితుల్లో వారితో పొత్తు కుదరకూడదు. వారువేరు.. మనం వేరు’ అనే భావన బలపడింది. అందుకే 1953లో ఫజల్‌ అలీ కమిటీ వేసినప్పుడు ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే, ఆంధ్రతో పొత్తు కుదరదని చాలామంది చెప్పారు. విశాలాంధ్రను సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంగీకరించినా ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు, మధ్యతరగతి వర్గం వారు, ప్రజలు, వ్యాపారులు ఎవ్వరూ విలీనానికి అంగీకరించలేదు. ఊర్లు, పట్టణాలు విలీనం వద్దని తీర్మానాలు చేశాయి. దీంతో ఫజల్‌ అలీ కమిటీ ‘1961 దాకా విలీనం చేయొద్దు, విలీనమంటూ జరిగితే, ఇద్దరు ఇష్టపడి అంగీకరిస్తేనే చేయాలి. 1961 దాకా ఆగాలి. అప్పటికల్లా తెలంగాణ ప్రజలకు ఓ నిర్ణయం తీసుకునే అనుభవం వస్తుంది. 1961లో మూడింట రెండొంతుల అసెంబ్లీ సభ్యులు అంగీకరిస్తే విలీనం చేయండి’ అని చెప్పింది. అయినా 1956లో విలీనం జరిగింది.

అయ్యంగార్‌ కమిటీ
ఎన్ని ముల్కీ నిబంధనలు వచ్చినా అవి పటిష్ఠంగా అమలు కాలేదు. ఎందుకంటే ‘స్థానికులు దొరక్కుంటే స్థానికేతరులను నియమించుకోవచ్చ’నే మినహాయింపు. స్థానికేతరులు చాలామంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నందున ఈ నిబంధనను వాడుకొని అప్పటికే చాలామంది స్థానికేతరులతో నింపేశారు. ముల్కీ నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా ఉండటంతో 1934లో హైదరాబాద్‌ ముల్కీలీగ్‌ అనే ఓ సంస్థ ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు దానికి కార్యదర్శి. నిజామత్‌ అలీ జంగ్‌ అధ్యక్షుడు. వీళ్లంతా కలసి ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థానికులకు ఇక్కడి ప్రజల అవసరాలు, సంస్కృతి, జీవన స్థితిగతులు తెలుసు కాబట్టి మంచి పాలన అందిస్తారని, అందుకే స్థానికులకే ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌ పెరిగింది. ఒత్తిడి తీవ్రం కావడంతో చివరకు ప్రభుత్వం అరవముదు అయ్యంగార్‌ నేతృత్వంలో ఓ కమిటీని వేసి, పరిస్థితులను సమీక్షించి - 1939లో ముల్కీ నిబంధనల్ని సవరించారు. 1945లో మరోమారు సవరణ జరిగింది. వాటిని పకడ్బందీగా అమలు చేసే క్రమం మొదలైంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇదీ ముల్కీ పరిస్థితి! 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - సమీకరణ దశ (1971 - 90)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌